లండన్ చేరామోచ్
ముంబయ్ లో మధ్యాహ్నం లండన్ ఫ్లైట్ కోసం గేట్ నంబర్ 73 దగ్గర బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తుంటే 1.30 కి కానీ స్టార్ట్ అవలేదు. 1.45 కల్లా ప్లేన్ లోకి ఎక్కాము. మాసీట్లు, మధ్య రో లోని నాలుగు సీట్లలో చివరి రెండు. అందుకని వాడు చివర కూచుంటే కొంత నయం. కంఫర్టబుల్ సీట్ కోసమైతే ముందే ఆన్లైన్ చెకిన్ చేసేటప్పుడే మూడు నుంచి ఐదు వేల దాకా ఎక్స్ ట్రా పే చేస్తే అప్పడు ముందు కొద్దిగా స్పేస్ ఉన్న సీట్స్ వస్తాయి. ఒక్కోసారి బయలు దేరాక సీట్లు ఖాళీలుంటే రిక్వెస్ట్ మీద అలాట్ చేస్తారు. కాని ఎక్కడా సీట్లు ఖాళీలు లేవు. వాడికి సీటు చాలా ఇబ్బందిగా ఉంది. చివరి సీటు కాళ్ళు చాపుకుని కూచుందామంటే, ఎయిర్ హోస్టస్ తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అడ్డుగా ఉంటాము. ఎక్కినప్పటినుండి, ప్రణయ్ ఏయిర్ హోస్టస్ ని అడుగుతూనే ఉన్నాడు. ఇంకా ముందు ఖాళీ జాగా ఉన్న సీట్ కోసం చూసాడు. కానీ, ప్లేన్ ఫుల్ గా ఉంది, ‘అడిగినా ప్రయోజనంలేదు, చివరిసీటు కాబట్టి కాస్త కాళ్ళు చాపుకుని పడుకో‘ అన్నాను.
చాలా సేపటికి కానీ ఫ్లైట్ స్టార్ట్ కాలేదు. దాదాపు మధ్యాహ్నం 2.35 కి టేకాఫ్ అయింది. ప్రణయ్ కి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కడం ఇదే మొదటి సారి. వాడు ఎంతో ఊహించు కున్నాడు. చక్కగా స్రీన్లో సినిమా చూసుకోవచ్చని అనుకున్నాడు. కానీ అవి ఏవి పనిచేయటం లేదని హోస్టస్ చెప్పగానే నిరాశ పడి పాపం అలాగే నిద్ర పోయాడు. అవును మరి, ఏరిండియా నష్టాల్లో నడుస్తుందట, అన్ని సౌకర్యాలు ఎలా ఉంటాయి? అనుకున్నాను. నాకూ బాగా నిద్ర ముంచుకొచ్చింది. కాసేపటికి, జూస్, ఏదో స్నాక్ ఇచ్చారు. తరువాత గంటలో లంచ్. ఇండియన్ ఫుడ్. బాగానే ఉంది. అదేపనిగా కూచోవటం, అంతగా టెక్షన్ పడ్డం వల్ల కడుపులో అదోలా అనిపించి, టీ కాఫీ బాగుండదు కాబట్టి స్ప్రైట్ డ్రింక్ తాగాను. మూడుగంటలు ఇరుకు కుర్చీలో నిద్రపోయాము. నిద్ర సుఖమెరుగదు కదా. మెలుకువ వచ్చే సరికి రాత్రి 8.20 అయింది. ఆరు గంటల ప్రయాణం చేసామన్నమాట. మొత్తం జర్నీ సుమారు పది గంటలు. దిగే సరికి ఇండియన్ టైమ్ లో రాత్రి సుమారు 12.30 లండన్ లో 8.30 అవుతుందేమో.‘వెదర్ బాగాలేక పోవటం వల్ల, అనుకున్న దానికంటే గంటన్నర డిలే అని, సీట్ బెల్ట్స్ వేసుకునే ఉండాలని‘ కెప్టెన్ అనౌన్స్ చేసాడు. మరి కాసేపు నిద్ర పోయి లేచేసరికి, కొద్దిసేపటిలో లాండ్ అవుతున్నామని, అక్కడి టెంపరేచర్ డిటేల్స్ చెబుతున్నాడు పైలెట్. అంటే
