దొరసాని

45 వ భాగం

” ఎన్నో రోజుల తర్వాత చాలా తీరికగా భోజనాన్ని ఆస్వాదిస్తున్నాము..” అన్నది నీలాంబరి.

” అవును మాకు కూడా అలాగే ఉంది. ..ఎప్పటికప్పుడు సమయం చూసుకోవడం భోజనం చేయడము అలా జరగడం తప్ప ఇలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెన్నెలలో పెరటి గాలి పీలుస్తూ భోజనం చేస్తుంటే అసలు ఇన్నేళ్లు ఇదంతా కోల్పోయాం కదా అనిపిస్తుంది” అన్నాడు అలేఖ్య నాన్నగారు.

ఇంచుమించు అందరికీ అదే భావన ఉంది.. నిదానంగా భోజనం చేసి ఎన్నాళ్ళయిందో అనుకున్నారు..

భోజనాలు అయ్యాక రేపటి ప్రయాణం గురించి కాసేపు మాట్లాడుకున్నారు భోజనం చేయడానికి అన్ని పదార్థాలు ఇంట్లో నుండే తయారు చేసి తీసుకువెళ్లాలని అనుకున్నారు…

తెల్లవారి ఉదయమే నిద్ర లేచిన నీలాంబరికి వంటింట్లో చప్పుడు వినిపించి అటువైపుగా వెళ్ళింది.

అక్కడ మహేశ్వరి వంట చేస్తూ కనిపించింది అలేఖ్య సౌదామిని కూడా మహేశ్వరికి సహాయం చేస్తున్నారు…
పులిహోర దధ్యోజనం చేశారు… దైవ దర్శనం అయ్యేవరకు ఎవరు టిఫిన్ చేయమని అనుకున్నారు కాబట్టి పెరట్లో కాసిన జామ పండ్లు అరటి పండ్లు ప్యాక్ చేసి పెట్టుకున్నారు

” ఏంటి అప్పుడే లేచి వంట పనులు కూడా మొదలు పెట్టారా” అన్నది ఆశ్చర్యంగా నీలాంబరి.

చిన్నగా నవ్వి వారి పనుల్లో నిమగ్నం అయిపోయారు..

నీలాంబరి వారిని ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా స్నానానికి వెళ్లిపోయింది ఒక్కరొక్కరుగా లేచి అందరూ తయారయ్యారు…

రెండు కార్లలో అందరూ బయలుదేరారు… ప్రొద్దున్నే కాబట్టి వాతావరణం చాలా బాగుంది ట్రాఫిక్ లేకుండా రోడ్లన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి…

ఒక కారు సాగర్ నడుపుతుంటే మరొక కారు సుధీర్ నడిపాడు… అందరూ మాట్లాడుకుంటూ సరదాగా ప్రయాణం చేశారు…

కొలనుపాక గ్రామం చేరుకున్నారు.. ఒకప్పుడు సరైన ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేనందువల్ల ఎక్కువగా టాంగాలు నడిచేవి… ఇప్పుడు కూడా అక్కడక్కడ టాంగాలు కనబడతాయి…

ముందుగా రెండవ శ్రీశైలంగా పిలువబడే సోమేశ్వర ఆలయం చేరుకున్నారు… అక్కడి శివలింగం స్వయంభు అని చెప్తారు ఆగుడి నిర్మాణం పదవ శతాబ్దంలో నిర్మించారు అని అంటారు.. ఊరు కొంచెం పురాతనంగా ఉన్నా కూడా అక్కడ ఏచోట తవ్వినా కూడా శివలింగాలే బయటపడతాయట ఇంటి నిర్మాణం కోసమో దేనికోసమైనా తవ్వితే అన్ని శివలింగాలే ఊరంతా మండపాల్లాంటి కట్టడాలతో కనిపిస్తుంది… ఇంటి నిర్మాణాలు కూడా కొంచెం విభిన్నంగానే ఉంటాయి…

అందరూ శివయ్య దర్శనం చేసుకుని … పూజారి గారు చేసిన పూజను తిలకించి తీర్థప్రసాదాలు తీసుకొనికాసేపు అక్కడ కాసేపు కూర్చొని బయలుదేరారు ..అప్పటికి సమయం తొమ్మిది గంటలు మాత్రమే అయ్యింది…

అక్కడికి దగ్గరలో ఉన్న మ్యూజియంకు వెళ్లారు అక్కడ ఎన్నో శిలాఫలకాలు సేకరించబడి ఉన్నాయి చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆనవాళ్లు ఆ మ్యూజియంలో కనిపించాయి అవన్నీ అందరూ ఎంతో ఆసక్తిగా చూశారు…

తర్వాత ఆలయ ప్రాంగణంలో వారి వెంట తెచ్చుకున్న జంపకానాలు పరుచుకొని పండ్లను తిని కాసేపు కూర్చున్నారు..

