దొరసాని

50వ భాగం

ఇలా నీలాంబరి అలేఖ్య మాట్లాడుకుంటూ ఉండగా సాగర్ వీడియో కాల్ చేశాడు…

” సాగర్ ఎలా ఉన్నావురా”? అని అడిగింది నీలాంబరి.

” నేను బాగున్నానమ్మా! అక్కా, సౌందర్యలహరి ఏం చేస్తున్నారు? సౌందర్యను చూద్దామని వీడియో కాల్ చేశాను” అన్నాడు సాగర్.

అతని కళ్ళు సౌదామిని కోసం కూడా వెతుకుతున్నాయి ..అప్పుడే అక్కడికి వచ్చిన అలేఖ్య..

” సౌదామిని బాలసదనంకు వెళ్ళింది రా అక్కడ ఇద్దరు పిల్లలకి జ్వరంగా ఉందంటే చూసి వస్తానని వెళ్ళింది కాసేపట్లో వస్తుందేమో!” అన్నది అతని మనసు చదివినట్లుగా.

” అలాగా మరి సౌందర్యాన్ని చూపించు అన్నప్రాసన జరిగింది కదా! దానికి ఏం బహుమతి పంపించాలో నాకు అర్థం కాలేదు… ఇప్పుడిప్పుడే కూర్చోవడం అలవాటవుతుంది కదా ఫీడింగ్ టేబుల్ తీసుకోనా” అన్నాడు సాగర్.

” వద్దురా మేము ఎలాగూ మరో వారంలో అమెరికా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నాము మళ్లీ దాన్ని ఇక్కడి నుండి మోసుకొని పోవడం కష్టం కదా” అన్నది అలేఖ్య.

” అవునా మీరు వచ్చేస్తున్నారా అయితే ఇక్కడికే ఆర్డర్ చేస్తాను” అన్నాడు సాగర్.

” అవును బావగారి ప్రాజెక్టు పూర్తి వస్తుంది.. నా మెటర్నిటీ లీవ్ కూడా అయిపోయింది.. నేను కూడా జాయిన్ అవ్వాలి” అన్నది అలేఖ్య.

” అదేంటి మీరు మరో వారంలో వెళ్ళిపోతారా? ఇప్పటివరకు నాతో ఒక్క మాటైనా అనలేదు ఇన్ని రోజులు మీరు వెళ్తారనే ఆలోచన లేదు నాకు పసిదాన్ని వదిలి నేను ఎలా ఉండాలో నాకు అర్థం కావడం లేదు” అన్నది బాధగా నీలాంబరి.

” వారం అని అనుకుంటే అంత తొందరగా మాకు టికెట్స్ బుక్ కావద్దా 15 రోజులైనా పడుతుందిలే ఇప్పటినుండే బెంగ పెట్టుకోకు అయినా ఎప్పటికైనా వెళ్లాల్సిన వాళ్ళమే కదమ్మా” అన్నది అలేఖ్య.

” మీరు ఇక్కడికి ఉద్యోగ ప్రయత్నం చేస్తామని అన్నారు కదా అలా వచ్చే ఆలోచన ఏమైనా ఉందా!” అన్నది నీలాంబరి.

” అంత తొందరగా అవకాశాలు దొరకవమ్మా అందులో ఇద్దరికీ కదా దొరికితే వాళ్లు మాత్రం వచ్చేయకుండా ఉంటారా కానీ ఒకసారి ఇక్కడ జీవితానికి అలవాటు పడితే మళ్లీ వెనక్కి వెళ్ళలేరు ఎంతమందిని చూస్తున్నాను కానీ నాకు అక్కకు మాత్రం మన దేశానికి రావాలనే ఉన్నది ఇక్కడికి వచ్చి పొరపాటు చేశానా అని నా మనసు అనుక్షణం బాధపడుతూనే ఉంది” అన్నాడు సాగర్.

” ఎలా జరిగేది ఉంటే అలా జరుగుతుంది ఉద్యోగాలు కూడా ముఖ్యమే కదా” అన్నది నీలాంబరి.

” నీలో ఉన్న ఈ గుణమే నాకు నచ్చుతుంది అమ్మా! తొందరగా కాంప్రమైజ్ అయిపోతావు అన్ని పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నీవు మలుచుకుంటావు గ్రేట్ అమ్మ నువ్వు” అన్నాడు సాగర్.

” అయితే మనం అమ్మకు సన్మానం చేద్దామా! నిజంగా చేయాలి కూడా అమ్మ ఇంత మంచి పెయింటింగ్స్ వేసి అమెరికాలో కూడా ఎంతోమంది మెప్పులు పొందింది ..ఎన్నో దేశాల వారు అమ్మ పెయింటింగ్స్ చూసి మెచ్చుకున్నారు తన పెయింటింగ్స్ అన్నింటికన్నా ఎక్కువగా కొనుక్కున్నారు నిజంగా అమ్మ గ్రేటే రా నువ్వు అన్నట్లు” అన్నది అలేఖ్య.

