“రెండో భార్య”

కథ

పూజ చేసుకుంటున్న శకుంతల ఉలిక్కిపడింది, అతను క్రిందకు దిగిన చప్పుడు విని, ఇంకా తొమ్మిదిన్నర కాలేదు కదా అనుకుంటూ. అతనిది టైమంటే టైమే. తొందరగా, పూజ ముగించుకుని బయటికొచ్చింది, ఆయనకు టిఫిన్ తయారు చెయ్యడానికి. వంట గదిలోకి వెళ్లబోతుంటే బయటికి వెళ్దామంటూ బయటకు దారి తీశాడతను.
దగ్గర సంవత్సరమవుతుంది, తనీ యింట్లో అడుగుపెట్టి. ఏ రోజూ, యిద్దరూ కలిసి బయటికెక్కడికీ వెళ్లలేదు. ఏమైందీరోజు? అతనికేమైనా తెలుసా? తెలిసే అవకాశమే లేదే! మరటువంటప్పుడు… ఒక్కసారి గుండె జారిపోయింది శకుంతలకి. పిల్లలికేమైనా అయిందా? అతనివైపు గాబరాగా చూసింది. ఎప్పటిలానే వున్నాడు. అమ్మయ్య! పిల్లలకేమీ కాలేదు. మరి? నాన్నకేమైనా అయిందా? అసలే ఆయన ఆరోగ్యమంత మాత్రం! తననింత టెన్షనులో పెట్టే బదులు యేమైందో చెప్పొచ్చు కదా! ఏమైందని అతన్నడిగే స్వాతంత్ర్యం లేదు. అడిగినా ప్రయోజనముండదు. ఆయనేమీ మాట్లాడడు. ఈ సంవత్సర కాలంలో పట్టుమని పదిమాటలు కూడా మాట్లాడి వుండడు.
కారులో కూర్చుందే గాని, ఆందోళనతో నిండిపోయిందామె మనసు. ఆమె భావాలతో సంబంధం లేనట్టు సూటిగా రోడ్డునే చూస్తూ కారు నడుపుతున్నాడతను. కళ్ళు మూసుకొని యెవరికీ, యేమీ కాకూడదని మనసులోనే ప్రార్థించుకుంటుంది. కారాగిన శబ్దం విని కళ్ళు తెరిస్తే, తమ యింటికి కాస్త దూరంలో వున్న వెంకటేశ్వరాలయం.
అది చూసి మరీ బిగుసుకుపోయింది శకుంతల. గత సంవత్సరమిదే రోజు, యిక్కడే… తన ఆశలను సమాధి చేస్తూ… అంతా ఆయన యిష్టప్రకారమే జరుపుకుంటూ వస్తుంది. అయినా యిప్పుడేమి చెప్పబోతున్నాడు. పిల్లలకు కూడా దగ్గరవ్వొద్దంటాడా? ఈ మధ్య పిల్లలు తనకు బాగా చేరికయ్యారు. వారిని చూసుకునే కాలం వెళ్లబుచ్చుతుంది. ఇప్పుడది కూడా వద్దంటాడా?
గతంలోకి జారుకుందామె మనసు…
గత సంవత్సరం… యిదే రోజు… యెన్ని ఆశలతో ఆయన్ని కలవడానికి వెళ్ళిందో! ఆయన ముఖంలో ఆనందమో, ఆశ్చర్యమో బదులు చూడకూడనిది చూసినట్టు…ఓ అపనమ్మకం నన్ను చూసి. ఈ దేవాలయం అడ్రస్ తన చేతిలో పెట్టి… వెళ్లాక, తెలియని వాళ్ళలా యెవరి మట్టుకు వారే దర్శనం… పదిరోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న తాము.
