“పిల్లలు చేసే తప్పుల్లో పెద్దల బాధ్యత యెంతవరకు?”

“నేటి భారతీయమ్” (కాలమ్)

       డా. మజ్జి భారతి

ఇప్పుడందరూ ఆ కాలంలా కాదండి. ఈ కాలం పిల్లలే వేరు, మనం చెప్తే వింటారా? అని అంటున్నారు కాని, మనం చెప్పినది పిల్లలు వినేలా చెయ్యడంలో మనమెంత నిబద్ధతతో, నిజాయితీతో వున్నామో గ్రహించుకోవలసిన బాధ్యత పెద్ద వాళ్లందరి మీదా వుంది. చిన్నప్పుడే వాళ్లకు మంచేదో చెడేదో నేర్పించకపోవడం, వాళ్ళు పెద్దయ్యాక మనం చెప్పిన మాట వినడం లేదని బాధపడటం ఈ కాలంలో సాధారణమైపోయింది తల్లిదండ్రులందరికీ. దానికి ముందు, పిల్ల వాళ్ల ఎదురుగా మనం చేసే ప్రతి చర్యను, మనకు మనమే సెన్సార్ చేసుకొని, అవసరమైతే వాళ్ల కోసం మనమే మారాల్సి వుంటుంది. అప్పుడే వాళ్ళు మన నిబద్ధతను గ్రహించి, మంచి పౌరులుగా వాళ్లను వాళ్లు తీర్చిదిద్దుకోగలుగుతారు.
అన్నీ తెలిసిన పెద్దలే యెన్నో తప్పులు చేస్తున్నప్పుడు, తెలిసీ తెలియని వయసులో పిల్లలు తప్పు చెయ్యడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. కాకపోతే, ఆ తప్పును చిన్నప్పుడే సరిదిద్దకుండా వదిలేస్తే, తాము చేస్తున్నది తప్పని తెలియకుండానే, అవే తప్పులు చెయ్యడమనేది వారి జీవితంలో భాగమైపోతుంది. వాళ్లకు తెలిసి వచ్చేసరికి పద్ధతి మార్చుకోలేక సతమతమైపోతారు.
తప్పేదో, ఒప్పేదో పిల్లలికి సరిగ్గా బోధ చెయ్యనందుకు, పిల్లలు చేసిన తప్పుకు పెద్దవాళ్లే బాధ్యత వహించాల్సి వుంటుంది. మనందరికీ తెలిసిన సామెత-మొక్కై వంగనిది మానై వంగునా అని. ఇక్కడ అదే వర్తిస్తుంది. పిల్లలు తప్పు చేస్తే వారిని దండించాలి. ఆ దండననేది చేతులతోనో, కర్రతోనో, బెల్టుతోనో కాదు. గట్టిగా చెప్పాలంటే కంటి చూపుతోనే వారిని దండించవచ్చు. మీరు పిల్లలను గమనించండి. మనమేదైనా చెప్పినప్పుడు వాళ్ళు మన ముఖాన్ని పరిశీలనగా చూస్తారు. మన ముఖంలో ఏమాత్రం నవ్వు తాండవించినా, మనం చెప్పినదాన్ని వాళ్ళు సీరియస్ గా తీసుకోరు. అలా కాకుండా మన గొంతులో ఉన్న సీరియస్ నెస్ మన ముఖంలో కూడా కనిపిస్తేనే, మనం చెప్పిన దాన్ని వాళ్లు నమ్ముతారు. ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారు.
అలాగని చీటికిమాటికి కోపాన్ని చూపించక్కర్లేదు. సౌమ్యంగా మాట్లాడుతూనే, యెక్కడెలా వుండాలి, యెలా వుండకూడదనే విషయం, వాళ్లకు చిన్నప్పటినుండే బోధిస్తుంటే, వాళ్ళర్థం చేసుకుంటారు. ఆ చెప్పడమనేది కథల రూపంలో చెప్తే పిల్లలకు బాగా గ్రాహ్యమౌతుంది. మనమే పాత్రలను సృజించి ఉదాహరణలతో చెప్తే యింకా మంచిది. పిల్లలకు తినిపించినప్పుడో, నిద్ర పుచ్చినప్పుడో కథలు చెప్తే, వాళ్లా పాత్రలను జీవితానికి అన్వయించుకుంటారు. పిల్లలతో మనమెక్కువ సమయం గడిపితే, దాని ప్రభావం వాళ్ళ జీవితకాలముంటుంది.
