వృక్షమాత

కవిత

మట్టిలోని సారమో సాగునీటి సదుపాయమో
పెరటి మొక్క లిప్తపాటులో కొమ్మలు రెమ్మలతో
పచ్చని పందిరై కనువిందు చేసింది
రెప్పపాటులోనే రెమ్మరెమ్మకో పంచవన్నెల రామచిలుక పువ్వై విరిసింది
ఆకు – పసరై బెరడు – కషాయమై వేరు –
చూర్ణమైన ఆమూలాగ్ర ఆరోగ్యప్రదాయిని
మానవాళికి ప్రాణవాయువు నందించే ఊపిరియంత్రం
సాధుజంతుల పాలిటి కల్పవల్లి
నీకు నీడనిచ్చి నిన్ను సేదతీర్చే అమ్మ ఒడి
నీ గుండెకు బలమై నీ శ్వాసకు ఆయువుపట్టైన అపర ధన్వంతరి
ఏ పాడు గాలి సోకిందో
ఏ చీడపీడ తగిలిందో
అడవికి పచ్చని పరదాలు వేసి
నేలకు తివాచీలు పరిచి ఆహ్లాద పరిచిన పత్రహరితం
ఎందుకో వడలిపోతోంది
నేల కొరిగిన వృక్షమాత
అనావృష్టికి సూచిక
రేపటి క్షామానికి హెచ్చరిక
వృక్షో రక్షతి రక్షితః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్కతో ముచ్చట్లు -దిల్ ఖోల్కె….!!

అష్టాదశ శక్తిరూపిణులుగా- బొడ్డెమ్మ, బతుకమ్మ