తెల్లవారి మామూలుగానే లేచి సౌదామిని బాలసదనంకు తయారైంది…
నీలాంబరి సౌదామిని దగ్గరికి వచ్చి…
” ఈరోజు బ్రేక్ఫాస్ట్ నువ్వు తయారుచేసావట కదా! మహేశ్వరి చెప్పింది” అన్నది.
” అవును అత్తయ్యా! ఊరికే ఇడ్లీ దోస ఇవి తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు కార్బో హైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి.. అప్పుడప్పుడు ఓట్స్ రాగి పిండితో చేసిన పదార్థములు ఇలాంటివి తింటే మంచిదని… మన పూర్వీకులు తినే ఆహారం ఎంతో బాగుండేది కదా రాగులు, జొన్నలు ఎక్కువగా వాడుకునే వాళ్ళు ఈ మధ్యకాలంలో అందరం రుచిగా ఉన్న పదార్థాల వెంటపడి ఆరోగ్య రహస్యాలు మర్చిపోతున్నాము… అందుకని ఓట్స్తో పొంగల్ చేశాను” అన్నది సౌదామిని.
” హమ్మయ్య పెద్ద క్లాసే విన్నాను… నువ్వు చెప్పింది నిజమే అప్పటి రోజుల్లో చాలావరకు పొద్దున టిఫిన్లు లేనే లేవు ఒకవేళ తిన్నా కూడా గుప్పెడు అటుకులు లేదా పేలాలు లేదా ఆ సీజన్కు సంబంధించిన పండ్లు అలాంటివే తినేవాళ్ళం భోజనంలో ఇప్పటిలా పాలిష్డు బియ్యం కాదు కదా ఇంట్లో దంచిన బియ్యమే తినేవాళ్ళం ఇప్పుడు అన్ని పదార్థాలు నాణ్యత లేకుండానే పోయాయి ఏం తింటున్నామో అర్థం కావడం లేదు అంతా పిప్పి మాత్రమే… హమ్మయ్య రివర్స్ క్లాసు నేను కూడా తీసుకున్నాను” అన్నది నవ్వుతూ నీలాంబరి.
“మరి మనిద్దరం సమఉజ్జీలుగా ఉండాలి కదా అత్తయ్య” అన్నది నవ్వుతూ సౌదామిని.
సౌదామిని మామూలుగా మాట్లాడుతున్నందుకు కొంచెం ఊపిరి పీల్చుకున్నది నీలాంబరి “కళ్ళ ముందు పిల్లలు బాధపడుతుంటే ఎవరు మాత్రం తట్టుకోగలరు! దేవుడి దయ వల్ల అన్ని సవ్యంగానే జరగాలి నామొర శివయ్యకే చెప్పుకోవాలి ఒకసారి వెళ్లి అభిషేకం చేసుకొని వస్తాను” అని మనసులో అనుకున్నది నీలాంబరి.
మహేశ్వరి వచ్చి సౌదామినికి ప్లేట్లో ఓట్స్ పొంగల్ పెట్టి ఇచ్చింది.
” నువ్వు కూడా టేస్ట్ చేయు మహేశ్వరి” అన్నది సౌదామి నీ..
” సరే చిన్నమ్మ” అన్నది మహేశ్వరి.
ఇంతలో బయటకు వచ్చిన అలేఖ్య “ఏంటి టిఫిన్ సెక్షన్ నువ్వు తీసుకున్నావా!” అన్నది సౌదామినితో..
” అంత లేదు వదినా ఓట్స్ తో పొంగల్ చేశాను అందరికీ బాగుంటుంది కదా కొంచెం కారం లేకుండా పక్కన పెట్టాను సౌందర్యకు కూడా ట్రై చేయవచ్చు” అన్నది పొంగల్ తింటూ..
” సరే ట్రై చేస్తా కానీ ఎలా చేశావు!” అని అడిగింది.
” ముందుగా ఒక గ్లాస్ పెసరపప్పుని ఉడికించాను.. సగం ఉడికాక అందులో ఒక గ్లాస్ ఓట్స్ కొంచెం జీలకర్ర కొన్ని మిరియాలు కొంచెం క్యారెట్ తురుము ఉడికించిన ఆలు ముక్కలు కరివేపాకు, కొత్తిమీర వేసాను పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు పాప కోసం వేయలేదు… ఇదంతా మెత్తగా ఉడికాక కొంచెం ఉప్పు వేసి తర్వాత నెయ్యితో ఇంగువ పోపు వేశాను” అన్నది సౌదామిని…
” మంచి ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ మంచిదే” అన్నది అలేఖ్య.
టిఫిన్ తినేసి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బాలసదనంకి బయలుదేరింది సౌదామిని.
అక్కడ అందరి పిల్లల్ని ఒకసారి చూసి బయటకు వచ్చి హాల్లో కూర్చుంది..
ఒక అమ్మాయి దాదాపు తన వయసే ఉంటుంది ఒక చిన్న పాపను తీసుకుని వచ్చింది. పాప కొంచెం అబ్నార్మల్ గా ఉంది…
పాపని చూసి సౌదామిని
” పాపకి ప్రాబ్లం ఏంటి” అని అడిగింది.
” ఐదేళ్ల వయసున్నా ఇంకా మాటలు సరిగా రావు సంవత్సరం పిల్లలాగా ప్రవర్తిస్తుంది డాక్టర్ గారు” అని చెప్పింది పాప తల్లి.
” ఇప్పటివరకు ఎక్కడైనా చూపించారా” అని అడిగింది.
” చూపించానండి.. మాది మేనరికం పెళ్లి అండి అందుకని పిల్లలు ఇలా పుట్టవచ్చు అని చెప్పారు డాక్టర్ గారు” అని చెప్పింది ఆ అమ్మాయి బాధపడుతూ.
