నైట్ డ్యూటీ లో ఉన్నప్పుడు ఎక్కువ మంది టీనేజ్ అమ్మాయిలని “డాక్టరుగారూ! ఇంతవరకు బాగానే వుంది. ఏమైందో, యేమిటో వున్నట్టుండి ఊపిరి తీసుకోలేకపోతుంది. పిల్లకేదో అయిపోయిందని,” కంగారుగా తీసుకొస్తారు. పిల్లల్ని చూస్తే ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టు పెద్ద శబ్దంతో ఊపిరి తీసుకోవడం, ఒక్కోసారి ఊపిరాగిపోయినట్టు తలవాల్చెయ్యడం, దాంతో తల్లిదండ్రులింకా కంగారు పడడం జరుగుతుంది. అర్జెంటుగా ఏదో చెయ్యకపోతే పిల్లకేదో అయిపోతుందన్నంత భయం, తల్లిదండ్రులకు కలిగించేలా ఉంటుంది ఆ పిల్లల పరిస్థితి.
ఆ ఆయాసమనేది ఆస్తమా నుండి వచ్చిందా, ఎలర్జీ నుండి వచ్చిందా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుండి వచ్చిందా అన్న విషయం, వాళ్లను అబ్జర్వ్ చేస్తూ, హిస్టరీ తీసుకుంటూ, స్టెతస్కోప్ పెట్టి చూడగానే తెలిసిపోతుంది డాక్టర్లకు. సరైన మందులిస్తే, మనం మాట్లాడుతుండగానే వాళ్ళు మామూలు స్థితికి వచ్చి, మనకో నమస్కారం చేసి వెళ్ళిపోతారు. వాళ్లతో సమస్యేమీ ఉండదు.
ఇంకోరకం… లేనిది వున్నట్టు నటించడం. దానిని మాలింగరింగ్ (Malingering) అంటాం. సరిగ్గా చదవడం లేదని తల్లిదండ్రులు కోప్పడితేనో, వెధవ్వేషాలు వేస్తున్నారని తిడితేనో, జల్సాలకు డబ్బులివ్వడం లేదనో… ఈ రకమైన లక్షణాలతో, ఎమర్జెన్సీ డిపార్ట్మెంటు (క్యాజువాలిటీ)కు వస్తారు.
వాళ్లను చూడగానే తెలిసిపోతుంది మాలింగరింగన్న విషయం. ఇక తెలుసుకోవాల్సింది కారణమేమిటని. ముందుగా మేము చేసేది అటెండెంట్సుని బయటికి పంపించేసి, పేషెంట్ చుట్టూ స్క్రీన్ పెట్టించి, వేరే పేషెంట్సుని అటెండవుతూ ఉంటాం. అప్పుడు చూడాలి వీళ్ళ బాధ. ఎదురుగా మనిషుంటేనే వీళ్లు ఆయాసం, ఎగూపిరి నటిస్తారు. చుట్టూ యెవరూ లేకుంటే, ఏమి చెయ్యాలో తోచక దిక్కులు చూస్తారు. అప్పుడు పేషంట్ దగ్గరకు కుర్చీ లాక్కొని, యిప్పుడు చెప్పు విషయమేమిటని నిదానంగా అడుగుతాం. ఆయాసమొచ్చినట్టు, నటించడానికి ట్రై చేస్తారు. కాని వాళ్లకర్థమైపోతుంది, మాకు అర్థమైందనే విషయం. అప్పుడు మొదలు పెడతాం, కౌన్సిలింగ్ యివ్వడం. నేనైతే “నాన్నా! అదిగో పులి కథ” చెప్తాను. కొన్నాళ్ల తర్వాత నిజంగా నీకేదైనా ఐనా ఎవరూ పట్టించుకోరు. అప్పుడు నీ పరిస్థితేమిటని సూటిగా అడుగుతాను. ఇలా చేస్తే వాళ్లకే నష్టమనే ఆలోచన, వాళ్లలో కలిగించేందుకు ప్రయత్నిస్తాను. అర్థం చేసుకున్న వాళ్లైతే పర్వాలేదు. లేకపోతే సైకియాట్రిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తాను.
ఇంకొక వైపు తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగిస్తాను. ఈ వయసులో పిల్లలెంత సెన్సిటివ్ గా వుంటారో, తల్లిదండ్రులు వాళ్ళనే రకంగా చూడాలో, వాళ్ల మనసు నొప్పించకుండా మన దారిలోకి యెలా తీసుకురావాలో… యిలా కొన్ని జాగ్రత్తలు చెప్తాను. నేను ఖాళీగా ఉండే సమయం చూసుకొని అవసరమైతే మరల రమ్మని చెప్తాను.
