తల్లివేరు

కథ

                 వేముగంటి శుక్తిమతి

మరోసారి కాలింగ్ బెల్ కొట్టడం కోసం చేయి పైకెత్తుతున్న నిర్మలమ్మకు తెరిచిన తలుపును అలాగే చేతితో చాలాసేపు పట్టుకుని శిలలా నిల్చున్న కూతురు విజయను చూస్తే ఆశ్చర్యం వేసింది.
మేఘాలు లేని ఆకాశంలా ఎప్పుడూ నిర్లిప్తంగా కనిపించే ఆమె ముఖంలో కోపమూ, దుఃఖమూ పలచటి దూది మేఘాల్లా కనిపించి ఆ తల్లి స్థాణువులా చాలాసేపు అలాగే నిల్చుండి పోయింది.
“అమ్మమ్మను అంతసేపు కారిడాల్లో నిలబెట్టావ్.? ఎందుకు మమ్మీ ?”అని కూతురు అడిగిన ప్రశ్నకు
విజయ కంగారుపడుతూ అటూ ఇటూ తలతిప్పి చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది.
తడబడే అడుగులతో లోపలికి వచ్చిన కమలమ్మ చేతిలో ఉన్న రెండు సంచులను పక్కకి పడేసి సోఫాలో కూలబడిపోయింది.
“చిట్టి తల్లీ. నాకు కాసిన్ని మంచినీళ్లివ్వు” నీరసంగా అడిగింది కమలమ్మ.
“ఆ- ఇస్తా గాని నాకోసమేం తెచ్చావు చెప్పు అమ్మమ్మా.?”
“తెచ్చాను తల్లీ. ఒకటేమిటి ..చాలా తెచ్చాను.. నీకి ష్టమైనవన్నీ తెచ్చాను.” అంటూ గడగడా చెంబెడునీళ్లు తాగేసింది.
తన రాక చూసి కూడా ఒక్క మాటైనా మాట్లాడక గదిలోకి వెళ్లిపోయి ఎంతసేపటికి బయటకు రాకపోయేసరికి నిర్మలమ్మకు విషయం అర్థం కాలేదు. ఏదైనా నలతగా ఉందా. లేక ఏదైనా సమస్యతో బాధపడుతుందా అని ఆలోచిస్తూ కూర్చున్నదల్లా లేచి కూతురు గదిలోకి వెళ్లి
….. ……. ……………
దిగులుగా, మాటా పలుకు లేకుండా ఒంటరిగా కూర్చున్న కూతురు విజయ తో.
“ఏమైంది తల్లీ. అలా ఉన్నావ్” అడిగింది
” ఏదో చెప్పాలనుకుంటే నోరు పెగల్లేదు.
‘ అవునూ. తనకేమైంది..? ‘తల్లి వేసిన ప్రశ్ననే తనకు తనూ వేసుకుంది.
కిటికీలో నుండి బయటకు శూన్యాన్ని చూస్తూ తనకోసం వచ్చిన తల్లిని ‘అమ్మా!’అని పిలుద్దామని నోరు తెరవబోతే గుండెలోంచి గొంతులో నుండి మాటకు బదులు దుఃఖం పెల్లుబికి వస్తోంది.
ఊరి నుండి తమకు ఇష్టమైన ఎన్నెన్నో పిండి వంటలు, వడియాలు ,పచ్చళ్ళు కష్టపడి చేసి ఎండలో బస్సులో పడి వచ్చినందుకు తను తన తల్లికి చెంబెడు నీళ్లు కూడా ఇవ్వలేకపోయింది.
నోరు విప్పి అమ్మా అనలేకపోయింది. ఎందుకు..? ఏమైంది తనకు??.
అతి ముఖ్యమైన బంధాలమద్య కూడా ఆస్తి సంబంధాల వల్ల అవరోధం ఎంత త్వరలో ఏర్పడిపోతుంది. ఒక్కమాటతో… ఒక్క చేష్టతో..చివరకు కన్నతల్లి అయినా సరే…. గట్టిగా నిట్టూర్చింది విజయ.
ఒక కోతి పిల్ల తల్లి చుట్టూ ఆడుకుంటుంది. చెట్ల కొమ్మల్లోకి పరిగెత్తి మళ్లీ గెంతుకుంటూ వస్తోందితల్లి చెంతకు.
