అంతర్ దర్శనం – Look inside

డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకులు .

కళ్ళు చూస్తున్నవి, నాసిక శ్వాసను పీలుస్తున్నది, చెవులు శబ్దాలను అందిస్తున్నవి, నోటిలో నాలుక భావాలను వినిపిస్తున్నది, చర్మం స్పర్శ తెలుపుతున్నది ఇవన్నీ జ్ఞానేంద్రియాలు. ప్రతి ప్రాణికి సజీవత కోసం ఇటువంటి లక్షణాలే ఉంటాయి.ఇదే విధంగా ప్రతి మనిషికి జరుగుతుంది. ఇదేమి కొత్త విషయం కాదు. చేతులూ కాళ్ళూ అంతర్ బహిర్ అంగాలు , ఈ ఇంద్రియాలన్నీ వాటి పనిని అవి చేస్తున్నాయి, కానీ మెదడు జాగ్రత్త గా నియంత్రిస్తున్నది. ఇది కూడా అందరికీ తెలిసిందే. లోకంలో మంచి చెడు అనే తారతమ్యాలు ఎక్కడినుండి వస్తున్నాయి,? మెదడు లో ఉన్న బుద్ధి గుండెలో ఉన్న హృదయం ఈ రెంటి సమ్మేళనమైన మనస్సు చేసే వింత లీలలు ఇవన్నీ. చెడును వీడి, మంచి అలవడడానికి ఇల్లు వాకిలి చుట్టుపక్కల వాళ్ళు వీటన్నింటి కన్నా ప్రాముఖ్యమైనటువంటి ఇంటివాళ్ళ, కుటుంబ సభ్యుల నడవడి, మాటలు, శిక్షణ ఇతోధిక సహాయం చేస్తూనే ఉంటాయి. వీళ్ళందరూ నేర్పించిందే సంస్కృతి. సంస్కృతులను కాపాడడానికి చేసే క్రియలే ఆచారాలు. ఆచారాలలో పండుగలు ఉత్సవాలు పద్ధతులు ఉంటాయి.
ఒక కుటుంబంలో మనిషి పుట్టినప్పుడు ఆచరించే విధానాలు పద్ధతులు ఒక రకంగా ఉంటాయి , మరో కుటుంబంలో మరో విధంగా ఉంటాయి. పక్క పక్కనే ఇళ్ళు ఉన్నా కూడా రెండిళ్లలోన ఆచారాలు ఒక్కలా ఉండవు. కానీ ఎవరు నిర్వహించిన వాళ్ళ వాళ్ళ ఉనికిని తెలుపుకోడానికి వాళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి వాళ్లదైన జీవన సంస్కృతులను తెలియజేయడానికి పండగలు ఉత్సవాలు కొలబద్దలుగా ఉంటాయి.
ఇవి పైన చెప్పుకున్న శరీర అంగాల వంటివే. వాటి వాటి పనులు అవి చేసినట్టే పండుగలు ఉత్సవాలు జాతరలు ఆచారాలు చేస్తూ ఉంటాయి. అలవాట్ల నుండి వచ్చిన బ్రతుకు ముచ్చట్లు ఇవి.
ఏ జాతికైనా తమ సంస్కృతిని నిలుపుకునే హక్కు అనేది ఉంటుంది . హక్కు అంటేనే తనంతట తాను పొందేది. దీన్ని కాదు అని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదు. ప్రపంచం మొత్తం మీద ఎన్నో రకాల మతాలు ఉన్నాయి ఒక్కో మతానికి ఒక్కో ఆచారము ఒక్కో విధానము ఒక్కో సంస్కృతి ఉంటుంది. అటువంటిదే హిందూ సంప్రదాయంలో కూడా ఉన్నాయి. హిందూ ధర్మంలో ఆచరించమని చెప్పిన ఎన్నో మంచి మంచి అంశాలు పలు పలు విధాలుగా మారి మారి చెట్టు వేళ్ళు పాతుకున్నట్టుగా దర్శనమిస్తుంటాయి. చెట్లు పత్ర పుష్పాలతో ఫలాలతో ఎంత సేవ చేస్తున్నాయో చెట్టు బెరడు వేళ్ళు కాండము ఎంత సేవ చేస్తున్నాయో అటువంటివే సంస్కృతి సంప్రదాయాలు కూడా.
అయితే మన దైన కుటుంబ వారసత్వం నుంచి వచ్చిన సంస్కృతి సంప్రదాయాలలోని మంచి విషయాలను త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే భావితరాల వాళ్ళకి కూడా సునాయాసంగా అందించగలరు. మనసు ను అధీనం లో పెట్టుకొని కర్త, కర్మ, క్రియ ఈ మూడు ఒకే విధంగా ఆలోచించాలి. ఒకే విధంగా ఆచరించాలి . అప్పుడే సందేశాత్మకమైన జీవితాన్ని మనకు తెలియకుండానే నలుగురికి పంచిన వాళ్ళం అవుతాం. జాతి జీవగర్ర లైన విషయాలలో పండుగ లు ముఖ్యమైనవి.