అంత ఎక్కువ లేటవకుండానే మానేజ్ చేసినట్టున్నాడు. లండన్ హీత్రో ఏర్పోర్ట్ లో లాండ్ అయి, సెక్యూరిటీ చెకప్ లో నిలుచున్నాము. చాలానే క్రౌడ్ ఉంది. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. ప్రతీ పాసింజర్నీ అక్కడ చాలా ప్రశ్నలే అడుగుతారు. ఒక్కోసారి ఏమి అడగక పోవొచ్చును కూడా. కాని అడిగితే, థామస్ కుక్ ట్రూప్ మానేజర్ వైదేహి ఏదో చెప్పమని చెప్పింది. ఏమిటో అది గుర్తు రావటం లేదు. ప్రణయ్ ని అడిగితే, నాకేం తెలుసు అన్నాడు. హడావిడిలో ఏమి గుర్తురావటం లేదు. ఆలోచనా రావటం లేదు. ఉజ్వలకు మెసేజ్ చేసాను. థామస్ కుక్ వాళ్ళు ఫార్వర్డ్ చేసిన డాక్యుమెంట్ చూపించమని జ్ఞాపకం చేసింది. అవును కదా అనుకుని, అప్పటికే ఫోన్లో తీసిపెట్టుకున్న థామస్కుక్ డాక్యుమెంట్స్ ఇమ్మిగ్రేషన్ లో చూపించాము. వాళ్ళు కూడా పెద్దగా ఏమి అడగలేదు. ఆ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయి, బాగ్స్ కలెక్ట్ చేసుకుని బయటకి వచ్చే సరికి పది గంటలు అవుతున్నట్టుంది. ఇంకా నా వాచీ అప్డేట్ అవక ఇండియన్ టైమే రాత్రి రెండు అని చూపిస్తుంది.
లండన్ హీత్రూ ఏర్పోర్ట్ లో ప్రణయ్ కాబ్ డ్రైవర్ అలీ నయీమ్ లండన్ హీత్రూ ఏర్పోర్ట్
అప్పటికే మేము ప్లేన్ లాండ్ అయి లోపల ఉండగానే బయట మాకోసం కాచుకుని ఉన్న కాబ్ డ్రైవర్ కాల్ చేసాడు. హమ్మయ్య కాబ్ వచ్చిందన్నమాట. వస్తాడో లేదో నని కంగారు పడుతున్నాను. ఒక వేళ కాబ్ రాక పోతే కాల్ చేయటానికి కాంటాక్ట్ నంబరు ఇచ్చారు. ఆ అవసరం రాకుండా కాబ్ వచ్చేసింది. అయినా మేము మా బాగేజెస్ కలెక్ట్ చేసుకుని బయటకు వెళ్ళేసరికి ఉంటాడో లేదో, లేక పోతే ఫోన్ చేయొచ్చులే అనుకున్నాను. మేము సెక్యూరిటీ చెక్ అయి, లగేజ్ తీసుకుని ఏర్పోర్ట్ బయటకు వచ్చేవరకు అంటే సుమారు గంటన్నర పాటు అతను వెయిట్ చేసాడు. అదే మన హైదరాబాద్ లో అయితే పదినిముషాలు లేటైనా వెళ్ళిపోతారు కాబ్ డ్రైవర్స్. ఏర్పోర్ట్ డ్రైవర్స్ గురించి నాకు పెద్దగా తెలియదు. ఎప్పుడు ఉజ్వల, పవన్ లు దింపుతారు కాబట్టి, ఆ అవసరం రాలేదు. ఆ డ్రైవర్ ని చూడగానే చాలా మంచి వాడుగా కనిపించాడు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడాడు. మేము హైదరాబాద్ నుండి వచ్చామనగానే మంచి హుర్దూలో మాట్లాడటం మొదలు పెట్టటాడు. అతని పేరు అలీ నయీమ్ అని చెప్పాడు. ఏర్పోర్ట్ బయట ఉన్న షాపులో మా దగ్గర ఉన్న యూరోస్ కొన్నిటిని, మరికొన్ని పౌండ్స్ లోకి మార్చటానికి వెళితే ఏదైనా కొంటే కాని చేయనన్నారు. అలీ కూడా ఏదైనా కొనందే కరెన్సీ మార్చరని చెప్పాడు. వాటర్ బాటిల్స్ రెండు కొంటే ఒకటి ఫ్రీ వచ్చింది. కొన్ని పౌండ్స్ కూడా దొరికాయి. ఇక్కడ నీళ్ళు కొనడం కాస్ట్లీనే.