భర్త శేఖర్ దగ్గర నుండి ఫోన్.
” విజయా. ఈసారి ఈ టూర్ లో చేయాల్సిన పనులేవీ చేయలేకపోతున్నాను. ముందు మీ పుట్టింట్లో భూమి నా సొంతమయ్యే వరకు నేను ఏ పని చేయలేను. అందుకే ఈ రాత్రి ట్రైన్ ఎక్కేస్తున్నాను.ఎల్లుండి ఉదయానికల్లా అక్కడ దిగుతాను. గుడ్ నైట్….”
ఒక్కసారిగా యావత్ ఆకాశమంత తనమీద కుప్పకూలినట్టు తను నిలువునా కూరుకుపోయినట్టు గట్టిగా చెవులు మూసుకుంది విజయ.
తలుపు దగ్గర శబ్దం కావటంతో అటు తిరిగిన ఆమెకు తల్లి ప్లేట్లో టిఫిన్, గ్లాస్ లో జ్యూస్ తీసుకురావడం చూసిన ఆమెకు బోరున ఏడవాలనిపించింది.
నవ మాసాలు మోసి, కని,పెంచి ఆమె జీవితమే తనకోసం అన్నట్లు దీనంగా కనిపించిన తల్లి ఎవరో పరాయి మనిషిగా అనిపిస్తోంది.
మారు మాట్లాడకుండా తను తీసుకువచ్చిన ప్లేటును శబ్దం కాకుండా తన ముందు పెట్టి వెళ్ళిపోతున్న తల్లిని వాటేసుకుని బావురుమనాలనిపించింది.
కానీ ఇంతలో భర్త శేఖర్ ఉగ్రరూపం కళ్ళ ముందు కదిలింది.
తన తల్లి ఇక్కడికి వచ్చేది శేఖర్ కి తెలియదు. ఇన్ని రోజుల నుండి మంచు ముద్దలా ఉన్న అతడి మనసు ఎవరో శిలగా మార్చారు.
లేనిపోని ఆశలన్నీ కల్పించారు. దీనంతటికీ కారణం భూముల ధరలు పెరగటం.
అంతమాత్రాన మనుషుల విలువలు తరగడం సబబేనా..
తనకు ఒక్కగానొక్క తమ్ముడు, అమాయకపు తల్లి. వాళ్ల బ్రతుకులు ఎలా గడవాలి.?
చదువు వంటపట్టక ఆ భూమి పంట తోటే గడిపేస్తున్న ఆ ఇద్దరి జీవితాల గురించి అతడు ఎందుకు ఆలోచించటం లేదు.
ఆ ఇంటి అల్లుడుగా పెద్దదక్షతలేని వాళ్లకి పెద్ద కొడుకులా మెదలాల్సింది పోయి శత్రువులా ప్రవర్తిస్తూ అవసరమనిపిస్తే కోర్టుకైనా వెళతానంటాడా.
ఇన్నేళ్లు, ఇన్నాళ్లు ఆమెతో అడ్డమైన మర్యాదలు పొంది ఆ అమాయకురాలును రోడ్డు మీద పడేస్తాడా.
తన పెళ్లి నాడు అందం, ఆస్తి, చదువు ,ఉద్యోగం అన్నీ ఉన్న శేఖర్ సంబంధం వదులుకోకూడదని తన తండ్రి దాదాపు 8 ఎకరాల దాకా అమ్మేసి పెళ్లి చేశాడు.
ఇప్పుడు వాళ్లకు మిగిలింది కేవలం నాలుగు ఎకరాలు. ఏ పంట పండినా తనకిచ్చే పాలు తప్పటం లేదు. వాటితో పాటుగా ప్రతి పండుగ పబ్బాలకు పిండి వంటలతో మొదలుపెట్టి సర్వం మోసుకుని తె వస్తుందా పిచ్చితల్లి.
తన భర్తకు మంచి ఉద్యోగం, ఊర్లో పంటలు, బస్తీలో ఇల్లు ఇన్ని ఉన్నా ఇంకేదో కావాలని ఇన్ని రోజుల నుండి లేని ఆశ ఎందుకు మొదలైంది.
