అందరికీ శనార్థులు
మంచిగున్నరా..!?
రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు రకరకాలుగా రుణమాఫీలు జేస్తరు గదా..!అది మనకు ఎర్కనే నాయే.
జనాలు ఎట్ల తయారయిండ్రంటే.. అన్నీ పుక్కట్లా రావాలి, అప్పుసుత దీసుకున్న అది మాఫ్ జెయ్యాలే, అనే సొన్చాయిస్తరు. ఎదుటోళ్ళు ఎప్పుడు మనకిచ్చుడే గాని మనము ఒకళ్ళకి ఇయ్యాలన్న యావనే ఉండదు. “మందిది మంగలారం తనది సోమారం” అని పెద్దలు ఊకేనే అన్నారూ..! రుణం అంటే ఏందో ఎరుకనా తమ్మి. పైసలు అప్పు దీసుకునుడు ఒకటే రుణం కాదు. మనిషికి జన్మ ఎత్తినంక తీర్సుకునే రుణాలు మస్తుంటయి. ఓలన్న బాగా పైసలు ఉన్నోడు.. లేకుంటే మస్తు సంపాదిస్తున్న, బలముంది నాకు అనుకునేటోళ్లు, నేను ఎవ్వల మీద ఆధారపడతలే. నాది నేనే బతుకుతున్న అనుకునేటోళ్ళు మంచిగినుండి జెర.
నువ్వు పొద్దుగాల లేసినవంటే,ఊపిరి తీసుకున్నవ్ అంటే, ఈ దునియాలో ఉన్నవంటే,ఒక ఇంట్ల ఉన్నవంటే, మీ అవ్వ అయినా సరే నీకు ఇంత ఉడికేసి కడుపు కింత పెడుతుంది అంటే, ఒక గిలాస చాయ్ ఇచ్చిందంటే, నీళ్లు ఇచ్చిందంటే ఆల్ల రుణంలో వడ్డట్టే నువ్వు.. ” రుణం కథ శాన పెద్దది. సదుకున్న, మస్తు పైసలు సంపాదిస్తున్న, ఎవల్లను వడితే ఆల్లని అంట,అందరితో చాకిరి చేపించుకుంటా. అంటే నడవది. ఈ పొద్దు మంచిగా అనిపించినా ఏదో ఒక పొద్దు రుణం మాఫీ జేసుకోవాలె నువ్వు సుత!
అగో గిదేం లెక్క నేను ఇన అనుకుంటే ఇక అది గుడ నీకు కర్మకే మల్ల! ఒకల తానా చెయ్ బదులు పైసలు తెచ్చుకున్నము మల్ల ఇచ్చేత్తము గదే కదా అక్కా.. !రుణ మాఫి అంటే అనుకుంటున్నవా ఏంది?
కానే కాదు, చెప్పిన గదా రుణం కథ పెద్దది అని. మనిషి తల్లి గర్భంలకెల్లి ఈ భూమి మీద వడతడు. కన్న తల్లి రుణం భూతల్లి రుణం ఏమిచ్చిన తీర్సుకుంటమా, తీర్సుకునుడు ఈ జన్మకి అయితదా! అట్లనే నాయన రుణము, మన దేశము, మన చుట్టు పక్కనోళ్ళు, చుట్టాలు పక్కాలు,దోస్తులు,శెట్లు శేమలు, షెల్కలు,ప్రకృతి గాలి నీరు భూతల్లి, మొగిలు, అగ్గి ఇవన్నీ పంచభూతాలు ఇవి మనల గూడ ఉంటయి, పంచభూతాల రుణం తీర్సుకునుడు ఐతదా. ఆలోచన అస్తుంది కదా దిమాఖ్ల.
రావాలె సుత!
నీ అమ్మ నాయన ముసలోళ్లయినంక నీకు దేవుడు అవకాశం ఇస్తడు రుణం తీర్సుకోనీకి. కావురంతోని వాల్లను గోస వెట్టి రుణగ్రస్తుడివి గాకు.
అట్లనే నీ కష్టంలా,నీ దుఃఖంలా నీకు తోడై నోళ్లను, తమ భుజం ఆసరా ఇచ్చినోళ్ళను ఎప్పటికీ యాది మరవకు.
