నులివెచ్చని గ్రీష్మం

ధారావాహికం -14వ భాగం

జరిగిన కథ:

పిల్లల కోరిక మీద అమెరికా వచ్చిన, సుభద్ర, అర్జున్ లు కొడుకు ఇల్లు మినియాపోలీస్ నుంచి కూతురు దగ్గరకు అట్లాంటా వస్తారు. మనవడు, మనవరాలు, అల్లుడు కలిసి ఫర్నీచర్ అసెంబుల్ చేసుకోవటము వారికి ఆశ్చర్యం కలిగిస్తుంది. కూతురు ప్లంబింగ్ పనులు కూడా చేసుకుంటుందని, పిల్లలకు ఎవరి మీదా ఆధారపడకుండా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటము నేర్పిస్తున్నామని స్పూర్తి చెపితే మంచిపని చేస్తున్నారని మెచ్చుకుంటాడు అర్జున్.

ఇక చదవండి…

ఇంటికి వెళ్లే టైం అయింది అనుకుంటూ వడివడిగా వెళ్తున్న సూర్యుడు ఏదో కోలాహలం వినిపిస్తోందని కిందికి తొంగి చూశాడు. అది ఒక కాలనీ. ఆ కాలనీ చివర ఉన్న ఖాళీ స్థలంలో  చాలామంది మగవాళ్ళు, ఆడవాళ్లు, పిల్లలు ఉన్నారు. అక్కడ అక్కడ కుర్చీ లేసి ఉన్నాయి మగవాళ్ళంతా చేతులలో గ్లాసులు పట్టుకొని ఒక పక్కగా నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఆడవారంతా వేసి ఉన్న కుర్చీలలో  కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అమ్మాయిలు,అబ్బాయిలు ఓ పక్కగా వేసిన బల్లమీద గిన్నెలలో వంటకాలు కబుర్లు చెప్పుకుంటూ సర్దుతున్నారు. పిల్లలు గంతులు వేస్తూ, గోలగోలగా అరుస్తూ  ఆడుకుంటున్నారు. సన్నగా పక్కన పెట్టి ఉన్న మ్యూజిక్ సిస్టం నుంచి సంగీతం ఆహ్లాదంగా వినిపిస్తోంది. ఈ కాలనీవాళ్ళు పార్టీ చేసుకుంటున్నట్లున్నారు అనుకొని, పశ్చిమాద్రికి తన ప్రయాణం కొనసాగించాడు సూరయ్య!

“మొత్తానికి దుమ్ము రేపేస్తోంది కమలాహారిస్” అన్నాడు రంగారావు.

“అవునండి రావుగారు కమలా హరీస్ కి మద్దతు ఇస్తున్న వాళ్ళ చెల్లెలు మాయా హరీస్ కూడా చాలా బాగా మాట్లాడుతోంది. ఆమె ‘మా అమ్మ స్వయం  నిర్ణయాధికార శక్తి మాకు స్ఫూర్తి. మేము  స్వతంత్రంగా ముందడుగు వేయటములో ఆమె పాత్ర ఉంది ‘ అంటూ భావోద్రకంతో చేసే ప్రసంగాలు, రాజకీయ విమర్శల కంటే కూడా ఎక్కువగా ఓటర్ల్ పైన బలమైన ప్రభావం చూపిస్తున్నాయి. ఆ నేర్పే అక్కకు కీ అడ్వైజర్ ను చేసింది” మెచ్చుకోలుగా అన్నాడు అర్జున్.

“ట్రంప్ అడ్వైజర్ తులసి కూడా తక్కువదేమీ కాదండోయ్. చాలా మాటకారి. వాళ్ళ అమ్మ, కరోల్ పోర్టర్ కు హిందూమతం అంటే ఆసక్తి అట. అందుకే హిందూమతాన్ని స్వీకరించిందట. కూతురుకు తులసి అని పేరు ఆవిడే పెట్టిందిట. తులసికి చిన్నప్పటి నుంచే భగవద్గీత శ్లోకాలను నేర్పించిందట” అన్నాడు రామారావు.

“అయినా ఈ సారి డిబేట్ లో ట్రంప్ వెనుదిరిగాడుగా” అప్పుడే అటుగా వచ్చిన జాన్అన్నాడు.

చాలా ఉత్సాహంగా సాగిపోతున్నాయి చర్చలు.