అతనికది రెండో పెళ్లే కావచ్చు. కాని, తనకది మొదటి పెళ్లే. కాబోయే భర్తతో గుడికి వెళ్ళినప్పుడు కలిసి దైవదర్శనం చేసుకునే అవకాశం కూడా లేదా! లేదని అర్థమైంది. ఆయనెక్కువ మాట్లాడడు. ఆ విషయం ముందే మధ్యవర్తి చెప్పాడు. నాలుగు మాటల్లో… మాటలేవైతేనేమి? భావం మాత్రం… నేనీ పెళ్లి చేసుకుంటున్నది నా పిల్లల కోసం. అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. ఈ విషయం నేను మీ పెద్దవాళ్లకు కూడా చెప్పాను. ఒకవేళ నీకేమైనా అభ్యంతరముంటే, యిప్పుడైనా మించిపోయింది లేదని తన అభిప్రాయం కోసం కూడా చూడకుండా, చెప్పాల్సింది చెప్పి వెళ్ళిపోయాడు.
అప్పుడు తనదే పరిస్థితి? తనకు పెళ్లి చేసే స్థితిలో లేరు కన్నవాళ్ళు. టెన్త్ అయ్యాక ఇద్దరిని చదివించలేనని, తన చదువుని ఆపించేసి, తమ్ముడిని చదివించారు. చదివించినా డిగ్రీ కూడా పూర్తి చెయ్యకుండానే, అక్క పెళ్లయినంతవరకు చూస్తే నా పెళ్లయినట్టే అనుకున్నాడో! ఏమో! ప్రేమించాను, పెళ్లి చేసుకున్నానని యింటికే తెచ్చేసాడు ఒకమ్మాయిని. ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోకూడదా, నీ నుండి మా సరదాలు తీరడం లేదన్నట్టు మరదలి చూపులు. ఎన్నాళ్లు నిన్ను మేము భరించాలన్నట్టు తమ్ముడు… తనకన్నా పెద్దది యింట్లో వుందన్న విషయం కూడా పట్టించుకోకుండా, కోరి తెచ్చుకున్న పెళ్ళాంతో కులుకుతున్న కొడుకునేమీ అనలేక, ఆ కోపాన్ని కూతురుమీదే చూపించే తల్లి… బట్టల కొట్లో గుమస్తా ఉద్యోగం చేస్తూ, కూతురి పెళ్లి చెయ్యలేని నిస్సహాయతకు కుమిలిపోతూ తండ్రి…
అమ్మానాన్నలు చూసిన సంబంధాలు, కట్నమిచ్చుకోలేక కుదరకపోతే, తనని చేసుకుంటామని వచ్చినవాళ్లు తమకి నచ్చక… భార్య వుండి రెండో పెళ్లి చేసుకుంటానన్నవాడొకడు, రౌడీలా తిరుగుతూ చిన్నప్పటినుండి తన వెంట పడ్డవాడింకొకడు, మొగుడు పెట్టిన బాధలు భరించలేక భార్య చనిపోతే, రెండో పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చినవాడు… ఇవీ, కట్నం లేకుండా చేసుకుంటామని వచ్చిన సంబంధాలు. తమ్ముడైతే, ఎవరికో ఒకరికిచ్చి చెయ్యొచ్చు కదా! యెన్నాళ్ళని యింట్లో వుంచుకుంటామంటూ పోట్లాట… ఎప్పుడూ తమ్ముడి కోసం తనను వెనక్కిపెట్టే తండ్రి యేమనుకున్నాడో, యేమో! ముందు నీ పెళ్ళాన్ని పోషించుకోడానికేదైనా ఉద్యోగం చూసుకో. తర్వాత పెత్తనం చేద్దువనేసరికి గమ్మునుండి పోయాడు. గాని ఆ కోపం, యేదో రకంగా తన మీద చూపిస్తూనే వుంటాడు.
అటువంటి పరిస్థితులలో ఎమ్మార్వోగా పనిచేస్తూ, ఇద్దరు పిల్లలున్న సంబంధమొస్తే, అదృష్టం తలుపు తట్టిందన్న వాళ్లే. పెళ్లిచూపుల్లో ఆయన నా వంక చూడను కూడా, చూడలేదు. తన ఇంట్లో ఆయనతో మాట్లాడే పరిస్థితి లేదు. అందుకని తనే ధైర్యం చేసి ఆయన ఆఫీసుకు వెళితే… ఆయన చెప్పినట్టు ఏ ఆశలూ పెట్టుకోకుండానే పెళ్లి చేసుకుంది. కనీసం తనను ఒక స్త్రీగానైనా చూస్తాడనుకుంది.
