“నేటి భారతీయమ్-కాలమ్”

“విధి నిర్వహణలో నా అనుభవాలు -2”

డా. మజ్జి భారతి

ఈవినింగ్ ఓపీలో, ఒక్కోసారి కేసులు వరదలా ఒకదాని వెంట ఒకటొస్తుంటాయి. ఒక్కోసారి ఈవినింగ్ డ్యూటీ అయినా, నీకు ఫ్రీ టైం యిచ్చాములే ఎంజాయ్ చేసుకో అన్నట్టు ఒకటి, రెండు కేసులే వస్తుంటాయి. ఆరోజు రెండో క్యాటగిరిలో ఉన్నాను. మా హాస్పిటల్ చుట్టూ పెద్ద వాకింగ్ ట్రాక్, గార్డెన్ ఉంటుంది. ఖాళీ దొరికితే నడవడమనేది నాకెంతో ఇష్టమైన ప్రక్రియ. స్టెతస్కోపు పక్కన పెట్టి లేవబోతుంటే, లోపలకు రావాలా వద్దా అన్నట్టు క్యాజువాలిటీ ఎంట్రన్స్ దగ్గర టీనేజ్ లో ఉన్న ఒకమ్మాయి, చేతిలో ఓపీ చీటీ. పిలిచాను. బెరుకు బెరుగ్గా వచ్చింది.
ఈవినింగ్ ఓపీకి వచ్చే టీనేజ్ అమ్మాయిల విషయంలో రెండు రకాల అనుభవాలుంటాయి. ఒకటి… ఉదయం స్కూలుకో కాలేజీకో వెళ్తారు కాబట్టి, ఈ సమయంలో వచ్చి చూపించుకుంటారు. రెండు… బిడియపడుతూ, అటూ యిటూ చూస్తుంటారు. ఏమైందంటే చెప్పరు. అప్పుడు వాళ్ళని పక్క గదిలోకి తీసుకెళ్లి, యేమైందో చెప్పని నెమ్మదిగా అడిగితే, అప్పుడు వాళ్ళ సమస్య ఏమిటో చెప్తారు. చాలా వరకు ఆ సమస్య ఆడవాళ్లకు సంబంధించింది…అదే పీరియడ్స్ గురించి. ఎందుకొచ్చారో అడిగి, తర్వాత వాళ్ల కంప్లైంట్ కి సంబంధించిన వివరాలన్నీ అడుగుతాం. ఉదాహరణకి…ఎన్ని రోజులు లేటు? అది వరకు యెలా వచ్చేవి? బ్లీడింగ్ యెన్ని రోజులుంటుంది? కడుపు నొప్పుంటుందా? ఇటువంటి వివరాలన్నీ. దాంతో మాకో అవగాహనొస్తుంది.
చాలావరకు కడుపునొప్పి, పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోవడం, బ్లీడింగ్ ఎక్కువవ్వడమనే కంప్లైంటులతోనే, ఎక్కువమంది వస్తారు. వాటికి మందులిచ్చి, యివన్నీ అందరికీ వుండే ప్రాబ్లమ్సే, భయపడక్కర్లేదని కౌన్సిలింగ్ యిచ్చి పంపిస్తాం. ఎందుకంటే, యుక్త వయస్సులో ఆడపిల్లల్లో చాలా అపోహలుంటాయి గనుక.
కొద్దిమంది మాత్రం మిస్సింగ్ పీరియడ్ గురించి వస్తారు. చాలా భయపడుతుంటారు. అప్పుడు కూడా, ఏ చిన్న స్ట్రెస్ కు లోనైనా పీరియడ్స్ క్రమం తప్పి రావొచ్చని, అది సాధారణమే అని వారికి అర్థమయ్యేటట్టు చెప్తాం. ఇంకా వాళ్లు కన్విన్స్ కాకపోతే… అలాగని వాళ్ళ అనుమానమేమిటో మన ముందు పెట్టకపోతే… అప్పుడు సబ్జెక్టులోకి వస్తాను. ఇప్పుడు 8, 9వ తరగతి పాఠ్యాంశాల్లో పునరుత్పత్తి వ్యవస్థ గురించిన పాఠాలుంటాయి కాబట్టి, వారికి కొంత అవగాహనుంటుంది. గర్భాశయం ప్రయోజనాలు, అండం విడుదల, ఇంకా అవసరమైతే పునరుత్పత్తి వ్యవస్థ గురించి వివరిస్తూ, స్త్రీ పురుషుల కలయిక జరిగితేనే, పీరియడ్స్ రాకపోవడం గురించి భయపడాలి. లేకపోతే భయపడాల్సిన పనిలేదు. ఏ రకమైన మానసిక ఆందోళన ఉన్న పీరియడ్స్ రావడం లేటవుతుంది. దానిని పట్టించుకోనవసరం లేదని కౌన్సిలింగిస్తాను. దాంతో చాలా వరకు వాళ్ళ అనుమానాలన్నీ క్లియర్ అయిపోయి, వెళ్లిపోతారు.
ఇంత చెప్పినా వాళ్ళు వెళ్లకుండా, తటపటాయిస్తుంటే మనకర్థమైపోతుంది. వాళ్లు తప్పటడుగు వేసారని. గుచ్చి గుచ్చడిగితే యెప్పటికో నెమ్మదిగా చెప్తారు. చాచి లెంపకాయ కొట్టాలనిపిస్తుంది. తమాయించుకొని పెద్దవాళ్లను తీసుకురమ్మంటాం. ఏడవడం మొదలు పెడతారు. కాసేపు ఊరుకుని, అప్పుడు మొదలు పెడతాను కౌన్సిలింగ్ చెయ్యడం.
