మరలిరాని ఆమని – కవిత

అమ్మ ఒడిలో అరుణ కమలమై

చదువులమ్మ ఒడిలో స్వర్ణ తేజమై

గుడి ముంగిట సుమధుర గానమై

కోవెల గంటల నాదమై

మైదానంలో ‘ ఖేల్ రత్న’ మై

అందానికే అలంకారమై

అందరికీ తలలో నాలుకై

అన్నిటా అంతటా తానై

పరువంపు వాకిటి కరుదెంచిన విరిబోణి

జోడు కుదిర్చిన ఆనందంలో కుటుంబం

సరిజోడు కాదన్న సంఘర్షణలో అంతరంగం

కొబ్బరాకుల పందిళ్లు సన్నాయి మేళాల సందడింపులు ఒకవైపు

ఎదలో రేగే అసమ్మతి జ్వాల మరోవైపు

పుట్టింటి అనురాగం మధుర ఫలమై ఒకవైపు

రేపటి బంధం పరిమళభరిత పుష్పగుచ్ఛమై మరోవైపు

భూతభవిష్యత్తులు త్రాసులో తూగుతూంటే పుష్పగుచ్ఛానికి ఓటేసిన వర్తమానం

అసంతృప్తిలో ఆలోచన అపసవ్యం

పేగుబంధాన్ని తెంచిన గోరింట చేతులు

గడప దాటిన పారాణి పాదాలు

లిప్తపాటులో బోధపడిన బ్రతుకు చిత్రం

అంగడి సరుకైన ఆత్మగౌరవం

కలల ప్రపంచం రంగులలొలికిన రవివర్మ చిత్రమై

బ్రతుకు చట్రంలో ఛిద్రమై

ఎడారి పయనంలో శాలభంజికై

హృదయం రగులుతున్న రావణ కాష్టమై

ఆనక అంతశయ్యపై జీవనయానమై

డేగ చూపుల సలపరింతలు వణికించే గద్దల రెక్కల ధ్వనుల నడుమ

ఆశలుడిగి అలుముకున్న అంధకారంలో

గర్భకుహరాన్ని చీల్చుకొచ్చిన ఆశాకిరణంతో కొడిగట్టే స్థైర్యానికి జ్యోతి ప్రజ్వలనం

ఆ దీపపు వెలుగుల్లో కొత్తదారులు వెదుక్కుని

కోల్పోయిన స్థైర్యాన్ని కూడగట్టుకుని

బంధాల మకరందాన్ని రంగరించిన ఉగ్గుపాలతో

నేర్చుకున్న పాఠాలే బలమైన పునాదిగా

అనుభవాలే దృఢమైన వంతెనగా

వ్యక్తిని మహాశక్తిగా భరతమాత చరణాలజేర్చి

మాతృమూర్తిగా విజయదుందుభి మ్రోగించిన తాను

కదిలే అడుగులకు హెచ్చరికై

మెదిలే ఆలోచనలకు మంత్రదండమై

రేపటి తరానికి కరదీపికై

సహస్రారాన్ని చీల్చుకుని రివ్వుమంటూ నింగికెగిసిన ఆత్మహంస

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నిత్య పెళ్ళి కొడుకు – కథ

జీవితం