ఓ రోజు నేను నా స్నేహితురాలితో వాకింగ్ చేస్తున్నాను. ఉన్నట్లుండి ఆమె తనకు తెలిసినావిడ గురించి ప్రస్తావించింది. అందులో భాగంగా ఆమె భర్త ఓ అనుమానం పక్షి అనీ భార్యను తన అనుమానరోగంతో వేధిస్తాడనీ చెప్పింది. పైగా అగ్నికి ఆజ్యం పోసినట్లు ఆమె ఉద్యోగం కూడ చేయడంవల్ల ఆమె పట్ల అతని వేధింపులు ఎక్కువే అని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగితే బాగుండేది. కానీ ఆమె అన్న మరో మాటకు నేను అవాక్కయ్యాను. ఇంతకీ ఆమె అన్న మాట ఏమిటయ్యా అంటే “ఇంతా చేస్తే ఆవిడ ఏమన్నాగొప్ప అందగత్తా అంటే అదేమీ కాదు…ఆవిడ చూడటానికి అసలేం బాగుండదు…., అచ్చు కోతిలా ఉంటుంది” అన్నది
ఎగతాళిగా మొహంపెట్టి. ఆ మాటకు నా మనస్సు చివుక్కుమంది. ఆమె స్నేహితురాలే అయినా నేను స్పేర్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరైనా తప్పు చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం కూడ క్షమార్హం కాదని నా అభిప్రాయం. అందుకే వెంటనే నేను కల్పించుకుని ఇలా అన్నాను. “ అదికాదు నిర్మలగారూ.. ఇంకొకళ్ళ అందచందాలగురించి అలా తక్కువ చేసి చులకనగా మాట్లాడడం తప్పండీ….అందంగా ఉండడం,ఉండకపోవడం అనేవి మనచేతుల్లో లేనివి. అవి పూర్తిగా దైవనిర్ణయాలు. వాటిని గురించి అదేదో మన ప్రతిభో లేక మన వైఫల్యమో అనుకోవడం మూర్ఖత్వం. అంతే కాదు ఎంతటి సౌందర్య రాశి ఐనా జరా మరణాలకు గురి కాక తప్పదు. నడమంత్రపు సిరిలా మధ్య వచ్చినదానిని చూసుకుని మిడిసిపడటమంత హాస్యాస్పదం మరోటి లేదు. అందుకే అందంగా ఉంటే అహంకారానికి లోనవడం లేకుంటే కుంగి పోవడం ఎన్నటికీ తగదు. అహంకారం ఎప్పటికైనా వినాశనానికి దారి తీస్తుందని మనం గ్రహించడం మంచిది అన్నాను. అంతేకాదు వినయం, నమ్రత మనిషికి పెట్టని ఆభరణాలని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, అన్నాను. అయినా ఆవిడ నా మాటలకు స్పందిచినట్లు ఏ కోసానా కనపడలేదు.
మితి మీరిన ఈ దురహంకారంవల్ల మనిషి ఏ విధంగా పతనం చెందుతాడో మన పురాణాలలోని, భృగు మహర్షి, దూర్వాస మహా ముని, నహుషుడు ఇంకనూ విశ్వామిత్రాదుల కథలు వింటే మనకు అర్థం అవుతుంది. ఇక అసురులైన రావణ కుంభకర్ణులు, హిరణ్యాక్ష హిరణ్యకసిపులు, శిశుపాల దంతావకృల మాట వేరే చెప్పనక్కరలేదుకదా….! అందుకే మనిషి ఈ అహంకారాన్ని దరికి చేరనివ్వకుండా నిరంతరం జాగరూకతతో వ్యవహరించవలసి ఉన్నది. లేకుంటే పతనం తథ్యం అని మనం గుర్తుంచుకోవాలి.