కాని, మొదటి రాత్రి… నాకు ఒంటరిగా పడుకోవడం అలవాటైంది. ఇప్పుడు మార్చుకోలేనంటూ, గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు, భార్యనని కాకపోయినా, అతని ఇంటికి కొత్తగా వచ్చిన, ఒక వ్యక్తికివ్వాల్సిన చిన్నపాటి మర్యాద కూడా చూపించలేదు. మూసుకున్న ఆ తలుపులనే చూస్తూ, ఒంటరిగా ఆ గది ముందు నేను.
గుండెదాటి బయటకు రాబోతున్న కన్నీళ్లను మందలిస్తూ… ఏమైందిప్పుడు? అక్కడిలా… రేపెప్పుడో నా పరిస్థితేమిటి? ఎవరికి నన్నిచ్చి చేస్తారు? అసలు నాకు పెళ్లవుతుందా, లేదా? ఇటువంటి ఆలోచనలతో బుర్ర బద్దలు కొట్టుకొనక్కర లేదు. అమ్మా నాన్న చనిపోయాక నా పరిస్థితెలా వుంటుందోనన్న బెంగ లేదు. ఇంట్లో మరదలి చూపులు, బయట ఇరుగుపొరుగుల చూపులు, రోడ్డు మీదికి వెళ్తే మగవారి ఆకలిచూపులు, భరించక్కరలేదు. ఇంట్లో యెలా వున్నా, బయట ఎమ్మార్వో భార్యగా… పెద్ద ఇల్లు, రేపెలాగా అన్న దిగులు లేదు. కనీసం పిల్లలు పెద్ద వాళ్ళయ్యేవరకన్నా, నా స్థానం నాకుంటుంది. అది జీతం లేని, ఆయా స్థానమే అయుండొచ్చు. ఐతే మాత్రం? యింకేమి కావాలి?
అక్కడికన్నా యిక్కడ బాగానే వుంటుందిలే, అని నా మనసునెంత మభ్యపెట్టానో ఆ రాత్రంతా. నా అదృష్టం… పిల్లలు తొందరగానే చేరికయ్యారు. వారితో సమయం గడిచిపోతుందనుకుంటే, మరల ఈయన యిక్కడికి… అదీ ఈరోజే… నెల క్రిందట జరిగిన విషయం గురించా? తప్పు తనది కాకపోయినా… మరలా తనకే శిక్షా? నిట్టూరుస్తూ, ఆలోచనల్లో నుండి బయటకొచ్చి, యింకా అక్కడే నిలబడ్డావేమన్నట్టు చూస్తున్నతనిని అనుసరించింది శకుంతల.
*
తన చేతిలో వున్న పూజా సామగ్రిని పంతులుగారికి అందిస్తూ, శకుంతల పేరు మీద అర్చన చేయించండి. ఈరోజు తన పుట్టినరోజన్న రవిని, అపనమ్మకంగా చూస్తున్న శకుంతలను చూస్తుంటే, అలాగే తనూ ఆమెను చూసిన విషయం గుర్తుకొచ్చింది. జ్ఞాపకాలలోకి జారుకున్నాడు.
