ఎడారి కొలను 

ధారావాహికం – 39 వ భాగం  

(ఇప్పటివరకు : మైత్రేయి కి జరిగిన విషయాలు తెలిస్తే తనని తన తల్లి తండ్రులు అర్ధం చేసుకుంటారన్న ఆశ, అడియాసే అయింది. సుబ్బ రావు  మైత్రేయి పని చేస్తున్న కాలేజీ కొచ్చి గోడవచే స్తాడు. ఇంటి కొచ్చిన మైత్రేయికి లండన్ నుంచి తిరిగి వచ్చిన వసుంధర ఆమె కోసం ఎదురుచూస్తు కనిపించింది. సుబ్బారావు ఫోన్ వస్తుంది )తెల్లవారి ఏడుగంటలయింది . వాకిలి ముందు ఒక ఆటో వచ్చి ఆగింది. అందులోనుంచి లంగా ఓణీలో లో కాస్త బొద్దుగా తెల్లగా ఉన్న  పద్దెనిమిదేళ్ల పిల్ల , పెద్ద కుంకుమబొట్టు గుంటూరు నేతచీర పచ్చగా పసుపు రాసినట్లున్న కళ గల మొహం తో నిండుగా కనిపిస్తున్న ఒకామె దిగారు. అక్కడే  నీళ్లు పట్టుకుంటున్న రమాదేవి ని చూసి ,  “ఎమ్మా !మైత్రేయి , కాలేజీలో పనిచేస్తుంది , ఇక్కడే ఉంటుంది కదా!” అడిగింది ఆమె.

“ ఇక్కడే ఉంటుంది అదిగో ఆ మధ్య పోర్షన్ లోనే, ఇంతకీ మీరెవరు ,” రాగం  తీసింది మైత్రేయి.

“  ఆ పిల్ల మా కోడలు,” అంది ఆమె.

ఇంతలోకే నీళ్లు పట్టు కుందామని బయటి కొచ్చిన మైత్రేయి ని చూస్తూ ,” వదిన! బాగున్నావా!”  అంటూ చనువుగా ఆ పిల్ల అటువైపుగా పరిగెత్తింది. “ రాజి ! “ అంటూ మైత్రేయి ఆ అమ్మాయిని దగరికి తీసుకుంది. అమ్మాయి వెనకాలే ,“ఎమ్మా బాగున్నావా ,” అంటూ వచ్చింది ఆమె.

“ బాగున్నాను , లోపలకి రండి అత్తయ్య గారు ,”’ అంటూ వాళ్ళను లోపలకి తీసుకెళుతూ

“అక్కమ్మ కొంచం నీళ్లు నింపి ఉంచు నేను తీసుకెళ్తాను,”  చెప్పింది.

లోపలకు తీసు కెళ్ళి వాళ్ళిద్దరిని మొ హం కడుకొమ్మని , కాఫీ కలిపి తెచ్చిచ్చింది .

“ ఇప్పుడు చెప్పు రాజి, ఇంత హట్టాతుగా వచ్చారేంటి ,” అడిగింది అనుమానంగా. “ఏంలేదు వదిన, నిన్ను చూసిపోదామని,” అంది.

“ ఏమిలేక పోవటమేంటి, మైత్రేయి నేను నీకు సూటిగా చెబుతున్నాను. మాకి వయసులో వాడే ఆధారం . వాడు జైలు కెళితే మా పరిస్థితి ఏమి గాను,” అంటూ దీనంగా మొహం పెట్టింది.

“ ఆడపిల్లవి, నువ్వు మాత్రం సర్దుకుపోలేవా! నీకయినా ఏదొక మొగతోడుండాలి కదా జీవితాంతం. మా పెద్దవాళ్ళందరం కలిసి కుదిర్చిన సంబంధం మీది, ఏ కష్టమున్నా  మాకు చెప్పుకోవాలి గాని, పోలీస్ స్టేషన్ లకి , కోర్టులకి వెళతారా,” అంటూ నిష్టురంగా మాట్లాడటం మొదలుపెట్టింది.

