“నేటి భారతీయమ్” (కాలమ్)

“పిల్లల చదువులు-తల్లితండ్రుల బాధ్యత”

పిల్లలు బాగా చదువుకుంటే యే తల్లిదండ్రులకైనా, అంతకన్నా కావాల్సిందేముంది. దానికి ముందు తల్లిదండ్రులుగా మన బాధ్యతేమిటో ఒక్కసారి సింహావలోకనం చేసుకుందాం. వాళ్లకు కావల్సినవన్నీ సమకూరుస్తున్నాం కాబట్టి, వాళ్లు బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోవాలని ఆశపడడంలో తప్పులేదు. కాని, వాళ్లకు ఫస్ట్ ర్యాంకులు రావాలంటే, మనమేమి చెయ్యాలో ముందు గ్రహించుకోవాలి.

              డా. మజ్జి భారతి

చాలామంది పెద్దలు పిల్లలకి సబ్జెక్టుకొక ట్యూషన్ పెట్టి, అక్కడితో తమ బాధ్యత అయిపోయిందని భావిస్తారు. అంతేకాని వాళ్లకు ఆ సబ్జెక్టంటే యిష్టముందా! లేదా! అని ఆలోచించకుండా, పిల్లల యిష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా, వాళ్లకు నచ్చని కోర్సుల్లో జాయిన్ చేస్తే, అంతిమంగా నష్టపోయేది పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా. అందుకని ముందే పిల్లల యిష్టాలను పరిగణనలోకి తీసుకొని, ఒకవేళ వాళ్ళ ఆలోచనలు తప్పైతే, అవి ఎందుకు తప్పో, భవిష్యత్తులో ఆ నిర్ణయంవలన వాళ్లెంత నష్టపోతారోనన్న విషయం, వాళ్ళకి విడమర్చి చెప్తే అర్థం చేసుకుని, ఆ కోర్స్ మీద యిష్టాన్ని పెంచుకుంటారు.
అందరి పిల్లల తెలివితేటలూ ఒకే రకంగా వుండవు. పెద్దవాళ్లు ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అందుకనే వేరే వాళ్లతో పిల్లలనెప్పుడూ పోల్చి చూడకూడదు. అలా చెయ్యడంలో పిల్లల మనఃస్థైర్యం మరింత దెబ్బతిని, అటు డిప్రెషనులోకైనా వెళ్ళిపోతారు, లేకపోతే రెబల్సులా తయారవుతారు. రెండూ మంచివి కావు. ఆ పరిస్థితి పిల్లలకు రాకుండా వుండాలంటే మన బాధ్యతేమిటో ముందు గ్రహించుకోవాలి.
బాధ్యతంటే, సదుపాయాలు సమకూర్చడమే కాదు. వాళ్ళకు మనమున్నామనే ధైర్యాన్ని కలిగించడం. వాళ్లకు మంచిర్యాంకులు రాకపోతే నీకింత చేస్తున్నాం? నువ్వేమి చేస్తున్నావని పిల్లలను నిందించడం కాదు. ఆ సమయంలో వాళ్ళకి మానసికస్థైర్యాన్నివ్వాలి. వాళ్లకి ర్యాంకెందుకు రాలేదో కారణాలు గ్రహించాలి. ఒక్కోసారి బాగా చదివినా మంచి ర్యాంకులు రాకపోవచ్చు. అటువంటి సమయంలో, వాళ్లకు మనము ధైర్యాన్నివ్వగలిగితే, పిల్లలు రెండోసారి ఫెయిలయ్యే అవకాశం తక్కువుంటుంది. మా అమ్మానాన్నలు నాకోసమున్నారనే, భరోసా పిల్లల్లో వుంటుంది. ఆ భరోసా వున్న పిల్లలు పెద్దయ్యాక, మీకోసం మేమున్నామనే భరోసాని తల్లిదండ్రులకు యివ్వగలుగుతారు.
