ఖబడ్దార్

కథ

చదరంగం ఆటలో పావులతో మనం ఆడుకున్నట్లు జీవితం ఆటలో భగవంతుడు మనతో ఆడుకోవటం అసలు నచ్చదు నాకు. దానికి తోడు ఆడపిల్లలను అన్యాయంగా బలిచెయ్యటం అన్నది మరీ అంగీకరించలేకపోతున్నాడు. అందుకే మౌనంగానే ఎదగమని… పాటలోలా మన రాతనని మనమే తిరగరాసుకోవాలి అనుకున్నా! అలాగే పయనం సాగిస్తున్నా అనుకుంది మనసులో ‘సాహసు’.
* * *
‘నిర్భయ’కి ఫస్ట్ షో సినిమాకు వెళ్ళాలనిపించింది.
“అమ్మా! నువ్వూ రామ్మా! ఇద్దరం వెళదాం” అని తల్లి సాహసను అడిగింది.
“బాగా తలనొప్పిగా ఉందిరా. నీ స్నేహితురాలు ‘శాంతి’ని తీసుకువెళ్లు ఈ ఒక్కసారికి అనటంతో “పోనీలేమ్మా! ఇంకో రోజు వెళదాంలే” అంది.
“వెళ్లరా! నాకేం ఫరవాలేదు. నీ కెప్పుడు ఏం చెయ్యాలనిపిస్తే అది చెయ్యటం అలవాటుగా. నీ నడక మంచి వైపుకే సాగుతోంది కాబట్టి నేనెప్పుడూ అడ్డు చెప్పటం లేదు. చెప్పను కూడా. అదే మరెవరైనా అయితే “రోజులు బాగా లేవు. మ్యాట్నీకి వెళ్లు. లేదా వెళ్లటం మానెయం అంటారు. నేనలాా కూడా అనను. ధైర్యంగా వెళ్లిరా కన్నా అనే అంటాను.”
“సరే! అమ్మా! వెళ్లొస్తా” అంటూ వెళ్లిపోయింది నిర్భయ.
* * *
సినిమా చూసి ఆనందంగా బస్టాప్ దగ్గర చేరారు. ఆటోలన్నీ జనంతో కిక్కిరిసి పోయి వెళుతున్నాయి. ఈ వేళలోఇలాగే ఉంటాయి అనుకుంటూ ఎదురు చూస్తున్నారు. ఈ లోపు ‘క్యాబ్’ రావటంతో ఇంకా ఆలస్యమవుతుందని ఎక్కేసారు.
శాంతికి మామూలుగా ఇలా ఎక్కాలంటే భయం. తమ ఇల్లు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది కాదు సమస్య. ఆ దారంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఏం జరుగుతుందో అని ఒంటరిగా ఎప్పుడూ రాదు. కానీ నిర్భయకి ఆ భయం ఎప్పుడూ ఉండదు. అందుకే అది తోడుంటే కానీ ఇలాంటి సాహసం చెయ్యదు.
కాబ్ లో ఇద్దరు ప్యాసింజర్లు తమతోపాటు ఉన్నారు. జనాల సందడి దాటగానే వాళ్లలో వాళ్లే సైగలు, ఒకే దెబ్బకు ఇద్దరు పిట్టలు అని నవ్వుకోవటం ఇద్దరూ గమనించారు.
‘నిర్భయ’ కూడా నవ్వుతూ డ్రైవరును కూడా కలుపుకొని “ఒకే దెబ్బకు మూడు పిట్టలు” అంది.
ఈ సారి తెల్లబోవటం వారి వంతయింది.
“నల్లద్దాలు వెనక ఆడపిల్లలను సరదాగా తిరుగుతూ రేప్ చెయ్యటం ఫ్యాషన్ అయిపోయింది కదా! ఈ రోజు సరదాగా ఆ ఆట దే నాడుకుంటాను” అంది నిర్భయ తమను రేప్ చెయ్యడానికి సిద్ధపడుతున్న ఇద్దరినీ చూస్తూ.
“అంటే మీరే మమ్మల్ని రేప్ చేస్తారా? అదీ మజానే” వెకిలిగా నవ్వాడొకడు.
“అబ్బా! ఎంత ఆశరా మీకు. క్షణాలలో ఏ కీలు కా కీలు విరగొ్గడతానంటున్నా. అదీ మా ఆట. అర్థమయ్యిందా?”
“ఏడిశారులే!” కోతలు కొయ్యకండి. ఆఫ్రాల్ మీరాడాళ్లు” ఎగతాళి చేసాడు వెనకి్క తిరిగి వెటకారంగా నవ్వుతూ డ్రైవర్.