అప్పుడే చేసిన పకోడీలను హాట్ బాక్స్ లో పెట్టుకొని వచ్చింది సుభద్ర. వేడివేడి పకోడీలు అంటూ అందరికీ సర్వ్ చేస్తోంది.

“అమ్మమ్మా మాకూ…” అంటూ ఒక అయిదేళ్ళపాప చేయి పట్టుకొని వచ్చింది సౌమ్య. సౌమ్యకు పకోడీలు ఇస్తూ”ఎవరీపాప” అడిగింది.

“ఈ పాప పేరు రియా. అదో వాళ్ళ బామ్మ అక్కడ ఉంది. చూపిస్తానురా”చేయి పట్టి లాగుతూ అంది సౌమ్య.

అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్న అమెరికన్ ఆవిడ దగ్గరకుతీసుకెళ్ళి, “మై గ్రానీ” అని పరిచయం చేసింది సౌమ్య.

హాయ్ అంటూ చేయి జాపింది.

“నా పేరు జూలీ.  ఆ ఇంట్లో ఉంటాను” అని ఎదురు ఇల్లు చూపించింది.

“హాయ్. నా పేరు సుభద్ర. సుభా అని పిలవచ్చు” పరిచయం చేసుకుంది జూలీ చేతిని అందుకుంటూ సుభద్ర.

“మీ సౌ,ది చాలా ఫ్రెండ్లీ నేచర్. మా రియాను బాగా ఆడించుకుంటుంది” అన్నది జూలీ.

“రియా మీ మనవరాలా?” అడిగింది సుభద్ర.

“అవును మా అబ్బాయి కూతురు. మా అబ్బాయి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. రియా కొన్ని రోజులు, అమ్మ దగ్గర, కొన్ని రోజులు నాన్న దగ్గర ఉంటుంది. నాన్న దగ్గరకు వచ్చినప్పుడు వీకెండ్స్ లలో, అతను పని మీద వేర ఊరికి వెళ్ళినప్పుడు నా దగ్గర దింపుతాడు మా అబ్బాయి. రియాకు కూడా నేనంటే చాలా ఇష్టం. అసలు నా దగ్గరే ఉంచుకుందామనుకుంటాను. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. నా దగ్గర ఉన్నప్పుడు సౌ వచ్చి ఆడుకోవటానికి తీసుకెళుతుంటుంది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు, ఎప్పుడైయినా మధ్యాహ్నం మా ఇంటికి రండి” చెప్పింది జూలీ.

ఒక్కసారిగా పెద్దగా వినిపించిన మ్యూజిక్ శబ్ధానికి అందరూ అటు తిరిగారు. మైక్ చేతిలోకి తీసుకొని “అందరూ డిన్నర్ కు రండి. వేడివేడి పదార్థాలు నోరూరిస్తున్నాయి” అని అనౌన్స్ చేసాడు లియాం.

అందంగా అలంకరించి, వేడివేడిగా ఉన్న పదార్ధాల వైపు నడిచారు అందరూ. డిన్నర్ తరువాత కాసేపు డాన్స్ చేసారు. ఆటపాటలతో అలిసిపోయి, నిద్రకు జోగుతున్న పిల్లలను భుజాన వేసుకొని, ఇళ్ళకు బయలుదేరారు అందరూ.

“ఆ ఎదురుగా ఉన్న కాలనీ లో చాలా మంది తెలుగువాళ్ళు, ఇండియన్స్ ఉన్నారు. పిల్లలకు సెలవలున్నన్ని రోజులూ, ఉదయము పిల్లలను తీసుకొని అక్కడి వెళ్ళాము. అక్కడ చిన్న పార్క్ కూడా ఉంది. పిల్లలు అక్కడ ఆడుకుంటుంటే, మేము ఆ బెంచెస్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళము. సాయంకాలం, పని ఉండదు కాబట్టి ఆడవారు కూడా వచ్చేవారు. ఇక ఇప్పుడు పిల్లలకు స్కూల్స్ మొదలయ్యాయి కదా పొద్దున పూట వెళ్ళటం లేదు. సాయంకాలమే మేమిద్దరమూ పిల్లలను తీసుకొని వెళుతున్నాము. ఇక్కడ బయట రోడ్ మీద తిరగటానికి వాకింగ్ పాత్ లేదు. అందుకని వాకింగ్ చేయటం కష్టం. అందుకే ఆ కాలనీలోకి, ఇక్కడికీ తిరుగుతుంటాము. మీరిద్దరు కూడా రండి” అన్నాడు రంగారావు.

