” నేటి భారతీయమ్ కాలమ్”

“డాక్టరుగా నిర్వహణలో నా అనుభవాలు-3”

ఈవినింగ్ ఓపీలో పేషెంట్స్ ఇంకెవరూ లేరని ఆయా చెప్తే, ఇంటికి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వచ్చిందామె. ముప్పయ్యేళ్లు వుంటాయేమో! అందమైన ముఖమే, కాని ముఖంలో కాంతి లేదు. అయినా నా పిచ్చిగాని, హాస్పిటల్ కి వచ్చేది బాధతో. మరి వాళ్ళ ముఖాల్లో కాంతి యెట్లా వుంటుందని నాకు నేనే సర్ది చెప్పుకొని “ఏంటమ్మా బాధని” అడిగాను. ప్రక్కగా వున్న స్క్రీన్ వైపు చూసింది. అర్థమైంది నాకు. స్క్రీన్ లోపలికి దారి తీశాను. మాట్లాడకుండా నాతో వచ్చి ఆమె బాధ ఏమిటో చూపించింది.

డా. మజ్జి భారతి

గుండెల్లోని గాయాలు కనిపించవేమో కానీ, గుండెల మీద గాయాలు, అవే … నఖక్షతాలు, పంటి గాట్లు కనిపించాయి. వాటిని చూస్తుంటే, అనురాగంతో చేసినవి కావని తెలిసిపోతుంది. అలవాటుగా “ఎప్పుడు జరిగాయి? ఎలా జరిగాయి?” అడిగాను. “రాత్రి మావారు తాగి వచ్చారు” సంజాయిషీ చెప్పింది. ఆమె మా వారు అనకపోతే నేనా కేసును మెడికో లీగల్ కేస్ చేసి పోలీసులకు కంప్లైంట్ యివ్వాల్సి వచ్చేది. అదో పెద్ద ప్రసహనం.
ఇటువంటి కేసులు సాధారణంగా వచ్చేది మానభంగం కేసుల్లో… లేకపోతే వ్యభిచారవృత్తిలో ఉన్నవారు ఎక్కువగా ఇటువంటి బాధలతో వస్తారు. అరుదుగా, యిదిగో యిలా భర్త చేతిలోనే… ఆమెకు ఆయింట్మెంట్, మాత్రలు ఇచ్చి పంపించేసాను.
అలా ఆమె అప్పుడప్పుడు, అదే రకం కంప్లైంట్ తో. ఇంక అడగక తప్పలేదు “మీ భర్త ఏం చేస్తున్నారు? ఏమిటని? బ్యాంకులో ఉద్యోగమట. ఒకసారి తీసుకురామ్మా! ఆయనతో మాట్లాడాలన్నాను. ఆమె కళ్ళల్లో బెదురు. “అతనికి నేనేమీ చెప్తానో, యెలా చెప్తానోనని?”
“మాత్రలు వేసుకుంటే తగ్గిపోతుంది. ఆయన మంచివారే. ఎప్పుడైనా తాగివచ్చినప్పుడే అలా. నాకేమీ ఇబ్బంది లేదు” గబగబా అంది.
“అది కాదమ్మా మీ ఆయన బ్యాంక్ మేనేజర్ అంటున్నావు కదా! నాకు లోన్ కావాలి. ఆ విషయం మాట్లాడదామని. అంతే నీకిబ్బందైతే వద్దులే” అన్నాను. ఆమె ముఖంలో రిలీఫ్. “అలాగే మేడం” అంటూ ఆ మరుచటి రోజే తీసుకొచ్చింది.
మామూలు పరిచయాలయ్యాక, “నా పర్సనల్ లోన్ గురించి మీతో కాస్త మాట్లాడాలని” పక్క గదిలోకి వెళ్లబోతుంటే ఆమె కళ్ళల్లో మరల కంగారు. “నా పర్సనల్ మ్యాటర్స్ ఇంకొకరి ముందు డిస్కస్ చెయ్యడం నాకిష్టముండదని” చెప్పి పక్క గదిలోకి దారి తీశాను. నన్ను అనుసరించాడతను.
మనిషి నెమ్మదస్తుడిలాగే ఉన్నాడు. పర్వాలేదు, చెప్పొచ్చని ధైర్యమొచ్చాక, “మీరేమీ అనుకోనంటే…” అంటూ “మీరంటే ఆమెకు చాలా ఇష్టం. కాని డాక్టరుగా నేనొక విషయం మీకు చెప్పాల్సి ఉంది. మీరు గమనించే వుంటారు. భార్యాభర్తలు కలిసే టైములో ఒక్కోసారి ఆమె యిబ్బంది పడడం” అంటూ ఆగింది.
