నులివెచ్చని గ్రీష్మం

ధారావాహికం -12వ భాగం

జరిగిన కథ…

పిల్లల కోరిక మీద అర్జున్, సుభద్ర అమెరికా వస్తారు. ముందుగా కొడుకు అభిమన్యు దగ్గరకు మినియాపోలీస్ వస్తారు. కొడుకు కుటుంబముతో హాయిగా గడుపుతుంటారు. అక్కడ సీనియర్ సెంటర్ ఉందని, అందులో వివిధ రకాల కార్యక్రమాలు సీనియర్ సిటిజన్స్ కోసం నిర్వహిస్తుంటారని తెలిసి అందులో చేరుతారు. అక్కడ కలుస్తున్న  అమెరికన్స్ ద్వారా అమెరికా జీవనవిధానాలను ఆసక్తిగా తెలుసుకుంటుంటారు. అమెరికాలో కొన్ని రాష్ట్రాలలో డెత్ డిగ్నిటీ ని ఎలౌవ్ చేస్తారని తెలుసుకొంటాడు అర్జున్. ఆరోజు కొద్దిగా మనసు అల్లకల్లోలం అవుతుంది…

 

ఇక చదవండి…

“అరే! మా గాంధీజీ మూడు కోతుల బొమ్మ!” గులాబీరంగు దుపట్టా మీద పెట్టి ఉన్న, మూడుకోతుల ఇత్తడి బొమ్మను చూస్తూ ఆశ్చర్యంగా అంది సుభద్ర.

సీనియర్ సెంటర్ నుంచి హెలెన్ ఆహ్వానించటముతో, హెలెన్ ఇంటికి వచ్చారు సుభద్రార్జున్ లు. సిటీంగ్ రూం లో కూర్చోబోతూ, పక్కన బల్ల మీద పెట్టిన ఉన్న మూడుకోతుల ఇత్తడి బొమ్మను చూసి ఆశ్చర్యంతో హెలెన్ ను అడిగింది.

“మా డాడీ ఢిల్లీ నుంచి నాకోసం ఈ బొమ్మ, ఇదో ఈ డ్రెస్ తచ్చారు. పాంట్, షర్ట్ చినిగిపోయాయి. దీనిని మటుకు గుర్తుగా దాచుకున్నాను” దుపట్టాను చూపిస్తూ జవాబిచ్చింది హెలెన్.

“మీ డాడీ ఢిల్లీలో ఉన్నారా? ఎప్పుడు?” ఆసక్తిగా అడిగింది సుభద్ర.

“మా డాడీ ఢిల్లీలో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. డాడీ నాకు తెచ్చిన డ్రెస్ లాంటిదే నువ్వు వేసుకొని వచ్చావు కదా! అది చూడగానే డాడీ గుర్తొచ్చారు” అంది హెలెన్.

“ఢిలీలో ఏదైనా జాబ్ చేసారా?”  ఈసారి అర్జున్ అడిగాడు.

“మీరు వింటానంటే ఆ కథ చెపుతాను” నవ్వుతూ అంది హెలెన్.

“ఓ తప్పకుండా వింటాము. చెప్పు” అన్నాడు అర్జున్.

“కూర్చోండి” వారితో అని, కిచెన్ లోకి వెళ్ళి, మూడు కప్స్ లలో టీ, మంచినీళ్ళ గ్లాస్ లు ట్రే లో తెచ్చింది. వాళ్ళకు ఇచ్చి, తనూ ఓ కప్ తీసుకొని, ఎదురుగా వాళ్ళ ముందు కూర్చుంది. కొద్ది సేపు ముగ్గురూ టీ తాగుతూ మౌనంగా ఉన్నారు. ఏదో గుర్తు తెచ్చుకుంటున్నట్లు‌ కాసేపు మౌనంగా ఉండి, రెండుమూడు నిముషాల తరువాత చెప్పసాగింది.

“అప్పటి సంఘటనలన్నీ కళ్లకు కట్టినట్లు ఇప్పటికీ కళ్లముందు కనిపిస్తుంటాయి. అది మా జీవితంలో చీకటి కాలం అనే చెప్పాలి…”

***

అవి రెండవప్రపంచ యుద్దం ముమ్మరంగా సాగుతున్న రోజులు!

“అమ్మా ఇంకెంత సేపు?” మేరీ వడిలో తలపెట్టి, మునగదీసుకొనిపడుకున్న అయిదేళ్ళ హెలెన్ అడిగింది.