తనకున్న నలుగురు బాబాయిలు వారికున్న భూములను ఏ తగాదాలు లేకుండా ఎవరిది వాళ్లు పంచేసుకున్నారు. ఏ చిన్న పోట్లాట వారి మధ్య తను చూడలేదు.
ఆ తర్వాత కూడా ఒకరికొకరు ప్రాణంగా, ఆత్మీయంగా ఉండటమే తనకు తెలుసు.
తనకున్న ఇద్దరు మేనత్తలు కూడా అన్న తమ్ముళ్ల మీద చూపించే ప్రేమ, ఆర్థిక సహాయాలు మాత్రమే తనకు తెలుసు.
మానవ సంబంధాలే ఆనాటి బలం.బలగం.’
పక్కమీద దొర్లుతున్నా నిద్ర పట్టని విజయ తెల్లవారకుంటే బాగుంటుందని భగవంతుని వేడుకుంటుంది.
శేఖర్ రాకముందు తల్లిని వెళ్లిపొమ్మనాలి.
గత రెండు నెలల నుండి ఆ మానవుడిలో తను దానవుడినే చూస్తుంది.
తన తల్లి వచ్చిన సంగతి తెలువక మానదు. అవసరమైతే బిడ్డను కూడా ఎంక్వయిరీ చేసే నీచ స్థితికి దిగజారి పోయాడు.
అందుకే తన మనసు చంపుకొని తల్లిని పలకరించనైనా లేదు.” విజయ దిండులో మొహం దూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది.
పొద్దున్నే నిద్ర మేల్కొని కళ్ళు నలుపుకొని బయటికి వచ్చేప్పటికి ఇంటి పని అంతా చేసి రెండు కాళ్లు ముడుచుకొని ముఖాన్ని లాక్కొని చెర్లో తామర తూడు లాగా కూర్చుని ఉన్న తల్లిని చూసి విజయ మనసు తల్లడిల్లి పోయింది.
విషయాన్ని ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. ఎలాగో ధైర్యం చేసుకొని ఎటో చూస్తూ “అమ్మా!
నువ్వు రేపే వెళ్ళిపో. నువ్వు ఇక్కడికి రావద్దు… నన్ను ఎప్పుడూ కలవొద్దు.. నీకున్న భూమిలో మాకు సగం ఇచ్చేవరకు.” చేతులు జోడించి కాసారాలైనా కళ్ళతో, వణికే పెదవులతో అన్న కూతురు మాటలు వింటుంటే కమలమ్మ బెంబేలెత్తిపోయింది. అకస్మాత్తుగా ఇంటి నుండి వెళ్లిపొమ్మని హెచ్చరిస్తున్న బిడ్డను అమాయకంగా చూసింది. కమలమ్మకు ప్రశ్నలు వేయడం తెలియదు. ముభావంగా ఉంటూ తన పని తాను చేస్తూ వెళ్లే తత్వం ఆమెది.ఆమెకు కూతురు మాటలుమళ్లీ మళ్లీ చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది
నిశ్శబ్దం.. నిర్ణయానికి తట పటాయింపుకు మద్య నిశ్శబ్దం… అవును కాదు కి మధ్య నిశ్శబ్దం… విధేయతకు, దిక్కారానికి మధ్య నిశ్శబ్దం..
తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ, ఇన్నాళ్లూ తనతో యంత్రంలా పని చేయించుకున్న కూతురు….
ఉన్నట్టుండి మారిపోయిన పరిస్థితికి బెంబేలెత్తిపోయిన కమలమ్మ దెబ్బతిన్న పక్షిలా గిలగిలా కొట్టుకుంది.

తన జీవితంలో నుండి కూతురు దూరంగా వెళ్లిపోయినట్టు అనిపించింది. మరుక్షణం తన ఊరికి తిరుగు ప్రయాణం కట్టింది.
* * * *

తలుపు చప్పుడు విని నిర్మలమ్మ అటువైపు చూస్తుంది.
ఎదురుగా జగన్నాథం. అతని వెనక అల్లుడు.
కాళ్ళ కింద భూమి కనిపించింది. అవునా, కాదా అని పరీక్షగా చూసింది. నిజమే. జగన్నాథం.
