భూమి,నీరు, అగ్ని,గాలి, ఆకాశం పంచభూతాలు . సృష్టిలో జీవం పుట్టినప్పుడు ఈ పంచభూతాలే కారణం! పంచ రంగులు, పంచాంగాలు, పంచతంత్రాలు, పంచాక్షరులు, పంచామృతాలు, పంచగంగలూ, పంచ నదులు , పంచభక్ష్యాల వంటివి కూడా ముఖ్యమైనవే. పంచేంద్రియాలతో జీవిస్తున్న మనుషులు నలుపు తెలుపు రంగుల పుట్టుక తెలియకుండానే ఉన్నారు. కాంతి పరావర్తనం చెంది కంటికి చేరుకుంటున్న తెలుపు రంగును, కాంతి పరావర్తనం చెందని నలుపు రంగును అర్థం చేసుకోలేని మూర్ఖులు కాదు. శాస్త్రీయ విశ్లేషణ తెలియకున్నా సాధారణ స్థితికి కారణం తెలుసు. ఇప్పుడు అంతా చీకటిమయం అయిపోతున్నది. చీకటికి నలుపు ను ఉపమాలంకారం గా తీసుకుంటారు. కానీ ఏ రంగులతో పని లేని ఈ మనుషులు ఏర్పరచుకున్న చీకటి. భావ దారిద్ర్యపు చీకటి. ద్యుతి లో తేడాలు , ధృతి లో తేడాలు.
ఎద ఎదలో వికృతత్వం ప్రతిధ్వనిస్తున్న దాష్టీకపు రోజుల్లో బ్రతుకీడిస్తున్నాం. స్వార్థం అత్యాశ మనిషి ప్రవర్తనకు చిరునామాలై పోతున్నాయి. మానవత్వం నశించిన ఏవో గడ్డు రోజుల్లో సమాజం మసలుతోంది.
భూకంపాలు రావడం, తుఫానులు వరదలు రావడం, వడగాలులూ, అడవులు దగ్ధమవడం అగ్నిపర్వతాలు బద్దలవడం వంటి వైపరీత్యాలు ప్రకృతి సహజం. పర్వతాలు ఎరప్ట్ అవ్వడం వలన లావా ఉప్పొంగి తీవ్రమైన నష్టం కలుగుతుంది. విపరీతమైన వర్షాలు కురిసి వరద బీభత్సాలు సృష్టిస్తుంటాయి. సముద్ర గర్భంలో కూడా విస్ఫోటనాలు ఏర్పడుతుంటాయి. ఇవన్నీ ఋతువుల ప్రభావాలు.ఇవి తప్పించలేని విపత్తులు.
కానీ మనుషులు విచక్షణా రహితంగా ప్రవర్తించడం వల్ల కలిగే విపత్తులు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నవి. ఇది సభ్య సమాజానికి భయాన్ని కలిగిస్తుంది. మానవాభివృద్ధి కి చుక్కెదురు. భవితవ్యానికి గొడ్డలి పెట్టు.
వర్షాకాలం కదా, వర్షాలు సహజంగానే కురుస్తున్నాయి కానీ. వర్షం నీరు పోవడానికి దారి లేకుండా చేసిన మనుషుల వైపరీత్యాలను ఎవరు ఆపగలరు? ప్రకృతి ప్రకోపానికి కారణమేమిటో? నీటి జాలుకు అడ్డంగా ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవన్నీ ప్రేరేపించడానికి కారకులెవరు?
ఒకప్పుడు పచ్చి పల్లెటూర్లలో వర్షాలకు వరదలకు దారులు తెగిపోయి ఇబ్బందులు ఉండేది. ఇప్పుడు పట్నాలలో ఈ ఇబ్బందులు.
రోడ్డు రవాణా సౌకర్యాలు విస్తరించని పల్లె ప్రాంతాలు గిరిజన ప్రాంతాలకు కాలినడకన వెళ్లే చోట అవస్థలు పడుతున్నారని ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత రోడ్లు వేసిన తర్వాత అతివర్షాలకు ఆ రోడ్డు తెగిపోయి వాళ్ళ కు కష్టాలు కలుగుతున్నాయి అనేదే తెలుసు. మానవ సంబంధాలు తెగిపోయాయి రోడ్డు లేకపోవడం వలన అనే వార్తలను వినేవాళ్ళు ప్రజలు. ఇప్పుడు పల్లె వార్తలు కాదు పట్నాలు ఈ వార్తలకు ఎక్కుతున్నాయి . ఢిల్లీ, ముంబై , చెన్నై , హైదరాబాదు …. ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం విజయవాడ ! ఇలా పట్నాలు నీటిమయమైపోతున్నాయి . దీనికి కారణం ఏమిటి ? వర్షాలు కొత్తగా కురుస్తున్నాయా ? కాదు ప్రతి సంవత్సరం వర్షాలు ఇలాగే పడతాయి ! కానీ పడిన వర్షపు నీరు ఎక్కడికి వెళ్లాలో దారిలేని పరిస్థితి ఏంటో ఎవరైనా ఆలోచిస్తున్నారా ? అంత ఆలోచించలేని మూర్ఖులు కాదు . మళ్ళీ మూర్ఖత్వం అనే పదమే ఉపయోగించాల్సి వస్తోంది ! ఎందుకంటే విచక్షణా రహితంగా నగరాలను నిర్మించడం పెద్ద కారణం . నగరాలను నిర్మించేది మనుషులు . ప్రకృతి సిద్ధంగా ఉన్నది! ఇది మర్చిపోతున్నారు. నదులు చెరువులు లేకుండా భూమి లేదు.
