దొరసాని

ధారావాహికం – 49 వ భాగం

అమెరికా వెళ్ళిన సాగర్ భారత్ కి రావడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు.. ఇక్కడ సౌదామిని సాగర్ కోసం ఎదురుచూస్తూ బాలసదనం పనులు చూసుకుంటూ ఇంట్లో నీలాంబరికి చేదోడు వాదోడుగా ఉంటుంది…

సౌందర్యలహరి అన్నప్రాసన కోసం సుధీర్ కుటుంబమంతా గోపాలపురం వచ్చారు… శివాలయంలో అన్నప్రాసన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు.. ఆదిదంపతులు శివపార్వతుల సన్నిధిలో కుటుంబ సభ్యుల మధ్యలో అన్నప్రాసన కార్యక్రమం జరిగింది.

శివుడికి రుద్రాభిషేకం చేయించి పార్వతీదేవికి కుంకుమార్చన చేయించుకుని ఆది దంపతులకు నివేదించిన పాయసంతో సౌందర్యలహరికి అన్నప్రాసన చేయించారు.

భక్తిశ్రద్ధలతో దైవాన్ని పూజించుకొని ఇంటికి వచ్చారు . దేవాలయంలోని అందరూ ప్రసాదం ఆరగించడం వల్ల ఆకలిగా లేదు అని అందరూ హాల్లో కూర్చున్నారు.

ఇదే సమయం అనుకున్న నీలాంబరి భూపతి ముందుగా సౌదామిని పెదనాన్న గారైన సుధీర్ తండ్రిని సాగర్ సౌదామినిల పెళ్లి గురించి అడుగుదామని అనుకున్నారు.

సందర్భం ఎలా తేవాలి అని ఆలోచించుకున్న సమయంలో ..

ముందుగా సుదీర్ తండ్రి సౌదామిని పెళ్లి మాట తీశారు..

” మా సౌదామిని చదువు అయిపోయి ఉద్యోగంలో స్థిరపడింది కాబట్టి మా తమ్ముడు కూడా పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు” అని అన్నాడు.

” అవును పెళ్లి చేయాల్సిన వయసే కదా ఇప్పుడు చేస్తేనే బాగుంటుంది” అన్నది నీలాంబరి.

” మా అక్కయ్య కొడుకు హైదరాబాదులో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు చిన్నప్పటినుండి మా అక్కయ్య తన కొడుక్కి సౌదామిని చేసుకోవాలని అనుకుంటుంది మా తమ్ముడు మరదలు కూడా మేనల్లుడు అంటే చాలా ఇష్టం ఈ కాలం పిల్లల్లా కాకుండా వినయ విధేయతలు కలిగి మంచి ఉద్యోగం చేస్తున్నాడు అందుకనే అందరికీ ఈ సంబంధం ఇష్టంగానే ఉంది” అన్నాడు సుధీర్ తండ్రి.

ఒక్కసారిగా అందరి ముఖాలు వాడిపోయాయి… అప్పటికే విషయం తెలుసుకున్న అలేఖ్య ఈ పిడుగు లాంటి వార్తను వినలేక పోయింది తమ్ముడు ఏమైపోతాడో అని చాలా బాధపడిపోయింది.

నీలాంబరికి అసలు నోట మాట రాలేదు భూపతి కూడా అలాగే చూస్తూ కూర్చున్నాడు…

ఈ సంభాషణ వినని సౌదామిని లోపల నుండి అందరికీ గ్లాసుల్లో మజ్జిగ తీసుకుని వచ్చింది..

అందరూ నిశ్శబ్దంగా ఉండడం చూసి..

” ఏంటి లైబ్రరీలో కూర్చున్నట్టు అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు అసలు ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు ఏంటి!” అని అడిగింది.

అసలు విషయం తెలియని సుధీర్ తల్లి తండ్రి మాత్రం” నీ పెళ్లి గురించి చెప్తున్నాము తల్లి” అన్నారు..

సౌదామిని సాగర్ తోనే పెళ్లి విషయం అనుకొని మొహంలో కొంచెం సిగ్గుని దాచుకొని..

” అవునా పెద్దనాన్న” అన్నది.

” అవును తల్లి! చిన్నప్పటినుండి నిన్ను మీ అత్త కొడుకుకు ఇవ్వాలని మీ నాన్న కోరిక తెలుసు కదా!.. కమల్ బావ ఎలాంటి వాడో తెలుసు కదా నీకు.. చిన్నప్పటినుండి అందరూ కలిసి పెరిగారు దగ్గర కుటుంబంలో ఇస్తే బంధుత్వాలు బాంధవ్యాలు బాగుంటాయని మా అందరి కోరిక మరి ఈ విషయం మీ నాన్న నీకు చెప్పాడో లేదో నాకు తెలియదు” అన్నాడు సుధీర్ తండ్రి.

ఒక్కసారి షాక్ తిన్నట్లయ్యింది సౌదామినికి..

” చిన్నప్పటినుండి నా ముందు ఈటాపిక్ ఎప్పుడు రాలేదు పెదనాన్నా.. అయినా పెళ్లి విషయం మాట్లాడాలంటే ముందు మా నిర్ణయం అడగాలి కదా నాన్న నాకు తెలియకుండా అలా ఎందుకు అనుకున్నారు” అన్నది సౌదామిని.

” ఏమోనమ్మా నాతో మాత్రం చాలా సార్లు మీ నాన్న నిన్ను కమల్కు ఇస్తే బాగుంటుందని అన్నాడు” అన్నది సుధీర్ తల్లి.

