నులివెచ్చని గ్రీష్మం

చివరి భాగం

జరిగిన కథ…

పిల్లల కోరిక మీద అమెరికా వచ్చిన, సుభద్ర, అర్జున్ లు మినియాపోలీస్ నుంచి కూతురు దగ్గరకు అట్లాంటా వస్తారు. అట్లాంటాలోని సీనియర్ సెంటర్స్ కు, వైయెంసీఏ కు వెళుతుంటారు. వాళ్ళ కాలనీలోని పాట్ లక్ కు వెళ్ళి అందరినీ పరిచయం చేసుకుంటారు. మౌంట్ రష్మోర్ కు వెళ్ళివస్తారు.

ఇక చదవండి…

“హాయ్ మామ్, హాయ్ డాడ్, హలో హలో సిస్టరూ” అభి సుభద్ర చేతిలో నుంచి బాగ్ అందుకుంటూ అందరినీ పలకరిస్తూ, స్పూర్తి తో సిస్టరూ ఇన్ని రోజులా మా మమ్మీడాడీని నీ దగ్గర ఉంచుకునేది?” అర్జున్, సుభద్రలను బాగేజ్ క్లేమ్ దగ్గర రిసీవ్ చేసుకుంటూ అన్నాడు.

“పోపోవోయ్! అయినా నీ దగ్గరే ఎక్కువ రోజులు ఉన్నారు” కినుకగా అంది.

“బాగుంది.పెద్దవాళ్ళయినా మీ పోట్లాటలు తగ్గలేదర్రా.అన్ని చోట్లా ఈ అక్కాతమ్ముళ్ళ పోట్లాటలు బాగున్నాయి” అభిని దగ్గరకు తీసుకుంటూ నవ్వింది సుభద్ర. కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరారు. అభి కార్ గ్యారేజ్ లో పార్క్ చేసి, డిక్కీ నుంచి సూట్కేస్ లు తీస్తుంటే అర్జున్ కూడా ఓ చేయి వేసాడు. వీళ్ళను చూస్తూనే గబగబా కిందికి వచ్చి, “హాయ్ అక్కా, వెల్ కమ్” అంటూ స్పూర్తిని హగ్ చేసింది శశి. “అట్లాంటా ఎట్లా ఉంది ఆంటీ” అంటూ సుభద్రను పలకరించింది.

“పిల్లలు స్కూల్ కు వెళ్ళారా? ఎక్కడా అలికిడి లేదు” అంది సుభద్ర.

“అవునాంటీ. కాఫీ ఇవ్వనా?” అడిగింది.

“వద్దమ్మా. ఫ్రెషప్ అయ్యి లంచ్ చేసేస్తాము. మీ పని చేసుకోండి. మేము తినేస్తాములే” అంటూ పాంట్ జేబులో నుంచి హాండ్ కర్చీఫ్ తీసాడు అర్జున్. కర్చీఫ్ తో పాటు పింక్ కలర్ పేపర్ వచ్చింది. “ఇదేమిటీ? నేను ఏమీ పెట్టలేదే” అంటూ దానిని తీసి చూసాడు.

“WE MISS YOU TAATAA, AMMAMMAA” అని వ్రాసి, కింద చిన్నపిల్లల బొమ్మ వేసి ఉంది. దానిని ఆశ్చర్యంగా చూసి, “ఎప్పుడు పెట్టారో” అన్నాడు.

ఆ పేపర్ తీసుకొని మురిపెంగా ముద్దు పెట్టుకుంటూ “ఇది సౌమ్య పనే అయి ఉంటుంది. ఏమి తెలివి” అంది సుభద్ర.

సుభద్ర సూట్కేస్ మూత తీయగానే, పైన ఆకుపచ్చ కాగితంలో “WE MISS YOU TAATAA, AMMAMMAA” అని చక్కని చిత్రం తో ఉంది. అలా అర్జున్ షర్ట్ లో నుంచి, సుభద్ర చీరలో నుంచి దాదాపు వివిధ రంగులలో చక్కని హాండ్ రైటింగ్, పిక్చర్‌లతోఓ పది బుక్ మార్క్ పేపర్ లు ఉన్నాయి.

“ఇవన్నీ ఎప్పుడు పెట్టారీ పిల్లలు” విస్తుబోయాడు అర్జున్.

