నా ఇల్లు

కథ

“అమ్మా! అమ్మా! నేను అందంగా అమర్చిన బొమ్మలన్నీ ఎవరు తీసేశారు? నా చిన్నప్పటి నుండి ఇవన్నీ ఇలాగే పెడుతున్నాను కదా?”అని అడిగింది సుదీప. కొంచెం ఏడుపు కొంచెం కోపం మిళితమైన గొంతుతో.

అప్పుడే అక్కడికి వచ్చిన సుదీప తల్లి వసుంధర జవాబు చెప్పేంతలో, సుదీప అన్న సుధీర్ అక్కడికి వచ్చాడు.

“అవి మీ వదిన సర్దింది. అయినా తను ఈ ఇంట్లోకి వచ్చాక తన ఇష్టం ఉన్నట్లు తను పెట్టుకుంటుంది. నువ్వు నీ పెళ్లయ్యాక నీ ఇష్టం ఉన్నట్లు మీ ఇంట్లో సర్దుకో”అన్నాడు వ్యంగ్యంగా సుధీర్ .

ఈ సమాధానం ఊహించని సుదీప , వసుంధర ఇద్దరూ నివ్వె రపోయారు.

“అదేంటి అన్నయ్యా! వదిన తన ఇష్టం ఉన్నట్లుగా సర్దుకుంటానంటే నేను మాత్రం వద్దంటానా? చిన్నప్పటినుండి నాకు బొమ్మలంటే చాలా ఇష్టం కదా! నా పదేళ్ల వయసు నుండి ఒక్కొక్కటి కొని అన్నిటినీ ఇలా సర్దాను. ఇంట్లో అందరికీ నచ్చింది కూడా! నాన్న అయితే మరీ మెచ్చుకున్నాడు. నువ్వు కూడా ఎన్నోసార్లు బాగుందన్నావు కదా! అన్నయ్య”అన్నది మెల్లగా సుదీప.

“అయితే ఏమంటావు? అప్పుడు బాగుందని, ఇప్పుడు మీ వదినకి నచ్చిన బొమ్మలు పెట్టుకుంటానంటే వద్దంటావా?” అన్నాడు కోపంగా సుధీర్.

జవాబు చెప్పాలనుకుని సుదీప నోరు తెరిచినంతనే వసుంధర “దీపా ఎందుకీ అనవసరపు వాదన. నీ పెళ్ళయ్యాక మీ ఇంట్లో నీకు నచ్చినట్లు నువ్వు సర్దుకుందువుగానిలే. లోపలికి వచ్చేయ్”అన్నది.

అసలు ఏమీ అర్థం కాని సుదీప మెల్లిగా లోపలికి వెళ్ళిపోయింది.

అంతకుముందే వచ్చి బయట నిలబడ్డ సుదీప తండ్రి రాజేందర్ నీరు నిండిన కళ్ళతో నిలబడ్డాడు.

తనేవి విననట్లుగానే లోపలికి వచ్చాడు.

సుదీపకు చిన్నప్పటినుండి ఇంటి అలంకరణ అంటే చాలా ఇష్టం. ఎన్నో బొమ్మలని సమకూర్చి, వాటిని చక్కగా ఇంట్లో ఏవి ఎక్కడ పెట్టాలో ఆలోచించి పెట్టేది .అలా చిన్నప్పటినుండి కొన్న బొమ్మలన్నీ కలిపి చాలానే ఉంటాయి. ప్రతి సంవత్సరం దీపావళికి బొమ్మల కొలువు పెట్టి అందరిని పిలిచేది వసుంధర.

చదువులో కూడా మంచి మార్కులు తెచ్చుకుంటూ, అందరి మెప్పులు పొందేది సుదీప.

ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సుదీపకు ఈ మధ్యనే క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ కూడా వచ్చింది.

సంవత్సరం క్రితమే సుధీ ర్ పెళ్లి జరిగింది. వదిన వస్తే ఎంతో చక్కగా కలిసి ఉండొచ్చు అని ఎన్నో ఊహించుకుంది సుదీప.

