ఆనాడు నిజాం నిరంకుశ పాలనలో తెలుగు భాషకు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణా భాషకు యాసకు జరిగిన అన్యాయాన్ని చూసి బాధపడి తెలుగు భాషకు ,తెలంగాణా భాషకు తగిన గౌరవం లభించాలని,మన భాషలో యాసలో రచనలు చేయాలని ఆశించి బాధపడ్డ తెలంగాణా ముద్దు బిడ్డ.
ఒక ధిక్కారస్వరం,నిరహంకారం,ఆవేశం,ఆలోచన ,సమాజంలో జరిగే అన్యాయాలను రచనల ద్వారా ఎండగట్టే మహనీయుడు.అందరి గొడవలను తన బాధగా భావించి ‘ నా గొడవ ‘ లో వినిపించి సమాజంలో మార్పు రావాలని ఆశించి గొంతెత్తిన కలం యోధుడు శ్రీ కాళోజీ నారాయణ రావు గారు.
1914 సంవత్సరం సెప్టెంబర్ 9 వ తేదీన బీజాపూర్లోని రట్టిహళ్ళి అనే గ్రామంలో రంగారావు,రమాబాయి దంపతులకు జన్మించాడు.కాళోజీ చిన్నతనంలోనే తెలంగాణాకు వలస వచ్చారు తల్లిదండ్రులు. కాళోజీకి మరాఠీ,కన్నడ,తెలుగు,ఉర్దూ,ఆంగ్ల భాషల్లో నిష్ణాతుడు.
నిజాం ప్రభుత్వంలో ఉర్దూ రాజభాషగా ఉన్నందున ఉర్దూమాధ్యమంలో చదివినప్పటికి తెలుగు భాష పట్ల తెలంగాణ భాష పట్ల చాలా అభిమానం కలవాడు.
నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు.ఆంధ్ర మహాసభలు,ఆర్యసమాజం,తెలంగాణా రైతాంగ పోరాటం,తెలంగాణ తొలిదశ,మలిదశ ఉద్యమాలలో చైతన్య వంతంగా తన వంతు పాత్రను పోషించాడు.తెలంగాణాలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఒక తెలంగాణా ఆత్మాభిమాన కెరటం.
తెలంగాణా భాషకు యాసకు జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక తన గొంతును విప్పి కలం ఝళిపించిన భాషాభిమాని.
ఆంధ్ర సారస్వత పరిషత్ వ్యవస్థాపక సభ్యుల్లో,తెలంగాణా రచయితల సంఘ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు.
అనేక రచనలు చేసిన మహాకవి.కాకతీయ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ను,కేంద్ర ప్రభుత్వం వారు పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించారు.అనేక అవార్డులు,రివార్డులు పొందిన మహాకవి.
” అన్య భాషలు నేర్చి
ఆంధ్రంబు రాదంచు
సకిలించు ఆంధ్రుడా
చావవెందుకురా ”
అని నినదించి తెలుగు భాష గొప్పతనాన్ని, మాతృ భాష ప్రాముఖ్యతను చాటి చెప్పాడు.
ఇంత గొప్ప సేవ చేసిన మహనీయుని జన్మ దినాన్ని పురస్కరించుకొని తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించినాక తెలంగాణా భాషా దినోత్సవాన్ని,ఆయన పేరు మీదుగా తెలంగాణా సాహిత్య విశిష్ట వ్యక్తికి కాళోజీ పురస్కారమిచ్చి తన్ను తాను గౌరవించుకుంటుంది.కాళోజీ ధిక్కార స్వరం అందరికి ఆదర్శనీయం.బతుకమ్మ మురిసి విరిసి పోయింది.తెలంగాణా ప్రత్యేకతను చాటుకుంది…..