“తొందరలోనే చేరుతాము తల్లీ పడుకో” హెలెన్ తో అనునయంగా అంటూ, కుదురుగా కూర్చోకుండా కదులుతున్న పదేళ్ళ రాబర్ట్ ను కూర్చోబెడుతూ, కంపార్ట్మెంట్ అంతా కలియజూసింది మేరీ. కంపార్ట్మెంట్ అంతా జనాలు నిండిపోయి ఉన్నారు.దాదాపు అందరూ ఆడవాళ్ళు, పిల్లలే! పిల్లల ఏడుపులు, పెద్దవాళ్ళ గదమాయింపులు, మధ్యమధ్య ఒకరిమీద ఒకరు అరుచుకునే అరుపులతో కంపార్ట్మెంట్ అంతా గందరగోళంగా ఉంది. రైలు ఎక్కి ఎన్ని గంటలయ్యిందో కూడా తెలియటము లేదు. చిన్నగా ఆగి ఆగీ కదులుతోంది. అసలు బయలదేరేటప్పుడే ఇదిగో, అదిగో అంటూ ఉన్నచోటునే కొన్ని గంటలు ఆపి ఉంచారు. ఇది ఎప్పటికి గమ్యం చేరేనో! విచారంగా అనుకుంది మేరీ. ఆడపడుచు న్యూయార్క్ వచ్చేయి వదినా. ఒక పని చూసుకొని ఇక్కడే అందరమూ కలిసి ఉందాము అని పదే పదే కబురు పంపుతుండటముతో ధైర్యం చేసి, పిల్లలను తీసుకొని, ఉన్న ఊరు వదిలి వస్తోంది. అసలు తనేమైనా పని చేయగలదా? ఇంత వరకు బయట ప్రపంచమే తెలియదు తనకు. రూబెన్ తనను కాలు కింద పెట్టకుండా చూసుకునేవాడు. ఇద్దరు పిల్లలను, ఇంటిని చూసుకుంటూ సంతోషంగా ఉండేది. ఈ యుద్దం తమ జీవితాలను చిన్నాభిన్నం చేసింది. తమ ముచ్చటైన సంసారం, యుద్దంలోకి రూబెన్ వెళ్ళక తప్పకపోవటముతో రోడ్డున పడింది. రూబెన్ చేసే చిన్న ఉద్యోగములో వచ్చే కొద్దిపాటి డబ్బుతోనే సంసారం గుట్టుగా నడుపుకునేది. సైన్యంలో సిపాయిగా చేరాడు. బర్మా వెళుతున్నాను అన్నాడు. ఎప్పటికి తిరిగి వస్తాడో, అసలు వస్తాడో రాడో తెలియని పరిస్థితి. ఈ చిన్నపిల్లలను తీసుకొని ఊరూరా తిరిగింది. చివరికి ఆడపడుచు దగ్గరికి వెళుతోంది. అక్కడ ఎట్లా ఉంటుందో తలుచుకున్నా కొద్దీ దుఃఖం ముంచుకువస్తోంది. మేరీ ఆలోచనలతో సంబంధం లేకుండా అక్కడక్కడ మజిలీలు చేస్తూ రైలు వారం రోజులకు గమ్యం చేరింది.

