దొరసాని

– 46 వ భాగం

తెల్లవారి అలేఖ్యను అత్తవారింటికి పంపించడానికి పసుపు కుంకుమ చీర సారే తయారు చేసింది నీలాంబరి…

“మీరు కూడా పిల్లలతో మా ఇంటికి వస్తే బాగుండేది” అన్నది అలేఖ్య అత్తగారు నీలాంబరితో…

” ఓ వారం అయ్యాక తప్పకుండా వస్తాము.. మాకు మాత్రము సౌందర్యలహరిని వదిలి ఉండడము కష్టమే” అన్నది కొంచెం బాధగా నీలాంబరి.

” వచ్చి మీరు కూడా వారం రోజులు ఉండండి ఆ తర్వాత మీతో పాటు మళ్ళీ తీసుకొచ్చుకుందురు గాని” అన్నది అలేఖ్య అత్తగారు.

” అలా వద్దు వదిన గారు.. మీకు కూడా మీ మనవరాలిని చూసుకోవాలని ముచ్చట ఉంటుంది కదా వాళ్లు అమెరికా వెళ్లే వరకు మీదగ్గరే ఉండనీయండి” అన్నది నీలాంబరి…

“ఎలాగూ మరో నెల రోజులు ఆగితే అన్నప్రాసన ఉంటుంది కదా అప్పుడు ఇక్కడికే వచ్చి బాలసదనంలో చేద్దాము.. అందరి పిల్లల మధ్య అన్నప్రాసన జరిగితే పిల్లలందరికీ శుభం కలుగుతుంది “అన్నది అలేఖ్య అత్తయ్య..

వారికి కూడా బాలసదనం పట్ల మంచి అభిమానం ఉన్నందుకు సంతోషపడింది నీలాంబరి…

” ఈరోజు టిఫిన్ పనులు పెట్టుకోకుండా ఏకంగా భోజనాలు చేసి బయలుదేరుదాం లేదంటే చాలా ఆలస్యం అయిపోతుంది చంటి పిల్లతో రాత్రుళ్లు ప్రయాణం అంత బాగుండదు” అన్నాడు సుధీర్..

అలేఖ్య తన బట్టలు పాప బట్టలు ఇంకా పాపకు కావలసిన వస్తువులు అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసుకుంది సుధీర్ కూడా ఏదీ మర్చిపోకుండా జాగ్రత్తలు చెప్తూ తన సహకారం అందించాడు…

అలేఖ్య సుధీర్ సౌందర్య లహరిలను కూర్చోబెట్టి బొట్టు పెట్టి వారికి బట్టలు పెట్టారు నీలాంబరి భూపతి…

వారితో పాటుగానే సౌదామిని తన తల్లిదండ్రులతో వెళ్లడానికి తయారయింది..

సౌదామిని వెళ్ళిపోతుందనే విషయం అప్పుడే తెలుసుకున్న సాగర్ మనసు వెలితిగా తోచింది…

” ఇన్నేళ్లు ఉన్న ఇల్లే తనకి కొత్తగా అనిపిస్తుంది.. ఏదో వెలితిగా ఉంది.. తన మనసును ఎవరో లాకెళ్లిపోతున్నంత బాధగా’ అనిపించింది…

సౌదామిని కూడా చిన్న పోయిన ముఖంతోనే తన సామాన్లు సర్దుకుంటుంది…

వెనుకగా వచ్చిన సాగర్..

” నువ్వు వెళ్ళిపోతావని నాకు తెలియదు ఎందుకు ఇంత సడన్గా నిర్ణయం తీసుకున్నావు” అన్నాడు.

” సడన్గా ఏం కాదు సాగర్! ఎలాగూ వెళ్లాలి కదా !నేను ఇక్కడ ఉండడానికి సిద్ధంగా రాలేదు కదా ఈ ప్రపోజల్ నాకు ముందు తెలియదు వెళ్లి నా సామాను అంతా సర్దుకొని నా సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని వచ్చి జాయిన్ అవుతాను.. అమ్మ వాళ్ళతో కూడా కలిసి ఉన్నట్లు ఉంటుంది కదా” అన్నది సౌదామిని.