జరిగిన అవమానం మర్చిపోయి నేరుగా ఇంటికే వచ్చాడు” అసహ్యించుకుంది.
అల్లుడు వచ్చినందుకు సంతోషించింది.
వంటింటికెళ్లి ఏదేదో హడావిడి చేసింది. కొడుకు అచ్యుత్ ను పిలిచి బావగారికి ఏదో మర్యాదలు చేయమని పురమాయించింది.
“అమ్మ బాగున్నారా” తను చేసిన బాగునంతా మరిచిపోయి అడుగుతున్న జగన్నాథం చూస్తే ముందు బయటికి వెళ్ళమని అరవాలనిపించింది. అల్లుడు ఉన్నాడని తమాయించుకొంది.
‘తన భర్తనెంత క్షోభ పెట్టాడు. గోవు లాంటి వ్యక్తిని గట్టు పంచాయతీ, గెట్టు పంచాయతీ పెట్టి బెదిరించి అదిరించి పొలం దున్నుకోకుండా, బతుకు తెరువు లేకుండా చేశాడు. ఆ దౌర్జన్యానికే ఇంకా బతకాల్సిన అతని గుండెను పగలగొట్టాడు.’
ఆమె పటపట పళ్ళు కొరుక్కుంది.
కానీ వచ్చింది అల్లుడుతో.
“అమ్మా. మీ అల్లుడు ఏదో కోరుకుంటున్నాడు. మీరు కాదంటారేమోనని ఊర్లో పెద్దమనిషినైన నన్ను పిలుచుకొచ్చాడు మాట్లాడమని.
మీరు కోపంగా ఉన్నారు. వెళ్లిపోమంటే వెళ్ళిపోతా.”
కూర్చున్న చోటు నుండి లేవబోయిన అతన్ని అల్లుడు ఉండమని ప్రాధేయపడుతుంటే ఏమీ మాట్లాడలేక ఆమె
ఇదేదీ పట్టించుకోనట్టు అల్లుడు వేపు చూస్తూ “విషయంచెప్పండి” అంది.
“చెప్పడానికేముంది. మీ కొడుకు తో సమానంగా ఉన్న నాలుగెకరాలలో రెండెకరాలు నా పేరు మీద రాసి వ్వాలి.”
ఆమెకు తెలిసిన విషయమే కాబట్టి ఏమీ గాబరా పడలేదు.
కానీ. విషయం రంగం మీదకు వచ్చింది కాబట్టి,
ఆమె అతన్ని ఏదో ప్రాధేయపడాలనుకుంది. తన కొడుకు పరిస్థితి చెప్పాలనుకుంది. ఏ ఆదాయం లేని తన కొడుకుకున్న ఒక్క ఆసరాను లాగేయవద్దని కాళ్ళా వేళ్ళా పడాలనుకుంది.
కానీ జగన్నాథం ముందు ఏదీ మాట్లాడడం ఆమెకి ఇష్టం లేదు. ఆత్మాభిమానం గల మనిషి కనుక.
” విజయ రాలేదా నాయనా”మాట మారుస్తూ అంది.
” రాలేదు.మీరు నేను అడిగింది ఒప్పుకోకుంటే ఇప్పుడే కాదు ఇంకెప్పుడూ రాదు..” అంటూ ఎదురుగా ఉన్న అచ్యుత్ తో” నీ బోడి మర్యాదలు ఇకనుంచి చాలు. కాళ్లకు నీళ్లు, కప్పెడు టీ తో పొంగిపోయే అమాయకపు రోజులు పోయాయి. మీ అమ్మతో మాట్లాడు. లేదు కాదంటే కోర్టుకెళ్లిపోతాను.” అంటూ లేచి వెళ్లిపోయాడు.
……… ……….. …………….
నీళ్లు నిండిన కళ్ళతో అచేతనంగా చేతిలో ఉన్న బియ్యపు గింజల్ని చల్లి పక్షుల, పిచ్చుకలు అవి ముక్కుతో పొడుస్తూ తృప్తిగా తింటుంటే ఆమె మనసుకెంతో ఊరట కలిగింది.
