జాతీయాలు

మనం ఇంతకు ముందు కొన్ని జాతీయాలు గురించి తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని జాతీయాల గురించి తెలుసుకుందాం.
“రాగంలేని భోగం, త్యాగం లేని మనస్సు”
ఇది జీవిత సత్యాన్ని తెలియచెప్పే జాతీయం. ఎంతగా భోగాలను అనుభవిస్తున్నా అలా అనుభవించింటేప్పుడు బంధుమిత్రుల అనురాగం ఉంటేనే ఆ భోగానుభవంలో ఆనందం ఉంటుంది. కానప్పుడు ఎన్ని భోగాలున్నా, ఎదురుగా ఇంకేమున్నా ఆనందమే ఉండదు. అలాగే ఎదుటి వారికోసం చిన్నదైనా, పెద్దదైనా త్యాగం చేసినప్పుడు మనస్సుకు కలిగే ఆనందం ఎంతో గొప్పగా ఉంటుంది. ఎలాంటి త్యాగమూ లేకుండా జీవితం గడుస్తూ ఉంటే మనస్సుకు ఆనందం ఉండదని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది.

మరొక జాతీయం చూద్దాం
“మొక్కబోయిన దేవుడు ఎదురైనట్టు”
తలచిన పనులు వెనువెంటనే జరిగిన సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. ఎంతో దూరాన ఉన్న ఒక దేవాలయంలోని దేవుడికి మొక్కుకుంటే అంతా మంచి జరుగుతుందని ఓ వ్యక్తి ఆ దేవుడికి మొక్కుకోవాలని సంకల్పించాడట. అయితే ఆ మరుక్షణంలోనే ఆ దేవుడే అతడికి ఎదురైతే ఎలా ఉంటుందో తెలియచెప్పే భావన ఆధారంగా ఈ జాతీయం ఆవిర్భవించింది. ‘మొక్కబోయిన దేవుడు ఎదురైనట్టు ఆయన కోసం వెతుకుతుంటే ఆయనే నాకు ఎదురువచ్చాడు’ అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మరొక జాతీయం చూద్దాం
“మొండికి సిగ్గులేదు మొరటుకు ఎగ్గు లేదు”
మానవ మనస్తత్వాల విశ్లేషణ చేసే జాతీయాలలో ఇది కూడా ఒకటి. ధర్మాధర్మాలు, న్యాయాన్యాయాలు ఆలోచించుకోకుండా మొండిగా కొందరు వ్యవహరిస్తుంటారు. ఈ వ్యవహారం సిగ్గులేనితనంగా కూడా ఉంటుంది. అలాగే మొరటుగా మరికొందరు ప్రవర్తిస్తుంటారు. ఇలాంటివారు ఎగ్గును లెక్కచేయరు. ఎగ్గు అనంటే కీడు అనర్థం. మొరటుగా ఆలోచించేవారు తమకు కీడు కలుగుతుందన్న ఆలోచన కూడా లేకుండా ప్రవర్తిస్తారన్నది భావన. ఆ భావనల ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. ీమొండికి సిగ్గులేదు మొరటుకు ఎగ్గు లేదన్నట్టుంది నీ ప్రవర్తన. దాన్ని మార్చుకోవటం మంచిది’ అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మరొక జాతీయం చూద్దాం
“మెరుపు దీపమవుతుందా అన్నట్టు”
తాత్కాలికమైనవి ఏవీ శాశ్వతమైన ఆనందాన్ని లేదా ప్రయోజనాలను చేకూర్చలేవని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది. ఆకాశంలో క్షణకాలంపాటు మెరిసే మెరుపులు కాసేపు మంచి కాంతినే ఇస్తాయి. ఇంకా చెప్పాలంటే మామూలు దీపాలకన్నా ఎక్కువ కాంతినే ఇస్తాయి. అంత మాత్రం చేత ఆ మెరుపులను దీపాలకు ప్రత్యామ్నాయంగా వాడాలంటే సాధ్యమయ్యే పనికాదు. ఈ భావన ఆధారంగానే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది.

