మరుగుజ్జు బుద్ధులు

కథ

“అరుంధతీ! ఈరోజు ఆఖరి పీరియడ్ కాగానే సరోజా టీచర్ ఇంటికి వెళ్లాలనుకుంటున్నాం.ఇందాక వాళ్ళ అబ్బాయి రాజు వచ్చి వాళ్ళ అమ్మ పరిస్థితి ఏమీ బాగాలేదని మనందర్నీ చూడాలనుకుంటుందని చెప్పి వెళ్ళాడు. ఇంక ఆఖరు రోజులే నట ఒకసారి చూసొస్తే బాగుంటుంది” అని జయ 9వ తరగతిలో ఉన్న అరుంధతి దగ్గరికి వచ్చి చెప్పగానే ఒక నిమిషం సమాధానం ఏం చెప్పాలో తోచక ఆగి ,”సరే వస్తాను” అంది అరుంధతి.
అప్పుడే అటు వచ్చిన రాధ “స్కూల్లో పని చేసినంత కాలం అందర్నీ కాల్చుకు తినింది. అందుకే చివరి రోజులు అంత బాధ పడుతోంది.” అది కచ్చగా .

“అవును.నేను ఉద్యోగంలో చేరిన నాటి నుండి ఆవిడ రిటైర్ అయ్యేవరకు ఏ రోజు క్లాసుకు వెళ్ళగా చూడలేదు. అయితే విద్యార్థులు మాత్రం ఆవిడ బేగుని రాముడి పాదుకల్ని భరతుడు మోసినట్లు ప్రతి పీరియడు ఒక క్లాస్ నుండి మరో క్లాస్ కు మార్చేవారు.” అన్నది అరుంధతి

“ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఆవిడ స్టాఫ్ రూమ్ లోనే కూర్చుని కిటికీలోంచి దృష్టి సారించేది. అంతే, ఆవిడ లేకపోయినా పిల్లలంతా నిశ్శబ్దంగా గైడ్లు చూసుకుని నోట్స్ రాసుకుంటూ కూర్చునేవారు.” రాధ అంది .
ఆఖరుకు యూనిట్ పరీక్షలు కూడా ప్రశ్నపత్రం ఇచ్చేస్తే వాళ్లే బోర్డు మీద రాసి పరీక్ష పూర్తి చేసి పుస్తకాలు తెచ్చి ఆవిడకు ఇచ్చేసేవారు .

అంతలో లంచ్ బెల్లు కావటంతో ముగ్గురు స్టాఫ్ రూమ్ దారి పట్టారు .
స్టాఫ్ రూమ్ లో కూడా అందరూ సరోజా టీచర్ గురించే చెప్పుకుంటున్నారు .

“మనం లంచ్ బెల్లుకి ఇక్కడికి వచ్చేసరికి సరోజా టీచర్ టేబుల్ మీద అందరి బాక్సులు తెరిచి చూసి తనకి నచ్చిన వంటలు ఉంటే చక్కగా కాస్త కాస్త తినేసేది.”సునంద టీచర్ నవ్వుతూ చెప్తోంది .

“మరి మీరేం తినేవారు?” కొత్తగా చేరిన వాణి ఆశ్చర్యంగా అంది .

“మరి ఏం చేస్తాం? మా తమ్ముడు ఇల్లు స్కూలు పక్కనే కదా! పిల్లల చేత కబురు పెడితే మా మరదలు తినటానికి ఏదో తీసుకొని వచ్చేది.” అంది సునంద.

‘టీచర్ వృత్తిలో ఉంటూ ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా !’అని మనసులో నే అనుకుంది పైకి అనలేక.
“ఇంకా ఏం చూసావు? స్టాఫ్ రూమ్ ముందు నుండి పోయే ప్రతీ టీచర్ ని ఏదో ఒక పేరు పెట్టి వెటకారం చేయడం లేదా తిట్టడం! ఒకటి కాదు ఆవిడ గురించి చెప్పాలంటే “సునంద అంది.

“నిజమే ఆవిడకి భయపడి కొందరు టీచర్లు స్టాఫ్ రూమ్ కి రాకుండా వేరే రూమ్ లో కూర్చునేవారు”. అంది అరుంధతి .

