నీలాంబరి వంట గదిలోకి వెళ్లి చక్కని పాయసం చేసింది… అమ్మ ఏం చేస్తుందిఅని వెనకే వచ్చిన సాగర్ కి పాయసం చేస్తున్న నీలాంబరిని చూసి “ఇప్పుడేం చేస్తున్నావమ్మా మహేశ్వరి వంట చేసి వెళ్ళింది కదా!” అన్నాడు.
” ఇంతటి శుభవార్త విన్న తర్వాత నోరు తీపి చేసుకోకుండా ఎలా ఉంటాం! అందుకే పాయసం చేస్తున్నాను.. నాకు ఇప్పుడు వంటలు పర్ఫెక్ట్ గా వచ్చులే భయపడకు” అన్నది నవ్వుతూ నీలాంబరి.
” అదేంటమ్మా ఎన్నోసార్లు మా కోసం ఏదో ఒకటి చేసి పెట్టే దానివి కదా! నీవంట నాకు ఇష్టమేలే .ఇప్పుడు నీకు తోడుగా సౌదామిని వచ్చింది తను కూడా చక్కని వంటలు చేస్తుంది కదా! మీ ఇద్దరి వంటలు తిని మేము ఒళ్ళు పెంచుకుంటామేమో” అన్నాడు నవ్వుతూ సాగర్.
” సాగర్ నీకో మాట చెప్పనా! నేను సౌదామిని చూసిన మొదటి రోజే ఆఅమ్మాయి అంటే నాకు చాలా నచ్చింది ఈ ఇంటి కోడలు అయితే బాగుండు అనిపించింది దేవుడు నాకోర్కె విన్నాడేమో అందుకే ఈవరం ప్రసాదించాడు” అన్నది నీలాంబరి.
నీలాంబరి భుజాల చుట్టూ చేతులు వేసిన సాగర్ “అవునమ్మా! తనది మంచి మనసు.. తనను చూసిన మొదటి నుండి నాకు ఆమెలో నువ్వే కనిపించావు ఆ వ్యక్తిత్వం కానీ ఆమాట తీరు కానీ అచ్చం నీలాగే ఉంటుంది మన ఇంట్లో ఇమిడిపోగలదని అనిపించింది రేపటి తరంకి తను ఆదర్శంగా ఉంటుందని నాకు చాలా నమ్మకంగా ఉంది నీకు నచ్చినందుకు చాలా థాంక్స్ అమ్మా” అన్నాడు సాగర్.
ఇంతలో వంట గదిలో సాగర్ నీలాంబరి ఏం చేస్తున్నారో చూడటానికి వచ్చింది సౌదామిని…
” మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు” అంటూ లోపలికి వచ్చింది.
” ఏమీ లేదు మేడం.. డాక్టర్ గారి కోసం మా అమ్మ పాయసం తయారు చేస్తుంది” అన్నాడు సాగర్ నవ్వుతూ..
” ఈరాత్రి పాయసం ఎందుకు అత్తయ్య మనమందరం రాత్రి తేలికపాటి భోజనమే చేస్తాం కదా” అన్నది నీలాంబరి.
” నువ్వు కోరి నా ఇంటి కోడలిగా వస్తానని చెప్పిన తర్వాత నేను నీకు తీపి తినిపించ వద్దా! అందులో నా మనసులో ఉన్న కోరిక కూడా తీరబోతుంది కదా! నాకు నచ్చిన నేను మెచ్చిన కోడలివి కాబోతున్నావు అందుకనే రా పాయసం చేస్తున్నాను” అన్నది నవ్వుతూ నీలాంబరి.
నీలాంబరి దగ్గరికి వచ్చిన సౌదామిని నీలాంబరిని గట్టిగా హత్తుకుంది…
” అత్తయ్యా! మా పెళ్ళికి మీరు ఒప్పుకుంటారో లేదో అని అనుకున్నాను కానీ ఇంత సంతోషంగా ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను కూడా మిమ్మల్ని చూసిన మొదటి క్షణం లోనే నాకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది ఇంతటి చక్కని భావాలు కలిగిన మీలాంటి వారి దగ్గర డాక్టర్ గా పని చేస్తాను అనుకున్నాను కానీ మీ ఇంట్లోనే మీపక్కనే మీ కోడలుగా ఉంటానని ఊహించలేదు థాంక్యూ అత్తయ్యా!” అన్నది సౌదామిని.