“మరి చూసారా పిల్లలు మిమ్మలిని ఎంతమిస్ అవుతున్నారో! ఇంకొన్ని రోజులు ఉండమంటే, వెళ్తామని తొందర పడుతున్నారు” నిష్టూరంగా అంది స్పూర్తి. అర్జున్ జవాబివ్వబోతుంటే “నాకు తెలిసులే డాడీ నెక్స్ట్ టైం అనేగా నువ్వు అనేది” మూతి ముడిచింది స్పూర్తి. వాటిని ముచ్చటగా చూస్తూ, జాగ్రత్తగా ఒక కవర్ లో పెట్టి, సూట్కేస్ లో చీరల అడుగున దాచుకుంది సుభద్ర.

***

శశీ, స్పూర్తి కలిసి, డెక్ మీద బార్బీక్యూ గ్రిల్ అరేంజ్ చేసారు. దాని మీద ఒక వైపు మొక్కజొన్న కండెలు, ఇంకో వైపు వెజిటేరియన్ కబాబ్స్ పెట్టింది స్పూర్తి. లోపల నుంచి ప్లేట్స్ తీసుకొచ్చాడు అభీ. డెక్ మీద టేబుల్, చేర్స్ అన్నీ పెట్టారు. సుభద్ర సహాయం చేస్తానంటే వదినామరదళ్ళు వద్దనేసారు. సరే మీరే చేసుకోండి అని డెక్ మెట్ల మీద కూర్చుంది. పిల్లలిద్దరూ అటూఇటూ పరిగెడుతూ ఆడుకుంటున్నారు. సన్నగా వినిపిస్తున్న చప్పుడుకు తలెత్తి చూసిన సుభద్రకు, రెక్కలు చాచి, చేతికి అందుతుందా అన్నంత కిందిగా వెళుతున్న విమానమును చూస్తూ, రేపు ఈ పాటికి మేమూ విమానంలో ఉంటాము అనుకుంది సుభద్ర. వెళుతున్నాము అనుకోగానే ఒక్కసారిగా బెంగ వచ్చేసింది. ఆడి, అలిసిపోయి పక్కన చేరిన ఆరాధ్య, ఆకాశ్ లను రెండు చేతులతో దగ్గరకు తీసుకుంది.

గ్రిల్ మీద వేడి అవుతున్న మొక్కజొన్నపొత్తుల కమ్మటి వాసన ముక్కుపుటాలకు తగిలి హూ…  పీలుస్తూ “మామ్ సో యమ్మీ” అంటూ అటు పరిగెత్తి ఒకటి తీసుకోబోయింది ఆరాధ్య.

“నేనిస్తాను ఉండు, చేయి కాలుతుంది” అంటూ ఒక చిన్నది గ్లౌస్ వేసుకున్న చేతితో, పటకారుతో తీసి ప్లేట్‌లో వేసి ఇచ్చింది స్పూర్తి.

ఇంతలో అభి స్నేహితులు రామ్, శ్రావ్య, సమీర్, లక్ష్మి వాళ్ళ పిల్లలతో వచ్చారు. శ్రావ్య, లక్ష్మి చేసుకుని వచ్చిన వంటకాలను డిష్‌లలో సద్ది, మధ్యలో ఉన్న టేబుల్ మీద పెట్టారు. పెద్దలు కబుర్లలో, పిల్లలు ఆటలలో పడ్డారు.  ఆ సందడినంతా ముచ్చటగా గమనిస్తోంది సుభద్ర.

చిన్నగా సూర్యుడు లేక్ కిందికి జారుకుంటుండగా, ఆయనకు ఎదురుగా చంద్రుడు ఉదయిస్తున్నాడు. ఆ సూర్యచంద్రుల కలయకతో ఆకాశమంతా వింతవింత రంగులతో శోభాయమానంగా ఉంది. ఆకుపచ్చని రంగు నుంచి వివిధ రంగులను అప్పుడప్పుడే సంతరించుకుంటున్న చెట్ల ఆకులు, ఆకాశంతో పోటీ పడుతున్నాయి. ఆ ఆహ్లాద వాతావరణంలో డెక్ మీద గ్రిల్ నుంచి వస్తున్న మొక్కజొన్న పొత్తుల, కట్లెట్‌ల వాసన గాలిలో తేలి వస్తూ ముక్కుపుటాలను పలకరిస్తున్నాయి.