చేసిన చిన్న తప్పుకు ఎంత బాధ పడుతున్నావో చూసావు కదా! ఏదైనా అటు,యిటు జరిగితే నీ ప్రాణానికే ప్రమాదం. నీ మీద నమ్మకంతో, నిన్ను స్కూలుకి పంపించిన నీ తల్లిదండ్రులకేమని చెప్తావు? ఈ విషయం అందరికీ తెలిస్తే నీ భవిష్యత్తు ఏమవుతుంది? నీ కుటుంబ పరువు మర్యాదలేమౌతాయంటూ భయపెట్టి, బోధ చేసి, వాళ్ల తల్లిదండ్రులకు నేను చెప్తానని చెప్పి, వాళ్ళని పిలిపించి వాళ్లా విషయాన్ని తట్టుకునేటట్టుగా, వాళ్ళని మానసికంగా సిద్ధం చేసి, జరిగిపోయిందాని గురించి ఆలోచించినా వెనక్కి రాదు, జరగబోయేదాని గురించాలోచించాలని, భవిష్యత్తులో యెలా వుండాలో పిల్లలకెలా చెప్పాలనే విషయం మీద వాళ్ళకి కౌన్సిలింగిచ్చి, ట్రీట్మెంట్ యిచ్చి పంపిస్తాను.
అంతవరకు డాక్టరుగా నా బాధ్యత నిర్వర్తించినా, వాళ్ళు వెళ్లిపోయాక మొదలవుతుంది నాలో అంతర్మథనం. ఎటు వెళ్తోంది యువతరం? మన ఆచారాలు కట్టుబాట్లు యేమవుతున్నాయి? ఇంత చిన్న వయసులోనే ఆకర్షణలకు లొంగిపోతే, రేపు వాళ్ళు భవిష్యత్తునెలా తీర్చిదిద్దుకోగలరు? చేసిన చిన్న తప్పు, రేపు వాళ్ళ భవిష్యత్తు మీద మాయని మచ్చగా మిగిలిపోతే యేమవుతారు వీళ్లు? ఇటువంటి ప్రశ్నల పరంపర నన్నుక్కిరి బిక్కిరి చేస్తుంది.
పిల్లల మీద కోపమొస్తుంది. చిన్న వయసు కదా! తెలియకే కదా ఆకర్షణలకు లొంగిపోతారని, సమాధాన పడడానికి ప్రయత్నిస్తాను. తర్వాత పెద్దవాళ్ల మీద… ముఖ్యంగా తల్లి మీద కోపమొస్తుంది. కూతుర్ని ఆ మాత్రం కనిపెట్టుకోలేదా అని. పిల్లలు బయటికెళ్లాకెలా కాపలా కాస్తాం? ఉద్యోగాలు చేసే తల్లులైతే యెన్నని చూసుకోగలరని మనసుని సమాధాన పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇటువంటి కేసులొచ్చినప్పుడు మనసులోని అలజడి కొన్నాళ్ళు వెంటాడుతూనే వుంటుంది నన్ను.
ఎదిగిన కూతురు పెళ్లవ్వకుండానే తల్లవ్వబోతుందంటే ఆ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి యెలా వుంటుంది? ఎవరైనా ఊహించగలరు. ఆ పరిస్థితి రాకుండా వుండాలంటే… మనం కొంచెం శ్రద్ధ తీసుకోక తప్పదు. ముఖ్యంగా ఆడపిల్లలున్న తల్లులకు.
తల్లులూ… మీకెన్ని వ్యాపకాలున్నా మీ పిల్లల మీద ఒక కన్నేసి వుంచండి. వాళ్ల పీరియడ్స్ ఎప్పుడొస్తున్నాయనే విషయాలను కూడా గుర్తుపెట్టుకోండి. పిల్లలేం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ స్నేహితులెటువంటి వాళ్ళనే విషయాన్ని కాస్త పట్టించుకుంటే, ఈ పరిస్థితి రాదు. పిల్లల భవిష్యత్తును తీర్చేదిద్దుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులదే. కాబట్టి పిల్లలతో ఎక్కువ సమయం గడపండి. వాళ్లకి మీరున్నారనే భద్రతనివ్వండి. ఏ విషయాన్నైనా మీతో పంచుకోవచ్చనే భరోసాను కల్పించండి. మీకు తెలియకుండా, మీ పిల్లలు హాస్పిటల్ మెట్లు ఎక్కే పరిస్థితి రాకుండా చూసుకోండి. తల్లిదండ్రులకు నేనిచ్చే సలహా యిదే.
*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అవకాశం – నువ్వు The Choices

నీ ప్రపంచంలో నేను