” నా భజన చేస్తున్నారేంటి ఇవాళ్ళ” నవ్వుతూ అన్నది నీలాంబరి.

ఇంతలో సౌదామిని వచ్చింది…

” ఏం భజన అత్తయ్యా!” అన్నది నీలాంబరి పక్కన కూర్చుంటూ.

వీడియో కాల్ లో ఉన్న సాగర్ సౌదామిని చూసి..

” ఏంటి డాక్టరమ్మ! ఈవినింగ్ కూడా బిజీయేనా”? అన్నాడు సాగర్.

” హాయ్ సాగర్… చిన్నపిల్లలు కదా రాత్రుళ్లు జ్వరం ఎక్కువైతే కష్టం అని వెళ్లాను… వాళ్ల తల్లిదండ్రులు తీసుకొని వెళ్లే వరకు కొంచెం నార్మల్ గా ఉంటే వాళ్లకు టెన్షన్ ఉండదు కదా” అన్నది సౌదామిని.

” నువ్వు అన్నది కూడా నిజమే సౌదామని ఊరికే అన్నాను” అన్నాడు సాగర్.

మొహం వాడిపోయి కళ్ళు కాస్త ఎర్రగా ఉన్న సౌదామిని చూసి..

” ఏంటి సౌ.. మొహం అలా వాడిపోయింది కళ్ళు ఎర్రగా ఉన్నాయి అమ్మా నాన్న మీద బెంగ పెట్టుకున్నావా ఏంటి? వెళ్లి రావాల్సింది ఒకసారి” అన్నాడు సాగర్.

వాళ్లు మాట్లాడుకుంటుంటే నీలాంబరి అలేఖ్య లోపలికి వెళ్ళిపోయారు వారిద్దరికీ ఏకాంతం కలిగించాలని.

సౌదామిని డివైస్ తీసుకుని లోపలికి గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని సాగర్ తో మాట్లాడింది…

జరిగిన విషయం ఎంత చెప్పొద్దని అనుకున్న మనసు ఆగలేదు..

సాగర్ తో చెబుతూ వెక్కివెక్కి ఏడ్చింది..

ఒక్క క్షణం సాగర్ కి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు.. ఇలాంటి పరిణామం వస్తుందని అసలు ఊహించలేదు కూడా..

తన్ను తాను కంట్రోల్ చేసుకుని..

” సౌ అంతలా బాధపడకు ఏం కాదు మన పెళ్లి తప్పకుండా జరుగుతుంది నువ్వు పాజిటివ్ గా ఆలోచించుకో ఇలా నువ్వు ఏడుస్తూ ఉంటే ఇక్కడ నేను ఏ పని చేసుకోలేను కొంచెం టైం తీసుకుందాం” అన్నాడు సాగర్.

కాసేపు ఈ విషయం మర్చిపోయి సరదాగా ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు..

కానీ మనసులో సాగర్ కు కూడా ఆందోళనగా ఉంది సౌదామిని తల్లిదండ్రులు ఒప్పుకుంటారా లేదా అని ఆలోచించసాగాడు…

సాగర్ తో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన సౌదామిని నీలాంబరి అలేఖ్య తన కోసమే ఎదురు చూస్తున్నట్లు అర్థమైంది..

” భోజనం చేద్దామురా సౌదామిని” అని పిలిచింది నీలాంబరి.

” అయ్యో నాకోసం ఎదురు చూస్తున్నారా మీరిద్దరు భోజనం చేయాల్సింది ” అన్నది సౌదామిని

” అంకుల్ ఏదో పని ఉందని పట్నం వెళ్లారు సుధీర్ కూడా బయటకు వెళ్లాడు వాళ్ళు ఆలస్యంగా రావచ్చు ఇంకా ఉన్నది ముగ్గురమే కదా మనం కలిసే తిందాం. సౌందర్య ఎలాగూ నిద్రపోతుంది” అన్నది నీలాంబరి.

ముగ్గురు కలిసి భోజనం చేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు.

సౌదామిని తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఫోన్ చేసింది..

వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమగా పలకరించారు.. పెళ్లి విషయం వాళ్ళు తీసుకొని రాలేదు కూడా ఆ మాట ఎత్తలేదు. కానీ సౌదామినికి అడగాలని అనిపించింది ఎలా అడగాలో అర్థం కాలేదు… అయినా ఇలా ఫోన్లో అడిగే దానికన్నా ఒకసారి ఊరికి వెళ్లి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అనిపించింది…

తర్వాత కళ్ళు మూసుకుని తన ఇష్ట దైవాన్ని ప్రార్థించుకొని కిటికీలో నుండి చందమామను చూస్తూ పడుకుంది.

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నులివెచ్చని గ్రీష్మం

“రెండో భార్య”