“అయితే రండిరా చూసుకుందాం” అంది నిర్భయ పొజీషన్ కి వస్తూ.
“మీరు కానీయ్యండిరా. ఆ తర్వాత వాటా నాది” అనటంతో డ్రైవరు, అప్పటిదాకా నిర్భయ మాటలతో లోలోపల భయపడుతున్న వాడల్లా డ్రైవరు వత్తాసుతో వీరావేశంగా నిర్భయ చున్నీ మీద చెయ్యివేసాడు.
“అంతే! వాడి చెయ్యి ఫట్.”
“అబ్బా!” అంటూ విలవిల్లాడుతూ ఓ మూల వెళ్లిపడ్డాడు.
“నీకెంత ధైర్యం! మా వాడినే కొడతావా?” అంటూ మీదకు ఉరక బోతున్న మరొకడి ముఖం మీద మరో “పంచ్”.
ముఖం బద్దలయింది.
ఇదంతా గమనిస్తున్న డ్రైవరు క్యాబ్ ఆపి వెనక సీటులోకి గెంటాడు. చావుని కొని తెచ్చుకోవటమంటే ఇదే!
“ఇందాక ఏమన్నావురా?” అంటూ వాడి ఆయువు పట్టుమీద ఒకే ఒక ‘తన్ను’ తన్నింది. అంతే! మరోమాట వాడి నోట్లోంచి వస్తే ఒట్టు.
కళ్లలో మాత్రం ఎంతో ఆశ్చర్యం!
“ఆఫ్టరాల్ ఆడవాళ్లమా! కాదురా! ఖబడ్దార్ సింహాచలం! జాగ్రత్త!” అంది నిర్భయ.
* * *
పేపరు చదువుతూ ‘టీ’ తాగుతోంది సాహస.
“ ‘నిర్భయం’ వెలుగుతో అమ్మాయిలు” అన్న హెడ్డింగ్ ఆమెను ఆకర్షించింది.
ఇంతలో అక్కడికి నిర్భయ రానే వచ్చింది.
రేప్ చేయబోయిన అల్లరి వెధవలకు గుణపాఠం చెప్పిన వీర వనిత అంటూ ఫోటోలో తన కూతురే!
“ఏమిటీ???” అన్నట్లు చూసింది.
“నువ్వు కోరుకున్నదే అమ్మా! లోకంలో ఉన్నది ఆడ, మగ, ఒకరి స్వేచ్ఛకు ఒకరు భంగం కలిగించకూడదంటూ చిన్నతనం నుంచే కరాటే నేర్పించావుగా. ఇదంతా ఇలాంటి అరాచిికాలను అడ్డుకోవటానికేగా!”
అవును. ఐదేళ్లకే “బ్లాక్ బెల్ట్” సాధించి “గిన్నిస్ రికార్డ్” కొట్టేసినప్పుడు కూడా కలగని ఆనందం ఇప్పుడు కలిగిందామెకు.
“వీళ్లను విరగదీసి ఫోటో తీసి పేపరు వాళ్లకు MMS పంపా. శాంతి మాత్రం భయపడి చచ్చిందనుకో. దీనిలాంటి వాళ్లుండబట్టే ఇలాంటివాళ్లు రెచ్చిపోతున్నారు. ముందు ఇలాంటి వాళ్లలో మార్పు రావాలమ్మా!”
“వస్తుందిరా. అది ఎంతో దూరంలో లేదు. చూస్తూ ఉండు.”
“నిజమా అమ్మా!” అంటూ ఆమె ఒళ్లో చేరింది.
“నా బంగారం రా నువ్వు. ఆడపిల్లలంటే ఇలాగే ఉండాలి. హెల్ప్! హెల్ప్! అంటూ అరవటం మానేసి వాళ్లు “హెల్ప్! హెల్ప్!” అని అరిచేలా చెయ్యాలి. ఇన్నాళ్ల నా శ్రమకు ఫలితం దక్కిందిరా” అంటూ నిర్భయ నుదుటి మీద ముద్దు పెట్టింది. సాహస ఆమెనే అపురూపంగా చూస్తూ.
“నేనే కాదు ఆడపిల్లలంతా నాలా తయారవ్వాలి. సున్నితమైన వారి చేతులు ఉక్కు పిడికిళ్లులా మారాలి. అప్పుడే తనకు ఆనందం” అనుకుంది మనసులో నిర్భయ ది గ్రేట్ హోంమేకర్. ఇంటినే కాదు, దేశభద్రతకు కూడా తనే ఆధారమని నిరూపించిన ఇల్లాలు.
సమాప్తం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొబ్బరి పీచు

ఇటుగా…వీస్తే!!