శ్వాసకోశ సంబంధ యిబ్బందులైనా, మాలింగరింగైనా డయాగ్నోసిస్ ఈజీగానే చేస్తాం. ఒక్కోసారి కొన్ని సెన్సిటివ్ కేసెస్ వస్తాయి.
ఫిజికల్ ఎబ్యూజ్ కు గురైనప్పుడు, లేకుంటే వారిమీద ఫిజికల్ ఎబ్యూజ్ జరిగే అవకాశముందన్న భయం వున్నప్పుడు… ప్రత్యేకించి ఒక ట్యూషనుకు వెళ్ళనన్నప్పుడు… ఇరుగుపొరుగులే అయినా కొంతమంది యిళ్లకు వెళ్ళనన్నప్పుడు… పిల్లలలా ఎందుకంటున్నారో అర్థం చేసుకోకుండా, వెధవ్వేషాలెయ్యకు వెళ్ళు అని కసిరేస్తుంటారు పెద్దలు. అటువంటప్పుడు పిల్లలు, మానసిక ఆందోళనకు గురై ఎవరితో చెప్పుకోవాలో తెలియక, కళ్ళు తిరిగి పడిపోతుండడమో, అతిగా భయపడుతుండడమో, ఏడుస్తుండడమో చేస్తుంటారు. అంతరాంతరాలలో వాళ్ళ మనసు బాగా గాయపడి వుంటుంది.
వాళ్లకు శారీరిక అనారోగ్యం లేదని నిర్ధారించుకున్నాక, అందరినీ బయటకు పంపించి, సరదాగా మాట్లాడుతున్నట్టు వాళ్ళ హాబీల గురించి, ఫ్రెండ్స్ గురించి, స్కూల్లో యాక్టివిటీస్ గురించి అడుగుతూ… వాళ్లని మాటల్లో పెట్టాక అప్పుడు విషయానికొస్తాను. వాళ్లు దేని గురించి భయపడుతున్నారని లాలించి అడిగితే, నెమ్మదిగా బయటపడతారు. వాళ్లు కారణాలు చెబుతున్నప్పుడు, వాళ్లనటువంటి పరిస్థితికి తెచ్చిన వాళ్లమీద చాలా కోపమొస్తుంది. దాన్ని కంట్రోల్ చేసుకుని, ఆ అమ్మాయికి అటువంటి పరిస్థితులలో ఎలా వుండాలో కౌన్సిలింగ్ యిచ్చి, అప్పుడు తల్లిదండ్రులను లోపలికి పిలిచి, పిచ్చాపాటి మాట్లాడుతున్నట్టు మాట్లాడి నెమ్మదిగా విషయ సంగ్రహణ చేసి, వాళ్లకు నామీద నమ్మకం కుదిరాక, అప్పుడు విషయానికొస్తాను. పిల్లలు అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా, అనే విషయం గ్రహించుకోకుండా, పిల్లని ఆ స్థితికి తెచ్చింది మీరేనని చీవాట్లేస్తూ… ఇక్కడ డాక్టరుగా నా వయసుకూడా పరిగణనలోకి తీసుకుంటారు. యాభయ్యేళ్లు దాటిన నాకు, ఇద్దరు పిల్లలని పెంచిన అనుభవముంటుంది కదా! దానికి ఎక్కువ విలువనిస్తారు. అలా వాళ్లకీ కౌన్సిలింగిస్తూ… అవసరమైతే మరలా రమ్మని…
ముఖ్యంగా ఆడపిల్లలకు… అన్నింటికీ, అందరికీ భయపడక్కర్లేదు. మీరు బాగా చదువుకుంటే, తల్లిదండ్రులు మీ మాట నమ్ముతారనే ధైర్యాన్ని వాళ్ళలో కలిగించి పంపించినప్పుడుండే తృప్తి, చెప్పినా మిగిలిన వాళ్ళకి అర్థం కాదేమో!
నైట్ డ్యూటీలో యిటువంటి అనుభవాలు యెన్నో! పిల్లలు సైకాలజిస్టుల దగ్గరకో, సైకియాట్రిస్ట్ దగ్గరకో వెళ్ళవలసిన పరిస్థితిరాకుండా, మనమే వాళ్లలో ఆ మనోధైర్యాన్ని నింపి పంపినప్పుడు, ఆ రోజంతా మనసు ఆహ్లాదంగా వుంటుంది. మరికొన్ని అనుభవాలు వచ్చే కాలమ్ లో.