కానీ సుధీర్ భార్య సౌమ్య అసలు ఎవరితోనూ కలిసి ఉండేది కాదు. ఎన్నోసార్లు మాట్లాడలనీ ప్రయత్నించింది సుదీప. నిజానికి సుదీప మనస్తత్వం చాలా నిష్కల్మషమైనది. ఎవరినీ నొప్పించే తత్వం కాదు.

ఒకరోజు కాలేజ్ ఫంక్షన్ జరుగుతుండడంతో తన చీరలేవి అంత బాగా లేదనిపించి వదినను అడగడానికి వెళ్ళింది.

“వదినా! రేపు నాకు కాలేజీలో ఫంక్షన్ ఉంది. నీ చీర ఏదైనా కట్టుకొని వెళతాను. మనం ఇద్దరం ఒకే వెయిట్ లో ఉంటాము. కాబట్టి, మీ బ్లౌజ్ కూడా నాకు సరిపోతుంది”అని అడిగింది వదిన పక్కనే కూర్చుంటూ.

“ఏంటి, నా చీర నువ్వు కట్టుకొని వెళ్తావా? అందులో బ్లౌజ్ కూడా వేసుకుంటావా? ఛీ ఛీ నాకు ఒకరు వేసుకున్న బట్టలు నచ్చవు. నా బట్టలు నేనెవరికీ ఇవ్వను” అన్నది నిక్కచ్చిగా.

“పోనీ బ్లౌజ్ నాది వేసుకుంటాను. చీర నీది కట్టుకొని వెళ్తాను. సరేనా”అని అడిగింది అమాయకంగా సుదీప.

“ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇలా అడుక్కొని కట్టుకోవడం దేనికి? నీకున్నవే కట్టుకొని వెళ్ళు”అన్నది కఠినంగా.

అప్పుడు కానీ అర్థం కాలేదు సుదీపకు ,వదిన నిజంగానే అంటుందని.

కళ్ళనీళ్ళతో బయటకు వచ్చింది. ఆ విషయం తల్లితో కూడా చెప్పలేదు. కానీ విషయం గ్రహించిన వసుంధర , వెళ్లి దగ్గర్లో ఉన్న షాపులో ఒక చీర దానికి సంబంధించిన ఫాల్ కొనుక్కొని వచ్చింది.

“అమ్మా! ఎక్కడికి వెళ్లావు? నీకోసం అప్పటినుండి వెతుకుతున్నాను .రేపు కాలేజీలో ఫంక్షన్ ఉంది. నీ చీర ఏదైనా ఉంటే కట్టుకొని వెళ్తాను”అన్నది సుదీప.

“నా చీరలు నీకేం బాగుంటాయి తల్లి. అప్పుడెప్పుడో ఫంక్షన్ ఉంటుంది అని నువ్వు అన్నావు కదా! అది గుర్తొచ్చి ఇక్కడ షాప్ లో చీరలు బాగున్నాయంటే వెళ్లి తీసుకొచ్చాను. చూడు బాగుందా”అని తాను తెచ్చిన చీర చూపించింది వసుంధర.

చిలకపచ్చ రంగు చీరకి, గులాబీ రంగు అంచు, అక్కడక్కడా జరిగి బూటాతో చీర ఎంతో అందంగా ఉంది.

“చాలా బాగుందమ్మా, అయినా, అలా ఎలా తెచ్చావ్ ?పోనీ నన్నైనా పిలవలేదు”అన్నది సుదీప చీరను పట్టుకొని సంతోషంగా చూస్తూ.

“నీకు నచ్చకుంటే వెళ్లి మార్చుకొని వద్దాము. ఇంకా సమయం ఐదు గంటలే అయింది కదా? షాప్ మూయరు” అన్నది వసుంధర.

“మార్చడం ఏమీ వద్దమ్మా, నాకు చాలా నచ్చింది. ఇదే కట్టుకొని వెళ్తాను. కానీ దీనికి బ్లౌజ్ ఎలా?”అన్నది సుదీప.