తర్వాత జైన మందిరంకు బయలుదేరారు…. జైన మందిర నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంది.. మందిరంలో చుట్టూ నాటబడిన చెట్లు బుద్ధ విగ్రహాలు అన్ని ఎంతో అందంగా ఉన్నాయి.. ముఖ్యంగా పరిసరాలు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయి ఎప్పటికప్పుడు శుభ్రత కోసం పాటుపడే అందర్నీ చూసి ఎంతో ఆశ్చర్యం అనిపించింది ..వచ్చిన వాళ్లు కూడా ఎక్కడా చెత్తాచెదారం పడేయకుండా క్రమశిక్షణగా ఉండటం గమనించారు.

దాదాపు అక్కడ రెండు గంటల సమయం పట్టింది సుమారు ఒంటిగంట కావస్తుండగా అందరూ భోజనం చేద్దామని అనుకున్నారు…

కార్లలో కొంత దూరం ప్రయాణం చేసి ఎక్కువగా చెట్లు ఉన్న ప్రాంతం ఎన్నుకొని అక్కడే కూర్చుని వెంట తెచ్చుకున్న పులిహోర దద్దోజనం తిన్నారు…

అందరూ కొంచెం అలసిపోయి ఉండటం వల్ల కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుని బయలుదేరాలని అనుకున్నారు… అందరూ కూర్చుని అంత్యాక్షరి ఆడుకున్నారు…

ఎక్కువగా నీలాంబరి పాడే పాటలను సౌదామిని చాలా ఇష్టపడింది… తర్వాత సౌదామిని తనకు వచ్చిన హిందీ పాటలను పాడింది.. అలా కాసేపు అక్కడ గడిపిన తర్వాత మళ్లీ బయలుదేరారు ఇంకా బోలెడంత సమయం ఉంది ఇంకా ఎక్కడికైనా వెళదామా అని అనుకున్నారు…

వారికి మార్గమధ్యంలో వచ్చే మరో ఆలయాన్ని దర్శించుకోవాలని అనుకున్నారు అదే ఏదులబాద్ శ్రీ గోదా రంగనాయక స్వామి ఆలయం…

మధ్యాహ్నం సమయం ఆలయం మూసి ఉంటుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న చెరువులను చూసుకుంటూ వెళ్లారు అందమైన తటాకాలు తామరలతో నిండిపోయి ఉన్నాయి.. సౌదామినికి ఆ చెరువును చూస్తే ఎంతో నచ్చింది… ఆ పక్కనే ఉన్న చెరువులు తాగునీటి కోసం ఉపయోగించేవని సాగర్ చెప్పాడు.

సాయంత్రం ఐదు కావస్తుండగా అమ్మవారి గుడి తలుపులు తీశారు… ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఆ గుడి అంటే నగరవాసులకు ఎంతో ఇష్టం ప్రశాంతమైన వాతావరణము.. పల్లెలా కనిపిస్తుంది కానీ పట్టణానికి దగ్గరలో ఉన్న అద్భుతమైన క్షేత్రము.

రంగనాథ స్వామిని గోదాదేవిని దర్శించుకున్న తర్వాత అక్కడే ఉన్న అమ్మవారి అద్దాలు మంటపం దర్శనం చేసుకున్నారు తర్వాత ఆరగింపు చేసిన ప్రసాదం తీసుకొని అందరూ మళ్లీ గోపాలపురానికి బయలుదేరారు…

“సాగర్ నేను డ్రైవ్ చేయనా” అని అడిగింది సౌదామిని.

” చేస్తావా డ్రైవింగ్ బాగా వచ్చా” అని అడిగాడు సాగర్.

” చేస్తాను బాగానే వచ్చు మీరు పక్క సీట్లో కూర్చోండి” అని చెప్పింది సౌదామిని.

మరో కార్ సుదీర్ నడుపుతున్నాడు కదా అలేఖ్య అడిగింది “నేను కూడా డ్రైవ్ చేస్తా సుధీర్.. సౌందర్య అమ్మ ఒడిలో బజ్జుంటుంది పొద్దుటి నుండి ప్రయాణంలో అలసిపోయింది కూడా” అన్నది.

డ్రైవింగ్ అలేఖ్య సౌదామిని చేతుల్లోకి వెళ్లిపోయింది…

దాదాపు పది గంటల ప్రాంతంలో గడి చేరుకున్నారు…

అప్పటికే అందరూ అలసిపోయి ఉన్నారు…

రాత్రి భోజనాలు ఎవరు చేసే పరిస్థితిలో లేనందువల్ల మహేశ్వరి అందరికీ ఉప్మా చేసి పెట్టింది… అందరూ ఉప్మా తిని పడుకున్నారు…

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

గణపతి మహారాజ్ కీ జై

అభ్యసన – బోధన- Which is important?