మొన్నటి వరకు జరుపుకున్న బతుకమ్మ పండుగ ఒక గొప్ప ఉదాహరణ . తలలో పెట్టుకొనే పువ్వులు , దేవుడి పూజకు ఉపయోగించని పువ్వులు కూడా పూజార్హత పొందుతాయి . మైదానంలో అడవులలో దొరికే పూలు,గడ్డి పూలు ఉపయోగిస్తూ బతుకమ్మను పేర్చడం గమనిస్తాం. దీనికి కారణం ఏంటి అంటే ప్రకృతి పట్ల మనిషికి ఉండాల్సిన ఆరాధన భావం ఇది అని చెప్పడం. ఎటువంటి వ్యక్తికైనా గౌరవము ఇష్టము అనేవి కలగడానికి భక్తి అనే భావం కూడా తోడవుతుంది. భక్తి అనగానే ఏదో సనాతన విషయం అని దీన్ని కొట్టి పారేయవద్దు. సదాచారాలు సనాతన ధర్మాలు. హేతువాదం విషయంగా కూడా భావించాలి. భక్తి అనేది విశ్వాసానికి సంబంధించింది. భక్తితో పువ్వులను పూజించడం పువ్వులతో దేవతార్చన చేయడం, ఆటపాటలతో పూజించడం అనేది ఈ బతుకమ్మ పండుగలో గమనిస్తాం. బతుకమ్మ రూపును విశ్లేషించుకుంటే ఆకారం కొండలాగా ఉండడం గమనిస్తాం . ఉపయోగించేది పువ్వులు .ఈ పువ్వులు కూడా అన్ని రకాల పువ్వులు ఉపయోగిస్తాం తర్వాత పాట రూపంలో భగవత్ స్వరూపాలను కొలవడం. ఈ సామూహిక ఉత్సవం మానవత్వాన్ని మంచితనాన్ని నేర్పిస్తుంది స్నేహం, సేవా భావం వంటివి దీంట్లో కనిపిస్తాయి. ఒక్కళ్ళు పాట చెబితే అంతమంది విని పాడడం అనేది ఒక గొప్ప పద్ధతి.దీనివలన వినికిడి శక్తి విన్నదాన్ని ఉచ్చరించే శక్తి ఉచ్చరించడానికి భాషను సామాజిక కోణం లో వాడడం, ఇది గొప్ప భావము . మనసుకే శక్తి లభిస్తుంది.
ఒకరికొకరు పసుపు కుంకుమలను ఇచ్చుకోవడం తెచ్చిన ప్రసాదాలను అందరితో పంచుకోవడం వాళ్ళు ఇచ్చినవి తీసుకొని తినడం అనేది అందరం ఒక్కటే అనే గొప్ప భావాన్ని నేర్పిస్తుంది బతుకమ్మ పండుగ.
దసరా బతుకమ్మ తర్వాత వచ్చే పండుగ. ఈ పండుగ పరమార్థం ఏమిటా అని చూస్తే, విజయ దశమి అనడం లోనే కనిపిస్తుంది విజయం అంటే దేనినైనా సాధించుకోవడం సాధించుకోవడానికి బలాన్ని సంపాదించుకోవడం సంపాదించింది సద్వినియోగం చేయడం అనేవి ఈ పండుగ పరమార్ధాన్ని తెలుపుతాయి. దసరా అన్నప్పుడు, దశ దుర్గుణాలను హరించేది అని కూడ అర్థం ఉంది. తనలో ఉండే ఈ చెడు స్వభావాలను పోగొట్టి చైతన్యవంతంగా ఆలోచింప చేయడమే విజయదశమి.
ఇలా పండుగలు ఒక పరమార్థం కొరకు చేస్తారు. పండుగలలో ఉన్న విశేషతను కొత్త తరాల వాళ్లకు సరైన అర్థంలో సరైన విధంగా వాళ్ళ మనసుకు ఎక్కేలాగా చక్కగా నేర్పిస్తే గొప్ప సంస్కృతి భావితరాలకు అందుతుంది.
భావి నిర్మాణానికి పునాదులైన నిర్మాణాలు అయినా యువతనే కదా వెలుగు రేఖలు. ఈ వెలుగు రేఖలు స్వచ్ఛంగా సత్యంగా ప్రకాశవంతంగా ఉండాలి అంటే పెద్దతరం వాళ్లే కదా మూలకందాలు.
ఈ మతంలోనైనా మంచి బోధన లే ఉంటాయి. ” లోకాః సమస్తా సుఖినోభవంతు” వంటి శాంతి మంత్రాలను నేర్పించి గొప్ప భావన కూడా ముందుకు తీసుకుపోతున్నటువంటి హిందూ మతం భారతదేశానికి ప్రతీక గా ఉంటుంది.
అలాగే…
” ముద్దై లాఖ్ బురా చాహే తో క్యాహోగా ఆఖిర్ వొహీ హోగా జో మంజూర్ ఖుదాహోగా” ఉర్దు లో ఓ సామెత ఉన్నది . ముద్దై అంటే మనిషి. మనుషులు ఎన్ని చెడ్డ పనులు చేయాలనుకున్నా చివరికి భగవంతుడు ఏం నిర్ణయిస్తాడో అదే జరుగుతుంది అని అర్థం. అంటే భగవంతుని సృష్టిలో ,నిర్వహణ లో మంచే ఉంటుంది. చెడ్డ వాళ్ళ పని పడుతుంటాడు అనే భావం. దండిస్తాడు అనే…! నీలోని మంచి అనే భగవత్ శక్తి ని అందిపుచ్చుకొని మంచి జీవితం పొందడానికి గుర్తుంచుకోవాలి ఈ సామెతలనూ ఈ శాంతి మంత్రాలు నూ !!

