మాటల చెట్టు అంటే చెట్టు మాట్లాడుతుందనా లేక…….? గడ్డం సులోచన గారు రచించిన కవితా సంపుటి ‘మాటల చెట్టు’ చూసినప్పుడు కలిగిన సందేహం ఇదే.
సహజంగా కథ లేదా కవితా సంపుటి ప్రచురించేటప్పుడు ఆ సంపుటిలోని ఏదో ఒక శీర్షికను పుస్తకానికి పేరు పేరు పెట్టడం రివాజు. అలాగే ఈ పుస్తకమూ ఏమో, ఈ పేరుతో ఓ కవిత ఉందేమో అనుకున్నాను. పుస్తకం మొత్తం చదివాక తెలిసింది మాటల చెట్టు అంటే మరేదో కాదు ఆ కవయిత్రే అని. ఒక చెట్టులోని ప్రతిభాగం మనిషికి ఎలా ఉపయోగపడుతుందో అదే విధంగా సులోచన గారి ఈ సంపుటిలోని కవితలన్నీ.
గడ్డం సులోచన గారి కవితలన్నీ ఒకటికి మించి మరొకటి భేష్ అనిపించేలా ఉన్నాయి. తన కవితలకు వస్తువు కోసం వెతుక్కోలేదు. నిత్య జీవితంలో మన చుట్టూ జరిగే సంఘటనలే. మట్టి, మనిషి, మనసు, అమ్మ, నాన్న,చేదబావి, స్నేహం, జీవితం, అక్షరం, పల్లె, కాదేదీ కవిత కనర్హం అన్నట్లు ఉంటాయి ఆ కవితలు.
మట్టి గురించి, మట్టి వాసన గురించి ఆమె రాసిన మట్టి – మనిషి అనే కవితలో
ఎంతకమ్మనిది ఈ మట్టి వాసన
సమస్త సుగంధ ద్రవ్యాల సారం
ఈ మట్టి గంధం
అంటూ మొదలెట్టి
మట్టిలోనే మనుగడ
మట్టిని ప్రేమించ లేకపోతే మనం మనుషులం ఎలా అవుతాము?
మన కణం కణం లోని మూలకణం మట్టే
మనం కలిసేది ఈ మట్టిలోనే
ఎంత నిగూఢమైన కవిత ఇది!
అలతి పదాలలో అనంతమైన జీవిత సారాన్ని చూపించారు ఈ కవితలో
మనిషి జీవితంలో మట్టి వాసన మమేకమైపోయింది అంటూ సులోచన గారు రాసిన ఈ కవిత మనల్ని మన మూలాల్లోకి తీసుకువెళ్తుంది.
అందమైన పంజరం అనే కవితలో ఆవిడ కమ్మని గొంతుతో కూస్తున్న కోయిలకు చెప్తోంది
పిలవద్దు మళ్లీ నన్ను
ఎందుకంటే నేనాడపిల్లను
హద్దులుంటాయి
అని చెప్తూనే ఈ హద్దులను ఏర్పరిచిన తల్లిదండ్రులను తోబుట్టువులను సమాజాన్ని ఆమె తప్పు పట్టలేదు
నాక్షేమం కోరి
స్వేచ్ఛను హరిస్తారు
లోకానికి భయపడి
ఎంత చక్కని వివరణ. ఆడపిల్లకు కొన్ని హద్దులు ఉండక తప్పదేమో. దానిని తప్పుగా భావించకుండా తన కోసమే ఈ ఏర్పాటు అనుకుంటే బాగుంటుంది కదూ!
అలా అని స్త్రీ స్వేచ్ఛగా ఉండక్కర్లేదు అని చెప్పరు. మరో కవితలో
నేను ఎదుగుతా- వికసిస్తా- ప్రకాశిస్తా !
ప్రపంచానికి విలువల వెలుగులు పంచుతా
నాకు కాస్త చేయూతనివ్వండి, అణగదొక్కకండి అంటూ ఆర్తితో చెప్తారు.