‘మనిషి కంటే మూగ ప్రాణులు ఎంతో నయం. ఎన్ని యుగాలు గడిచినా అవి ధర్మం చెడలేదు. కడుపు నింపుకోవడం తప్ప వేరే కడుపు కొట్టడం లోకంలో ఏ ప్రాణికి లేదు. మనిషికి తప్ప.’
ఆమెకు దుఃఖం ఆగడం లేదు.
కొడుకు అచ్యుత్ పాత తెల్లని బుషట్ వేసుకొని ఫేము కుర్చీలో కూర్చొని తలని వెనక్కి వాల్చి ఎటో చూస్తున్నాడు.
‘తన కొడుకేమాలోచిస్తున్నాడు.’
” ఏమో..? ఆమె గట్టిగా నిట్టూర్చింది.
రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన తన కొడుకు మనసు అల్లకల్లోలం చేస్తుందని ఆమెకు తెలుసు.
” వంట అయిపోయింది. అన్నం వడ్డిస్తా.రా.” తల్లి పిలుపు అచ్యుతుకు వినిపించలేదు.
ఆమె భయపడింది.
దగ్గరగా వచ్చి ఉల్కక, పల్కక కూర్చున్న కొడుకు చేతిలో పేపర్ తీసేసి.
“ఏం చదువది?” అంది విసుగ్గా.
“భూమికోసం బాధపడుతున్నావా. పోతే పోయింది. ఆనాడే మీ నాయన శ్రీమంతుడైన అల్లుడు కోసం ఇంకో రెండెకరాలు ఇచ్చాడు అనుకుందాం. మిగిలింది నీకు చాలు లే. దేవుడున్నాడు నిన్ను కాపాడటానికి.”
పొంగి వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అంది.
” అమ్మా… పొలం కోసం కాదు. బావ గారి ప్రవర్తన.. అలవాటు లేక మింగుడు పడటం లేదు. అదే వేదన. అదే బాధ నాకు. రెండు చేతుల్లో మొహం దాచుకొని బోరున ఏడ్చాడు.
బావతో తన కొడుక్కు పదేళ్ల బంధం. ఇన్నేళ్లూ ఆయన చూపిన ఆత్మీయత, పాదుకున్న అనుబంధం, ఆదుకున్న వైనం ఆమెకు తెలియంది కాదు. కానీ ఏం చేయగలదు.
…………. …………. …….
తలుపు బిగించడంతో మిట్ట మధ్యాహ్నమైనా చిమ్మ చీకటి. పైన తిరుగుతున్న ఫ్యానురెక్కల్ని తదేకంగా చూస్తున్న ఆమె కళ్ళల్లో ఊరిన నీటి బిందువులు కనుకొలుకుల నుండి కారిపోతున్నాయి.
నిర్జీవమైన తన గాజు కళ్ళలో ఇంకా నీరుందా? చెంపల మీద జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అనుకుంది.
ముడుచుకొని పడుకున్న తల్లిని చూసి” అమ్మా! నీ బాధ నాకెరుకే. ఏం చేస్తాం.?”
“అన్నం పెట్టే భూమినన్న వదులుకుంటా గాని రక్తం పంచుకున్న అక్కను వదులుకోలేను.”
తల్లి దగ్గర కూర్చొని ధైర్యం నూరి పోశాడు.
కుంపటి లా రాజుకునే కడుపు మంట నిలువునా దహించేస్తుంటే కొడుకు మాటలు మంచులా చల్లబరిచి కరిగిపోయి ఆమె చేత కంటనీరు పెట్టించింది.
ఇన్నాళ్లూ ఇద్దరూ భూమిని నమ్ముకుని బతికిన వాళ్లే.
ఇప్పుడు ఇద్దరూ మోసపోయిన వాళ్లే.
ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకునే వాళ్లే.
ఒకరిని చూసి ఒకరు విలవిలలాడుతూ జీవంలేని మొక్కల్లా మిగిలిపోయారు.
అవును. యేటికి ఎదురీదైనా సంబంధాలు నిలుపుకోవాలి కదా.
ఇద్దరిదీ ఒకటే ఆలోచన.
ఇద్దరిదీ ఒకటే నిర్ణయం
అందుకే ఇద్దరి మధ్యా మాటలు కరువైన నిశ్శబ్దం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

” లాయర్ సలహాలు” (కాలమ్)