ఈ విశ్వంలో ఉన్న అనంతమైన శక్తి సంపదనే భగవంతునిగా కొలిచే మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నంతవరకు మంచితనం అనేది పచ్చ పచ్చగా వెచ్చ వెచ్చగా తప్పకుండా నిలిచి తీరుతుంది. రూపాలను సృష్టించుకోవడం అనేది మానవ నైజం ! ఫర్ ద కాన్సన్ట్రేషన్! To inconclute interest, ఇంట్రెస్ట్ ఫర్ ద ఫీలింగ్స్ ..ఇలా ఎన్నైనా చెప్పొచ్చు. భగవంతుని రూపాన్ని ఏర్పరచుకొని పూజిస్తారు జనులు. అంతమాత్రాన ఏదీ వేరు కాదు అంతా ఒక్కటే!
కళ్ళ తోనే కాదు చూడాల్సింది … మనో నేత్రం తోనూ! మంచిని ఆఘ్రాణిస్తూ చెవులకు పట్టిన కనిపించని చిలుమును వదిలేస్తూ , కర్ణేంద్రియాలను సద్వినియోగం చేస్తూ, బుద్ధి కి పట్టిన కనిపించని చెదను కాలరాస్తూ, మనసుకు పట్టిన మౌఢ్యమనే తెగులుకు సద్బుద్ధి అనే కీటక నివారణిని పిచికారీ చేస్తూ మనిషి అనే చెట్టు ను పరిరక్షణ చేసుకోవాలి . ప్రకృతి నుండి జీవజాలం సమస్తం బ్రతుకు అవసరాలను తీసుకుంటున్నట్టు సత్యసంధమైన జ్ఞానమనే జీవజలం తీకోవాలి జనులు!!
__***___

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

యూరోప్ ట్రిప్-2