సాహిత్యం జీవితాన్ని ప్రజ్వలనం చేస్తుంది.వ్యక్తిత్వ వికాసం కలిగిస్తుంది. చదువు సంస్కారాల విలువను తెలియజేస్తుంది. గొడవర్తి సంధ్య గారి పరిచయం ప్రథమం గా ఉపాధ్యాయినిగానే ! హైదరాబాద్ రామ్ కోటి , కింగ్ కోటి ల దగ్గర ఉన్న సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో మేం కొలీగ్స్ మి. తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా కూడా వారు విధులు నిర్వహించారు.
కానీ నాకు పరిచయం అయిన కొద్ది రోజుల్లోనే తెలిసింది ఆమె కవయిత్రి రచయిత్రి అని.
ఆమె సాధన నరసింహాచార్యులు గారి అర్ధాంగి అని. ” సాధన ” అనగానే సాహిత్య సంస్థగా నరసింహాచార్యులు గారికి పేరు. వీరి అర్థాంగి గా అడుగడుగున ఆయన కి సంపూర్ణ సహకారాలు అందిస్తూ సాహిత్య సభలలో వెన్నుదన్నుగా నిలిచారు సంధ్య గారు. కవిత్వం లో అందెవేసిన చేయి సంధ్య గారి ది అని వారి కవిత్వం వింటే తెలుస్తుంది. కొన్ని సభా వేదిక ల మీద కవి సమ్మేళనం లో కవిత చదవగానే నేను దగ్గర గా వెళ్లి అభినందనలు తెలిపేదాన్ని. ఎన్నో సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు ఈ దంపతులు. హైదరాబాద్ లోని చాలా పాఠశాల లో పద్య పఠన పోటీ, వ్యాస రచన పోటీలు వంటివి పెట్టి తెలుగు భాష కోసం పాటుపడిన జంట.
సంధ్య గారి తల్లిదండ్రులుకీ.శే.భాగ్యలక్ష్మి తెలికిచర్ల కృష్ణ మూర్తి గారు.
సంధ్య గారి ఆడపడుచు వైదేహి నేను ఒకే సంవత్సరంలో తెలుగు ఉపాధ్యాయులుగా చేరాం. మాకన్నా సంధ్య గారు సీనియర్. తర్వాత కాలంలో
సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేశారు.
పుస్తకపఠనం ఎంత ఇష్టపడేవారో రచనాసేద్యం అంతే ఇష్టపడేవారు. స్కూల్ లో పిల్లలతో నాటకాలు వేయించేవారు. అవసరార్థం నాటకాలు కూడా అప్పుడే రాసేవారు. “పోతన చరిత్ర “, “కథా భారతం ” సంధ్య గారి ప్రసిద్ధ ముద్రితగ్రంథాలు.
దూరదర్శన్ ఆకాశవాణి ల లో ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరుమలతిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ లో ప్రవచనాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. త్యాగరాయ గాన సభ లో ఎన్నో కవి సమ్మేళనాలలో కవితా పఠనం చేశారు. ఎన్నో అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు, కార్యక్రమాలు నిర్వహించారు. సాహితీ సమీక్షకురాలిగా మన్ననలందారు. సంధ్య గారి కి ప్రాచీన సాహిత్యం అంటే ఎంత ఇష్టమో ఆధునిక సాహిత్య మంటే కూడా అంతే ఇష్టం. తాము చదివిన సాహిత్యం అందరికీ పంచటంలోనే ఆనందం అనేవారు.
ప్రతి ఏటా పాఠశాల వార్షికోత్సవం లో సంధ్య గారు, మరో సీనియర్ తెలుగు ఉపాధ్యాయుని రచయిత్రి కొమండూరి అరుంధతి గారు కలిసి నాటకాలు వేయించేవాళ్ళు . తోటి తెలుగు ఉపాధ్యాయులుగా మేమందరం సహాయపడేవాళ్ళం. ఒక సంవత్సరం ” పుష్ప విలాపం” టాబ్లో ను అద్భుతంగా వేయించారు.
వానమామలై వరదాచార్యులు గారు రచించిన
“పోతనచరిత్ర” ను తేట తెలుగు వచనం లో సంధ్య గారు రాసిన పుస్తకం ప్రశంసలు అందుకుంది. పోతనపై తనకు ప్రత్యేక అభిమానం కల్గటానికి కారణం కీ.శే.బ్రహ్మశ్రీ మల్లంపల్లి పరమేశ్వర శర్మగారు అనీ, రాజమండ్రిలో స్థానం ప్రాచ్య కళాశాల లో ఆయన చెప్పిన పాఠాలు “పోతన చరిత్ర” ను రాయడానికి కారణం అని అనేవారు.
శ్రీవానమామలై వరదాచార్యులు గారి కావ్యంలోని అందాలను సులభశైలిలో తేట తెలుగులో రాసి భర్త ప్రోత్సాహంతో వచనంగా ” పోతన చరిత్ర” తో రాసారు. కవయిత్రి గా రచయిత్రి గా ప్రసిద్ధి కెక్కిన సంధ్యగారు ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇద్దరి కవితలను ఒక కవితా సంపుటి గా ప్రచురించారు కూడా. గొడవర్తి సంధ్య గారు గా సాహితీ లోకంలో పేరు పొందినా, మాకు నర్సమాంబ గారు గానే చాలా దగ్గర. నర్సమాంబగారు మంచి స్నేహశీలి.
ఈ మధ్య కాలంలో నేను నడుపుతున్న అంతర్జాల పత్రిక” మయూఖ” లోనూ సంధ్య గారి వ్యాసం ప్రచురించాను.
దాదాపు 25 ఏళ్ల క్రితం సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో సంధ్య గారి తో పరిచయం. అప్పటి నుండి ఆ సాధన నర్సింహా చార్యులు గారి తో మాకు అంటే నా భర్త కొండపల్లి వేణుగోపాల్ రావు గారి కీ నాకూ పరిచయం. ఒక కవయిత్రి గా, ఒక కవిగా ఈ దంపతులు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టే ఉండేవాళ్ళు. కూకట్ పల్లిలో లో వారి ఇల్లు సాహితీ వేత్తలనిలయం.వీళ్ళ ఏకైక కుమారుడు చిరంజీవి సాయిమానస్ ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు.
గొడవర్తి సంధ్య గారు నువ్వు ముఖం తో , మంచి మాట లతో స్నేహశీలి గా మా హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
వారి కిదే తరుణి పత్రిక సంపాదకురలిగా, స్నేహితురాలిగా నా శ్రద్ధాంజలి.