“ఏమైంది డాక్టర్! తనకేమైనా…” ఆగిపోయాడతను, యెలా అడగాలో తెలియక
“మీరు గమనించే వుంటారు, మీరామెను హత్తుకున్నప్పుడు…” నా మాట పూర్తి కాకుండానే అతని కళ్ళల్లో కోపం. బాధేమిటో అతనికి చెప్పకుండా, నాకు చెప్పిందని… “డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర యేది దాచకూడదంటారు” చిన్నగా నవ్వి అన్నాను. సర్దుకుని చెప్పమన్నట్టు చూశాడు.
అప్పుడు మొదలు పెట్టాను. ఒక పేపర్ తీసుకొని, వక్షోజాల బొమ్మ గీసి, అవి కేవలం సౌందర్య చిహ్నాలో, కామ ఉద్దీపాలో కాదంటూ, అందులో వుండే గ్రంధులు, వాటి నాళాలు, ఆ బొమ్మలో చూపిస్తూ, బిడ్డ పుట్టాక వాటి ఆవశ్యకత యేమిటో, తల్లిపాల వల్ల పిల్లలకు చిన్నతనంలోనే కాక, పెద్దయ్యాక రోగ నిరోధక వ్యవస్థ ఎలా వృద్ధి చెందుతుందో చెప్తూ, ఆ వక్షోజాలకి గాయాలైతే, ఆ దుష్ప్రభావం పాల గ్రంధుల మీద, నాళాలమీద ఏ రకంగా వుంటుందో… నాళాలు మూసుకుపోయి బిడ్డ పాలు త్రాగ లేకపోతే, తయారైన పాలు బయటికి రాకపోతే ఆ తల్లికి ఎంత ప్రమాదమో… నెమ్మదిగానే, అయినా వివరంగా చెప్పాను. రేపు మీ భార్యకు, మీకు పుట్టబోయే బిడ్డకు ఈ సమస్యలు ఎదురు కాకూడదంటే, యేమి చెయ్యాలో మీకు అర్థమయ్యే వుంటుందంటూ, ఇంకో విషయం… నేనీ విషయాలు చెప్పినట్టు ఆమెకు తెలియనివ్వకండి. బాగుండదని” బయటకు వెళ్లాక “సారీ! మిమ్మల్ని యిబ్బంది పెట్టాను. పాత లోను తీర్చాక, కొత్త లోనుకి అప్లై చేసుకుంటాను థాంక్యూ” అన్నాను.
ఆ తర్వాత ఆమె రాలేదు. వచ్చే అవసరం పడలేదా? అలాగైతే సంతోషమే. లేక అతను రానివ్వలేదా? ఏమైనా నేను చేసేదేమీ లేదు. ఇటువంటి కేసులొస్తే కొన్నాళ్లు వాటి గురించే ఆలోచిస్తాం. ఆ తర్వాత, కొత్త కేసుల్లో పడి మర్చిపోతాం.
ఆరు నెలల తర్వాత అనుకుంటా, వచ్చి థ్యాంక్స్ చెప్పిందామె. అయోమయంగా చూస్తున్న నాతో, సిగ్గుపడుతూ “నెల తప్పాను మేడమ్. రాత్రా విషయం చెప్తే, అప్పుడు చెప్పారాయన, మీరాయనతో మాట్లాడినట్టు. థాంక్స్ మేడమ్! ట్రీట్మెంట్ ఇచ్చి పంపించెయ్యకుండా, కౌన్సిలింగిచ్చి ఆయనను మార్చినందుకు. ఇప్పుడాయన అస్సలు తాగడం లేదని”, ఆనందంగా చెప్పింది.
మనసులో సంతోషం ఉత్తుంగమై ఎగిసింది. బయటికి మాత్రం “దాందేముందమ్మా! నా డ్యూటీ నేను చేశాను” అనేసాను మామూలుగా. అప్పుడప్పుడు వచ్చే ఇటువంటి ఫీడ్ బ్యాక్ లు, మా వృత్తిలో మమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. వచ్చేవారం ఇంకో అనుభవంతో మీ ముందుకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళ మణులు- దీపా నిదాన కవి

ఎడారి కొలను