అంతేకాని, వీడు చిన్నవాడు. వీడికేం తెలుస్తుంది. పెద్దయ్యాక వాడే అర్థం చేసుకుంటాడులే అనుకుంటే, మనం తప్పులో కాలేసినట్టే. చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రభావమే యెక్కువగా వుంటుంది. పెద్దయ్యాక చుట్టూ వారి ప్రభావం కూడా వుంటుంది. అప్పుడు వారిని నియంత్రించడం కష్టమవుతుంది.
మనం పిల్లలకు సమకూర్చినన్నిటి వాటిల్లో, మనం వారితో గడిపే సమయమే అతి ముఖ్యమైనదని తెలుసుకుంటే, మనం వాళ్లకన్నీ అందించిన వాళ్లమవుతాం. ఆ సానుకూల ప్రభావం పిల్లల భవిష్యత్తును నిర్దేశిస్తుందంటే ఆశ్చర్యమేమీ లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం మాని, అవసరమైతే వాళ్ల కోసం మన ఉద్యోగవేళలను కూడా మార్చుకోవడం మంచిదనే విషయం ముందే గ్రహించుకోవాలి. ఒకసారి చెయ్యి దాటిపోయాక, యెంత చేసినా ఫలితముండదు. పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దుకునేలా, మరల ఆ తప్పును చెయ్యకుండా వుండేలా వాళ్లను ప్రోత్సహించండి. ఏది చేసినా పిల్లల చిన్నప్పుడే చేస్తే, పెద్దయ్యాక వాళ్లు మనకి ఎక్కువ శ్రమను కల్పించరు.
ఒక్కోసారి పని ఒత్తిడిలో మనం కూడా పిల్లల విషయాల్లో తప్పులు చేస్తూ వుంటాం. కొన్ని సందర్భాల్లో, యెదుటివారిని యేమీ అనలేక ఆ కోపాన్ని పిల్లల మీద కూడా చూపిస్తుంటాం. పెద్దవాళ్ళం అలా చెయ్యకూడదు. ఒకవేళ ఆ నిముషంలో అలా చేసినా, గ్రహించుకున్న మరుక్షణమే పిల్లలకు క్షమాపణ చెప్పడంలో, ఇంకొకసారి యిలా జరగదని చెప్పడంలో, మనం వాళ్లకు ఆదర్శంగా నిలుస్తామనే విషయాన్ని మర్చిపోకూడదు. తప్పు చేస్తే ఎవరైనా క్షమాపణ చెప్పవలసిందే అన్న విషయం, చిన్నప్పుడే పిల్లల మెదడులోకి మనం యెక్కించగలిగితే, పిల్లలు తప్పులు చెయ్యడానికి సాహసించరు.
మనమేమి చేస్తామో, పిల్లలకు అదే చెప్పినప్పుడు, పిల్లలకేది చెప్తామో, మనమదే చేసినప్పుడు, పిల్లలకు మనమీద గౌరవం పెరుగుతుంది. మనం చెప్పిన మాట మీద గురి ఏర్పడుతుంది. అప్పుడే వాళ్ళు మనం చెప్పింది ఫాలో అవుతారు. అందుకని తల్లిదండ్రులూ చిన్నప్పటినుండి మీరు మీ పిల్లలకు ఆదర్శంగా వుండగలిగితే, మీ పిల్లలు యెప్పుడూ తప్పు చెయ్యరనే నిశ్చింత మీలో యేర్పడుతుంది.
మరెందుకాలస్యం? పిల్లలకు ఆదర్శంగా వుందాం. పిల్లలు తప్పు చెయ్యకుండా, మన వంతు బాధ్యత మనం నెరవేరుద్దాం. బాధ్యతగల సమాజాన్ని నెలకొల్పుదాం. “ఈ కాలంలో పిల్లలా?” అనే అవసరం లేకుండా చేసుకుందాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పండిత లక్షణం

దొరసాని