ఆడపడుచు రెబెకాభర్త జానీ కూడా యుద్దంలోకి వెళ్ళాడు. రెబెకా ఊళ్ళు మారుతూతిరుగుతూ, న్యూయార్క్ లో చిన్నపాటి ఉద్యోగాలు దొరుకుతున్నాయని తెలిసి, వచ్చింది.పిల్లలతో ఒక రూరల్ కమ్యూనిటీలో చిన్న గది తీసుకొని ఉంది. వదినను కూడా అక్కడికి రమ్మని పిలిచింది. తన ఇంటి పక్కనే ఒక చిన్నగది ఇప్పించింది. అక్కడఉన్న ఆడవాళ్ళందరూభర్తలు యుద్దములోకి వెళ్ళి, ఒంటరిగా పిల్లలతో ఉన్నవారే! అప్పటి వరకు ఇంటి నుంచి బయటకు వెళ్ళని వారంతా అక్కడే ఉన్న షాప్స్ లలో, ఖార్కానాలల్లో చిన్నచిన్న ఉద్యోగాలల్లో చేరారు. ఆ కమ్యూనిటీ లోనే ఉన్న స్కూల్ లో పిల్లలను చేర్పించారు. చిన్నగా జీవితం ఒక గాడిన పడుతోంది. రూబెల్ వెళ్ళి పది సంవత్సరాలు దాటిపోయింది. బర్మా వెళ్ళిన తరువాత కొన్ని రోజులు మాత్రం అతని నుంచి కబురు వచ్చేది. ఆ తరువాత చిన్నగా అవీ ఆగిపోయాయి. ఎక్కడ ఉన్నాడో తెలియలేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి. రాబర్ట్ చదువు ముగించి ఉద్యోగం లో చేరటముతో కాస్త వెసలుబాటు వచ్చింది. హెలెన్ కూడా హైస్కూల్ చదువు ముగించి నర్సింగ్ కోర్స్ లో చేరింది. రూబెల్ ఎక్కడ ఉన్నాడో, అసలు ఉన్నాడోలేడోనని మేరీ దిగులుపడుతూ ఉంటుంది. హెలెన్మటుకు తండ్రి బ్రతికే ఉన్నాడని, తప్పక తిరిగి వస్తాడని ఎదురు చూస్తోంది. అలాంటి రోజులలో ఒక సిపాయి వచ్చి, యుద్దానికి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వస్తున్నారనీ, రూబెల్ ఇండియాలో, ఢిల్లీలో ఉన్నాడని త్వరలోనే వస్తాడని కమ్మని కబురు తెచ్చాడు. తను, రూబెల్, జానీఉన్న ఫొటోను ఇచ్చాడు. ఆ ఫొటోను చూసిన వారి ఆనందం అంబరమంటింది.ఒకొకరొకరుగా యుద్దానికి వెళ్ళిన వారంతా తిరిగి వస్తున్నారు. కాలనీ అంతా ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. పండుగ వాతావరణం నెలకొంది. పదిహేను సంవత్సరాల తరువాత తిరిగి వస్తున్న రూబెల్ కోసం ఆత్రుతగా మేరీ, రాబర్ట్, హెలెన్ ఎదురుచూస్తున్నారు. ఆ రోజు రానే వచ్చింది. గుమ్మం లో నిలబడ్డ రూబెల్ ను చూసి ఎవరికీ నొటి వెంట మాట రాలేదు. కళ్ళనీరు కారుతుండగా రూబెల్ ను హత్తుకుపోయారు ముగ్గురూ. ఆనందాశ్రువులతో ముగ్గురిని ఒకేసారి హత్తుకున్నాడు రూబెల్!

“నన్ను బర్మా నుంచి ఇండియాకు పంపారు. ఆ రోజులల్లో కొన్ని రోజులు,క్షేమసమాచారం తెలిపేందుకు ఏ వసతీ లేకుండింది. అలా ప్రయాణిస్తూ ఇండియా చేరేసరికి కొన్ని నెలలు పట్టింది. మమ్మలిని ఢిల్లీ పంపారు. అక్కడకు చేరుకున్నాక, మీ సంగతి తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేసాను. మన పాత ఊరిలో, నువ్వు పిల్లలను తీసుకొని వెళ్ళిపోయావని అతి కష్టం మీద తెలుసుకోగలిగాను. కానీ ఎక్కడి వెళ్ళారో తెలియలేదు.  ఈ మధ్య, జానీ ఫ్రెండ్ ఒకతను, రెబెకా న్యూయార్క్ వచ్చిందనీ, నువ్వు పిల్లల కూడా తన దగ్గరకు వచ్చారని చెప్పాడు. అప్పుడే జానీ ఫ్రెండ్ మిమ్మలిని చూడటము తటస్థించింది. నీకు మా ఫొటో చూపించానని, మా గురించి చెప్పానని కబురు పంపాడు. ఆ యుద్దవాతావరణంలో  క్షణక్షణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉన్నాము. ఎన్నో సార్లు చావుకు దగ్గరగా వెళ్ళాను. మిమ్మలిని తలుచుకోని రోజే లేదు. నువ్వు చంటి పిల్లలతో ఎలా ఉన్నావో, ఇల్లు వదిలి వెళ్ళని దానివి ఇప్పుడు పిల్లలను ఎలా పెంచుతున్నావో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో అని అనుక్షణం బాధ పడుతుండేవాడిని. మిమ్మలిని మళ్ళీ కళ్ళారా చూస్తానని అనుకోలేదు” వాళ్ళను అలా దగ్గరగా పొదుపుకొనే, డగ్గుత్తికతో అన్నాడు రూబెల్.

