అవకాశం – నువ్వు The Choices

14-9-2024 తరుణి పత్రిక సంపాదకీయం

ఆకాశం నీలిరంగు సముద్రం పైన పడుతున్నదా? సముద్ర నీటి రంగు నే ఆకాశం ప్రతిబింబిస్తున్నదా? ఈ ప్రశ్నలకు విజ్ఞాన శాస్త్రం సమాధానాలు చెబుతోంది. ఇవన్నీ మనుషుల నిర్థారణకు రావాల్సిన విశేషాలు. ఆకాశానికి సముద్రానికి అవసరమే లేదు. జీవులకు జీవవేదన కోసం ఈ ఆరాటం ఈ పోరాటం.ఇవి బ్రతుకు కూ చావుకు మధ్య జరిగే ప్రత్యేకమైన విషయం. దీనికి ముఖ్య కారణం అవకాశం అనేది అవసరార్థం వచ్చి పోతూ ఉంటుంది. ఇటువంటి అంశం గొప్ప సాంద్రత కలిగి ఉంటుంది. అవకాశాలు జీవితం విడదీయరాని బంధం తో ఉంటాయి.
జీవితం ఏమీ అందరాని చందమామ కాదు. అలా అని … నేల విడిచి సాము చేస్తేనే కష్టం . కోరికలు, ఆశలు ఉండడం సహజం . ఉండాలి కూడా ! అయితే కన్న కలలను , కోరికలను , ఆశలను నెరవేర్చుకోవాలంటే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఇదే ఆకాశానికి సముద్రానికి ఉన్న బంధం వంటిది. అవకాశాలు శూన్యంలో తచ్చాడవు . కంటికి కనిపించేవి కొన్ని మనసు గ్రహించగలిగేవి ఏ కొన్నో అవకాశాలు ఉంటాయి. తనదైన మార్గంలో పయనించే వాటిని తెలుసుకొని సాధన చేసి సాధించుకోవాలి. జీవన్మరణ సమస్యలు కాదు ఇవి. జీవించడం అనేది ఒక కళ. ప్రతిది డబ్బుతోనో హోదాతోనో అంతస్తును తెలివితోను ముడి వేయాల్సిన పనిలేదు. ఎంత చెట్టుకు అంత గాలి అని ఒక సామెత మనలో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. చిన్న చెట్టుకు కొంత గాలి పెద్ద చెట్టుకు ఎక్కువగాలి వేయడం సహజం . దీన్ని అచ్చంగా ఇలా ఉపయోగిస్తూ ఉంటారు , కానీ జీవితానికి ఉపయోగించవచ్చు. ఎవరికైనా వాళ్ళ బ్రతుకు వాళ్లకు ముఖ్యమే. తను చేసే కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. దీన్నే ఆ చెట్టుకు అంతే గాలి అనేది చెప్పడం.
ఒక లక్ష్యంతో పని చేస్తే ఫలితం తప్పకుండా సాధించవచ్చు. లక్ష్యశీలురకు లక్ష్య శూన్యులకు మధ్య ఉన్న భేదం అవకాశాలను చేత పట్టుకుని సాధించే వాళ్ళలోనే చెప్తాం. లైఫ్ అండ్ డెత్ ఈ రెంటి మధ్యన ఛాయస్ లు ఉంటాయి. Choices in between life and death. ఏ స్థాయిని బట్టి ఆ స్థాయికి ఏ వయస్సును బట్టి ఆ వయసుకు ఏ కృషికి తగినట్టుగా ఆ కృషికి తప్పకుండా అవకాశాలు కనిపిస్తూనే ఉంటాయి. స్వచ్ఛమైన మనసుతో స్పష్టమైన అభిప్రాయంతో చేజిక్కించుకోవాలన్నా జిజ్ఞాసతో కృషి చేసే ప్రతి ఒక్కళ్ళు అవకాశాలను అందుకుంటారు.