“ఇప్పటికయినా మించి పోయిందేమి లేదు, నేను వాడికి బుద్ధి  చెపుతాను, నువ్వు వాడి మీద కేసు ని వెనక్కి తీసుకో, మనందరం కలిసుందాము,” అంటూ చెప్పింది.

ఆమె మాట్లాడినదంతా  మౌనంగా  వింటూ కూర్చుంది మైత్రేయి.

“ అలా బెల్లము కొట్టిన రాయల్లే  ఉలకవేంటే! ఎదో ఒకటి చెప్పు, లేదంటే  మా దోవన మేము పోతాము,” అంటూ బర్రున ముక్కు చీదింది.

“టిఫిన్ చేశారా రాజి,” అడిగింది మైత్రేయి.

“లేదు వదిన ,మొదటి బస్సుకే వచ్చాం కదా,” అంది.

“అలాగా,” అంటూ  వంట గదిలోకెళ్ళి చక చక పోహా చేసి తెచ్చి పెట్టింది.

“నేను  స్నానం చేసి తింటాను ,  నువ్వు జరీ చీరలు కూడా  కడతావుగా నాకొక చీర పడేయ్,” అంటూ   స్నానాల గదిలోకి వెళ్ళింది. మైత్రేయి అమ్మకి చీర తీస్తున్నప్పుడు పక్కనే వచ్చి నుంచొని,

“అబ్బా వదిన , ఆ కుర్తా పైజామా డ్రస్ ఎంత బాగున్నాయో నాకివ్వవు, నేను వేసుకుంటాను,” అంటూ అల్మారా లోనుండి ఆ బట్టల జతని  లాగేసుకొని  వెళ్లి మంచం మీద కూర్చుంది.  అత్తగారు మైత్రేయి తీసి ఉంచిన చిలక పచ్చ గళ్ళజరీ పేటు  చీరని కట్టుకొని చీరని సంతృప్తి గ చూసుకుంటూ,  “ఒసే రాజి నువ్వు కూడా  వెళ్లి స్నానం చేసిరా,” అంది. అలా వాళ్ళు తయారవ గానే,  మైత్రేయి ,  “నేను కాలేజికి వెళ్ళాలి టైమవు తుంది, మీరు సాయంత్రం దాకా ఉంటారా,” అడిగింది.

“లేదమ్మా , ఇప్పుడే పదకొండు గంటల బస్సు కి వెళతాము, నువ్వు మేము చెప్పిన  విషయం ఆలోచించి మాకు కబురు పెట్టు.  నేను మీ మామగారు అందరం ఇక్కడికే వచ్చి ఉంటాము,” అంటూ మూతి మూడువంకర్లు తిప్పింది.

“ఇందులో చెప్పటానికేమి లేదు . నా నిర్ణయం మారదు , మీరు అనవసరమైన శ్రమ తీసుకున్నారు,” అంది  నిశ్చలంగా.

“అంతేనా!  అయితే ఇక మాకిక్కడ పనేంటి ,ఆ ఇడిచిన బట్టలు సంచిలో పెట్టవే రాజి

పోదాం ,” అంటూ లేచింది. రాజి చక చక అక్కడే  హాంగర్ కి వేలాడుతున్న డోలక్ బాగ్  తీసుకొని బట్టలు అందులోపెట్టి, “పదవే అమ్మ,” . ఇద్దరు బయటికొచ్చారు.

“ఇప్పుడె వస్తా”  అంటూ లోపాలకి పరిగెత్తింది రాజి , ” వదిన ఒక వెయ్యి రూపాయలుంటే ఇవ్వు.  మాకు తిరుగు చార్జీలు కూడా  ఇవ్వకుండా అన్నయ్య మమ్మల్ని నీ దగ్గరికి పంపించాడు. అడిగితే దాని దగ్గర ఉంటాయి లే అడిగి తీసుకో నీకు కావాల్సినంత అని అన్నాడు వదిన,” అంటూ బుంగ మూతి పెట్టింది.