అక్షర్ కి ఫోన్ చేసి మేము లండన్ చేరామని, కాబ్ కూడా వచ్చిందని, హోటల్ కి వెళుతున్నామని చెప్పాను. మీరు హోటల్ లో చెకిన్ అయ్యాక కాల్ చేస్తాను. రేపటి ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతానన్నాడు. కాబ్లో బయలు దేరాము. అలీ నయీమ్ చాలా కలుపుగొలుపుగా మాట్లాడాడు. ఆ కాసేపటిలోని ఎంత చనువు ఏర్పడిందంటే ఫేస్బుక్ ఖాతాలు కూడా ఇచ్చి పుచ్చుకున్నాము. అతన్ని అడిగాను మరునాడు మమ్మల్ని కార్ల్ మార్క్స్ సిమెట్రీకి, గ్రీన్విచ్ మెరీడియమ్ కి తీసుకెళ్ళటానికి రాగలవా అని. అలా కాబ్లో చాలా కాస్ట్లీ అవుతుందని, హోటల్ దగ్గర లోనే మెట్రోస్టేషన్ ఉందని, ట్రైన్ సర్వీసెస్ చాలా ఉన్నాయని, అందులో వెళ్ళటం చాలా చీప్ అని సలహా చెప్పాడు.
అలి తన వివరాలన్ని చెప్పాడు. లహోర్ నివాసి అని, యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్ లో బిజినెస్ అండ్ మానేజ్మెంట్ సైన్స్ చదువు కోసం 2010 లో వచ్చానని చెప్పాడు. మరి అంత చదువుకుని కాబ్ డ్రైవర్ గా ఎందుకు జాబ్ చేస్తున్నావని అడిగాను. కొన్నిరోజులు ఉద్యోగం చేసానని, కాని కాబ్ డ్రైవర్ గా సంపాదన, ఉద్యోగంలో లేదని చెప్పాడు. లాహోర్ లో పేరెంట్స్ ఉంటారని, ఇక్కడ భార్యా, ఏడాదిన్నర పాపతో ఉంటున్నామని, ప్రతీ రెండు సంత్సరాలకి ఒకసారి తల్లీతండ్రి, స్నేహితులు, బంధువులను కలవటానికి వెళ్ళి వాళ్ళతో నెలపాటు గడుపుతానని చెప్పాడు. అలీ మాట్లాడుతున్నా కూడా నాకేమో పెద్ద డౌట్. ఏదో సందేహం వాళ్ళు ఇతనికి అమౌంట్ ఇచ్చారా? మళ్ళీ మేము ఇవ్వాల్సి ఉంటుందా…అయినా మా దగ్గర సఫీషియంట్ పౌండ్స్ లేవుగా …. ఏమిటో అన్ని ధర్మ సందేహాలే. నేనుగా బయట పడకుండా, అలా మాట్లాడుతూనే అతనికి హోటల్ వాళ్ళకు మ్యూచ్యుల్ టైఅప్ ఉంటుందా? అని అడిగాను. అవునని, వాళ్ళ కంపెనీకి పే చేసి కాబ్ అరేంజ్ చేయమని చెబుతారని, అలాగే తానూ వచ్చానని చెప్పాడు. హమ్మయ్య నేను ఇంకా ఏమి ఇవ్వనవసరం లేదన్నమాట. ఛా… అల్రెడీ థామస్కుక్ వాళ్ళని అరేంజ్ చెయ్యమని అమౌంట్ ట్రాన్ఫర్ చేసానుగా. మళ్ళీ నాకీ సందేహమేల. అలా మాట్లాడుతుండగానే హోటల్ ఆట్రియమ్ కి 11 గంటలకల్లా వచ్చాము.
