జరిగిన కథ…
సీనియర్ సెంటర్ లో సుభద్రకు తను వెళ్ళే కార్డ్స్గది లో ఇంకా ఎవరూ రాకపోతే తన దగ్గర ఉన్న చిన్న డైరీ లో తను రాసుకున్న వారి పేర్లు సరి చేసుకుంటుంటుంది. అప్పుడే వచ్చిన షైనీ అది చూసి అందరి పేర్లూ చెప్పి ఎట్లా పలకాలో చెపుతుంది. కారెన్ కూడా వచ్చాక, ఇంకెవరూ రాలేదని ముగ్గురే కాసేపు ఆడాక కారెన్, షైనీ వెళ్ళిపోతారు. సుభద్ర, అర్జున్ బ్రిడ్జ్ ఆడుతున్న చోటుకు వచ్చి, అక్కడ ఒక పెద్ద ఆయన కూతురు, తండ్రి కి ఆడటములో సహాయము చేయటము ఆసక్తిగా గమనిస్తుంది. బయటకు వచ్చిన సుభద్ర కారెన్ తో కారెన్ గురించి తెలుసుకుంటుంది. కారెన్ గురించి ఏమి తెలుసుకుందో తెలుసుకోవాలంటే తొమ్మిదవ భాగం చదవండి. ఇంటికి వచ్చిన సుభద్ర, అర్జున్ లకు ఇంట్లో కొడుకు ఒక్కడే ఒక అమ్మాయితో మాట్లాడుతుండటము కనిపిస్తుంది. ఆ తరువాత…
వీళ్ళిద్దరినీ చూసి “హాయ్” అని పలకరించింది ఆ అమ్మాయి.
“నా ట్రేనర్ కీర్తి, మా మమ్మీ, డాడీ” పరిచయం చేసాడు అభి.
“హాయ్” అని, ఆ అమ్మాయి పైపు చూసింది సుభద్ర. తెల్లగా, సుకుమారంగా, అందంగా ఉంది. నలుపు రంగు ట్రాక్ సూట్ వేసుకొని ఉంది. ఇంత నాజూకు బొమ్మ ఏం ఎక్సర్సైజులు చేయిస్తుంది అనుకుంది.
“పిల్లలు, శశీ ఏరి బేటా?” ఆకలికి ఆగలేక, తనకూ, అర్జున్ కూ ప్లేట్స్ పెట్టి, వడ్డిస్తూ “నీ లంచ్?” అభిని అడుగుతూ కీర్తి వైపు చూసింది.
“నేను పన్నెండింటికే తింటాను కదా? తినేసాను. శశి ఆఫీస్ లంచ్ కు వెళ్ళింది. పిల్లలు అప్పుడే రారు కదా? రేపు కీర్తికి పనుందిట. అందుకని ఈ రోజు రానా అని అడుగుతే నాకు మీటింగ్స్ ఏమీ లేవని రమ్మన్నాను” అన్నాడు అభి.
తన ప్లేట్ ముందు కూర్చుంటూ ఆ అమ్మాయిని చూసి చిరునవ్వు నవ్వింది. ఒక పట్టాన కొత్తవాళ్ళు ఏవయసువాళ్ళు అయినా వెంటనే మాట్లాడించలేదు. కాస్త మొహమాటం. అప్పటికే వాష్ రూం కు వెళ్ళి వచ్చిన అర్జున్ ప్లేట్ ముందు కూర్చుంటూ, “ఇంకా మొదలు పెట్టలేదేమిటి? ఇందాకే ఆకలి అన్నావుగా!” అని కీర్తి వైపు చూస్తూ” హలో నీపేరేమిటి? ఎక్కడ ఉంటావు?” కీర్తిని అడిగాడు అర్జున్. ఇక ప్రశ్నల పరంపర మొదలయ్యింది అనుకొని సుభద్ర, అభి ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు.
” కీర్తి అంకుల్.డౌంటౌన్ వైపు ఉంటాను అంకుల్” జవాబిచ్చింది కీర్తి.
“ఇక్కడ ఏమి చేస్తుంటావు? చదువుకుంటున్నావా? ఉద్యోగమా?” అడిగాడు అర్జున్.
“నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జిం లో వ్యక్తిగత శిక్షకుడిగా (personal trainer) పని చేస్తున్నాను” జవాబిచ్చింది కీర్తి.
“అవునా? గ్రాడ్యుయేషన్ అంటే జిం లో శిక్షణ ఇచ్చేందుకు వేరే ఏమైనా ప్రత్యేకంగా ఉంటుందా? మాములుగా ఈ మధ్య అందరూ సాఫ్ట్ వేర్ వైపు వెళుతున్నారు కదా? మరి నీకు ఇందులో ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? నీ గ్రాడ్యుయేషన్ ఇక్కడే చేసావా?” అడిగాడు అర్జున్.