మైత్రేయి పర్సులోనుండి రెండు అయిదువందల తీస్తుండగా, మరొక అయిదువందల నోటు కూడా వచ్చింది. కళ్ళు మెరుస్తుండగా,” ఆ మూడు నోట్లను లాగేసు  కుని,” ఉంటాను వదిన,” అంటూ బయటికి పరిగెత్తింది రాజి.  అలా పరిగెత్తి పోతున్న ఆ పిల్లను నిస్తేజం గ చూస్తూ అలాగే నిలుచుండి  పోయింది  మైత్రేయి ,

“ఏమండి మైత్రేయి గారు , కోపం తగ్గిందా?”  అన్నప్రసాద్ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. ప్రసాద్ గారిని చూస్తూనే పెద్దగా నవ్వడం మొదలెట్టింది, ప్రసాద్ ఆమెని అయోమయంగా చూస్తుండిపోయాడు.

అలా నవ్వుతు అక్కడే కుర్చీలో కూలబడి పొట్టపట్టుకొని ,  “నేనిక నవ్వలేను బాబు ,” అంది.

అప్పటివరకు అయోమయంగా చూస్తున్న ప్రసాద్ , “అమ్మయ్య నవ్వు ఆపేసారు. నాకు భయమేసింది సుమా , మీ నవ్వు చూసి. అంత నవ్వెలా  వచ్చిందండి బాబు మీకు,” అంటూ  అన్నాడు.

“ఎం చెప్పమంటారు. ఎవడి గోల వాడిదే అంటే ఇదేనెమో.”

“అంటే,” అడిగాడు.

“ అదేనండి , కొడుకు తోటి కాపురం చేయమని, నాకేమి కష్టం రాకుండా ఉండడానికి , మా అత్తగారు, మామగారు కూడా వచ్చి నా దగ్గరే ఉంటారట, కేసు వాపసు తీసుకొ, హాయిగా అందరం కలిసుందామని చెప్పడానికొచ్చారు, అంతే  కాదు వాళ్ళు తిరిగి వెళ్ళటానికి అతను  డబ్బులు కూడా నా దగ్గరే తీసుకోమని తన చెల్లికి చెప్పాడట . కనీసం మా అత్తగారికి అర్ధం కాలేదు , అసలు ఏమయిందో, ఎలాటి స్థితిలో నేని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో? ఆమెనెలా అర్ధం చేసుకోను? అమాయకు  రాలనా , లేక  కొడుకు మీదున్న వ్యామోహంతో సొంత కొడుకు చేతుల్లోనే మోసపోతున్న తల్లిగాన?”

అత్తగారి మీద జాలి తోటి ఆమె మనసంతా నిండిపోయింది. జీవితంలో డ బ్బు ముఖ్యమే అయినా , అంతకంటే ముఖ్యమయినది మంచి సంబంధ బాంధవ్యాలు, అవుంటేనే ఎవరి కుటుంబమయిన మంచిగా ఉంటుంది , స్వార్ధం తప్ప మరేమి లేని సుబ్బారావు , తల్లిని చెల్లిని కూడా తన స్వార్ధానికే ఉపయోగించుకుంటున్నాడు, ఇలాటి మనిషి తో జీవితం ఎలా గడపాలి? ఆలోచనలో మునిగి పోయింది.

“ మైత్రేయి గారు , ఆలోచనల నుండి బయటికి రండి , మీరు కాలేజ్ కి వెళ్ళాలి ,” అని గుర్తు చేసాడు ప్రసాద్.

అన్యమనస్కంగానే తయారయి కాలేజికి  కి వెళ్ళింది తాను. ప్రసాద్ తన పనిలో ఉండిపోయాడు.

అప్పుడే అతనికి తనని కలవమని ప్రభాకర్  నుండి ఫోన్ వచ్చింది. తాను కూడా తయారయి  ఆయన్ని కలవడానికి బయలు దేరాడు. వాళ్ళఇంటికి చేరుకునేసరికి ప్రభాకర్ ఏవో కొన్ని పేపర్లు ముందేసుకుని కూర్చొని ఉన్నాడు హాల్లో.

