కమలహాసన్ నటించిన ఆకలి రాజ్యం అనే సినిమాల ” ఈ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్” అని ఒక పాట ఉంటది. ఆ పాట దేనికోసం రాసినా, ఏది రాసినా ఇప్పుడు
సావు పెండ్లి లెక్క అని ఎందుకంటరు అన్న దాని గురించి మనంముచ్చట జెప్పుకుందాం! ఏంది.. రమక్క గిట్ల సావు గురించి ముచ్చట పెడుతుంది అని ఏం మనాది కాకున్డ్రి.
ప్రపంచ మొత్తం సూసుకుంటే.. జాతుల మధ్య కొట్లాట, మా మతం గొప్ప అంటే మా మతం గొప్ప అని కొందరు,ఒకర్నొకరు సంపుకునుడు, మతం మార్చాలనుకునుడు, దేవుండ్ల గురించి, కులం గురించి, మతం గురించి ప్రాంతాల గురించి తండ్లాటలు!
కానీ మనిషి జీవితంల ఎన్ని ఏండ్లు గానీ, ఎంతమంది సావు సూడని,
గత్తర లేశి శవాల కుప్పలు పడనీ …! మనిషిల మార్పు వస్తలేదు. అదే మస్తు ఫికర్ అనిపిస్తది నాకు. కనీసం సావు సూషినంకన్న మారాలే మనిషన్నోడు.
చావు, ఒక ఆత్మను శాశ్వతంగా బంధించేది కాదు, కానీ దాని మార్గం మారుస్తది. ఇది ప్రతి ప్రాణికి తప్పనిసరి అయిన గమ్యం. సావు జీవితం మీద ఉండే శాశ్వత రేఖ కాదు, అది ఆత్మ ప్రయాణంల ఒక క్షణిక విరామం మాత్రమే.ఇది సావు పైన తాత్విక దృక్పథం. ఎందుకంటే ఇది ఒక అంతం కాదు, కానీ మరొక దశకు మలుపు మాత్రమే…! ఇది నిజమైనా మనం పెంచుకున్న బంధాలు మర్వలేము గదా!
చావు వ్యక్తిని వేరుజేశినా, ఆ వ్యక్తి జ్ఞాపకాలు ఎప్పటికీ మనకు తోడుగా ఉంటయి. ఆ జ్ఞాపకాలు మనల్ని శానా రకాలుగ ప్రభావితం జేస్తయి. సంతోషం, బాధ, కోపం మరియుప్రేరణ… గిట్ల ఏవన్న ఉండొచ్చు. సావు వచ్చినప్పుడు జీవితం ఆగిపోదు, కానీ జీవించిన సమయం జ్ఞాపకాల రూపంల సజీవంగా ఉంటది. ఒక్కోసారి ఈ జ్ఞాపకాలు శానా కుదేలు జేస్తయి.
“జాతస్య హి ధృవో మృత్యుర్, ధృవం జన్మ మృతస్య చ।
తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి॥”
అర్థం: జనించినవారికి మరణం అనివార్యమైనది, మరణించినవారికి తిరిగి జననం కూడా అనివార్యం. కాబట్టి, ఈ తప్పించుకోలేని పరిణామాల గురించి నీవు శోకించకూడదు.
ఈ శ్లోకం భగవద్గీతలోని అధ్యాయము 2, శ్లోకము 27:
ఇది కృష్ణుడు అర్జునునికి భౌతిక జీవనం అనిత్యమని, ఆత్మ శాశ్వతమని నేర్పిస్తున్న సందర్భంలో చెప్పిన శ్లోకం.
అందరికీ ఒక రోజు వచ్చేదే ఇది. అందరికీ జరిగే లగ్గమే ఇది. దీని గురించి గుడా మాట్లాడాలే! దైర్నం ఇయ్యాలె. బతికినన్నాండ్లు మంచిగ బతుకుమని చెప్పే తత్త్వం సావు అంటే..!
సావు ఎంత మంచి గుండాలంటే మనకోసం వందల కండ్లు ఏడ్వాలే.! మంచి మనిషుండే అని కొంచెమన్నా మనాది పడాలె! గదే మనం ఎట్ల బతికినమో ఎర్క జేసే ఎగ్జామ్ రిజల్టు.
పోయినోల్లందరు మంచోల్లు, ఉన్నోల్లు పోయినోల్ల తీపి గురుతులు అన్నడు ఘంటసాల. నిజం కదా తమ్మీ…!
పానం పోయినా అందరి యాదిల బతికుండాలె. అది బతుకంటే! బతికినా ఎవ్వని లెక్కలకు లేకుండ, ఎవ్వళ్లకు గింత ఉపయోగం లేకుండ “తిట్లన్ని గాలికి వాయే, షిప్పెడైతే లోపలికి వాయే ” అన్నట్లు బతికితే.. అది సావుతోని సమానమే!
సావు మరియు పెండ్లి నడుమ పోలిక శానా గమ్మత్తయిన ( తిట్టకుండి, నాకు అనిపించింది గంతే ) తాత్వికత ఉంది అనిపిస్తది నాకు. అవి రెండూ జీవితంల ఒక ముఖ్యమైన మలుపు మాత్రమే కాదు, వాటి వెనుక దాగి ఉన్న అర్థాలు, అనుబంధాలు, మార్పులు లోతైన మనస్తత్వాన్ని, ఆ తరువాత ఎట్ల దాన్ని తీసుంటున్నం అన్నది పాయింటు!
పెండ్లి కొత్త జీవితం, కొత్త మనుష్యులు కొత్త ప్రపంచం ఇస్తది. ఎట్ల నడుపుతం మన బతుకును సూపుతది.
సావు , పెండ్లి లెక్క,ఇంకో కొత్త ప్రారంభం. బతికినోళ్లకు, పోయినోల్లు సూపిన తొవ్వ. ఇది ఒక ఆత్మ మరో జీవితం లేదా స్థితి వైపు ప్రయాణించడానికి మార్గం. ఆత్మ శరీరం వదిలి కొత్త స్థితిలోకి పోవడం అని అంటరు తత్త్వంల.
సావు కూడా ఒక విరామం మాత్రమే, ఆత్మకు ముగింపు కాదు. రెండింటిలోనూ మనం ఒక దశ ముగిస్తే,ఇంకో దశ
షురువు అవుతది అనుకోని ముందుకు నడ్వాలే..!!
సావు ఇచ్చే సందేశం
చావు ప్రతి ఇంట్లోనూ ఒక గురువు లెక్క! అది మనల్ని జీవిత పాఠాలను నేర్పిస్తది. “చావు” ఒక త్రికరణ శుద్ధిగా మన ముందుకు వస్తది. ఎంత ప్రయత్నించినా తప్పించుకోనీకి తొవ్వ ఇయ్యదు. ఈ దారి పొంటి అందరూ పొవ్వాలె అని తెల్సుకొని సక్కగ బతుకాలే, ఉన్నన్నాండ్లు! చావు ముందుకు వస్తది, కానీ మనం వెనక్కి తగ్గేదేలె.. అన్నట్టు నిలబడాలే! అప్పుడు జీవితంల ప్రతీ ఘడియ మంచిగ జీవిస్తం!జీవితం అంటే గొప్ప అర్థం సమజయితది.
జెర ఒళ్లు దగ్గర పెట్టుకోని కావురం ఎక్కకుండ బతుకుతం!!
తమ్ముండ్లు చెల్లెండ్లకు
దీవెనార్థులు
పెద్దోళ్లకు దండాలు
మీ
రమక్క