పూర్వకాలంలో రాజులు నిర్మించిన చెరువులు లేకుండా చేసేసిన దాష్టీకాలు పెద్ద కారణమై కూర్చుంది. నీరు పల్ల మెరుగు నిజం దేవుడెరుగు అని ఓ నానుడి. నిజం మనిషి కూడా ఎరుగు!! కానీ మనిషులు నిజాల్ని కప్పిపుచ్చుతారు.
బ్రతుకుతెరువు కోసం వలస బ్రతుకులు అలవర్చుకున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు. వీళ్ళు
చెరువుల్ని ఆక్రమించి ముందు గుడిసెలు వేసుకొని తర్వాత ఇల్లు కట్టుకున్న వాళ్ళు కొందరు. చాపంత స్థలమే కావచ్చు క్రమంగా క్రమంగా అవి వాడలుగా అయ్యాయి. ఇక మరో రకం ఆక్రమణలు…. డబ్బుతోటి హోదా తోటి తమనెవ్వరు ఏమంటారు లే అనే ఒక గర్వపు ఛాయాలతోటి చెరువులను , నాళాలను ఆక్రమించి భవనాలు నిర్మించుకున్న వారు కొందరు. స్పష్టంగా తెలిసి పోతుంది … అక్కడ ఎకరాల లో ఉన్న చెరువులు, నదులు కుదించుకుపోవడం, ఇల్లు నిర్మించుకోవడం. నిమ్మకునీరెత్తినట్టు మనమంతా చూస్తున్న వైనం ఇది.
మరి ఆ నీరంతా ఎక్కడికి పోతుంది ? నగరాలలో జెర్రిపోతుల విస్తరించుకున్న రోడ్డు మీదికి రాక?
ప్రభుత్వాలు ఓవైపు సౌకర్యాలు చేస్తూనే ఉంటాయి, మనుషులు ఓవైపు ఇటువంటి అన్యాయాలు చేస్తూనే ఉంటారు. కొన్ని తడవలు ప్రభుత్వాలు కూడా తప్పిదాలు చేస్తూ పోతుంటాయి ప్రజలు అన్యాయాలను సహిస్తూ ఉంటారు.
ఇల్లు కట్టుకోవడానికి పట్టా భూములే కావాలి పర్మిషన్లు గవర్నమెంట్ లో భాగమైన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వాలి ! ఇవన్నీ కొత్తగా ఎవరు చెప్పక్కర్లేదు. తేలు కుట్టిన దొంగల్లా ఎవరికి వాళ్లు తప్పిదాలను మరొకళ్ళపైన తోసేస్తుంటారు. కానీ ఎన్నో అక్రమాల విషయాలు పక్కన పెడితే ఈ నగరాలు జలమయమైతున్న అక్రమాలలో భాగమైన ప్రతి ఒక్కళ్ళు భవిష్యత్ తరాలకు ఏమి మార్గం చూపిస్తున్నారో గట్టిగా ఆలోచించాలి.
ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయి జలమయమైన రోడ్ల వలన? అంటువ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రయాణాలలో అవస్థలు ఎదురవుతుంటాయి. కాలినడకనపోయే బాటసారులకు ఎన్నో ఇబ్బందులు. పైన చెప్పుకున్న గుడిసెలు వేసుకున్న అభాగ్యులకు ఇక ఏ బాధలు ఉంటాయో చెప్పనక్కరలేదు. కార్లు మోటార్ సైకిళ్లు నీళ్లలో కాగితప్పడవలవుతుంటాయి.
శుభ్రత కరువై దోమలు ఎక్కువ డెంగ్యూ, మలేరియా వంటే జ్వర పీడితులవుతుంటారు. ఒకటా రెండా? ఎన్ని బాధలు? ఎన్ని కష్టాలు?
Natural disasters లతో వచ్చే ఇబ్బందులు ఒక ఎత్తు అయితే మనుషులు చేసే వైపరీత్యాల వల్ల కలుగుతున్న ఇబ్బందులు ఒక ఎత్తు! పరిష్కారాలు ఎలా ? ” హైడ్రా ” ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి!
_____*****____