“అంకుల్ రేపొద్దున మీరు వెళ్లిపోతున్నారు కదా మీకు ఇక్కడ ఎట్లా అనిపించింది అమెరికా నచ్చిందా మీకు?” అడిగాడు సమీర్.

“నచ్చింది. ముఖ్యంగా ఇక్కడ అందరూ ఎవరి మీదా ఆధారపడకుండా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం బాగుంది. తరూవాత శుభ్రత చాలా పాటిస్తున్నారు. రోడ్స్, ట్రాఫిక్ అన్నీ సిస్టమాటిక్ గా ఉన్నాయి. సరే మీరు ఇండియన్స్ అంటే అందరూ కలుస్తుంటారు కానీ సీనియర్ సెంటర్ లో అమెరికన్స్ మమ్మలిని కూడా కలుపుకొని, వివక్షత చూపించకుండా స్నేహంగా ఉండటం సంతోషంగా ఉంది. ప్రభుత్వం కూడా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, సత్వరమే స్పందించి, చర్యలు తీసుకుంటున్నారు. కాకపోతే మేము చూసింది మినియాపోలీస్, అట్లాంటా నే కదా! ఇవి పెద్ద సిటీలు. రూరల్ ఏరియాలో ఎట్లా ఉంటుందో చూడలేదు. అయినా ఇక్కడ జనాభా తక్కువ, ఉన్న స్థలం ఎక్కువ. వనరులు ఎక్కువ. అందుకని కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయగలుగుతోంది. అదే అధిక జనాబా అవుతే ఇంతగా చేయలేకపోయేదేమో. మన దగ్గర ఇంత గ్రీనరీ, ఇంత ఖాళీ స్థలం ఎక్కడా లేదుకదా?

ఆర్ధికంగా కూడా నిలదొక్కుకొని అగ్రరాజ్యంగా నిలిచింది కాబట్టే వివిధ దేశాలవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఈ మధ్య మన పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్‌ను పిలిపించుకొని దగ్గర ఉంచుకొని చూసుకోవటం కూడా మంచి పరిణామమే. ఇంకా పూర్తిగా తెలవాలంటే ఈ కాస్త సమయంలో ఏమి తెలుస్తుంది? విజిటర్‌గా వచ్చిపోతున్న మాకు స్వర్గంగానే కనిపిస్తుంది” అంటూ నవ్వాడు అర్జున్.

“ఆంటీ మీకెలా ఉంది?” అడిగింది లక్ష్మి.

“నాకు అమెరికా అంటే ఒక స్వర్గం అనీ, ఇక్కడ కష్టాలూ, కన్నీళ్ళు ఉండవని, ఆడవాళ్ళకు భర్తతో అసలు బాధలే ఉండవు, నచ్చకపోతే వదిలేసిపోయి మళ్ళీ పెళ్ళి చేసుకుంటారు. పిల్లలు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు ఉంటారు. అందరూ సర్వస్వతంత్రులు. వీళ్ళకు కుటుంబ సంబంధాలు ఉండవు. ఇలా అనుకునేదానిని. మరి ఆ అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో మరి. కానీ ఇక్కడకు వచ్చి చూసాక, సీనియర్ సెంటర్‌లోని ఆడవాళ్ళను కలిసాక, వీళ్ళకూ మనలాగే బోలెడు కష్టాలు ఉన్నాయి. కుటుంబ సంబంధభాంధవ్యాలు ఉన్నాయి.ఇట్లా పెళ్ళి చేసుకొని అట్లా ఏమీ విడిపోరు అని హెలెన్‌ను, కాథిన్‌లాంటి వాళ్ళను కలిసాక తెలిసింది. వాళ్ళెంత స్నేహపాత్రులో అర్ధం అయ్యింది. సెంటర్ కు వెళ్ళటం వలన ఇక్కడి వాళ్ళ జీవనశైలి తెలిసింది. నాకున్న అపోహాలు తొలిగాయి. కానీ ప్రపంచంలో ఎక్కడ యుద్దం జరిగినా ఇక్కడ నుంచి సైన్యం పంపటం, బిల్, హెలెన్ వాళ్ళ కథలు విన్నాక నాకు నచ్చలేదు. ఆ సమయములో ఎంత మంది స్త్రీలు పిల్లలతో నిరాశ్రయులు అయ్యారో కదా అని బాధ అనిపిస్తుంది” అంది సుభద్ర.