తన ముందు ఉన్న లంచ్ బాక్స్ లో నుంచి సాండ్విచెస్ తింటున్న కీర్తిని చూసి, “ముందు తనని తిననీయండి. తరువాత మీ ఇంటర్వ్యూ చేద్దురుగాని” అంటూ బౌల్ లో ఉన్న పులిహోర కొంచం కీర్తికి వడ్డించబోయింది సుభద్ర.
చేతులు అడ్డం పెడుతూ “నో ఆంటీ. నాకు ఇవి చాలు” అంది కీర్తి సాండ్విచెస్ చూపిస్తూ.
“అదేమిటి? జిం లో ఎక్సర్సైజులు చేయిస్తానంటున్నావు. ఇంత కొంచం తింటే ఎట్లా?” విస్తుపోతూ అడిగింది సుభద్ర.
“తను డైటింగ్ లే మమ్మీ. బలవంతం చేయకు” నవ్వుతూ అన్నాడు అభి.
“ఏమి డైటింగ్ లో ఏమో! అందుకే ఇంత సుకుమారంగా ఉన్నావు” అంది సుభద్ర. ఇంకేంమాట్లాడకు అన్నట్లు సైగ చేసాడు అర్జున్.
“ప్రశ్నలూ, జవాబులూ ఎందుకులే కానీ నీ గురించి డాడీకి చెప్పు కీర్తీ” అన్నాడు అభి.
“ఏమి చెప్పను అంకుల్? మీరు అడగండి నేను చెపుతాను” అంటూ ఉత్షాహంగా అంది కీర్తి.
“ఏమీ లేదమ్మా? మన దగ్గర పిల్లలు గారాబంగా పెరుగుతారు. అన్నీ పనులూ చేసిపెట్టేందుకు మనుషులుంటారు. ఆడపిల్లలనవుతే పెళ్ళయ్యాక వేరే ఇంటికి వెళ్ళిపోతారు అని పేరెంట్స్ మరీ గారాబంగా చూసుకుంటారు. అట్లాంటిది ఇంత దూరం అమ్మానాన్నలను వదిలేసి వచ్చి, ఒంటరిగా ఉంటున్నారు. సంపాదించుకుంటున్నారు. మీకు మీరు స్వతంత్రంగా ఉంటున్నారు నిజమే కానీ, ఇంతింత దూరాలు ఎందుకు వస్తున్నారు? ఇక్కడ సెటిల్ అయ్యేవరకూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకని? మీ అమ్మానాన్నా ఎక్కుండుంటారు? వాళ్ళను వదిలేసి ఇంత దూరం రావటానికి కారణం ఏమిటి?నీకు ఈ పర్సనల్ ట్రేనర్ కోర్స్ చేయాలని ఎందుకు అనిపించింది?ఒక అంతర్జాతీయవిద్యార్థిగానీ అనుభవాలుతెలుసుకోవాలని ఉంది” అన్నాడు అర్జున్.
“మా పేరెంట్స్ బెంగుళూర్ లో ఉంటారు. ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు ఇంజనీరింగ్ సెకెండ్ ఇయర్ అక్కడే చదువుతున్నాడు. ఈ ఏడాది చివరి నాటికి నేను అమెరికాలో అడుగుపెట్టి ఏడేళ్లు పూర్తవుతుంది. సమయం ఎంత వేగంగా గడిచిపోయిందో నేను నమ్మలేకపోతున్నాను.
2018లో అండర్ గ్రాడ్యుయేషన్ కోసం ఇక్కడికి వచ్చాను. ఎక్సర్ సైజ్ సైన్స్ లో బ్యాచిలర్స్, స్పోర్ట్స్ మెడిసిన్ లో మైనర్ డిగ్రీ చేశాను. నేను అమెరికా రావడానికి ప్రధాన కారణం స్పోర్ట్స్. అప్పుడు, నేను ట్రాక్ అథ్లెట్ ను. ఫిట్నెస్ లో ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి, నా విధ్యను మెరుగు పరుచుకుందామనుకున్నాను. యుఎస్ లో ఆ ఫీల్డ్ లో ఎక్కువ అవకాశాలున్నాయి. కాబట్టి నేను ఇక్కడ ఒక టీంలో చేరాలనుకున్నాను. అందులో ఏదైనా సాధించాలనుకొని ఇక్కడి స్కూల్ లో చేరుదామునుకున్నాను. నాకు మా స్కూల్ లో పెద్ద international community ఉంది.