“అంతేకాదు బాత్రూం కోసం రావడానికి కూడా భయపడేవారు. వారానికి ఓ రెండు రోజులు పదో తరగతి క్లాస్ కి మాత్రమే వెళ్ళేది .అటువంటి అప్పుడు స్టాఫ్ రూమ్ కి వచ్చేవాళ్ళం,”రాధ అంది.
“ఆవిడ్ని ఇంట్లో వాళ్ళు ఎలా భరించేవారో!” వాణికి కుతూహలం.

“భరించటానికి ఎవరూ లేరు పెళ్లి చేసుకోలేదు. కానీ ఒక లాయరు అప్పుడప్పుడు ఆవిడ ఇంటికి వచ్చి వెళ్తాడని అనేవారు. నిజం మనకి తెలీదు. ఒక కుర్రాడిని అనాధాశ్రమం నుండి తెచ్చి పెంచుకుంది. ఆమెతోపాటు ఆవిడ అక్క కూడా ఉండేది “సునంద చెప్పింది.

“శాడిస్ట్ మెంటాలిటీ. మరి ఎవరు ఆవిడ మీద కంప్లైంట్ చేయలేదా?” రాధ చిరాగ్గా అడిగింది .
“లేదు. అందుకే అటువంటి విపరీత ధోరణి” .సాలోచనగా అంది గౌరీ .

“ఆవిడ చేసిన మంచి పనుల ఆ పిల్లాడిని పెంచుకోవటం. వాడిని బాగా చదివించింది .పెళ్లి కూడా చేసింది. కొడుకు కోడలు ఆమె దగ్గరే ఉంటారు.” జయ అంది.
“ఇంతకీ ఏమిటి అనారోగ్యం?” అడిగింది అరుంధతి.
“ఒకటి కాదు. చాలా ఉన్నాయి .ఆరేడు నెలలుగా అన్ని మంచం మీదేనట. నాలుగు రోజుల నుండి మాట కూడా స్పష్టత లేదట. స్కూలు టీచర్లు అని గొణుగుతోందట. అందుకే రాజు వచ్చి ఒకసారి టీచర్లని రమ్మని పిలిచాడు. రాక్షసిలా అంత కాలంగా వేపుకు తింటున్నా పాపం కొడుకు బాధ్యతగా వచ్చి చెప్పి వెళ్ళాడు ” జాలిగా అంది జయ.
అంతలో బెల్లు కాగానే టీచర్లంతా ఎవరి క్లాస్ కి వాళ్ళు వెళ్ళిపోయారు.
లీజర్ పీరియడ్ కావడంతో అరుంధతి స్టాఫ్ రూమ్ లోనే కూర్చొని హోంవర్క్ పుస్తకాలు దిద్దటానికి తెరిచింది.

కానీ మనసు దానిపై లగ్నం కాలేదు. కళ్ళు మూసుకుని టేబుల్ మీదకి వంగి కుడి మోచేతి మధ్య ముఖం వాల్చింది. మూసుకున్న కళ్ళల్లో స్కూల్లో చేరిన కొత్తలో జరిగిన సంఘటన దృశ్యమానమైంది.

స్కూల్లో టీచర్ గా చేరిన వారం రోజులకి ఓ రోజు బాత్రూం కోసమని స్టాఫ్ రూమ్ కి వచ్చి అటాచ్డ్ బాత్రూం కి వెళ్లి తిరిగి వస్తూ లోపల గొళ్ళెం తీయబోతుంటే ‘అరుంధతి’ అన్న తన పేరు వినబడి అలాగే ఆగింది.
“ఈ అరుంధతి కళావంతులు కాబోలు కదా ! చూడటానికి గాని ,మాట గాని అలా కనిపించలేదే” అంటుంది సరోజా టీచర్.

“కాదనుకుంటాను టీచర్ .ఎస్సీ నో, బీసీనో అని ఆరోజు సర్టిఫికెట్ లో చూసినట్లు గుర్తు “ఇంకో టీచర్ కంఠం.