మరొక జాతీయం చూద్దాం
“మున్నూట అరవై రోగాలకు…”
మున్నూట అరవై రోగాలకు మూడు గుప్పెళ్ల కరక్కాయ పొడి అన్నట్టు అన్నది జాతీయం. జాతీయాలు జీవితానుభవసారాన్ని నింపుకొని తరతరాలకు చైతన్యదీపికలుగా అందుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ఔషధ విలువలను, ఆరోగ్యపరిరక్షణ అంశాలును గురించి తెలియచెప్పేవి కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి. మున్నూట అరవై అనంటే మూడు నూర్లు, అరవై అని. అంటే మూడు వందల అరవై. మూడు వందల అరవై అనేది ఇక్కడ ఎన్నెన్నో అనే అర్థంలో ఉపయోగించిన సంఖ్యావాచకం. అంటే అన్నెన్ని రోగాలకు కరక్కాయపొడి మంచి ఔషధంగా పనిచేస్తుందని. కనుక కరక్కాయ విలువను తెలుసుకోమని చెప్పే సందర్భాలలో దీని ప్రయోగం కనిపిస్తుంది.

మరొక జాతీయం చూద్దాం

“పొద్దెప్పుడు కుంకుతుందా ముద్ద ఎప్పుడు మింగుతానా అన్నట్టు”
పనిదొంగలు, తిండిపోతుల వ్యవహార శైలిని విమర్శిస్తూ పెద్దలు మాట్లాడే మాటల్లో ఈ జాతీయం వినిపిస్తుంటుంది. కొంతమందికి ఎప్పుడూ తిండి మీదే ధ్యాస ఉంటుంది. ఇది పూర్వకాలంనాడు ఆవిర్భవించిన జాతీయం. పూర్వం పొద్దుకుంకగానే అన్నం తినేసేవారు. ఓ వ్యక్తిని ఉదయం పూట పనిలోకి పెట్టకుంటే తిండి మీద ధ్యాస ఉన్న ఆ వ్యక్తి చెప్పిన పని చేయకుండా ఎప్పుడు పొద్దుకుంకుతుందా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అని ఎదురుచూస్తూ కూర్చున్నాడట. ఆ విషయం ఆధారంగా ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. ‘వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, పొద్దెప్పుడు కుంకుతుందా ముద్దఎప్పుడు మింగుతానా అని అన్నట్టు ఉంది తప్ప ఇక్కడ ఎవరూ సరిగా పనిచేస్తున్నట్లే కనిపించటంలేదు’ అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మరొక జాతీయం చూద్దాం
పూసిన పూలన్నీ కాయలవుతాయా పూసిన పూలన్నీ కాయలవుతాయా అన్నది జాతీయం. ప్రయత్నం విఫలమైన సందర్భంలో విసిగిపోవద్దని, మళ్లీ మళ్లీ ప్రయత్నం చేయమని ధైర్యం చెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. చెట్టుకు పువ్వులు పూస్తాయి. అయితే పూసిన పూలన్నీ కాయలవ్వవు, పండ్లుగా మారవు. కొన్ని మధ్యలోనే రాలిపోతాయి. కొన్ని పిందె వేసే స్థితికి వచ్చి రాలిపోతాయి. కాయలుగా మారేవి కొన్నే. పండ్లుగా మారేవి అందులో కొన్నే. ప్రకృతిలో కనిపించే ఈ సత్యాన్ని గమనించి అనుకొన్న పని జరగనప్పుడు ఎంతగా కష్టపడినా అప్పటికి ఫలితం దక్కనప్పుడు ఈ జాతీయాన్ని చెప్పి ఓదార్చటం కనిపిస్తుంది. పూలన్నీ కాయలవుతున్నాయా చెప్పు.. అలాగే అనుకోగానే జరగాలని ఏమీ లేదు. మరోసారి ప్రయత్నం చేయి’ అనేలాంటి ప్రయోగాలున్నాయి.

మరొక జాతీయం చూద్దాం
బడిలేని చదువు, వెంబడిలేని సేద్యం..
వ్యవసాయాధారితమైన దేశం కనుక మన దేశంలో సేద్యాన్ని పోలికగా తీసుకొని అవతరించిన జాతీయాలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఇదొకటి. చదువు, వ్యవసాయం రెండూ సక్రమంగా ఉండాలంటే ఏ పరిస్థితులుండాలో దీనిలో చెప్పటం కనిపిస్తుంది. బడికి వెళ్లి చదువుకుంటే తెలియని విషయాలను ఉపాధ్యాయుడు వివరంగా చెప్పి ఆ విషయాలను మనసుకు పట్టేలా చేస్తాడు. అలా చదివితేనే మంచి జ్ఞానం లభిస్తుంది. అలాగే వ్యవసాయదారుడు పొలం దున్ని నాట్లు వేసిన దగ్గర నుంచి ప్రతి నిత్యం పొలం వెంబడే ఉంటూ చూసుకుంటూ సేద్యం చేస్తేనే మంచి దిగుబడి లభిస్తుంది. అలాకాకపోతే బడికి వెళ్లని చదవని చదువులాగా అంతంత మాత్రమే సేద్యం ఉంటుందని, వెంబడి లేని సేద్యంలాగా బడికి వెళ్లని చదువు ఉంటుందని ఒకదానితో ఒకటి పోల్చి చెప్పటం ఇక్కడ కనిపిస్తుంది.

