మన చూరు కిందనే ఉండి
చేతికందని ఉట్టికి
వెదురు బొంగు మెట్లైనట్టు
అడుగుల అడుగేసుకుంట
అలుకుపూత చేసుకుంట
మనకు మనం
ఇగ మనదే అనుకున్న మాట
మన మాట
మనసులున్న మాట
మనదైన మాట
మనాదైన మాట
ఇయ్యాల తలకుపోసుకుంది
అరుగుమీద కూసుండి
అల్కగ
అందరి ముచ్చట అర్సుకున్నట్టు
అట్లిట్ల రాలే ఈ పండుగ
కంచెలు దెంపుకొని
గెట్లు పలగొట్టుకొని
జైలు గోడలమీద బొగ్గురాతలతోటి
తెలంగాణ గీత గీసిండ్రు
నా గొడవ అని మన గొడవెందో చూపెట్టి
నిప్పుల రాగం తీసిండ్రు
ఒక్కరా ఇద్దరా
బండెనక బండి కట్టినోళ్ళు
కాగడాలు చేత బట్టినోళ్లు
మోదుగుపూల ముల్లెనిప్పి
సూదిల దారం ఎక్కిచ్చినోళ్లు
కలం తెడ్డుతోటి మన
కట్టు బొట్టు కొట్టుక పోకుండ
ఈదుకొచ్చినోళ్ళు
మనది మనదే అనిపించుకోవడానికి
ఆగమైనోళ్ళు
యాడున్నా యాదిల ఉంటరు
కండ్లల్ల తేలుతుంటరు
యాదాడికోపారి వాళ్ల
పాదాల మీద పూలు జల్లి
నిండు దీవెనార్తుల కోరి
శనార్తుల మొక్కు తీర్సుకుంటున్న
ఇయ్యాల ఇక్కడ
యాది జేసుకుంటున్న