” అయితే ఎన్ని రోజులకి వస్తావు”? అన్నాడు సాగర్.

” 15 రోజులు పట్టొచ్చేమో” అన్నది సౌదామిని.

” అన్ని రోజులా ప్లీజ్ ,త్వరగా వచ్చేయవూ!” అన్నాడు సాగర్.

” సరే త్వరగా రావడానికి ప్రయత్నం చేస్తాను” అన్నది సౌదామిని.

అటు ఇటు చూసి ఎవరూ లేరని అనుకున్నాక ఒకసారి సౌదామిని హగ్ చేసుకుని వదిలేసాడు సాగర్..

ఇది ఊహించని సౌదామిని మొహం ఒక్కసారిగా సిగ్గుతో ముడుచుకొని పోయింది…

అందరూ త్వరగా భోజనాలు చేసి బయలుదేరారు….

ఇల్లంతా చిన్న పోయినట్లు అనిపించింది నీలాంబరి భూపతి సాగర్లకు…

ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించినట్లు అనిపించింది…

మౌనంగా అలేఖ్య గదిలోకి వెళ్లిన నీలాంబరికి… సుధీర్ లాప్టాప్ అక్కడే కనిపించింది…

” అయ్యో ఇక్కడ లాప్టాప్ మర్చిపోయాడు సుధీర్ తనకు ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు ఇది ఎంతో అవసరం కదా” అని ఆలోచించి..

” సాగర్ ఒకసారి ఇలా రా బావగారు లాప్టాప్ మర్చిపోయారు” అని చెప్పింది…

” తీసుకెళ్లి ఇచ్చేసి వస్తాను ఎక్కువ దూరం కూడా వెళ్లి ఉండరు” అన్నాడు సాగర్…

ఒకసారి కాల్ చేయి వాళ్ళ ఊరికి వెళ్లడానికి రెండు రూట్లు ఉన్నాయి మరి ఏదారిలో వెళ్తున్నారో తెలియదు అందులో ఆ దారంతా సిగ్నల్స్ కూడా ఉండవు త్వరగా ఫోన్ చెయ్” అన్నది నీలాంబరి.

సాగర్ వాళ్ళ అక్క ఫోన్ కి కాల్ చేశాడు కానీ అలేఖ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు వెంటనే సుధీర్ కి ఫోన్ చేశాడు అతను కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదు పాప నిద్ర లేస్తుందని మొబైల్ సైలెంట్ లో పెట్టుకొని ఉంటారు.. సరే ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని ల్యాప్టాప్ తీసుకొని కారులో బయలుదేరాడు సాగర్…

ఎంత దూరం వెళ్లినా వాళ్ల కార్ల జాడ కనిపించలేదు… ఒక అరగంట తర్వాత సుధీర్ ఫోన్ చేశాడు…

” ఏంటి సాగర్ ఫోన్ చేసావా? ఇప్పుడే చూసుకున్నాను పాపకి పాలు పట్టడానికి ఇక్కడ కాసేపు ఆగుదామని కారు ఆపుకున్నప్పుడు మిస్డ్ కాల్ చూశాను” అన్నాడు సుధీర్.

” అవును బావా మీరు మీ లాప్టాప్ మర్చిపోయారు. మీకు అది ఇంపార్టెంట్ కదా అది ఇవ్వడానికి మీరు ఏ దారిలో వెళ్తున్నారో తెలుసుకోవడానికి కాల్ చేశాను” అన్నాడు సాగర్.

” మేము చౌరస్తా నుండి ఎడం వైపు రంగాపురం వస్తుంది ఆ దారి గుండా వెళ్తున్నాము” అన్నాడు సుధీర్.

” అవునా నేను స్ట్రెయిట్ గా వెళ్తున్నాను ఇది దగ్గర దారి అవుతుందని దారిలో ఎవరో చెప్పారు” అన్నాడు సాగర్..

” ఎలా మరి నేను వెనుకకు రానా చాలా దూరం వెళ్ళిపోయి ఉంటావు” అన్నాడు సుధీర్..