ఎక్కడ చేరాలని అనుకుంటుంటే, మా మామయ్య అమెరికాలో నివసిస్తున్నారు, కాబట్టి నేను మిన్నెసోటాను ఎంచుకోవడానికి అది కూడా ఒక కారణం. మా మామయ్య ఉన్నాడని మా పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు” అంది కీర్తి.
“మరి ఇక్కడ అలవాటు పడటానికి నీకేమీ ఇబ్బంది కాలేదా?” అడిగింది సుభద్ర.
“మొదట్లో నేను వచ్చినప్పుడు ముందుగా నాకు చాలా కల్చర్ షాక్ ఉండేది. అంటే ఇక్కడి ఫుడ్ రుచి, ఇక్కడివాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ మరియు స్టైల్, వాతావరణంలో మార్పులు (విపరీతమైన శీతాకాలం) అన్నీ తట్టుకొని అలవాటు పడటము సవాలుగా ఉండేది. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టం కూడా పూర్తిగా వేరే. మన దగ్గర దానికి ఇక్కడ దానికి పోలికనే లేదు. మీరన్నట్లుగా నా వంట నేనే చేసుకోవాలి. గిన్నెలు కడుక్కోవటము, బట్టలు ఉతుక్కోవటమూ అన్నీ చాలా కష్టంగా ఉండేది. కొన్ని సార్లు ఏడుపొచ్చేది కూడా. కానీ నేను నా ఫీల్డ్ లో ముందుకు వెళ్ళాలని, ఇంకా కొత్తవి నేర్చుకోవాలని వచ్చాను. వెనకకు వెళ్ళే ప్రశ్నే లేదు అని గట్టిగా నన్ను నేను సమాధానపరుచుకున్నాను. కాలం గడుస్తున్న కొద్దీ దానికి అలవాటు పడ్డాను. ఇప్పుడు నేను చాలా కంఫర్టబుల్ గా ఉన్నాను” అని జావబిచ్చింది కీర్తి, తినటము పూర్తి చేసి, చేయి కడుగుకునేందుకు లేస్తూ.
“నాపనులు నేను సొంతంగా చేసుకోవటము నేర్చుకున్నాను. ఫైనాన్సియల్, ఇల్లు, భోజనం అన్నీ నాకునేనే మానేజ్ చేసుకోవటము స్టూడెంట్ గా ఉండగానే నేర్చుకున్నాను. ఇంకా నా ప్రొగ్రాం, నా ప్రొఫెసర్ లూ నాకు చాలా నచ్చారు. క్లాస్ రూం లో బయట కూడా చాలా నేర్చుకున్నాను. రకరకాల ఈవెంట్స్ ను అటెండ్ అవుతూ అందరితో మంచి రిలేషన్ షిప్ నూ, ఫ్రెండ్ షిప్ నూ పెంచుకున్నాను” చేయి, లంచ్ బాక్స్ కడుగుకొని వచ్చి కూర్చుంటూ చెప్పింది కీర్తి.
“వెరీ గుడ్. మరి గ్రాడ్యుయేషన్ తరువాత ఏం చేస్తున్నావు?” ప్రశ్నించాడు అర్జున్.
“నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జిమ్ లో వ్యక్తిగత శిక్షకుడిగా (personal Trainer) పని చేస్తున్నాను. నా వృత్తి ద్వారా ప్రజలు సంతోషకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడతాను. నేను చేసేదాన్ని నేను ప్రేమిస్తాను. ఇంకా వ్యాయామం, మూవ్మెంట్స్, న్యూట్రీసియన్ ద్వారా ఆరోగ్యకరమైనవి నా క్లైయింట్స్ కు వారికి సరిపడేవి చెప్పటములోlive to help them make better health. ఇది నాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. Overall, grateful to have the opportunity to experience this. మా పేరెంట్స్ సపోర్ట్ మూలముగానే నేను ఇంత సాధించగలిగాను. నాకు కావలసిన విధముగా నన్ను నేను తీర్చుకోగలిగాను. ఈ వృత్తిలో చాలా సంతోషంగా ఉన్నాను. ఇక ముందు జీవితం ఇక్కడ నుండి ఏమి ఇస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని నవ్వుతూ ముగించి వెళుతానన్నట్లుగా బాగ్ సద్దుకుంది కీర్తి.
