మనమూ – ఆమె

కవిత

శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి
శ్రీమత్ సింహాసనేశ్వరి
నవవిధ రూపాల్లో కొలువుదీరి
భక్తులను అనుగ్రహించే
తొమ్మిది రోజుల వేడుక !

సంపద, తెలివి,
ఆరోగ్య ప్రదాయినిగా
బాలా త్రిపుర సుందరి
ఆశీర్వదిస్తుంది!

పంచేంద్రియాలను
పంచ ప్రాణాలను పాలించే
గాయత్రీ దేవి
మనల్ని రక్షిస్తుంది !

సంపూర్ణ పోషణ
సర్వోన్నత సంక్షేమం రూపమై
అన్నపూర్ణా దేవి
అలరిస్తుంది !

సర్వ శక్తులను ప్రసాదించి
శ్రీ లలితా త్రిపుర సుందరి
చైతన్యానికి ఊపిరి పోస్తుంది

సంపద, శ్రేయస్సు
అదృష్టం, ఐశ్వర్య ప్రదాయినిగా
శ్రీ మహాలక్ష్మీ దేవి
కరుణిస్తుంది!

బుద్ధి, వివేకం
విద్య, విజ్ఞానం
శ్రీ సరస్వతీ దేవి
ప్రసాదిస్తుంది

శత్రు సంహారం చేసి
శ్రీ దుర్గా దేవి!
ధైర్య సాహసాలిస్తుంది

దుష్ట శిక్షణ చేసి
అహంకారాన్ని అణచేసే
శ్రీమహిషాసుర మర్ధిని!
అండగా నిలుస్తుంది

ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి
క్రియా శక్తులను
ప్రసాదించి
శ్రీ రాజరాజేశ్వరీ దేవి!
మనుషులు గా చేస్తుంది

నవవిధ భక్తి తో
జగజ్జనని కొలుద్దాం
విశ్వమాత ఆశీస్సులు
పొందుదాం

సర్వాభీష్ట సిద్ది కావాలంటే….

అబద్దాలాడకు
అక్రమాలు చేయకు
అవినీతిని మరచిపో
అహంకారం వదిలేయ్
చెడును అనకు వినకు కనకు
అమ్మ
నిజమై
నీతై నిర్భీతై
నిశ్శంసయంగా
నీ పరమమౌతుంది !
నువ్వు మనీషివవుతావు
_*_

Written by Y.Sujatha Prasad

వై. సుజాత ప్రసాద్,
ఊరు - లచ్చపేట,
జిల్లా సిద్దిపేట,
చరవాణి - 9963169653.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బతుకమ్మ

బతుకమ్మ పండుగ