కాసేపటికి అందరూ ఆ ఉద్వేగం నుంచి బయటకు వచ్చారు. రూబెల్ తను ఢిల్లీ నుంచి మేరీ కోసం తెచ్చిన అందమైన చీర, రాబర్ట్ కోసం తెచ్చిన తాజ్ మహల్ బొమ్మ, హెలెన్ కు గులాబీరంగు, లేస్ తో కుట్టిన పంజాబీ డ్రెస్, మూడు కోతుల బొమ్మ ఇచ్చాడు. అవి చూసుకొని వారంతా మురిసిపోయారు.

“ఈ మూడు మంకీస్ ఏమిటి ఇట్లా ఉన్నాయి?” ఆసక్తిగా అడిగింది హెలెన్.

“అవి గాంధీజీ ఏర్పరిచిన బొమ్మలు. మనిషి మనసు కోతిలాంటిది. స్థిరంగా ఉండదు. ఎక్కువగా చెడు వైపే ఆకర్శించబడుతుంది. కానీ మనసును కోతి గంతులేయకుండా, చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడ వద్దు అని అదుపులో పెట్టుకోవాలి అని అవి ప్రభోదిస్తున్నాయి” వివరించాడు రూబెల్.

డాడీ తెచ్చిన బహుమతులు చాలా నచ్చాయి. అందులోనూ ఆ బొమ్మ, దాని నీతి చాలా నచ్చింది హెలెన్ కు. అందుకే దానిని చాలా జాగ్రత్తగా దాచుకుంది.

జానీ, రూబెల్ తిరిగి వచ్చిన సందర్భంలో రెబెకా చక్కని విందు ఏర్పాటు చేసింది.

***

చెప్పటం ఆపింది హెలెన్.

“మరి ఆ తరువాత మీ డాడీ ఉద్యోగం లో చేరారా? మీరంతా న్యూయార్క్ లోనే ఉండిపోయారా?  నీ పెళ్ళి ఎప్పుడు అయ్యింది?” ఆత్రుతగా కొద్దిగా ముందుకు వంగి అడిగింది సుభద్ర.

“డాడీ న్యూయార్క్ లోనే ఒక ఫాక్ట్రీలో ఉద్యోగంలో చేరాడు. వాళ్ళు అక్కడే స్థిరపడ్డారు. మా అత్త ఇచ్చినఆ పార్టీలో జోయ్ కలిసాడు. మేమిద్దరమూ ఒకరినొకరం ఇష్ట పడ్డాము. ఆరునెలలు డేటింగ్ చేసాక, ఇరువైపుల పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకున్నాము. కొద్దిరోజులకు జోయ్, ఇక్కడ ఇద్దరు పార్ట్నర్స్ తో బిజినెస్ మొదలు పెట్టాడు. ఇక్కడి వచ్చాక, కొద్దిరోజులకు ఈ ఇల్లు కొనుక్కున్నాము. అప్పటి నుంచీ నా జీవితం అంతా ఈ ఇంట్లోనే గడిచిపోయింది. మా పిల్లలు ముగ్గురూ ఇక్కడే పెరిగారు” చెపుతూ తమ పెళ్ళిఫొటో చూపించింది.

“అబ్బ ఎంత అందంగా ఉన్నారో! చిన్నగా క్యూట్ గా ఉన్నారు. అప్పుడు మీ వయసెంత? మరి నువ్వు నర్స్ కోర్స్ చేసావు కదా ఉధ్యోగం చేయలేదా?” ఆ ఫొటో చూస్తూ అడిగింది సుభద్ర.

“నాకు 20 సంవత్సరాలు, జోయ్ కు 25. చేయలేదు. అయినా ఆకోర్స్ ఎక్కడ పూర్తి చేసాను?ప్రేమలో పడి పెళ్ళి చేసేసుకున్నానుగా”  పెద్దగా నవ్వుతూ అని, పిల్లల ఫొటోతీసి, వీడు మా పెద్ద అబ్బాయి, వాడి కొడుకు, కూతురు, భార్య. వీడు మా చిన్నవాడు, వాడికొడుకులు ఇద్దరు. ఇది మా అమ్మాయి, తన పిల్లలు ముగ్గురు. కింద కూర్చున్న పిల్లలిద్దరూ మా గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్, కూతురి కూతుర్ల పిల్లలు.  అప్పట్లో డేకేర్ సెంటర్ లు లేవు. మా పిల్లలను, ఇంటిని చూసుకోవటమే నా ఉద్యోగం అన్నాడు జోయ్” పెద్దగా నవ్వింది హెలెన్.