” నీలాంటి అమ్మాయిని ఒప్పుకోకపోవడమా! ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ నీలాంటి కోడలు దొరుకుతుందా!” అని సౌదామిని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది నీలాంబరి.
ఎప్పుడూ వంటగదిలోకి రాని భూపతి కూడా లోపలికి వచ్చి ఏంటి మీటింగ్ అంతా కిచెన్ లోనే పెట్టారా !నాతో కూడా చెప్తే నేను కూడా మీతో పాటు సంతోషపడతాను కదా నన్ను ఒక్కడినే అక్కడ కూర్చోబెట్టి మీరంతా కిచెన్ లోకి వచ్చారా” అన్నాడు కొంచెం కోపం నటిస్తూ..
” అయ్యయ్యో భూపతి దొరగారూ! అలాంటిదేం లేదండి పాయసం చేద్దామని నేను వచ్చాను నా వెనక మీ కొడుకూ కోడలు వచ్చారు” అని నవ్వుతూ భూపతితో పాటు బయటకు వచ్చింది నీలాంబరి.
అందరికీ టేబుల్ మీద ప్లేట్స్ పెట్టి చపాతి ఆలు టమాటో కూర వడ్డించింది సౌదామిని. చిన్న గిన్నెలో అందరికీ పాయసం పోసి టేబుల్ మీద పెట్టి అందరిని తినడానికి పిలిచింది..
నలుగురు కూర్చుని సంభాషించుకుంటూ భోజనం చేశారు…
” పాయసం చాలా బాగా చేశారు అత్తయ్యా!” అన్నది సౌదామిని.
” మాఅమ్మ అమెరికా వెళ్ళినప్పటి నుండి వంటింట్లో దాడి చేస్తుంది లే” అన్నాడు సాగర్.
” నిజమేరా సాగర్ ఈమాట నేను అందామంటే మీ అమ్మని చూసి భయమేసి అనకుండా ఊరుకున్నాను, ఈమధ్య ఎప్పుడు చూసినా వంట గదిలో ఏదో ఒకటి చేస్తూనే ఉంది” అన్నాడు భూపతి.
” అదేంటి మీరిద్దరూ అలా అంటారు అత్తయ్య ఇంత బాగా చేస్తుంటే” అన్నది సౌదామిని.
” నాన్నా! వాళ్ళిద్దరూ ఒకటై పోయారు ఇక మనం జాగ్రత్తగా ఉండాల్సిందే” అన్నాడు సాగర్.
అంతా గమనిస్తున్న నీలాంబరి..
” ఇకముందు నన్నేమైనా అంటే మీఆటలు సాగవు నాకోడలు సౌదామిని నాకు తోడుగా ఉంది.. ఏంట్రా నా వంటలు బాగుండావా చెప్తా నీ పని” అంది నవ్వుతూ నీలాంబరి.
అలా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు కూర్చున్నారు..
తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి పడుకున్నారు… సాగర్ మరియు సౌదామిని ఎన్నో తీయని ఊహలు ఊహించుకుంటూ నిద్రపోకుండా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉన్నారు… కిటికీలో నుండి తొంగి చూస్తున్న చందమామ వీరిద్దరిని చూసి ముచ్చటైన జంటనే అని అనుకుంది..
వీరిద్దరికేమో వెన్నెలే వేడి సెగలా తోస్తుంది…
మరొక వారం తర్వాత సాగర్ అమెరికాకి వెళ్ళిపోయాడు…
తొందరలోనే తిరిగి వస్తారని చెప్పాడు… నీలాంబరి భూపతి అతను ఇక్కడే ఉంటాడని తెలిసి ఎంతో సంతోషపడ్డారు..
సౌదామిని మాత్రం ఈ కొన్ని రోజులు కూడా అతన్ని వదిలి ఉండడం కష్టమే అని బాధపడింది…
ఇద్దరు వీడ్కోలు చెప్పుకొని మళ్ళీ త్వరగా కలుసుకోవడానికి ఏర్పాటు చేసుకుంటామని భాస చేసుకున్నారు…
ఇంకా ఉంది