“అవునట. ఇక్కడ బయట వాకింగ్ చేయలేమనే మా అమ్మాయి వై (YMCA)  లో మెంబర్షిప్ తీసుకుంది. అయినా రోజూ వెళ్ళలేము కదా. వస్తాము. అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారని మా అమ్మాయి కూడా చెప్పింది” అన్నాడు అర్జున్.

“అవునండి. కొన్ని కాలనీస్ లలో అయితే దాదాపు అదరూ ఇండియన్స్ నే ఉంటారు. మన పండుగలు కలిసి చేసుకుంటారు. ఇప్పుడు దీపావళి కి పర్మిషన్ ఇచ్చారు. కదా ఇక దీపాలు పెడతారు. టపాకాయలు మ్రోగిపోతుంటాయి. పూజలూ, వ్రతాలు కూడా చేసుకుంటుంటారు. పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఖర్చు తక్కువ అవుతుందని, ఇండియాకు వెళ్ళకుండా ఇక్కడే చేసేస్తున్నారు. ఇప్పుడు మన ఇండియాకి, అమెరికాకు బేధమే లేదనుకోండి. మంచి ఇండియన్ రెస్టారెంట్స్కూడా ఉన్నాయి. మంచి భోజనమే దొరుకుతుంది. మేము అప్పుడప్పుడు వెళుతుంటాము. ఆ ఎదురు కాలనీలోనే ఒకావిడ మన ఇండియన్ స్వీట్స్ చేసి అమ్ముతుంది. అసలు అట్లాంటా అయితే రెండో ఇండియానే అనుకోండి” అన్నాడు రామారావు.

“దేవాలయాలల్లో కూడా కార్యక్రమాలు బాగా జరుపుతుంటారు. పెద్దపెద్ద దేవాలయాలు కూడా ఉన్నాయి. చాలా బాగుంటాయి చూడటానికి.  మనకు దగ్గరలోనే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మాల్స్ కూడా పెద్దపెద్దవి బాగుంటాయి. కొంచం దూరం వెళుతే పాతకాలం ఇళ్ళు చాలా అందంగా ఉంటాయి. చూసేందుకు చాలా స్థలాలు ఉన్నాయి” అన్నాడు రంగారావు.

“డాడీ నేను వీడిని తీసుకెళుతాను. ఇటివ్వండి. మీరూ తొందరగా వచ్చేయండి. ఈ మధ్య ఇక్కడ పాములను చూసామని గ్రూప్ లో ఎవరో పెట్టారు. జాగ్రత్త” హెచ్చరించి కొడుకును రామారావు భుజం మీద నుంచి తీసుకొని వెళ్ళాడు కిశోర్.

“అవునా? అయినా ఇక్కడి పాములు ఏమీ చేయవని మా అబ్బాయి చెప్పాడు” అన్నాడు అర్జున్.

“లేదండి, మినియాపోలీస్ లో అయితే ఏమీ చేయవేమో కానీ, ఇక్కడివి మటుకు పాయిజన్ స్నేక్స్ అట. ఆ మధ్య మా తమ్ముడి కొడుకు చెప్పాడు. అందుకే వాళ్ళు ఇంటి చుట్టూ ఫెన్సింగ్ లో పాములు రాకుండా ఏదో వైర్ లాంటిది పెట్టించుకున్నామనిచెప్పాడు. వాళ్ళ కాలనీలోనే ఒకరి ఇంట్లో ఏమిటో చప్పుడు వస్తోందని, అటక మీద చూస్తే ఒక పాము సకుంటుంబసపరివారంగా ఉందిట” నవ్వుతూ  అన్నాడు రంగారావు.

“బాబోయ్. అలాగవుతే మనం ఎందుకు ఇక్కడ నిలబడటము. పదండి వెళుదాము” రామారావు అనటం తో అందరూ ఇంటి వైపు నడిచారు.

***

“బ్రేక్ ఫాస్ట్ ఏమి చేయను?” స్పూర్తిని అడిగింది సుభద్ర.