ప్రసాద్ ని చూస్తూనే ,  “రా ,రా ప్రసాద్ ,” అంటూ తన గదిలోకి తీసుకెళ్లాడు.

తన టేబుల్ సొరుగులోంచి  ఒక ఫైలు తీసి చూపిస్తూ , “ తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్టు , సుబ్బారావు గురించి నేను చేస్తున్న ఏంక్వైరి లో వాడు చేస్తున్న పనులతో పాటు వాడి వెనకాతల ఎవరున్నారన్న విషయం కూడా తెలిసిపోయింది. వీడు చాల వ్యవహారాల్లో తలదూర్చిఉన్నాడు. అందుకనే వాడికొచ్చే డబ్బు సరిపోదు, అందుకనే మైత్రేయి ని వదులుకోవాలనుకోవటం లేదనుకుంటా వాడికి,” అని చెప్పాడాయన.

“అవును సార్ !మీరు చెప్పింది అక్షరాలా నిజం,” అంటూ సుబ్బారావు తల్లి ,చెల్లి వచ్చిన విషయం చెప్పాడు. ఆయన కూడా తాను అనుకుంటున్నది  కరక్టే  అన్నట్టు సాలోచనగా చూసాడు.

**************************

రాజ్యలక్ష్మి ఆఫీస్ కి వెళుతూ మైత్రేయిని  కలిసి “ ఈ రోజు సాయంత్రం మిమ్మల్ని వసుంధర మేడం రమ్మన్నా రండి ,” చెప్పి వెళ్ళింది.

కాలేజ్ నుండి వస్తూనే ప్రసాద్ ని పిలిచి,” ప్రసాద్ గారు ఈ రోజు సాయంత్రం వసుంధర గారింటికి వెళ్ళాలి, మీరు కూడా నాతో పాటూ వస్తారా ,” అడిగింది.

“తప్పకుండ  వస్తాను ,” అన్నాడు.

సాయంత్రం అయిదు గంటలకల్లా  మైత్రేయి ప్రసాద్ బైక్ మీద వసుంధర వాళ్ళఇంటికి వెళ్ళింది.

వాళ్ళిద్దరిని చూస్తూ ,”రండి!రండి! మీరు ప్రసాద్ కదూ!నైస్ మీటింగ్!  మీరు మా మైత్రి కి మంచి ఫ్రెండ్ లాగా చాల హెల్ప్ చేస్తున్నారని మా రాజ్య లక్ష్మి చెప్పింది. థాంక్  యు సో మచ్ ! నేను లేని సమయంలో మీరు మైత్రేయికి చాల తోడుగా ఉన్నారని కూడా చెప్పింది, గ్రేట్ ! మీలాటి ఫ్రెండ్ దొరకడం ,అది  అవసరం లో ఒక మంచి మిత్రుడి తోడు, మా మైత్రేయి సగం గట్టున పడ్డట్టే,” అంటూ ప్రసాద్ ని మనః స్ఫూర్తిగా అభినందించింది.

“ మేడం, మీరు నన్ను చాలా పొగిడేస్తున్నారు. నేను చేసిందేమి లేదు. ఒకే చూరు కింద ఉన్నవాళ్ళం, ఆ మాత్రం ఒకరొకొకరం తోడుగా లేక పొతే ఎలా, పైగా మన కెమన్న అవసరమయితే ముందుగా పలికేది మన పక్కవాడే  అనుకోండి, కానీ ఆ పక్క వాడే మనకు తెలియకుండా సమస్యలు కూడా తెచ్చిపెడుతుంటాడు . మీ ముందు నేను చాల చిన్న వాడిని,నన్నలా  పైకి ఎత్తేయొద్దు, కిందపడిపోగలను,”అంటూ చమత్కారంగా మాట్లాడాడు. అందరు నవ్వుకున్నారు.

“వెంకటేశ్వర్లు గారు లేరా  వసు,” అడిగింది మైత్రేయి.