హోటల్ రిసెప్షన్ – ప్రణయ్
హోటల్ బయటే, లగేజ్ టాక్సీ లోంచి దించి గుడ్నైట్ చెప్పి అవసరమైతే కాల్ చేయమని చెప్పి వెళ్ళి పోయాడు. ‘అదేంటి విజయా! డ్రైవర్ అలా వెళ్ళి పోతున్నాడు. హోటల్లోపలి కన్నా బాగ్స్ తేవాలి కదా!‘. ప్రణయ్ ఆశ్చర్యంగా అన్నాడు. ‘ఇక్కడ ఇలాంటి పనులు చేయరు. సెల్ఫ్ హెల్ప్…. పదా‘ అంటూ హోటల్ మేయిన్ ఎంట్రెన్స్ వేపు నడిచాను. రోడ్డుమీంచి ఒక ఏడెనిమిది మెట్లు దిగితే కానీ రిసెప్షన్ కౌంటర్ ఉంది. నేను ప్రణయ్, కష్టం మీద బాగ్స్ మోసుకుంటూ కిందికి దిగి హోటల్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాము. కౌంటర్ లో ఓ ఆజానుబాహుడు ఆఫ్రికన్ కళ్ళద్దాల్లోంచి మమ్మల్ని చూస్తూ ‘యేస్‘ అన్నాడు బ్రిటిష్ ఆక్సెంట్ తో. థామస్ కుక్ వాళ్ళు పంపిన మా హోటల్ బుకింగ్, ఫోన్ లో చూపగానే రూం అలాట్ చేశారు. ఇదే రూం కంటిన్యూ చేస్తారా లేక మళ్ళీ రేపు మారాలా అని ప్రణయ్ అడిగితే, అర్థం కానట్టు చూసాడు. అంటే అతనికి మన ఇంగ్లీష్ ఆక్సెంట్ ఆయనకు కొరుకుడు పడటం లేదన్నమాట. నేను కల్పించుకుని మళ్ళీ రిపీట్ చేస్తే అప్పుడు జవాబిచ్చాడు. అవసరం లేదు రూం త్రీడేస్ కోసం బుక్ చేసారని చెప్పాడు. సరే … సత్రా భోజనం.. మఠా నిద్రలో… మఠం అయితే సంపాదించాం…హోటల్ సమస్య తీరింది. మరి ఫుడ్ ఏంచేయను? ప్రణయ్ బాగా ఆకలేస్తుందంటున్నాడు. హోటల్ వాళ్ళని ఏమైనా అరేంజ్ చేయగలరేమోనని అడిగా. ఆ అవకాశం లేదన్నాడు. అయ్యో ఏంచెయ్యాలి అనుకుంటూ, ముందయితే రూం కెళ్ళిపోదామని లిఫ్ట్ వైపు లగేజ్ తీసుకుని బయలు దేరాము. రూం ఓపెన్ చేయగానే ఉసూరుమన్నాను. అక్కడ డబుల్ బెడ్ ఉంది. ‘అయ్యో ఎలారా రెండు సింగల్ బెడ్స్ ఉన్న రూం కావాలని అడగ లేదా. ఈ బెడ్ నీ ఒక్కడికే సరిపోయేలా ఉంది. పోనీ ఒక రోజంటే ఎలాగో అలా మేనేజ్ చేయొచ్చు. కాని మనం మూడు రోజులూ ఈ రూములోనే ఉండాలి.‘ అన్నాను. ‘అయ్యో, అడగడం మర్చి పోయాను విజయా. అసలే ఆ ఆఫ్రికన్ కి మన ఇంగ్లీష్ అర్థమై చావట్లేదు. ఇప్పుడు నేను ఎంత ఎక్సర్సైజ్ చేస్తే రూము చేంజ్ చేస్తాడో. అయినా వెళ్ళి అడుగుతాను మనం ఇంకోరూంకి మారదాంలే’ అంటూ మళ్ళీ కిందకి రిసెప్షన్లోకి వెళ్ళాడు. ఏ సమస్యా లేకుండానే వెంటనే రూం మార్చారు. హమ్మయ్య ఫ్రెష్ అయి మంచి నిద్రపోవాలి. అనుకుంటూ మరి వీడికి తిండెలా ఇక్కడ ఏమి
దొరికేలా లేదు. ‘మనం తెచ్చిన స్నాక్స్ తింటావా? దాంలో స్వీట్ బ్రెడ్ లాంటిది కూడా ఉందనుకుంటా‘ అన్నాను. ‘ఓ… నో, నాకు మంచి ఫుడ్ కావాలి. చాలా ఆకలేస్తుంది విజయా.‘ అన్నాడు జాలిగా. ఆకలికి, అలసటకి ముఖం వాడి పోయింది. మంచి ఫుడ్ లేకపోయినా కనీసం బర్గర్ లాంటి దైనా సరే వాడు తింటాడు. మరి అదీ దొరికేట్టు లేదు. కనీసం ఏర్పోర్ట్ లో తీసుకోవాల్సింది. ఇప్పుడేంచేయాలి…నేనైతే మంచినీళ్ళు తాగి సర్దుకో గలను అంత ఇబ్బంది లేదు. లక్షలు పోసుకుని వచ్చి ఇక్కడ ఇలా మాడటానికా …. వాడలా ఆకలీ అంటూంటే మనసు అదోలా అయిపోతోంది. ఎలా అరేంజ్ చేయాలి. మొదటి రోజే ఇలాంటి ఎక్పీరియన్స్ ఏమిటీ? ఈ విధంగా ఇన్ని రోజులూ వీడిని ఎలా మానేజ్ చేయాలి….
తరువాతి ప్రయాణం విశేషాలు మరో వారంలో