ఒక్కసారిగా రెక్కలు మొలిచి
అనంత ఆకాశంలోకి ఎగరాలని ఉంది
అంటూ ఆడపిల్లల మనసును ఆవిష్కరించారు. ‘కత్తులు దూస్తున్న కొమ్మలు’, ‘తిరగబడితే’ కవితలు కూడా స్త్రీ గొంతును ఎలుగెత్తి చాటాయి.
అభిజాత్యం! అహంకారం! అధికారం!
ఇంకా ఎన్నాళ్లు?
యుగాలు మారినా మారని భావజాలం!
అంటూ సమాజాన్ని ప్రశ్నించాయి.
ఇక సులోచన గారు తాను చిన్నవయసులో పెరిగిన గ్రామీణ వాతావరణం గురించి అక్కడి జీవనం గురించి ఎంతో రమ్యంగా కవితలు రచించారు. పల్లెటూర్లో ఒకనాడు మగవారికి రచ్చబండ ఎంత ముఖ్యమో ఆడవారికి
‘చేదురుబాయి’ అంతే ముఖ్యంగా ఉండేది. వీళ్ళ సమావేశాలు, సమాలోచనలు, కష్టసుఖాల కలబోతలు, ఓదార్పులు అన్నీ అక్కడే. అటువంటి అనుభూతులు నేడు కరువయ్యాయి అంటూ వాపోతారు ఆవిడ.
‘పల్లె పడతులు’ అనే కవితలో
ముద్దొచ్చే పొద్దు తిరుగుడు పూలు
నా పల్లె పడతలు
వారి శ్రమ జీవన సౌందర్యం
జాతికి జీవనము
అంటూ గ్రామీణ మహిళల గురించి ఎంతో అందంగా వర్ణించారు.
తాను రోజూ పయనించే ఒక ఆటో డ్రైవర్ ‘పెద్దులు’ గురించి, అతని వ్యక్తిత్వం గురించి
బాడీగార్డ్ లా భరోసాగా ఉంటాడు
పేరుకు తగ్గ పెద్ద మనసు
అరుదైన విలక్షణ వ్యక్తిత్వం
అంటూ రాయడం ఆవిడ పెద్దమనుసును తెలియజేస్తుంది.
ఇంకా కాళోజీ నారాయణరావు గారి గురించి, గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి, అంతరిస్తున్న నేటి బంధాలు అనుబంధాల గురించి ఆవిడ మనసు లోతుల్లోంచి వచ్చిన ప్రతి కవిత ఒక ఆణిముత్యమే అని చెప్పాలి. ఇలా రాస్తూ పోతే మీకు చదివేందుకు ఏమీ ఉండదు కదా! అందుకే ఈ ‘మాటలచెట్టుని’ తప్పక చదవండి. చక్కని పుస్తకం చదివిన అనుభూతిని మీరు పొందుతారు. ఇది సత్యం.
కానీ పుస్తకంలో ఆఖరి కవిత మిథునం గురించి చెప్పాల్సిందే!
భార్యాభర్తల జీవిత సారాన్ని మొత్తం ఈ పది పంక్తుల కవితలో ఎంత ఇంపుగా నింపారో. ఆ కవితను నేను వర్ణించే కన్నా మొత్తంగా రాస్తేనే బాగుంటుంది.
నువ్వు- నా హృదయపు తోటలో ప్రేమ మొలక
నేను- జత కలిసిన అందమైన ఆధారాన్ని
నీ వలపుల సుగందాన్ని
గమనం -జతగా ఒకరికి ఒకరం
తోడుగా నీడగా ఆశగా శ్వాసగా సాగటం
లక్ష్యం -జీవితాన్ని పండించుకుని
బరువు బాధ్యతల్ని తీర్చుకొని
పచ్చని పండుటాకులుగా గమ్యాన్ని చేరాలి
ముసి ముసి నవ్వులతో మురిసిపోవాలి
స్వేచ్ఛగా వాలిపోవాలి.
ఇదే కదా ప్రతి ఒక్క జంట, జంటగా కోరుకునేది. వావ్ సులోచన గారూ!!!