“ఇడ్లీ పిండి ఉంది. వేసేస్తానమ్మా. పిల్లలు స్కూల్ కు వెళ్ళాక, నాకు పదింటికి మీటింగ్ ఉంది, అది అయ్యాక మిమ్మలిని సీనియర్ సెంటర్ కు తీసుకెళుతాను అంది స్పూర్తి, ఫ్రిడ్జ్ లో నుంచి ఇడ్లీ పిండి తీస్తూ.

“నువ్వెళ్ళి పిల్లల పని, నీ పని చూసుకో.నేను చేసేస్తాను. వంట కూడా చేస్తాను. నాకు ఇక్కడ పనులు  అలవాటు అయ్యాయిలే” అంటూ కూతురి చేతి లో నుంచి ఇడ్లీ పిండి తీసుకుంటూ అంది సుభద్ర.

పిండి అమ్మకు ఇచ్చి, పిల్లల దగ్గరకు వెళుతున్న స్పూర్తి, గ్యారేజ్ తలుపు తీసి ఉండటం చూసి, ఎవరు తీసారూ అనుకుంటూ తలుపు వేద్దామని వచ్చింది. గ్యారేజ్ లో టేబుల్, కుర్చీ అసెంబుల్ చేసాక, పడి ఉన్న ఖాళీ అట్టపెట్టలను అన్నిటినీ తీసి పైకి పెడుతున్న అర్జున్ కనిపించాడు.

“ఎందుకు డాడీ అవన్నీ తీస్తున్నావు? ఉండనీయి తరువాత సద్దుకుంటాము” అంది స్పూర్తి.

“నేను ఖాళీగా ఉన్నాను కాదా! అయినా ఖాళీగా కూర్చుంటే నాకు తోచదు” ఒకదానిలో ఒక పెట్టెపెట్టి పైకి పెడుతూ అన్నాడు అర్జున్.

“పదింటికి నా మీటింగ్ అయ్యాక మిమ్మలిని సీనియర్ సెంటర్ కు తీసుకెళుతాను. అవి వదిలేయి. తయారవ్వు” అంది స్పూర్తి.

“ఇదో అయిపోయింది. ఈ కాస్త చెత్త ఊడ్చేసి, శుభ్రం చేసి వెళుతాను. ఎంతసేపటిలో వస్తా? నీ పని కానీయ్” అన్నాడు చెత్తంతా దగ్గరికి తీస్తూ అర్జున్.

ఇక తండ్రి వినడని నీ ఇష్ఠం అంటూ లోపలికి వెళ్ళింది.

పిల్లలతో గేట్ వరకూ వెళ్ళి, వాళ్ళు స్కూల్ బస్ ఎక్కాక, లోపలికి వెళ్ళాడు అర్జున్.

***

“వీళ్ళు మా పేరెంట్స్. ఇక్కడ సీనియర్ సెంటర్ లో చేరాలని వచ్చారు” రిసెప్షనిస్ట్ తో అంది స్పూర్తి.

“ఓ వెరీ నైస్” అంటూ అక్కడే ఉన్న ఒక పెద్దావిడతో, “ఎలిజా వీళ్ళను తీసుకెళ్ళి మన సెంటర్ చూపించు” అంది రిసెప్షనిస్ట్.

హాయ్ అని వాళ్ళను తీసుకెళ్ళి అంతా చూపించింది ఎలిజా. ఈ సెంటర్ మినసోటా సెంటర్ కన్నా పెద్దగా ఉంది. మెంబర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఆక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి. చుట్టూ తోట, ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంది. పక్కనే పెద్ద లైబ్రరీ బిల్డింగ్ ఉంది. అంతా చూపించి, వాళ్ళను రిసెప్షనిస్ట్ దగ్గర వదిలి వెళ్ళింది ఎలిజా.

“సంవత్సర చందా 60$” అంది రిసెప్షనిస్ట్ ఒక్ బుక్లెట్ తీసి ఇస్తూ.

అర్జున్ వారిస్తున్నా వినకుండా 120$ కట్టింది స్పూర్తి.

అక్కడికి సీనియర్స్ ను తీసుకు వచ్చే, కాబ్, బస్ ల బ్రోచర్ కూడా ఇచ్చింది. అది కూడా తీసుకొని, “రేపు దీని విషయము చూద్దాము. ఈరోజు నేను కానీ విజయ్ కానీ వచ్చి తీసుకెళతాము” అని చెప్పి వెళ్ళిపోయింది స్పూర్తి.

(సశేషం)

 

 

 

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“నేటి భారతీయమ్”

ఆర్మీ వీరుడు