పెద్దగా నవ్వుతున్న హెలెన్ వైపు ఓసారి చూసి, “మరి వాళ్ళిప్పుడు ఎక్కడున్నారు?” అడిగాడు అర్జున్ ఫొటోను చూస్తూ.

“పెద్దవాడు ఈ పక్క కమ్యూనిటిలోనే ఉంటాడు. చిన్నవాడు ఆస్ట్రేలియా, కూతురు మినటొంకా లో ఉంటారు” ఫొటోను ఆప్యాయంగా తడుముతూ చెప్పింది హెలెన్.

“మరి జోయ్…” సంశయంగా ఆపింది సుభద్ర, అర్జున్ వారిస్తున్నది చూసుకోకుండా.

“పరవాలేదు అడగనీయండి అని, కొద్దిగా ఆగుతూ… అరవై రెండు సంవత్సరాలు, నాకు ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చి, హట్ఠాత్తుగా నిద్రలోనే వెళ్ళిపోయాడు” ఆపీ… ఆపీ… చెప్పింది హెలెన్.

“అప్పటి నుంచీ ఇలా వంటరిగానే ఉంటున్నావా?” అడిగింది సుభద్ర.

“అవును. నేనూ, జోయ్ కలిసి అరవైరెండు సంవత్సరాలు ఇక్కడ కాపురం చేసాము. ఎన్నో జ్ఞాపకాలు, జోయ్ గుర్తులు ఉన్నాయి. వాటితోనే ఉండటం నాకు ఇష్ఠం” చెప్పింది హెలెన్.

“పిల్లల దగ్గరకు వెళ్ళ వచ్చు కదా? వంటరిగా ఉంటే ఆ జ్ఞాపకాలే ఏడిపిస్తాయి. బతకనీయవు. డిప్రెషన్ వస్తుంది కదా” మృదువుగా అన్నాడు అర్జున్.

“పిల్లల దగ్గరికా? కూతురు గ్రాండ్ చిల్డ్రెన్స్ ను చూసుకోవాలి. ఎప్పుడూ బిజీ. వచ్చి ఉండమంటుంది కానీ నాకే ఇష్ఠం ఉండదు. అందుకే వీకెండ్స్ లో వచ్చి కాసేపు నాతో టైం స్పెండ్ చేసి వెళుతుంటుంది. ఇంకా జోయ్ పార్ట్నర్స్ లలో ఒకరు చనిపోయారు. ఇంకొకతను ఉన్నాడు. వారి భార్యలు, ఇద్దరి పేర్లూ మారియన్ నే, వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్. తోచనప్పుడల్లా కలుస్తుంటాము. చర్చ్ లో వాలెంటీర్ గా చేస్తుంటాను. రేపు ఒక ఫ్యునరల్ ఫంక్షన్ ఉంది. వెళ్ళి హెల్ప్ చేస్తాను. సీనియర్ సెంటర్ కు వెళుతాను” అంది.

కాస్త సెంటిమెంట్ తో “కొడుకుల దగ్గరికి వెళ్ళవచ్చుగా?” అడిగింది సుభద్ర.

“కొడుకుల దగ్గరకా? చిన్నవాడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. పెద్దవాడు ఇప్పటికి ఇద్దరికి డైవర్స్ ఇచ్చి, మూడో భార్యను వెతుకుంటూ బిజీ” చెపుతూ పెద్దగా నవ్వింది.

లేత గులాబీ రంగులో ఉండే హెలెన్ మొహమంతా,  ఆ నవ్వుకు ముదురుగులాబీ రంగులోకి మారిపోయింది. నోరంతా తెరిచి పెద్దగా నవ్వుతున్న హెలెన్, కనురెప్పల మాటున దాగిన కన్నీటిని చూస్తూ ఉండిపోయారు సుభద్రార్జున్!

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సావిత్రీబాయితో కలిసి నడిచిన ఫాతిమా షేక్

శనార్తులు