” వద్దులే బావ చిన్న పాపతో మళ్ళీ వెనకకు రావడం కష్టం నేనే మీ ఊరి వరకు వచ్చేస్తాను ఎలాగో నాకు కూడా రావాలనే ఉండింది” అన్నాడు సాగర్.

అదంతా వింటున్నా అలేఖ్య “నిజమా సాగర్ నువ్వు వస్తున్నావా” అని సంతోషంతో గట్టిగా అరిచింది..

” నువ్వు పిలవకున్నా వస్తున్నాను అక్కా మీ ఊరికి” అన్నాడు సాగర్.

” సరే మీ గొడవ ఎలాగూ ఉంటుంది ఊరికి వెళ్ళిన తర్వాత తీర్పాటుగా గొడవపడండి” అన్నాడు సుధీర్ నవ్వుతూ..

వెంటనే సాగర్ నీలాంబరికి ఫోన్ చేసి చెప్పాడు…

” అమ్మా! వాళ్లు వేరే దారిలో వెళ్ళిపోయారు అందుకని నేను వాళ్ళ ఇంటి వరకు వెళ్లి ఇచ్చి వస్తాను నాకోసం వెయిట్ చేయకు ” అని చెప్పాడు.

” సరే వెళ్ళిరా నాక్కూడా అనిపించింది మన ఇంటి నుండి వివరమైన ఒకళ్ళము అక్కను పంపిస్తుంటే వెళ్లాల్సింది అని ఎలాగైనా నువ్వు వెళుతున్నందుకు సంతోషంగా ఉంది రా”అన్నది నీలాంబరి.

అలేఖ్య వాళ్ళ కన్నా ముందుగానే సాగర్ వాళ్ల ఇల్లు చేరుకున్నాడు పెళ్లప్పుడు అబ్బాయి వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా అప్పుడు మాత్రమే అందరూ వచ్చారు ఆ తర్వాత మళ్లీ ఇన్ని రోజులకి వెళ్లాడు సాగర్.

పదేళ్ల క్రితం నిర్మించిన ఇల్లు అంతా ఆధునికంగా ఉంది… గేటు తీయగానే లోపల అంతా చక్కని తోట ఆ తర్వాత మూడంతస్తుల నిర్మాణంతో ఎంతో అందంగా ఉంది..

లోపల అంతా చక్కని పెయింటింగ్స్ తో వేలాడుతున్న శాండిలీర్స్ తో కళకళలాడుతుంది… ఒక పక్కన అలేఖ్య సుధీర్ పెళ్లి ఫోటో ఫ్రేమ్ చేయబడి ఉంది మరొక పక్కన అలేఖ్య అత్తగారు మామగారు ఇంకా వారి కుటుంబ సభ్యులతో ఒక ఫోటో ఉంది . చక్కని అలంకరణతో ఇల్లంతా ఎంతో అందంగా ఉంది… అదంతా చూస్తూ లోపలికి వెళ్ళాడు సాగర్…

లోపల నుండి ఇద్దరు పెద్ద మనుషులు బయటకు వచ్చారు… వాళ్లు సుధీర్ నాయనమ్మ తాతయ్య….

లేచి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేశాడు సాగర్..

అప్పటికే సుధీర్ వాళ్లకి ఫోన్ చేసి ఉండడం వల్ల వాళ్లు సాగర్ ని గుర్తుపట్టి..

” కూర్చో నాయన ఇందాకే సుధీర్ ఫోన్ చేసి చెప్పాడు నువ్వు వస్తున్నావని” అని వాళ్ళు కూడా సోఫాలో కూర్చున్నారు.

పనమ్మాయి మంచినీళ్లతో పాటు కాఫీ కూడా తీసుకొని వచ్చి ఇచ్చింది…

కాసేపు సాగర్ జాబ్ గురించి తర్వాత గోపాలపురంలో కట్టిన బాలసదనం గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు వాళ్లకి కూడా నీలాంబరి చేసిన పనులు ఎంతో నచ్చాయి..

ఇలా మాట్లాడుకుంటూ ఉండగా రెండు కార్లు వచ్చి ఆగాయి…

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

విషయసూచిక – Content

నా ఇల్లు