మరొక జాతీయం చూద్దాం
పూరిగుడిసెకు పందిరి మంచమా అన్నట్టు స్థాయిని మరచి వ్యవహరించటం, ఆర్థిక స్థోమతకు మించి ఆలోచించటం అనే అర్థాల్లో ఈ జాతీయం ప్రయోగంలో ఉంది. పెద్దపెద్ద భవనాలు, భవంతులలో ప్రత్యేకంగా గదులుండటం, వాటిలో అందంగా పందిరి మంచాలుండటం బాగా ఉంటుంది. కానీ చిన్న పూరి గుడిసెలో పెద్ద పందిరి మంచాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే లోపల చోటు సరిపోకపోగా చూడటానికి కూడా బాగా ఉండదు. కనుక స్థాయికి తగ్గట్టుగా మాత్రమే ఏ వ్యవహారాలైనా సాగాలని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

మరొక జాతీయం చూద్దాం
పూతకు ముందే పురుగు పట్టినట్టు…
పని ప్రారంభానికి ముందే విఘ్నాలు ఏర్పడటం లేదా ఆ పనికి సంబంధించినవేవైనా చెడిపోవటం అనేలాంటివి జరిగినప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పువ్వు పూయాలంటే మొగ్గగా ముందు అది ఉద్భవిస్తుంది. మొగ్గ విచ్చుకొని పువ్వవుతుంది. పువ్వు పూసిన తర్వాత దానికేదైనా చీడపట్టడమో మరొకటో జరిగితే వేరే విషయం. కానీ మొగ్గ దశలోనే చీడపడితే పువ్వు పూయటం, అది అందంగా వికసించటం అనేవి జరగవు. ఈ క్రమాన్నంతటినీ పని విజయవంతమయ్యే విషయానికి పోల్చిచెప్పి పని ప్రారంభించకముందే నష్టాలు కలగటాన్ని ఈ జాతీయంతో పోల్చి చెప్పటం కనిపిస్తుంది.

రొక జాతీయం చూద్దాం
పిలిచి పెద్దపులికి పేరంటం చేసినట్లు..
ప్రమాదాలను కొనితెచ్చుకొని, ప్రమాదకారులను గౌరవిస్తూ ప్రమాదంలో పడటం తెలిసో తెలియకో చాలాసార్లు జరుగుతుంటుంది. అలాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. పెద్దపులి ఎంతటి క్రూరజంతువో అందరికీ తెలిసిందే. అలాంటి పెద్దపులిని పనిగట్టుకొని పిలిచి పేరంటం చేస్తే ఆ క్రూరజంతువు ఎలా ప్రవర్తిస్తుందో ఎవరైనా ఊహించవచ్చు. అలాంటి సందర్భాలలో ‘ఆయనను ఇక్కడకి పిలవటమంటే పెద్దపులిని పిలిచి పేరంటం చేసినట్లే లెక్క. అందుకే ఆయనను పిలవద్దంటున్నాను’ అనేలాంటి ప్రయోగాలున్నాయి

మరొక జాతీయం చూద్దాం
పనికి పరాకు… తిండికి హుషారు
బద్ధకస్తులను గురించి తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంది. బద్ధకస్తులు ఏదైనా పనిచేయమన్నప్పుడు పరాకుగా పరధ్యానంగా ఉంటుంటారు. అదే తినటానికి రమ్మంటే హుషారుగా ఎక్కడలేని ఓపికతో పరుగెత్తుతుంటారు. ఇలాంటి వారు ఎక్కడైనా కనిపించినప్పుడు వారి తీరును విమర్శిస్తూ ఉపయోగించే జాతీయం ఇది.