ఇదే మరి ఆళ్లకు మళ్ళీ నీ కృతజ్ఞత తెలియజేసి, ఆళ్లకు గూడ నీవు అక్కర అయ్యి రుణమాఫీ చేసుకొనుడు అంటే.
పైకెక్కి అచ్చిన మని కింద మెట్టును తంతే..! ఓ పాలి కింద వడితివో నడ్డి బొక్క సూర సూర అయితది. గిస్వంట అప్పుడే రుణమాఫీ అంటే ఏంది మనం పొందిన సహాయంకి మళ్ళీ మనం ఎట్లా కృతజ్ఞత సూపెట్టాలో తెలుసుకునుడే నిజమైన బతుకు అంటే.
అదేం లేదు నాది నేను సూసుకుంట ‘అలక నిరంజన్’ అనుకునుడు ఒట్టి మూర్ఖత్వమే అయితది.
ఎంత ఉన్నోల్లు గాని, అడక్కతినేటోళ్లు గాని.. అందరం రుణమాఫీ జేసుకోవల్సిందే. గీదేమల్ల పుణ్యం మూటగట్టుకునుడు అంటే.
ఒళ్ళుమర్శి దేశమంటే, ప్రకృతి అంటే, సమాజం అంటే, కుటుంబం అంటే, క్యాలె లేకుండా… కష్టంల ఆసరైనోళ్లను మరిచిపోయి…. లాపర్వాల..ఉంటే నిజంగా రుణంల పడతం తమ్మి.
దేవుడు మెచ్చుతడో లేదో తెల్వదు గాని ముందు నిన్ను, నువ్వు మెచ్చాలె.
నాలుగు మంచి పనులు జెయ్యాలె. నలుగురికి అక్కరకు రావాలె.
ఎవ్వలతాన్నుంచి సహాయం పొందిన, తిరిగి ఇచ్చేయాలె. నీ కన్న తల్లిదండ్రులైన తోడవుట్టినోళ్ళైనా సరే. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనుకోవద్దు.
నీ కండ్ల ముందు నీవు సాయం జేసే గడియ కనవడితే, శేతులు, మనసు ముడుసుకొని దూరం పోవద్దు. కాళ్లు శేతులు అరిగిపోవు, కావురము కరిగిపోదు. గింతే ముచ్చట గిది తెల్వాలి.
ఇగో తమ్మి – శెల్లె అందరూ ఇనుండి.. మీ రమక్క వట్టి మాటలు జెప్పదు. రోజు సుట్టు పొంటి, ఇసొంటి జనాల సూసి సూసి , యాష్టకు వస్తుంది. గందుకే నా తమ్ముండ్లు, శెల్లెండ్లు గదా అని మీకు కూడా చెప్తున్న. మనది వడి జెప్తున్న మనసు కరాబ్ చేసుకోకుండి. ఆలోచన మాత్రం జెయ్యుండి.
ఎప్పటికప్పుడు అన్ని రుణాలను మాఫ్ చేసుకుంటా.. పొండి మనసుకు ఎంత హాయిగుంటదో, దిమాక్ ఎంత శాంతంగుంటదో మీకే ఎర్కైతది.
టేక్ అండ్ గివ్వు, ఓన్లీ గివ్ అండ్ గివ్. ఏది బాగుందో మీరే ఆలోచించుండి.
ఎంతోమంది సహాయం చేస్తే ఆసరైతే మనిషి బతుకు ముందుకు సాగుతది. ఒక్కలతోనే ఏమీ కాదు అట్లయితే అనుకున్నడు మూర్ఖత్వం. గందుకనే మనం గూడ మనకు తోచినంత ఎదుటోళ్ళకి ఆసరగావాలే, కట్టంగ అక్కరకు రావాలె. ముఖ్యంగా.. నీ కష్టంలో ఆసరైనోళ్లను ఎప్పుడు యాది వెట్టుకోని ఆల్ల రుణములకెల్లి బయటవడాలె.
ఉంటమరి
యాది మర్వకుండి
మీ
రమక్క
8985613123