కాసేపు ఎవరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచలలో వారుండిపోయారు.

“ఆంటీ, అంకుల్ ఇక్కడంతా అంటే బయట, ఇంట్లో మమ్మలిని, మా జీవన శైలిచూసారు కదా! ఇందాక మీరు అన్నట్లుగా కొంతమంది తల్లితండ్రులు ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు, మంచి పరిణామమని.మరి మీరు వస్తారా?” ఆసక్తిగా అడిగింది శ్రావ్య అర్జున్ ప్లేట్‌లో చపాతీ వడ్డిస్తూ.

సుభద్ర అర్జున్ వైపు నాదేమీ లేదన్నట్లు చూసింది. చపాతీ ఒకటి చాలన్నట్లుగా చేయి చూపించి, “ప్రస్థుతం అవుతే ఆ ఆలోచన లేదు. నేను ఇంకా పని చేసుకుంటూ బిజీగా ఉన్నాను. ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ బాగుంటుందంటున్నారు కదా! అందుకోసమేమన్నా వస్తామేమో చెప్పలేము చూద్దాం” అని, డెత్ డిక్లరేషన్ ఇండియాలో అమలులోకి రాకపోతే వస్తానేమో అని మనసులో అనుకున్నాడు!

“మమ్మలిని అడిగారు సరే, మరి మీకు ఇక్కడ నచ్చిందా? ఇక్కడే ఉంటారా? ఇండియాకు తిరిగి వస్తారా?” నవ్వుతూ అడిగింది సుభద్ర.

“నచ్చిందా అంటే నచ్చిందనే చెప్పాలాంటీ. ఎందుకంటే మా చదువు పూర్తి అయిన రోజులలో మాకు ఇంతగా ఉద్యోగాలు లేవు. అప్పుడప్పుడే సాఫ్ట్‌వేర్ మొదలయ్యింది. ఇక్కడ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసిన మాకు మంచి ఉద్యోగాలు దొరికాయి. మంచి సంపాదన, ఒక సిస్టమాటిక్ జీవితం లభించింది. అందుకని నాకు ఇక్కడ నచ్చింది, అమెరికా అన్నా ఇష్టం ఏర్పడింది” అన్నాడు రామ్.

“అంటే నీకు మనదేశం నచ్చలేదా? ఇష్టం లేదా?” అడిగాడు అర్జున్.

“ఏదో ఒక దేశాన్నే ప్రేమించాలి అన్న రూల్ ఏమీ లేదు కదా అంకుల్! నాకైతే రెండు దేశాలన్నా ఇష్టమే. ఒకటి ఎక్కువ కాదు ఇంకోటి తక్కువ కాదు. ఒకటి నను కన్న దేశం. నను పెద్దచేసి విధ్యాబుద్దులు నేర్పిన దేశం. ఇంకొకటి నాకు జీవితమంటే ఏమిటో నేర్పి, స్థిరత్వాన్ని ఇచ్చిన దేశం. ఏది గొప్పదంటే, ఏదంటే ఇష్టం అంటే ఎలా చెప్పగలను?  ఆ రోజులల్లో నేను అక్కడే ఉంటే ఇంత సంపాదించగలిగేవాడినా? ఈ లెవల్ ఆఫ్ లైఫ్ కు చేరుకునేవాడినా? మా నాన్నకు అండగా నిలిచి, తమ్ముడి చదువు చూసుకున్నాను. వాళ్ళకు ఆర్ధికంగా కొంత వెసులుబాటుని కలిగించాను. సో నీకు ఏదేశం అంటే ఇష్టం, ఎక్కడ స్థిరపడతావు? అంటే రెండూ ఇస్టమే. ఇందాక మీరన్నట్లు తరువాతతరువాత ఇండియా వెళ్ళి మా ఊరిలో ఉండాలి అనిపించినా వెళ్ళి ఉంటానేమో!” అన్నాడు రామ్.