చిన్నప్పటి ఉండే డాక్టర్ను కావాలి అని అనుకునే పిల్లలు అదే కోణంలో వాళ్ల చదువుకోసం అడుగులు వేస్తారు.పాఠ్యాంశాలలో సైన్స్ కు సంబంధించిన విషయాలను చాలా ఇష్టంగా నేర్చుకుంటారు. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనుకునే లక్ష్యంతో ఉన్న పిల్లలు తప్పకుండా విజయ సోపానాలు అధిరోహిస్తున్నటువంటి పోలీస్ అధికారుల విషయాలను తెలుసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే లక్షణాలు కొన్ని ఉంటే ఇంటి పరిసరాలలో ఎవరైనా వాళ్ళకి నచ్చిన విధంగా మంచి పొజిషన్స్లలో ఉంటే వాటి ప్రభావమైన తప్పకుండా పడుతుంది. దీన్నే బ్రష్ అప్ చేసుకుంటూ ఉంటారు.. అంటే, ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవడం వాళ్ళనుకునే ఉద్యోగానికి చేరుకోవాలనుకునే పరీక్షలను రాయడం, పరీక్షలు రాయడానికి ముందు శిక్షణ తీసుకోవడం వంటివి చేస్తారు.
డాక్టర్ వృత్తి కొరకు వెళ్ళిన వాళ్ళు ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేక పోతే నర్స్ గానైనా వెళ్లాలనుకుంటారు. అమెరికా వంటి విదేశాలలో నర్స్ ఉద్యోగానికి చాలా విలువ ఎక్కువ. హాస్పిటల్లో నర్సు ఉంది, ఉన్నాడు అంటే డాక్టర్ లేకున్నా కూడా రోగి క్షేమంగా బయటపడతాడు అని ఒక నమ్మకం. అదేంటో భారతదేశంలోనే ఇటువంటి అభిప్రాయాలు లేవు. కానీ మన దగ్గర కూడా నర్సులు చేసే త్యాగం ఇంత అంతా కాదు. సేవాభావంలో ముందు చెప్పుకునే వ్యక్తులు వాళ్ళు.
అలాగే ఐఏఎస్ , ఐపీఎస్ కోర్సులు ఉంటాయి. ఐపీఎస్ కావాలనుకుని ప్రయత్నాలు చేస్తున్న వాళ్లు పోలీస్ వ్యవస్థలో ఉన్న తర్వాత స్థాయి ఉద్యోగాలైన వదులుకోరు.
న్యాయ శాస్త్రం పట్ల నమ్మకము ఇష్టమున్నవాళ్లు న్యాయాధికారులు కావాలని ప్రయత్నిస్తుంటారు.‘లా’ చదవాలని …దానికి తగిన పరీక్షలను రాయడానికి ముందు న్యాయాధికారులను, న్యాయవేత్తలను, న్యాయమూర్తులను పరిశీలిస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు అంటే లక్ష్య సిద్ధి ఉన్నవాళ్లు ఈ మార్గంలో పయనిస్తారని చెప్పడానికి ! ఏ లక్ష్యము లేకుండా … కనిపిస్తున్న ఏ అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోకుండా కొంతమంది ఎంతసేపు ఇతరుల మీద ఆధారపడి, ఇతరులపై నిందలు వేస్తూ జీవితాలను వెళ్ళదీస్తూ ఉంటారు.
క్రీడలలో ఆసక్తి ఉన్న పిల్లలు చాలామంది ఉంటారు. కొంతమందికే అవకాశాలు వస్తాయి, కొంతమంది వచ్చిన అవకాశాలను చేరుకోలేరు. గ్రూపులో ఆడే ఆటలు, సమూహ క్రీడలు కొన్ని ఉంటాయి, వ్యక్తిగతంగా ఆడే ఆటలు కొన్ని ఉంటాయి. ఈ ఆటలలో కూడా వాళ్ళ శక్తి యుక్తులను ప్రదర్శించాలి. అంటే, వాళ్ల జీవితం మొత్తం ఒక పోరాట యోధుడిలా క్రీడలలో తమ శక్తిని పెట్టిన వాళ్ళు తప్పకుండా సక్సెస్ వైపు అడుగులు వేస్తారు. ఇలా ఆటలలో వేళ్లాలనుకునే పిల్లలకు చదువు పట్ల కొంత వెనకడుగు వేయాల్సి వస్తుంది. క్లాసులో మొట్టమొదటి ర్యాంకు రావాలి అని పరితపించే పిల్లలకు క్రీడల్లో ఉన్న పిల్లలకు కొంత వ్యత్యాసం ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకే లేచి క్రీడల శిక్షణ కొరకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలు చదువు కొరకు వాళ్ళ పాఠ్యాంశ పరీక్షలు అంత శ్రద్ధగా చదవలేరు. వాళ్ళని తల్లిదండ్రులు బలవంత పెట్టి రెండిట్లోనూ అలాంటి విజయమే కలగాలి ఆ పిల్లలకు అని అనుకుంటే వాళ్ళు డిప్రెషన్ కి వెళ్లే అవకాశం ఉంటుంది . వాళ్ళ కు కొంచెం స్వేచ్ఛనివ్వాలి తల్లిదండ్రులు . అప్పుడే ఆటలలో రాణిస్తారు . తరగతి లోని మార్కులు కొంత తక్కువ వచ్చినా ఫెయిల్ అవ్వకుండా ఉంటే చాలు . పాస్ అవుతూ వెళ్ళినా చాలు . కానీ తప్పనిసరి చదవవలసిన కొన్ని డిగ్రీ కోర్స్ వరకు తప్పనిసరి చదవవలసి వస్తుంది . అంతవరకు చదివినా చాలు . కానీ ..మరి .. క్రీడ పైన తగినంత కృషి చేస్తున్నారా లేదా అనే పరిశీలన తప్పనిసరి తల్లిదండ్రులుది ఉండాలి . ఇక్కడ కూడా తల్లిదండ్రులు డిక్టేటర్ షిప్ తో ఉన్నారంటే ఆ పిల్లలు అటు ఆటకు కాకుండా ,ఇటు చదువుకు కాకుండా రెంటికి చెడ్డ రేవడి లా అయిపోతారు.
