వేదం వెల్లువై పొంగే చోట పలుకే రాని పంచదార గుళిక
జ్ఞానం కిరణాలై వెలుగులు విరజిమ్మే చోట అక్షరానికి ఆచూకీ లేని అడవి మల్లి
వర్ణాలన్నీ హరివిల్లై విరిసే చోట వర్ణమాల నెరుగని కొండమల్లి
స్వరాలన్నీ స్రవంతులై పారే చోట సరిగమ లెరుగని సురగంగ
సౌందర్యం సన్నజాజులై పరిమళించే చోట అందానికి ఆచూకీ లేని రెల్లు పూవు
సొగసులన్నీ సంపెంగలై గుబాళించే చోట తావి లేని కాగితపు పూవు
అయితేనేం అంబరమంటిన హృదయ వైశాల్యం ఆమె సొంతం
కల్మష మంటని నవ్వే తన ఆభరణం
భాష యాసల్లో నాటుతనం
నడక నడతల్లో మొరటుదనం
భేషజాలకు తాను అతీతం
డాబు దర్పాలకు వ్యతిరేకం
మండే ఎండలో తానో మలయ మారుతం
వణికించే చలి వేళ తానో వెచ్చని కంబళి
అవసరమైన చోట ఆపన్న హస్తమయింది
అపరాహ్ణవేళ అన్నపూర్ణయింది
ఆకలిగొన్న పేగులకు డొక్కా సీతమ్మ యింది
అమ్మతనం ఆమెను చూసి ఆమడ దూరం పారిపోయింది
అయితేనేం అనాధల పాలిట అమ్మయింది
అభాగ్యుల పాలిట అక్షయ పాత్రయింది
ఆమె మాట తేనెల తేట
ఆమె సాంగత్యం ఆలంబనల ఊట
అరిషడ్వర్గాలు ఆమె ముందు మోకరిల్లాయి
అందలం ఆమె ముందు చిన్నబోయింది
ఐశ్వర్యం అశనిపాతంలా అదృశ్యమైన ఆ ఇంట్లో ఆమె నవ్వే రత్నదీపమైంది
బంధుబలగం ఆ నవ్వుకు దాసోహ మయింది
మలిసంధ్య వేళ అల్జీమర్స్ పంజా విసిరింది
మర్మ మెరుగని ఆ నవ్వు అప్పుడూ వాడని పువ్వై విరిసింది
అన్నీ మరిచిన అంతరంగాన తనకు తానే అపరిచితురాలైంది
శూన్యం సృష్టించిన సుందర వనంలో ఆ నవ్వు మంచి గంధమై పరిమళించింది
మరువపు సుగంధాలను పంచింది
మొక్కవోని స్థైర్యానికి తానో దర్పణ మయింది
ఎగుడు దిగుడు నేలలో తానో శిఖరమై ఎదిగింది
ఎద ఎదలో తానో ఆకుపచ్చని జ్ఞాపకమయింది
ప్రతి మదిలో సస్యశ్యామలమై విలసిల్లింది