పిల్లలకు ట్యూషన్ లు పెట్టించినా, తల్లిదండ్రులు పక్కనుండి చదివించడం పిల్లలకెంతో మేలు చేస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనమెంత బిజీగా వున్నా, కొంత సమయాన్ని పిల్లలకి కేటాయించాలనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. పిల్లలతో గడిపిన ప్రతీసారీ చదువుకో, చదువుకో అనకుండా, అప్పుడప్పుడు వాళ్లతో సరదాగా గడిపితే, వాళ్లకీ చదువు నుండి కాస్త ఉపశమనం కలిగి, చదువులో మరింత రాణించగలుగుతారు.
పిల్లలు చదువులో వెనకబడ్డ ప్రతిసారీ నువ్వింతే, నువ్వెప్పటికీ బాగుపడవు అని పిల్లల్ని కించపరిచే మాటలు మాట్లాడకుండా, అటువంటి సమయంలోనే మనం మరింత సహనంతో, పిల్లలకు ప్రోత్సహమిచ్చేలా మన మాటలు చేతలు వుండాలి. అలా చేస్తే కొంతవరకైనా వాళ్ళ దృష్టిని చదువు వైపు మళ్ళించగలం. అంతేగాని వాళ్లను కోప్పడి, కించపరిస్తే మొదటికే మోసం వస్తుంది. పిల్లలను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమనేది సామాన్యమైన విషయం కాదు. దానికెంతో సహనం, ఓపిక, నేర్పు ఉండాలి. ఈ విషయం మనం మర్చిపోకూడదు.
పిల్లలు పై క్లాసులకు వెళ్ళిన కొద్దీ ఎక్కువ సేపు చదవాల్సి వుంటుంది. ఈ కాలం పిల్లల్లో యెక్కువమంది, బ్రహ్మ ముహూర్తంలో లేచి చదవడం కన్నా, రాత్రుల్లే చదవడానికి యిష్టపడుతున్నారు. ఆ సమయంలో వాళ్లను ఒంటరిగా వదిలే బదులు, మనమూ ప్రక్కనే వుంటే, మా అమ్మానాన్నలు నాకోసం కష్టపడుతుంటే వాళ్ల కోసం నేనేమైనా చేస్తాననే మానసిక సంకల్పం పిల్లల్లో కలుగుతుంది. అది వారిని చదువు దిశగా ప్రోత్సహిస్తుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాళ్లు చేసే ప్రతి పనిని, వాళ్లకు అనుమానం రాకుండా, నిశితముగా గమనిస్తూ వుండాలి. అవసరాన్ని బట్టి ప్రోత్సాహాన్నివ్వడమో, మందలించడమో చేస్తూ వుండాలి. ఒక రకంగా చెప్పాలంటే పిల్లల్ని అనుక్షణం మనం కనిపెట్టుకొని వుండాలి.
అలాగే చాలామంది తల్లిదండ్రులు పిల్లలు చదువుకుంటున్నప్పుడు, అటు టీవీ పెట్టుకోవడమో, ఫోనుల్లో పిచ్చాపాటి మాట్లాడుకోవడమో చేస్తుంటారు. ఆ రెండూ పిల్లల ఏకాగ్రతని దెబ్బతీస్తాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పిల్లలు చదువుకుంటున్నప్పుడు, మనము పక్కనే కూర్చుని మనమూ యేదో పుస్తకము చదువుకుంటే, మనకూ విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. అమ్మానాన్నలు పక్కనుంటే, చదవని పిల్లలు చదువుకునే విషయంలో జాగ్రత్త పడతారు. చదువుకునే పిల్లలు మరింత శ్రద్ధగా చదువుకుంటారు. పిల్లలకు మనకూ మధ్య చక్కని అనుబంధమేర్పడుతుంది. చిన్నప్పుడు పిల్లలకు మనమిచ్చే ధైర్యం, ప్రోత్సాహం, ప్రేమ… పెద్దయ్యాక వాళ్లు మనకివ్వగలుగుతారు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకుంటే వృద్ధాశ్రమాల అవసరం తగ్గుతుంది. సర్వేజనా సుఖినోభవంతు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అహంకారం

” లాయర్ సలహాలు” (కాలమ్)