అయితే అవకాశం వచ్చిన ప్రతి ఆటలోనూ పాల్గొని తన శక్తిని తాను పరిశీలించుకుంటే ముందు ముందు ఎలాంటి శిక్షణతో ఎలాంటి శ్రమతో సాధించగలను అనేది ఆ పిల్లలు తెలుసుకోగలుగుతారు. ఇది వయసుతో పెరిగే బుద్ధి వలన, బుద్ధితో పెరిగే విజ్ఞత వలన, విజ్ఞతతో వచ్చే ఓపిక వలన తప్పకుండా కార్యసిద్ధిని చేరుతారు.
అందుకే 7 , 8 , 9 తరగతుల వరకే విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలు ఏమిటో ఉపాధ్యాయులు గ్రహించాలి . గ్రహించిన విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి. తమ పిల్లలలో ఉన్నటువంటి ఆసక్తిని ముందే తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు చెప్పాలి. వీటి కొరకే పేరేంట్ టీచర్ మీటింగ్ అనేవి పెడతారు . వీటిని సద్వినియోగం చేసుకున్న వాళ్లు సక్సెస్ అవుతారు. ఇక్కడ కూడా మాటకు చాలా విలువ ఉంటుంది. మనం మేం మాట్లాడుతున్నాము ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నాము అనే విషయం వల్లనే మీరు అనుకునే పనులు సాధించగలుగుతారు . టీచర్స్ మీ పిల్లల క్షేమం కొరకే ఉన్నారు గానీ కేవలం మీ యొక్క కూతురు కొరకు …కొడుకు కొరకు .. ఉన్నారని అనుకోవడం చాలా పొరపాటు. ప్రతి దినం 6 క్లాసులు వివిధ తరగతులు అవి కూడా‌….. తీసుకునే ఉపాధ్యాయులు అందరి పైన సమదృష్టితో ఉంటారు . విద్యార్థిగా వచ్చినటువంటి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు కావచ్చుఒక్కతే కూతురు కావచ్చు కానీ ఉపాధ్యాయులకు విద్యార్థులు అందరూ కూడా తమ పిల్లలాంటివాళ్లే . అందుకొరకు క్లాస్లో ఉన్న 40 నిమిషాల్లో ప్రతి విద్యార్థిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తించే సమయం వాళ్ళకి అన్ని వేళల్లో ఉండకపోవచ్చు . గమనించలేని విషయాలు ఏమైనా ఉంటే తల్లిదండ్రులు ప్రత్యేకంగా కలిసి చెప్పుకునే అవకాశమే ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ఉన్నటువంటి సభా వేదిక కార్యక్రమం. అలా తల్లిదండ్రుల, పిల్లల జాగ్రత్త వల్ల అవకాశాలు వదులుకోకుండా ముందు కు పోతారు.
అవకాశం అందిపుచ్చుకున్న వాళ్ళే అనుకున్నవి సాధించి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఆకాశం అంతూ సముద్రం లోతూ చూడలేకపోయినా. నీలి రంగు వెనుక నలుపు తెలుపు రంగు లు పరుచుకున్నట్టు సమృద్ధిగా జీవించే అవకాశం పొందవచ్చు.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

శనార్తులు

“నేటి భారతీయమ్-కాలమ్”