“రెండో పెళ్లి చేసుకుంటున్నావు. బాగానే ఉంది. కాని, పాతికేళ్లు నిండినమ్మాయంటే, యిన్నాళ్లూ కోరికలు బిగబెట్టుకొని, నిన్నిప్పుడు గుప్పెట్లో పెట్టేసుకుంటుందేమో! కొంచెమాలోచించన్న” ఫ్రెండ్ మాటలు. “రెండో పెళ్లి చేసుకుంటే పిల్లల గతేమిటన్న” అత్తగారి మాటలు. “పిల్లల్ని అశ్రద్ధ చేయకండి” చనిపోయే ముందు భార్య మాటలు. చిన్నప్పటినుండి సవతి తల్లుల గురించి విన్న మాటలు. ఇవన్నీ తనలో అభద్రతను పెంచాయి. ఏ మాత్రం అలుసిచ్చినా ఆమె మాయలో పడిపోతాడేమోనని, ఆమేమి చేసినా అపనమ్మకంతోనే చూసేవాడు. సర్దుకుపోయింది. కాని, నెల క్రిందట…
ఆ విషయం జరగకపోయుంటే, యెప్పటికైనా తనలో మార్పు వచ్చి వుండేదా? తనొక యంత్రాన్ని పెళ్లి చేసుకోలేదని, తనలాగే చీమూ నెత్తురూ వున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, సవతి తల్లుల్లోనూ మంచి వాళ్ళుంటారనే నిజాన్ని యేనాటికి గ్రహించేవాడు?
అమెరికా నుండొచ్చిన ఫ్రెండు పార్టీ యిస్తున్నానంటే, వెళ్లాడు. అందరి బలవంతంతో, తాగక తప్పలేదు. అప్పుడు తెలిసింది, అది ఒక్క మందుపార్టీయే కాదు, పొందు పార్టీ కూడా అని. “కమాన్! ఎంజాయ్” అంటూ అందరూ నచ్చినమ్మాయిలతో… అందరిలా అక్కడుండలేక… యింటికొచ్చేసిన తాను, కళ్ళు విప్పింది, శకుంతల పడుకునే రూములో. రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకుంటే… తూలి పడబోతున్న తనకు సాయమిచ్చి గదిలోకి చేర్చిన శకుంతలను…
యిన్నాళ్లూ దేనికి భయపడ్డానో, మందు మత్తులో అవేవీ గుర్తుకు రాలేదు. ఆమె వదిలించుకుంటున్నా, విదిలిస్తున్నా, గదిలోకి పారిపోయినా… యే దయ్యం పట్టిందో తనను… బలవంతంగా చేజిక్కించుకున్నాడు. తప్పు చేశానని ఒకవైపు, తన తప్పుతో ఆమె విజయం సాధించానని గర్వపడుతుందేమోనన్న భయమింకొకవైపు… ఇటువంటి ఆలోచనలతో పిచ్చెక్కిపోయేది. ఇలా కాదని, ఆరోజు జరిగింది మందు ప్రభావంవల్లనే గాని, అందులో వేరే అర్థమేమీ లేదని ఆమెకు స్పష్టం చెయ్యడానికొక రోజు మధ్యలో యింటికొస్తే, పూజగదిలో వెక్కివెక్కి యేడుస్తూ ఆమె…ఆమెనలా చూసి జాలి వేసింది.
అప్పుడర్థమైంది, ఆమె తన శరీరాన్ని ఎరగా, వెయ్యాలనుకోలేదని. అప్పటినుండి ఆమెను అబ్జర్వ్ చేస్తూ వచ్చాడు. ఆమె పిల్లల్నెంత బాగా చూసుకుంటుందో తెలిసింది. ఈ కొద్ది కాలంలోనే ఆమంటే, కుతూహలం నుండి యిష్టం పెరిగిపోయింది. ఆమెకు చేసిన అన్యాయానికి, క్షమాపణ చెప్పుకోవాలని… అదెలాగో తెలియలేదు. కిందటి సంవత్సరం యిదే రోజు, యిక్కడే, నువ్వేమీ కావు నాకు అని చెప్పాడో, అక్కడే క్షమాపణ చెప్పుకోవాలని యిక్కడికొచ్చాడు. తను చెప్పింది విన్నాక, తను క్షమిస్తుందో లేదో ఆమె యిష్టం. “బాబూ! హారతి తీసుకోండి” పూజారి మాటలతో, ఈ లోకంలోకి వచ్చాడు రవి.
హారతిని కళ్ళకద్దుకొని, హారతి పళ్లెంలోని కుంకుమను తీసి శకుంతల నుదుటపెట్టాడు, ఆమె కళ్ళల్లో ఆనంద భాష్పాలు జాలువారగా.
*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

చిత్రం భళారే విచిత్రం