బతుకమ్మ

గత వారం బతుకమ్మ పండుగ జరుపుకున్నాం కదా! ఆ పండుగ విశేషాలు
తెలంగాణ లో అతి ముఖ్యమైన పండగ బతుకమ్మ పండగ. అందరికీ బ్రతుకు నిచ్చే పండగ. ఆడ బిడ్డలకు ఆదరణ దొరికే పండగ. నాటి నుండి నేటి వరకు జరుగుతున్న పూల జాతర ఇది. ప్రకృతికి దైవంగా కొలిచే అద్భుతమైన తీరు. పనికి రావు అని పారేసిన గడ్డి పూలు కూడా అతి పవిత్రంగా బతుకమ్మలో ఒదిగి పోయి వాటి జన్మ సార్థకం చేసుకుంటాయి. తంగేడు గునుగు సీత జడ పూలు ..బతుకమ్మ కు శ్రేష్టం గుమ్మడి పూలు. కడుపు నింప డానికి గుమ్మడి ఆకులు.

ఎనమిది రోజులు బతుకమ్మ తర్వాత చద్దుల బతుకమ్మ. ప్రతీ ఇంట్లో ఎంతో ఆరాట పడి వీలైనంత పెద్దగా పెర్చుకోవాలని ఆశిస్తారు. ముందు రోజే పూలు తెచ్చుకుని పిల్లలు పెద్దలు కలిసి ఏరి కట్టలు కట్టి..రంగులు అద్ది అన్ని ఆర పెట్టుకుని సిధ్ధంగా ఉంటారు.

తెల్ల వారి ఉదయం స్నానం పూజలూ నైవేద్యం వంటలు చేసుకుంటారు. తొమ్మిది రకాల పులిహోర ల లో ఒకటి చక్కెర పొంగలి, దద్యోజనం చేస్తారు. ఇక ఇంటి మధ్యలో చాప పరుచుకుని పీట వేసి దాని పై పెద్ద పళ్ళెం పెట్టీ పసుపు కుంకుమ పెట్టీ దండం పెట్టుకుని ఇంట్లో ఉన్న ముత్తైదువలు పసుపు కాళ్లకు రాసుకుని, బొట్టు పెట్టుకొని పేర్చడం మొదలు పెడతారు. పిల్లలు పూలు అందిస్తుంటే పెద్ద వాళ్ళు పేరుస్తారు. ముందు పళ్ళెంలో గుమ్మడి ఆకుని చక్కగా పరచి మొదటి వరుస గుమ్మడి పూలు పెడతారు. రెండవ వరుస తంగేడు పూలు. తర్వాత తెల్ల గునుగు తర్వాత రంగులు అద్దిన గునుగు..తర్వాత చామంతు లు గొట్ట మల్లె పూలు..తరవాత వరుసలో సీత జడ పూలు , మందారాలు పెట్టుకుంటు మధ మధ్య కడుపు ఆకులతో నింపి చివరగా శిఖరం పూల గుత్తి తో తయారు చేసి పెడతారు. మరో చిన్న బతుకమ్మ పేర్చి గౌరీ దేవి నీ పెడతారు. ఇక రెండు అందమైన బతుకమ్మల కు పూజ చేసి నైవేద్యం పెట్టి అందరూ చక్కని చద్దులతో భోజనం చేస్తారు.

సాయంత్రం 3 గంటల నుండి తయారు కావడం మొదలు పెడతారు ఇంట్లో ఆడ పిల్లలు . తర్వాత పెద్ద వాళ్ళు. వాకిట్లో చక్కగా అలికి ముగ్గులు వేసి పీట మీద బతుకమ్మలను పెట్టీ అందరూ ఉయ్యాలో అంటూ చప్పట్లతో పాటలు పాడుతూ ఆడుతారు. ప్రతి ఒక్కరూ లక్ష్మి దేవి స్వరూపాలు కనిపించి భక్తి భావం కలిగిస్తారు. అందరి ఇళ్ళ నుండి వచ్చిన బతుకమ్మలు ఊరిలో ఒక కూడలి వద్ద అమర్చి ఆటలు ఆడుకుంటారు. చక్కని పూల బతుకమ్మలు కొలువు దీరి కను విందు చేస్తాయి.

చీకటి పడగానే చెరువులో నిమజ్జనం చేసి..పళ్ళెంలో నీళ్ళు తెచ్చుకుని గౌరమ్మను ఓల లాడించి అందరూ పసుపు కుంకుమ పంచుకుని గౌరమ్మ పాట పాడుకుని ప్రసాదం తీసుకుని పాటలు పాడుకుంటూ ఇళ్ళు చేరుకుంటారు .

ఈ పండగ వల్ల మనసు మరియు శరీరం ఎంతో ఉత్తేజితం అవుతుంది. ఇప్పుడు వచ్చే శబ్దాలతో పాటలు కాదు. సాంప్రదాయంగా చప్పట్లతో మాత్రమే ఆదే వారు. ఆ పద్ధతిని పాటించుదాము. బతుకమ్మ పాటలను కొత్త రకంగా మార్చి వాటి సహజత్వాన్ని పోగొట్టు కో వద్దు. ముందు తరాలకు పండగ ఆవశ్యకతను తెలుపుదాము.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మానవత్వమా! నీ మతమేంటి?

“నేటి భారతీయమ్” (కాలమ్)