“మా ఆలోచనల పరిధిని పెంచి విశాలత్వం నేర్పింది. జీవితమంటే ఏమిటో నేర్పింది ఈ దేశం. ఈ దేశం నాకు ఒక మంచి జీవన విధానాన్ని, ఒక మంచి జీవిత అనుభవాన్ని కూడా ఇచ్చింది. అది నామాతృదేశం, ఇది నాకు జీవితాన్ని ఇచ్చిన దేశం. అందుకే నీకే దేశం ఇష్టమని ఎవరడిగినా  రెండూ నాకు ఇష్టమేనని చెపుతాను” అన్నాడు సమీర్.

“గుడ్. మీరన్నది నిజమే. సామాన్యంగా ఏదైనా కాని జనరలైజ్ చేసి అనకూడదు.సమాజం చాలా డైనమిక్‌గా ఉంటుంది.నిరంతరం మార్పు చెందుతు ఉంటుంది. ఏదైనా ఒక విషయం ఇది ఇంతే ఇలాగే ఉండాలి అని  అభిప్రాయానికి రాకూడదు. నీ చుట్టుపక్కల విషయాలను తెలుసుకుంటూ, అన్నీ గమనిస్తూ ఉండాలి. అంతేకానీ ఇదింతే అని అనుకుంటే అభివృద్ది ఉండదు. మా తాతయ్యావాళ్ళు పల్లెటూరిలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. మా నాన్న, చదువుకొని ఉద్యోగం కోసం  హైద్రాబాద్ వచ్చారు. నేను సెంట్రల్ గౌర్నమెంట్ జాబ్ లో చేరి, దేశమంతా తిరిగాను. మా అబ్బాయి విదేశానికి వచ్చాడు. మా మనవడు అంతరిక్షానికే వెళ్ళవచ్చు. ఈ వలసలు తప్పవు. ఎక్కడ మనకు నచ్చిన జీవనోపాధి ఉంటే అక్కడకు వెళుతాము. అభివృద్ధి ఒక్క చోటే ఆగిపోదు.ఈ మార్పు ఇలా తరంతరం నిరంతరంగా సాగిపోతునే ఉంటుంది. ఇదే జీవితం. ఈ పరిణామాలను అంగీకరించి మనమూ ముందుకు సాగిపోవాల్సిందే!” అన్నాడు అర్జున్.

“అవునకుల్ మీరు చెప్పింది నిజమే” అంగీకరించాడు రామ్.

కబుర్లు చెప్పుకుంటూ అందరూ డిన్నర్ ముగించారు.పిల్లలు ఆటలు చాలించి, నిద్రకు తూగుతున్నారు. ఇక వస్తాము ఆంటీ, అంకుల్ హాపీ, సేఫ్ జర్నీ అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు.

“అన్నీ సద్దుకోవటం అయ్యిందా? ఇప్పుడు ఎక్కువ లగేజ్ ఏమీ ఉండదేమో, రెండు సూట్కేస్‌లు ఉంచేయవచ్చు” అన్నాడు అభి.

“ఉంచటం కాదు తమ్ముడూ ఇంకో రెండు కావాలి” నవ్వింది స్పూర్తి.

“ఎందుకూ?” ఆశ్చర్యంగా అడిగాడు అభి.

“డాడ్ సంగతి మర్చిపోయావా? డాడ్, మామ్‌ల స్టాఫ్‌లు అందరికీ కొన్న గిఫ్ట్‌లు మర్చిపోయావా?”

“ఓహ్ నిజమే కదా”

లగేజ్ అంతా మరోసారి చూసి చెక్ఇన్ చేసేసాడు అభి.

“వర్ల్డ్ వైడ్ గా సీనియర్ సిటిజన్సే గలబల అంటే ఈజీగా మోసం చేయొచ్చు. పిల్లలను చేయలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులుండవు.మాలాంటి వాళ్ళం వాళ్ళ బుట్టలో పడము.ఇక మీకేమో ఆ టంగ్ ట్విస్ట్ అర్ధం కాదు అందుకే ఈజీగా దెబ్బ తింటూంటారు, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రావలింగ్ లో జాగ్రత్తగా ఉండాలి” చెక్ ఇన్ పూర్తయ్యాక అన్నాడు అభి.