“లేరు , లేట్ గ వస్తానని చెప్పారు. ఎదో లాయర్స్ మీటింగ్ కి వెళ్లారు,” అంది.

“నన్నెందుకు  కలవ మన్నావు చెప్పు ,” అడిగింది.

“ మన కేసు హియరింగ్ డేట్ పదిహేను జూన్, నీకు చెబుదామని,” అన్నది

“అవును ,గుర్తుంది. సమన్స్ అందాయి. “

“ఇప్పుడు కోర్ట్ లో నీకు కూడా ఏదయినా ఉంటె చెప్పు కోవచ్చని అంటారు. నువ్వే మయిన చెప్పాలనుకుంటున్నావా ,” అడిగింది వసుంధర.

ప్రసాద్ ,”నేను బయట కూర్చుంటాను మీరు మాట్లాడి బయటికి రండి ,మైత్రేయి,” అంటూ లేచాడు.

“ అయ్యో , మీరు బయటికి వెళ్లొద్దండి. మీకేమి తెలియని విషయం కాదు. నాకంటే ఎక్కువగా మీరు కూడా అవమానించబడ్డారు. నేను ఏమి మాట్లాడాలను కున్న , మీరు కూడా వినాలి, అవసరమైతే మొహమాటపడకుండా నాకు సలహా కూడా ఇవ్వాలి,” అంటూ అతన్ని చేయి పట్టి ఆపింది.

“తనకేమి అభ్యంతరం లేదు , మీరు ఇక్కడే కూర్చొవచ్చు, ” అంటూ వసుంధర  కూడా ప్రసాద్ ని కూర్చోమంది.  కొద్దీ సేపు మౌనంగా ఉండి  పోయింది మైత్రేయి. తనని కొద్దీ సేపు ఆలోచించుకొనివ్వాలని , “నేను మన ముగ్గురికి కాఫీ తీసుకొస్తాను,” అంటూ వంట గది  లోకి వెళ్ళిపోయింది వసుంధర.

“ ప్రసాద్ గారు , ఇప్పటి వరకు జరిగినవి తలుచుకుంటే , నాకనిపిస్తుంది, నేనొక ముళ్ళ చెట్ల మధ్యన ఉన్నానని.  ఏ మాత్రం ఏమరుపాటు ఉన్న , ఆ ముళ్ళు నన్ను గుచ్చు కొని నా శరీరాన్ని రక్తసిక్తం చేసేస్తాయి .  అలాంటప్పుడు నా నిర్ణయం వలన నేను ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు. అలా ఆలోచిస్తే అది స్వార్ధం అనిపించవచ్చు మా వాళ్లందరికీ.  పైగా ఇప్పటికే నా మీద మా అమ్మ నాన్న కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకి నాకంటే ముందే సుబ్బారావు జరిగిన సంఘటనని తనకి అనుకూలంగా మలిచి చేప్పి వాళ్ళ మద్దతు ని కొట్టేసాడు. పైగా  ఆడపిల్ల కి పెళ్లిచేసిన  తరువాత ఇలాటి స్వతంత్ర భావాలను హర్షించలేరు. అందుకే నేను పోలీస్ కేసు పెట్టటమే చాల పెద్ద తప్పిదం లాగ చూశారు.  సుబ్బా రావు ప్రవర్తన చాల సహజమయిన ప్రవర్తన గ  అనుకుంటున్నారు. ఆడపిల్ల గ నేనే సర్దుకుపోవాలని  కోరుకుంటున్నారు. ఇలాటి భావాలున్న వ్యక్తుల మధ్యన నేను ఏటికి ఎదురీదు తున్నట్లే.  అందువల్ల నా నిర్ణయం ఏదయినా భారీగా నష్టమైతే నాకే ననిపిస్తున్నది, మీరేమంటారు,” అన్నది .

“ మీరేమనుకుంటున్నారో స్పష్టం గ మీకు తెలుసా,” అన్నాడు.

“ అంటే.”

(ఇంకావుంది)

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

” లాయర్ సలహాలు” (కాలమ్)

నులివెచ్చని గ్రీష్మం