చాలామంది తల్లిదండ్రులు మా పిల్ల/ పిల్లవాడిని మేము చాలా ముద్దుగా పెంచామండి. చాలా సెన్సిటివ్ అండి. ఏ చిన్న కష్టమొచ్చినా తట్టుకోలేడని చాలా గొప్పగా చెప్తుంటారు. ఆ రకంగా చెయ్యడంలో, తెలియకుండానే పిల్లల భవిష్యత్తును మనమే నాశనం చేస్తున్నామనే విషయాన్ని చాలామంది తల్లిదండ్రులు గ్రహించరు. పిల్లలను ముద్దు చెయ్యడమంటే వారు చెప్పిన ప్రతి దానికీ తల వూపడం, వారు అడిగిందల్లా కొని పెట్టడం, వారు యేమి చెయ్యమంటే అది చెయ్యడం మాత్రమే కాదన్న విషయం తల్లిదండ్రులు బాగా గుర్తు పెట్టుకోవాలి.
ముద్దు చెయ్యడమంటే వాళ్ళ అవసరాలను తీర్చడం, వారికి మనమున్నామన్న నమ్మకాన్ని కలిగించడం, వారికి అవసరమైనది సమకూర్చగలమన్న భరోసానివ్వడం, క్లిష్ట సమయాల్లో మనము వాళ్ళకు అండగా వుంటామనే ధైర్యాన్నివ్వడం… అదీ ముద్దు చెయ్యడమంటే.
ఇంకొక విషయం… చాలామంది తల్లిదండ్రులు కొనగలిగే స్థితిలో వున్నాము కాబట్టి, పిల్లలడిగిన ప్రతి వస్తువూ కొంటారు. అదే ముద్దు చెయ్యడమని అనుకుంటారు. వాళ్లకది అవసరమా కాదా అని ఆలోచించరు. ఆ రకంగా చెయ్యడంలో పిల్లలకు… మేమేదడిగినా, మా అమ్మానాన్నలు చేస్తారనే తప్పుడు సంకేతాలను, పిల్లల్లో కలిగిస్తున్నామనే విషయాన్ని చాలామంది పెద్దలు గ్రహించడం లేదు. రేపు పెద్దయ్యాక, వాళ్లడిగినది యివ్వకపోతే, వాళ్లు చెప్పినట్లు చెయ్యకపోతే, వాళ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలను ఒకపక్క చూస్తూనే వున్నాం. ఐనా, మన పిల్లలు అలా చెయ్యరులే అనుకుంటూ వుంటాం.
అలా కాకుండా ఆ వస్తువు పిల్లలకు ఎంత అవసరమో వాళ్లనే నిర్ణయించుకోమని, వాళ్ల ఆలోచనలను ప్రోత్సహిస్తే, అది వాళ్లకు మంచి, చెడులను నిర్ణయించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. వాళ్లే నిర్ణయించుకుని కొంటే, ఆ వస్తువుని వాళ్ళు సక్రమంగా వినియోగిస్తారు. ఇది జీవితంలో ప్రతి విషయానికి కూడా వర్తిస్తుంది. నిర్ణయాన్ని వారికి వదిలే ముందు, వారి ఆలోచనలు సక్రమమైన మార్గంలో వున్నాయనే విషయాన్ని మనం ధృవీకరించుకోగలగాలి. వాళ్ల ఆలోచనలు సక్రమంగా లేకుంటే, సరిదిద్దాలి.
అలాగే పరిమితిని మించి దేనినీ ఖర్చు చెయ్యరాదని, ఖర్చు చేసే విషయంలో అది అవసరమో, కాదో, వాళ్లే బాగా నిర్ణయించుకోవాలని, అనవసరంగా చేసే ఖర్చు యేదైనా వాళ్లు వనరులను వ్యర్థం చేస్తున్నారనే విషయం పిల్లలకు చిన్నప్పటినుండి గ్రాహ్యమయ్యేలా చెప్పగలగాలి. అలా చేసినప్పుడు యే పనన్నా చెయ్యాలంటే, ఒకటికి పది సార్లు ఆలోచించి మరీ చేస్తారు. అలా పిల్లలు ఆలోచించినప్పుడు భవిష్యత్తులో వాళ్లెలా వుంటారోనన్న చింతన లేకుండా తల్లిదండ్రులు హాయిగా వుండగలుగుతారు. సమాజానికి మంచి పౌరులను అందించిన వాళ్లవుతారు. మా పిల్లలెప్పుడూ తప్పు చెయ్యరన్న ధైర్యంతో వుండగలుగుతారు.
మరెందుకాలస్యం! రండి. పిల్లల ఆలోచనలు పరిణతి చెందేందుకు కావలసిన ముద్దును వారికందిద్దాం.
*