“అబ్బా ఎన్ని సార్లు జాగ్రత్తలు చెపుతావురా” చిన్నగా విసుక్కున్నాడు అర్జున్.

“ధర్మరాజంతటివాడే అశ్వధామా హథః కుంజరహః అని గురువు ద్రోణాచార్యుణ్ణే పడేసాడు. ఇక మేమెంతటివాళ్ళం రా” కొడుకు హితబోధ, తండ్రి విసుగు చూస్తూ నవ్వుతూ అంది సుభద్ర.

***

“మిస్‌యూ బామ్మా” బామ్మ నడుం చుట్టూ చేతులు వేసి గారాబంగా అన్నాడు ఆకాశ్.

“మీ టూ” అంటూ బామ్మను, తాతను హత్తుకుంది ఆరాధ్య.

భారం అయిన గుండెలతో పిల్లలందరినీ హగ్ చేసుకొని సెక్యూరిటీలోకి నడిచారు సుభద్ర, అర్జున్.

***

“ఎట్లా ఉన్నావు గోపీ” లగేజ్ తీసుకుంటున్న డ్రైవర్‌ను అడిగాడు అర్జున్.

“బాగున్నాను సర్” జవాబిచ్చాడు గోపాల్.

దారంతా గోపాల్ ను విశేషాలు అడుగుతూ అర్జున్, చీకటిలో, లైట్ల వెలుగులో కనిపించీ కనిపించనట్లున్న ఊరిని చూస్తూ ఇంటికి చేరారు.

“సర్, ఫ్రిడ్జ్‌లో పాలు, ఇడ్లీ పిండి, స్టవ్ పక్కన కాఫీ డికాక్షన్ పెట్టానని చెప్పింది సుజాత. లేపనా కాఫీ కలిపి ఇస్తుంది” అన్నాడు గోపాల్.

“ఇప్పుడే వద్దులే. కాసేపు పడుకుంటాము” బద్దకంగా అన్నాడు అర్జున్.

పక్కింట్లో నుంచి వినిపిస్తున్న నల్లా నీళ్ళ చప్పుడుకు మెలుకువ వచ్చింది సుభద్రకు. చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. కాసేపు ఎక్కడ ఉన్నదో అర్ధం కాలేదు. ఓహ్ హైద్రాబాద్ వచ్చేసాము కదూ అనుకుంటూ లేచింది. అర్జున్ అప్పటికే లేచి, బాల్కనీ లో కూర్చొని పేపర్ చదువుకుంటున్నాడు. ఫ్రెషప్ అయి కాఫీ కోసం వంటింట్లోకి వెళ్ళింది.

“బాగున్నారా అమ్మా? కాఫీ కలపనా?” ఇడ్లీ పెడుతున్న సుజాత అడిగింది.

“బాగున్నాను. పిల్లలు స్కూల్‌కు వెళ్ళారా? నేను కలుపుకుంటానులే కాఫీ” అంటూ కాఫీ రెండుకప్పులు తీసుకొని బాల్కనీలోకి వచ్చింది.

“అండీ… కాఫీ.”

“అడగకుండానే రెండో కప్‌నా? ఏమిటి సంగతి?” నవ్వుతూ అన్నాడు అర్జున్.

ముచ్చటగా మూతి తిప్పి, పచ్చటి ఆకు మీద బోర్లా పడుకున్న బుజ్జి పాపాయిలా ఉన్న పారిజాతాన్నీ మృదువుగా స్పృషించింది. ఎదురు కరెంట్ తీగ మీద పరుగెడుతున్న ఉడత వచ్చావా అన్నట్లు ఓ చూపు చూసింది. విరగబూసిన మాలతీ తీగ పూవుల మీద ఉన్న వర్షపు నీటి బిందువుల మీద పడుతున్న సూర్య కిరణాలను మురిపెంగా చూస్తూ “అండీ రాత్రి వర్షం పడినట్లుంది. గ్రీష్మం వెళ్ళి వర్షం మనలని ఆహ్వానించింది కదూ!”

చిన్నపిల్లలా నీటిబిందువులను మురిపెంగా చూస్తున్న సుభద్రను నవ్వుతూ చూసాడు అర్జున్!

సమాప్తం

 

 

 

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దశలు — దిశలు

ఒడిపిళ్ళు