ఇప్పటికిప్పుడు కుట్టిచ్చాలంటే కష్టమే కద మ్మ, నీపట్టు పరికిణి మీది జాకెట్టు దీనికి సరిగ్గా సరిపోతుంది .ఒకసారి పెట్టి చూడు”అన్నది వసుంధర.

ఆ చీర కు కరెక్టుగా మ్యాచ్ అవ్వడంతో ఆ రాత్రికి ఫాలు కుట్టేసింది వసుంధర.

తెల్లవారి కాలేజీకి కట్టుకొని వెళ్తే అందరూ ఎంతో బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అందులో చక్కనైన సుదీపకు ఆ చీర ఇంకా బాగా నప్పింది.

అలా ఇంట్లో వదిన దేనికి తనతో కలిసి ఉండేది కాదు. ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని తొందరగా వెళ్ళిపోతే బాగుండు అన్నట్లుగా చూసేది.
ఇది మాది నువ్వు పెళ్లి అయ్యాక కొనుక్కో ఇలాగే మాట్లాడేది.

ఎంతో బాధపడేది సుదీప.
ఇక్కడే పుట్టి పెరిగినా నేను పరాయిదాన్ని అయ్యానా? అంటే ఈ ఇంట్లో నాకు స్థానం ఏమీ లేదా?”ఇలా ఎంతో బాధపడేది సుదీప.

తల్లి మాత్రం పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోమని చెప్పేది.
కానీ ఇదంతా చూస్తున్న తండ్రికి మాత్రం చాలా బాధగా ఉండేది. బుడిబుడి అడుగులతో నడిచిన బంగారు తల్లి పెరిగి పెద్దదై ఇంట్లో లక్ష్మీదేవిలా తిరుగుతుంటే ఇప్పుడు తనను పరాయిది అంటారేంటి? అలాగని కోడల్ని తక్కువ చేసి చూడలేదుకదా? కోడల్ని కూడా కూతురు లాగానే చూసుకుంటున్నాము కదా! ఇంకా సుదీప్ అయితే వదినను ఎంతో ప్రాణంగా చూసుకుంటుంది. ఏది కొన్నా వదిన కోసం ముందుగా తెస్తుంది. ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు? కొడుకు సుదీర్ లో కూడా మార్పు వచ్చింది. రేపు పెళ్లి అయిన తర్వాత అయినా సుదీప అత్త వారు మంచిగా చూసుకునే వాళ్ళు వస్తే చాలు” అని ఎన్నోసార్లు బాధపడేవాడు.

చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన సుదీప కు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు తల్లిదండ్రులు. అనుకున్నట్లుగానే ఎన్నో సంబంధాలు చూసి అందులో సుదీపకు కూడా నచ్చిన వరుడి తో పెళ్లి జరిపించారు.

ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది. సుదీప వదినకి పెళ్లి జరుగుతుందన్న సంతోషం కన్నా సుదీప ఇంట్లో నుండి వెళ్తుంది అని ఆనందమే ఎక్కువ కనిపించింది.

పెళ్లయి అత్తవారింటికి భర్తతో వెళ్లింది సుదీప. పెళ్లిరోజు రాత్రి పది గంటలు దాటింది. అప్పటికే అందరూ ఎవరి పడక గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. “కొత్త పెళ్లికూతురు వచ్చింది” అని ఎవరు బయటకు రాలేదు. లోపలికి వెళ్లి సూట్ కేసు లోపల పెట్టి, బట్టలు మార్చుకొని హాల్లోకి వచ్చింది సుదీప.

బయటకు వచ్చిన సుదీపను అత్తగారు ఒక చూపు చూసి”నువ్వు శ్రీకర్ అన్నం పెట్టుకొని తినండి. మేమందరం భోజనం చేసాము. గిన్నెలన్నీ సర్ది బయట వేసి స్టవ్ గట్టు అన్ని తుడిచిపెట్టి వెళ్లి పడుకోండి”అని చెప్పింది ఎప్పుడూ ఇంట్లో ఉండే మనిషికి చెప్పినట్లే చెప్పింది.