“నువ్వు ఇలా స్వతంత్రంగా, కాన్ ఫిడెన్స్ తో ఉండటము చాలా సంతోషంగా ఉందమ్మా. పిల్లలు ఒక వయసు వచ్చాక ఇలా ధైర్యంగా, స్వతంత్రంగా, దేనినైనా, ఏ పరిస్థితినైనా ఎదురుకోగలము అన్నట్లుగా ఉండాలి. ఈనాటి యువత ఆదారిగా పోతున్నారు.వారికి కావలసిన వృత్తిని ఎన్నుకుంటున్నారు. పూర్తిగా పెద్దల మీదే ఆధారపడకుండా స్వతంత్ర భావాలతో, పరిస్థితులకు అనుగుణముగా ముందుకు సాగుతున్నారు.ఇది శుభ పరిణామము. చాలా సంతోషం. అసలు నాకు ఇక్కడ మీ అందరినీ చూస్తుంటే, మగపిల్లలను సింగపూర్ మొదలైన కొన్ని దేశాలల్లో 12th క్లాస్ తరువాత మిలిట్రీ లో పని చేయాలని కంపల్సరీ చేసినట్లు మన దగ్గర కూడా చేసి, మొగపిల్లలను మిలిట్రీలోకి, ఆడపిల్లలను అమెరికాకు పంపాలి. అప్పుడే పిల్లలకు భాద్యత తెలుస్తుంది. పనులు వస్తాయి.డిసిప్లిన్ వస్తుంది. నువ్వు సరి అయిన దారిలోనే వెళుతున్నావు. నీకు అంతా శుభం జరుగుతుంది” కీర్తిని మెచ్చుకున్నాడు.
“థాంక్ యూ అంకుల్. ఇక వస్తాను. వేరే అపాయింట్మెంట్ ఉంది” అని వెళ్ళిపోయింది కీర్తి.
కాసేపు రెస్ట్ తీసుకుంటాను అని అర్జున్, అభి వాళ్ళ గదులలోకి వెళ్ళారు. సుభద్ర సెల్లార్ లో ఉన్న హోంథియేటర్ లో షారూక్ ఖాన్ సినిమాలు వెతికి “కుచ్ కుచ్ హోతా హై” చూస్తూ కూర్చుంది. అందులో మునిగిపోయి, పాటలను, షారుక్ డాన్స్ లను ఆస్వాదిస్తోంది. “భద్రా ఇక్కడ ఉన్నావా? ఇదిగో టీ. తాగి రెడీ అవ్వు. వాకింగ్ కు వెళుదాము.” అని అర్జున్ టీ కప్ అందిస్తుంటే సినిమాలో నుంచి బయటకు వచ్చింది.
“టీ పెట్టేసారా?” అని కప్ తీసుకుంటూ “పొద్దున సెంటర్ లో చాలాసేపు వాకింగ్ చేసాను. ఇంక ఓపిక లేదు బాబూ. ఈరోజుకు నన్ను వదిలేయండి. మీరు వెళ్ళి రండి” అంది.
“ఎట్లా ఎగ్గొడదామా అని చూస్తుంటావు. సరే కానియిలే. నేను వెళ్ళివస్తాను” అని టీ ముగించి, కప్స్ రెండూ తీసుకొని వెళ్ళిపోయాడు అర్జున్.
“ఇవ్వాళ ఒక్కడివే వచ్చావా?” పటేల్ ప్రశ్న వినిపించి వెనుకకు తిరిగి చూసాడు అర్జున్.
వెనుక వస్తున్న పటేల్ కోసం ఆగి “అవును. భద్రాకు ఓపిక లేదంది. అట్లా ఉన్నావేమిటి?” కొంచం డల్ గా ఉన్న పటేల్ ను అడిగాడు.
“ఇదివరకు వచ్చినప్పుడు ఇక్కడ మనోహర్ అని ఒక స్నేహితుడు అయ్యాడు. చాలా మంచివాడు. చాలా ఆక్టివ్ గా ఉండేవాడు. భార్య చనిపోయిందిట. ఇప్పుడు అతను దాదాపు అయిదు సంవత్సరాలుగా మంచం మీద ఉన్నాడు” జవాబిచ్చాడు పటేల్.
“అయ్యో పాపం. మరి వెళ్ళి చూసిరా. ఎక్కడ ఉంటాడు?” అడిగాడు అర్జున్.
“పక్క కమ్యూనిటీలో ఉంటారు. అప్పుడప్పుడు వెళ్ళి కాసేపు గడిపి వస్తుంటాను. ఈరోజు ఏమిటో కాస్త మనసు భారంగా అనిపిస్తోంది. నువ్వూ వస్తావా? వాకింగ్ వెళ్ళి రావచ్చు” అడిగాడు పటేల్.
“వస్తాను పద” అన్నాడు అర్జున్.
(సశేషం)