“లేదు లేదు అప్లికేషన్ ఫారం నేనే ఫైల్ చేశాను .కులం పేరు ఏదో గా ఉంది. ఎప్పుడు వినలేదు. ఆమెకి కొంచెం షాను ఎక్కువే అనుకుంటా ఎవరితోనూ మాట్లాడదు .”సరోజ టీచర్ గొంతు కొంచెం వెటకారంగా ధ్వనించింది .ఇంకో టీచరు ఏదో అనబోయి మాత్రం గోళ్ళెం చప్పుడు విని ఆపేసింది.
అరుంధతి బయటకి వచ్చి ఎటు చూడకుండా క్లాసులోకి వెళ్ళిపోయింది మాట్లాడుతున్న టీచర్ల మాట తీరు వాళ్ళ కులాన్ని తెలియజేస్తూనే ఉన్నాయి. మరి ఆ తర్వాత సరోజా టీచర్ రిటైర్ అయ్యేవరకు స్టాఫ్ రూమ్ లో లంచ్ చేయలేదు. మరొక క్రిస్టియన్ టీచర్తో కలిసి వేరే క్లాస్ రూమ్ లోనే చేసేది అరుంధతి.

మధ్యాహ్నం మొదటి పీరియడ్ పూర్తయినట్టుగా గంట మోగేసరికి అరుంధతి ఆలోచన తెగింది.

అంతవరకు వెళ్లాలా వద్దా అనే ఊగిసలాట లో ఉన్న అరుంధతి మళ్ళీ ఏమనుకుందో మిగతా టీచర్లతో పాటు సరోజా టీచర్ ఇంటికి బయలుదేరింది.

ఒక రేకు మంచం మీద దుప్పటి మాత్రం వేసి పడుకోబెట్టారు సరోజా టీచర్ ని. ఆమె వంటిమీద మాసి కంపు కొడుతున్న నైటీ ఉంది. ఆ రూమ్ అంతా భయంకరమైన నీచు వాసన. ఒక్కొక్కరే ఆమె దగ్గరగా వెళ్లి పలకరిస్తున్నారు. ఆమె మనుషుల్ని గుర్తు పడుతున్నట్లే ఉంది. గొణుగుతున్నట్లుగా వాళ్ళ పేర్లు ఉచ్ఛరిస్తోంది.

అందరూ టీచర్లు పలకరించిన తర్వాత జయ టీచర్
“అరుంధతి వెళ్లి పలకరించు” అంది, దూరంగా నిలుచున్న అరుంధతిని. అరుంధతి దగ్గరగా వెళ్లి ఆమె దగ్గరగా వంగి ఆమె చేతి మీద చెయ్యి వేసింది.. అరుంధతి దగ్గరగా వెళ్లి ఆమె దగ్గరగా వంగి ఆమె చేతి మీద చేయి వేసింది. అరుంధతి చేతి మీద సరోజా టీచర్ తన రెండో చేతిని వేసి ఏదో గొణిగింది. ఆమె ఏమందో అరుంధతికి అర్థం కాలేదు సరోజా టీచర్ అని నెమ్మదిగా పిలిచింది అరుంధతి

మళ్లీ ఏదో గొణిగింది ఆమె.
నెమ్మదిగా ఆమె చేతుల మధ్య నుండి తన చేతిని తప్పించి వెనక్కి వచ్చేసింది.
ఇప్పుడు ఆమె ఏమన్నా ఆమె చేసిన గుండె గాయపు మరక తొలగిపోతుందా

ఎదిగే వయసులోని విద్యార్థులకు సెక్యులరిజం గూర్చి బోధించాల్సిన వృత్తిలో ఉన్నవాళ్లే తమ తమ వివక్షతలను బయట పెట్టుకుంటే విద్యార్థులు ఏం నేర్చుకుంటారు ,?

ఒక వ్యక్తిని కులం బట్టి కాకుండా గుణాన్ని బట్టి ప్రవర్తనాన్ని బట్టి గుర్తించే రోజు ఇంకా ఇంకా రోజురోజుకీ దూరం అవుతూనే ఉంది .

అప్రయత్నం గానే ఓ గాఢమైన
నిట్టూర్పు విడిచింది అరుంధతి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిజాలు- ఇజాలు – Hypocrisy

శరన్నవరాత్రుల విశిష్టత