మరొక జాతీయం చూద్దాం
పిండీ, బెల్లమూ ఇచ్చి పిన్నమ్మా నీ ప్రసాదం అన్నట్టు
సొమ్మంతా ఒకరి చేతికిచ్చి కొద్దిపాటి ఖర్చులకు కూడా వారిని అడగాల్సిన దుస్థితిలో ఉంటుంటారు కొందరు. ఇది తెలివితక్కువ వ్యవహారం. సొమ్మంతా ఇతరులకు ఇచ్చి కావలసినది యాచించటమంటే బుద్ధిలేనితనంకిందే లెక్క. పిండి, బెల్లం రెండూ ఉంటే చలిమిడి, బూరెలలాంటి పిండివంటలు చేసుకొని తినొచ్చు. అలాకాక ఆ బెల్లం, పిండి వేరొకరికి ఇచ్చి వారు పెట్టిందే ప్రసాదంగా తినటమంటే ఎలాంటిదో సొమ్ము ఒకరికి ఇచ్చి చిన్నచిన్న ఖర్చులకు వారిని అడుగుతూ వారి దయాధర్మాల మీద ఆధారపడటం అలాంటిదేనని ఈ జాతీయం వివరిస్తోంది.

మరొక జాతీయం చూద్దాం
పాడిపసరం, పసిబిడ్డ ఒకటేనన్నట్టు..
వ్యవసాయం ఆధారంగా జీవించే కుటుంబాలు ఎక్కువ ఉన్న మనదేశంలో వ్యవసాయ నేపథ్యం నుంచి అనేక జాతీయాలు ఆవిర్భవించాయి. ఈ జాతీయం కూడా అలాంటిదే. పసరం అంటే పశువు అని అర్థం. పాడిపసరం అంటే పాడిగొడ్డు. అది ఆవు కావొచ్చు, గేదె కావొచ్చు. అలాంటి పశువులను ఏదో పశువులే అని నిరాదరించకుండా నిర్లక్ష్యం చేయకుండా ఇంట్లో పసిబిడ్డను ఎలా అయితే ప్రేమతో చూసుకుంటారో అలానే చూసుకోవాలి. అలా కాకపోతే నష్టమే అని తెలియచెప్పే సందర్భాలలో ఈ జాతీయ ప్రయోగం కనిపిస్తుంది.

మరొక జాతీయం చూద్దాం
అత్త మెత్తన వేము తీయన ఉండవన్నట్టు..
సామాన్య కుటుంబ జనజీవనంలో అత్తకోడళ్ల నడుమ తగాదాలు చెలరేగే పరిస్థితులను చూసిన కొందరు చెప్పిన జాతీయం ఇది. అత్తలు కోడళ్లను నెగ్గుకురానివ్వరని కఠినంగా ప్రవర్తిస్తూ వారని హింసిస్తుంటారన్న భావనతో అవతరించిన జాతీయమిది. అయితే దీన్ని సమాజంలో ఉన్నతాధికారులకు, వారికింద పనిచేసే ఉద్యోగులకు సమన్వయిస్తూ కూడా చెపుతుంటారు. ఉన్నతాధికారులను అత్తలతో, కిందిస్థాయి ఉద్యోగులను కోడళ్లతోను పోల్చి చెప్పటమే దీనికి ఆధారం. జాతీయంలో చెప్పినట్టు వేపచెట్టుకు సంబంధించిన కాయలు తియ్యగా ఉండవు. అవి చేదుగానే ఉంటాయి. అలాగే అత్తకూడా కఠినంగా ఉంటుందేతప్ప సున్నితంగా మాట్లడే తీరు ఆమె దగ్గర ఉండదు. ఈ తీరులో నిరసించటమే ఈ జాతీయంలోని అంతరార్థం. ‘అత్త మెత్తన వేము తీయన ఉండవన్నట్టు మాపై అధికారి ఎప్పుడూ మాతో అలా కటువుగానే ప్రవర్తిస్తుంటాడు’ అనే లాంటి ప్రయోగాలున్నాయి.

మరొక జాతీయం చూద్దాం
అనిత్యాని శరీరాణి.. అందరి సొమ్మూ మనకేరాని..
మనిషిలోని బలహీనతలను, మోసగుణాలను వెక్కిరించే జాతీయాలు కూడా కొన్ని ఉన్నాయి. వ్యంగ్యంమాటున చురుకు పుట్టించే అలాంటి జాతీయాలలో ఇదొకటి. కొంతమంది ఎదుటివారికి విపరీతంగా నీతులు చెబుతుంటారు. తత్వోపదేశం చేస్తుంటారు. వారు మాత్రం అందుకు భిన్నంగా స్వార్థంతో ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారిని గురించి తెలియ చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడటం కనిపిస్తుంటుంది. ఈ శరీరాలు అనిత్యాలు. కనుక బతికిఉన్నకాలంలోనే అంతా మంచిగా ప్రవర్తిస్తూ నిస్వార్థంగా ఉండాలి అని ఒకాయన ఉపదేశం చేస్తూ ఆ ఉపదేశంమాటున స్వార్థంతో ధనార్జన కూడా చేస్తున్నాడట. అలా ఎవరైనా తాము చెప్పేదానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నప్పుడు ‘అనిత్యాని శరీరాణి అందరి సొమ్మూ మనకేరాని అన్నట్టుంది ఆయన పద్ధతి’ అని అనటం కనిపిస్తుంది.