కళ్ళలో నుండి వస్తున్న నీటి ప్రవాహాన్ని దాచుకొని లోపలికి వెళ్ళిపోయింది సౌదామిని.

నీలాంబరి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది కానీ కంట్రోల్ చేసుకొని అలాగే కూర్చుంది.

భోజనాల సమయానికి మహేశ్వరి వచ్చి అందరికీ వడ్డించింది. సౌదామినిని పిలిస్తే “తలనొప్పిగా ఉంది కాసేపు అయిన తర్వాత తింటాను “అని చెప్పింది. విషయం నీలాంబరికి అర్థమైంది కానీ ఆ అమ్మాయికి ఏం చెప్పి ఓదార్చాలో అర్థం కాలేదు.. ఈవిషయం తెలిస్తే సాగర్ ఏమైపోతాడో అంతకన్నా అర్థం కాలేదు..

అందరూ భోజనం చేసిన తర్వాత ఒక పళ్ళెంలో పప్పుచారు అన్నం కలుపుకొని సౌదామిని ఉన్న గదిలోకి వెళ్ళింది నీలాంబరి…

అటు తిరిగి పడుకున్న సౌదామినిని చూసి..

” సౌదామినీ! లే తల్లి కొంచెం అన్నం తిని పడుకుందువు గాని” అని పిలిచింది.

సౌదామినీ జవాబు ఇవ్వకుండా అలాగే పడుకుంది.

నీలాంబరి సౌదామిని ముఖం చేయితో ఇటువైపుకు తిప్పుకుంది… కన్నీళ్లతో మొఖం అంతా తడిసిపోయి ఉంది కళ్ళు ఎర్రగా అయిపోయాయి.

అలా సౌదామినిని చూసే సరికి నీలాంబరికి కూడా చాలా దుఃఖం వచ్చింది…

తనని తాను కంట్రోల్ చేసుకుని..

” ఏంటి ఎందుకు ఏడుస్తున్నావ్ అప్పుడే ఏం జరిగిందని! నీకు ఇష్టం లేకుండా మీ వాళ్ళు నీ పెళ్లి చేయరు కదా…

నీ మనసులో ఉన్న మాట వాళ్లకు తెలియచేయి ఏమంటారో చూద్దాము.. అప్పుడే ఎందుకు బాధ పడతావు నేను కూడా మీ అమ్మానాన్న గారిని అడుగుతాను ..నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది” అన్నది నీలాంబరి సౌదామినిని దగ్గరికి తీసుకొని…

” నాకు ఏమీ అర్థం కావడం లేదు అత్తయ్యా! మా అమ్మానాన్న నన్ను అడగకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకోలేదు నా పెళ్లి విషయం ముందుగా నాతో కదా వాళ్లు మాట్లాడాలి” అన్నది సౌదామిని వెక్కుతూ..

” ఏంకాదు… నువ్వు చెప్తే వాళ్లు అర్థం చేసుకుంటారు నువ్వే చెప్పావు కదా చిన్నప్పటినుండి నాకు స్వేచ్ఛ ఇచ్చారని ..అలాగే ఈవిషయంలో కూడా వాళ్లు నిన్ను అర్థం చేసుకొని నీకు నచ్చని పెళ్లిని చేయరు” అని చెప్పింది నీలాంబరి.

” అవును అమ్మానాన్న నాకు నచ్చనిది ఏదీ చేయరు వాళ్ళకి నేను చెప్పి చూస్తాను” అని కొంచెం నవ్వుతూ లేచింది సౌదామిని.

” వెళ్లి ముఖం కడుక్కొని రా అన్నం తిందువు గాని” అన్నది నీలాంబరి.

సౌదామిని లేచి వెళ్లి ముఖం కడుక్కొని వచ్చింది.

నీలాంబరి స్వయంగా సౌదామినికి అన్నం తినిపించింది.. అప్పుడే లోపలికి వచ్చిన భూపతి ఈదృశ్యాన్ని చూసి “మేము అనుకున్నదే జరిగేలా దీవించు స్వామి” అనీ దేవుడికి దండం పెట్టుకున్నాడు..

నీలాంబరి కూడా దేవుడిని ప్రార్థించింది “ఈ పసిపిల్లల మనసులను వేరు చేయకు స్వామి” అని.

సాయంత్రం సుధీర్ తల్లిదండ్రులు వారి ఊరికి వెళ్ళిపోయారు.

అలేఖ్య సుధీర్లకు కూడా ఈ విషయం విన్నప్పటి నుండి బాధగా ఉంది..

” సౌదామినీ! నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావ్ బాబాయ్ పిన్నికి నేను చెప్తాను నీకు ఇష్టం లేని పని వాళ్ళు చేయరు” అని చెప్పాడు సుధీర్.

అలేఖ్య కూడా సౌదామినిని ఓదార్చింది..

” సాగర్ కి ఈవిషయాలు ఏం చెప్పకు అంతా సవ్యంగా జరుగుతుంది. దూరంగా ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ బాధపడతాడు” అని చెప్పింది అలేఖ్య.

సరేనని తల ఊపి..

” నేను బాలసదనం వరకు వెళ్లి వస్తాను అక్కడ ఇద్దరు పిల్లలకి కొంచెం జ్వరంగా ఉందట చూసి వచ్చేస్తాను” అని చెప్పి తన స్కూటీపై వెళ్ళిపోయింది సౌదామిని.

సౌదామిని వెళ్లిపోయిన తర్వాత అలేఖ్య నీలాంబరి చాలా సేపు మాట్లాడుకున్నారు..

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వృక్షాలను రక్షించండి

నులివెచ్చని గ్రీష్మం