అలనాడే అతివలబలలు కారని
వారు దలచిన సాధించలేని కార్యమేదీ లేదని,
సమాజ హితము కొరకు,
మహిషాసుర సంహారానికై, తమ ఆయుధములనిచ్చి
సృష్టించారు దుర్గాదేవిని త్రిమూర్తులు;
పాశ, శూల, చక్ర, వజ్రాయుధధారిణియై,
నవరాత్రుల భీకర పోరు అనంతరం,
అతివలబలలు కారని, మహాబలులని నిరూపించి,
సాధించె విజయం మహిషాసుర మర్ధనియై
దుర్గాదేవి ఆనాడు
మరి ఈనాడో!
అన్నిటా తానే ముందుండి, అంతరిక్షానికేగినా
అతివలపై అరాచకాలు, ఆకృత్యాలు,
నిత్య కృత్యమైపోయిన ఈ రోజుల్లో,
స్త్రీలకు మాన, ప్రాణ రక్షణే కరువైపోతుంటే,
దుర్గాదేవిలు యేమైపోయారు?
వారిని సృష్టించే దేవతలెక్కడ?
దార్శనికతలేని పురుషుల్లో,
అసుర గుణం ప్రబలుతుంటే,
జరుగుతున్న యెన్నో అమానవీయ సంఘటనలు,
మానవ జాతిని నిర్వీర్యం చేస్తుంటే,
వలువలిచ్చి, మగువల విలువను నిలిపే
శ్రీకృష్ణులు కానరారే?
కీచకుల మదమణచి, స్త్రీలను రక్షించే
భీమసేనులు అగుపడరే?
సహనశీలులను కాపాడే
వరాహమూర్తులు ప్రత్యక్షమవ్వరే?
మహిళలకూ సమాన హక్కులుండాలనే
కందుకూరులూ కనిపించలే?
మరేమి చేద్దాం?
పరిష్కారమెలా?
మానవ మృగాలు జనారణ్యంలో
వుండాలంటే భయపడేలా,
పుట్టిన నుండే ఆడపిల్లకు
ఆత్మరక్షణ నేర్పుదాం
అపర శక్తి స్వరూపిణిగా పెంచుదాం
ఆనాడే, ప్రతిదినమొక దసరా పండుగే అతివలకు
ఆ రోజు త్వరలో వస్తుందని ఆశిస్తూ…