” అవునా మరి ఈ మేనరికం పెళ్లి చేయాలని ఎవరి ఆలోచన!” అని అడిగింది.
” మా నాన్నగారు వాళ్ళ అక్క కొడుకుకి ఇస్తే వాళ్ళ మధ్య సంబంధాలు బాగా ఉంటాయని ఇలా నిర్ణయం తీసుకున్నారు ఇంకా దానికి బలమైన కారణం మా నాయనమ్మ… కూతురు ఎప్పుడు దగ్గరే ఉండొచ్చు అని ఆమె స్వార్థం ” అని కన్నీళ్లు పెట్టుకుంది.
“ఈరోజుల్లో చదువుకున్న వాళ్లు కూడా ఇంకా ఇలాగే చేస్తున్నారు తన విషయానికొస్తే తన తల్లిదండ్రులకి ఎంతో విజ్ఞానం ఉంది అయినా కూడా తనను అత్త కొడుకు ఇచ్చి చేయాలని అనుకుంటున్నారు అన్ని మేనరికపు పెళ్ళిళ్ళకి ఇలా జరగకపోవచ్చు కానీ ఒకవేళ జరిగితే అది మనం చేజేతలార చేసినట్లే కదా ఎందుకు అర్థం చేసుకోవడం లేదు మనుషులు అందులో నేను డాక్టర్ను కూడా…”ఇలా ఆలోచించుకుంటూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది సౌదామిని.
” ఏమి బాధపడకు ఇలాంటి పిల్లల్ని చూడడానికి స్పెషల్ హాస్పిటల్స్ ఉంటాయి మరియు స్కూల్స్ కూడా వాళ్ళకి సెపరేట్గా ఉంటాయి మామూలు మనుషుల్లా వాళ్లని చేయగలుగుతారు ఏ హాస్పిటల్ కి వెళ్ళాలి అనేది నేను కనుక్కొని చెప్తాను మీకు డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు కాకుండా నేను సహాయం చేస్తాను” అని చెప్పి ఆ అమ్మాయిని ఓదార్చింది.. తర్వాత ఆరోగ్యపరంగా ఆ అమ్మాయిని పరిశీలించి హెల్తీగా ఉంది బాధపడకు అని చెప్పి మనస్సు కొంచెంవికలం చెంది తొందరగానే ఇంటికి బయలుదేరింది సౌదామిని.
ఇంటికి వచ్చిన సౌదామినినీ చూసి నీలాంబరి అలేఖ్య ఆశ్చర్యపోయారు…” చాలా తొందరగా వచ్చావు సౌదామిని ఆరోగ్యం బాగుందా” అని కంగారుగా అడిగింది నీలాంబరి.
” బాగానే ఉన్నాను అత్తయ్యా! ఊరికేనే వచ్చాను రేపు నేను అమ్మానాన్న దగ్గరికి వెళ్లాలని అనుకుంటున్నాను” అని చెప్పింది..
” సరే తల్లి వెళ్లి రా మరో డాక్టర్ ఉంది కదా చూసుకుంటుందిలే” అని చెప్పింది నీలాంబరి…
గదిలోకి వెళ్లిన సౌదామినికి 10 నిమిషాల్లో వాళ్ళ నాన్నగారు నుండి ఫోన్ వచ్చింది వెంటనే బయలుదేరి రమ్మని చెప్పారు…
చాలా కంగారుగా బయటకు వచ్చిన సౌదామిని నీలాంబరితో..
” అత్తయ్యా! నాన్న నన్ను వెంటనే బయలుదేరి రమ్మన్నారు నేను బయలుదేరుతాను .. మరి మన సదనంలో నేను లేకుంటే సర్దుబాటు అవుతుందా వెళ్లి రానా!’ అని అడిగింది…
” వెళ్లి రా తల్లి నేను కూడా వెళ్లి చూసుకుంటాను నువ్వు దీని గురించి ఏమీ ఆలోచించకు” అని చెప్పి లోపలికి వెళ్లి ఒక 50 వేల రూపాయలు తెచ్చి సౌదామినీని చేతిలో పెట్టింది నీలాంబరి..
” ఇప్పుడు డబ్బు అవసరం లేదు నా దగ్గర ఉన్నాయి” అన్నది సౌదామినీ..
” నీ దగ్గర ఉండని ఇవి తీసుకో ఇంకా కొన్ని డబ్బులు గూగుల్ పే చేస్తాను క్యాష్ దగ్గర ఎక్కువగా లేదు” అని చెప్పింది నీలాంబరి.
” నన్ను పరాయిగా భావిస్తున్నారా !నాకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు నేను ఈ ఇంటి కాబోయే కోడలునే కదా! నేను డబ్బులు ఎందుకు తీసుకోవాలి!” అని అడిగింది సౌదామిని.
” అవునమ్మా ఇంటి మనిషివి అయితే మాత్రం డబ్బు అవసరం ఉండదా పోనీ ఒక పని చెయ్ బీరువాలో డబ్బులు పెట్టేస్తాను నీకు ఇష్టం ఉన్నంత తీసుకొని వెళ్ళిపో సరేనా” ! అన్నది నీలాంబరి.
” సరే ఇప్పుడైతే 10000 చాలు” అని 10000 తీసుకొని బ్యాగ్ లో రెండు జతలు బట్టలు పెట్టుకుంది..
నీలాంబరి అప్పటికే డ్రైవర్ కు ఫోన్ చేసి కార్ రెడీగా ఉంచమని చెప్పింది..
కారులో బయలుదేరింది సౌదామిని..
ఇంకా ఉంది