వాళ్ళ ఇంట్లో వాళ్ళ వదినని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో? సుదీపకు గుర్తొచ్చింది. అందరూ కలిసి స్వాగతం పలికి వదినను కూర్చోబెట్టి అన్ని సపర్యాలు చేశారు. తల్లి వడ్డించి కొసరి కొసరి భోజనం వడ్డించింది.

సుధీర్ కి కూడా చెప్పింది “తను మొహమాట పడకుండా చూసుకునే బాధ్యత నీదేనని.”

ఎన్నో రోజుల వరకు ఏ చిన్న పని కూడా చేయనిచ్చేది కాదు వసుంధర. కానీ వీళ్లు చూపించిన ప్రేమలో తను రెండు శాతం కూడా తనకు ప్రేమ ఉన్నట్లు ప్రవర్తించేది కాదు సుదీప వదిన.

ఆలోచనలో నుండి బయటకు వచ్చిన సుదీప

“అలాగే అత్తయ్యా!” అని నెమ్మదిగా సమాధానం ఇచ్చింది.

ఇంతలో స్నానం చేసి వచ్చిన శ్రీకర్

“ఏంటి నిలబడ్డావ్? భోజనం చేద్దాం పద”అన్నాడు.

మెల్లగా శ్రీకర్ తో పాటు వంటింట్లోకి నడిచింది.

డైనింగ్ టేబుల్ నిండా ఎంగిలికంచాలు అలాగే పడి ఉన్నాయి. వంట పదార్థాలు ఉన్న గిన్నెల మీద మూతలు కూడా సరిగా లేవు. వంటిల్లు అంతా చిందరవందర గా ఉంది. ఒక్కసారి అద్దంలాంటి తన పుట్టిల్లు గుర్తొచ్చింది .కానీ అదేది బయటపడకుండా మౌనంగా ఆ కంచాలన్ని తీసి బయటపెట్టి భర్తకి, తనకు కంచాలు పెట్టుకొని గిన్నెలు మూతలు తీసి చూసింది. అడుగుబొడుకు కూరలు మాత్రమే ఉన్నాయి. అన్నం అడుగంటి పోయింది. మెల్లగా పైపై అన్నం పెట్టేసి ఉన్న కూ రలు సర్దేసింది.

ఇదేమి పట్టనట్లు శ్రీకర్ గబగబా తినేస్తున్నాడు. సుదీపకు అసలు ఆ కూరలేవీ సహించలేదు. అందులో మిగిలిన కూరలు పాడైపోయే స్థితిలో ఉన్నాయి.” కొత్తగా కోడలు ఇంట్లోకి అడుగు పెడుతుంటే కాస్త మంచి భోజనం కూడా తయారు చేయలేరా” అని అనుకొని అన్నంలో మజ్జిగ పోసుకొని తినేసింది.

ఉదయమే లేచిన సుదీప హాల్లో వస్తువులని సర్ది పెట్టింది.శెల్ఫ్ లో అటు ఇటు పడి ఉన్న బొమ్మలను కాస్త అందంగా సర్దింది.

అప్పుడే బయటకు వచ్చిన సుదీప మరదలు దీక్ష

“అప్పుడే అధికారం చేతిలోకి తీసుకున్నావా? ఆ బొమ్మలు అలా పెట్టకూడదు. నువ్వెందుకు సర్దావ్ అసలు? ఇదేం నీ పుట్టిల్లు కాదు ఇష్టం ఉన్నట్లు చేయడానికి?” అన్నది.

ఒక్కసారి ఆశ్చర్యపోయింది సుదీప్.
అక్కడ పుట్టింట్లో వదిన ఇంట్లోకి రాగానే “నీ ఇల్లు ఇది కాదు నీ ఇంట్లో సర్దుకో” అన్నది ఇక్కడ మరదలు “ఇది నీ పుట్టిల్లు కాదు” అంది అసలు నాకంటూ ఒక ఇల్లు ఉందా?”అని బాధపడుతూ నిలబడింది సుదీప.
__*__

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

మన మహిళామణులు -కానూరి రమా మురళి రాజేశ్వరి