మరొక జాతీయం చూద్దాం
అన్నం అడిగిన వాడికి సున్నం పెట్టినట్లు
సమాజంలో నిరంతరం ద్రోహచింతనతో ఉండేవారిని గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు ఈ జాతీయాన్ని వాడుతుంటారు. ఉపకారం చేయమని అడగటానికి వెళ్ళిన వ్యక్తికి ఉపకారం చేయకపోగా చేస్తున్నట్లు నటించి అపకారం చేసి అవమానిస్తుంటారు కొందరు. అదెలాంటిదంటే అన్నం పెట్టిమని అడిగిన వ్యక్తికి సున్నం పెట్టడం లాంటిదే. ఈ భావనతోనే ఈ జాతీయం ప్రయోగంలోకి వచ్చింది. ” వాడి దగ్గరకు అనవసరంగా వెళ్ళి చెయ్యి చాపాను. అన్నం పెట్టమని అడిగితే సున్నం పెట్టిన తీరులో ఉంది వాడి ప్రవర్తన” అనేలాంటి ప్రయోగాలున్నాయి

మరొక జాతీయం చూద్దాం
నోరు బెల్లంగాళ్లు!
కొందరు తమ పనులు  చక్కబెట్టుకోవడానికి, తాము కోరుకున్నది దక్కించుకోడానికి ఎదుటి వాళ్లతో తీయగా మాట్లాడతారు. ఎప్పుడైతే పని పూర్తవుతుందో ఇక అప్పటి నుంచి కంటికి కూడా కనిపించరు! మాటల్లో ‘ఆకర్షణ’ ఉండి చేతల్లో శూన్యం, అవకాశవాదం  కనిపించేవారి విషయంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తుంటారు

మరొక జాతీయం చూద్దాం
గ్రంథసాంగుడు!
గ్రంథసాంగుడుకు నిజమైన అర్థం ఒక పుస్తకాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు అని.
గ్రంథం అంటే పుస్తకం. సాంగం అంటే… భాగాలతో కూడిన అని అర్థం.
ఒక పుస్తకంలో భిన్నమైన భాగాలన్నింటినీ అధ్యయనం చేసినవాడు గ్రంథసాంగుడు.
అయితే వ్యవహారికంలో గ్రంథ అధ్యయనంలో నిష్ణాతుడు అని కాకుండా… మోసం, రసికత్వం మొదలైన వాటిలో ఆరితేరిన వారిని ‘గ్రంథ సాంగుడు’ అనడం మొదలైంది.

మరొక జాతీయం చూద్దాం
జిల్లేడు పెళ్లి!
‘‘అదో పెళ్లంటావా? ఉత్త జిల్లేడు పెళ్లి.’’
‘‘నువ్వు చేసుకుంది పెళ్లి కాదు జిల్లేడు పెళ్లి’’… ఇలాంటి మాటలు అసహనంతోనో, ఆగ్రహంతోనో వినిపిస్తుంటాయి.
ఉత్తుత్తి పెళ్లి, దొంగపెళ్లి, ఎవరూ గుర్తించని పెళ్లిని జిల్లేడు పెళ్లి అంటారు. అసలీ మాట ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే…
పూర్వం ఇద్దరు భార్యలు చనిపోయిన వ్యక్తి మూడో పెళ్లి చేసుకోవాలనుకుంటే అతనికి మొదట జిల్లేడు పెళ్లి చేసేవారు. అంటే… ‘మూడు’ అనేది అంత మంచిది కాదన్న ఉద్దేశంతో జిల్లేడు చెట్టుకు తాళి కట్టించేవారు. దీంతో వరుడు చేసుకునే మూడో పెళ్లి కాస్త… నాలుగో పెళ్లి అయ్యేది. ఈ వ్యవహారం నుంచి పుట్టిందే… జిల్లేడు పెళ్లి!

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నులివెచ్చని గ్రీష్మం

బాధ్యత The responsibility