కొబ్బరి పీచు

కథ

నాకైతే ఏమి అర్థం కావడం లేదండి. నాకేమో అయింది అనుకుంటున్నారా? ఏమి కాలేదు. చెప్తాను! చెప్తాను.

మనం ముందుకు వెళ్తున్నామా? వెనక్కి వెళ్తున్నామా? పక్కన కి వెళ్తున్నామా? పైకి వెళ్తున్నామా? కిందికి వెళ్తున్నామా?

నాకు పిచ్చి కన్ఫర్మ్ అయింది అనుకుంటున్నారా? నో నో వస్తున్న దారిలోకి.

మొన్న అమెజాన్ లో ఒక విషయం చూసినప్పటి నుండి భలే పిచ్చి పట్టింది నాకు. అదేంటంటారా?

కొబ్బరి పీచులు ఉండలా చేసి గిన్నెలు వాడటానికి అమ్ముతున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కోపంతో తిక్క వస్తుందా లేదా?

పూర్వమంతా బూడిదతో, కొబ్బరి పీచుతో గిన్నెలు తోముకున్నామా? ఇప్పుడు వీళ్లు కొత్తగా పోష్ గా కొబ్బరి పీచులు తయారు చేస్తే ,మనం కొనుక్కొని దానితో గిన్నెలు తోముకోవాలి. అన్నింటికీ మనం ఇలా అలవాటు పడ్డాము. మనది అన్నది ఏది మన సొంతం కాకుండా ,మళ్లీ ఎవరో చెప్తే దాన్ని మనం పాటిస్తాము.

అంతే కదా! పూర్వము పొలాలకి బూడిద, పశువుల పేడ ,ఇంట్లో వ్యర్ధాలు అన్ని వేసి పెరట్లో ఒక మూల భాగంలో నిలువ చేసేవాళ్ళు. పొలం దున్నినప్పుడు వాటిని బండ్లలో తీసుకెళ్లి ఎరువుగా వాడేవాళ్లు.

ఈ గ్రోమోర్ ఎరువులు, పురుగు మందులు అసలు ఉన్నాయా? ఇవన్నీ అలవాటు చేసిన విదేశీయులు మాత్రం ఆర్గానిక్ అంటూ సేంద్రియ ఎరువుల వాడుతూ, మళ్లీ మన వస్తువులను మనకే ఆర్గానిక్ గా అమ్ముతున్నారు.

అంటే ఎవరో ఒకరు చెప్తేనే మనం నమ్ముతాము. అది మన దేశపు వాళ్ళు చెప్తే నమ్ముతామా? ఆహా! అంత పిచ్చోళ్ళమా? మనకు కొత్త సీసాలో పాత సరుకు పోసి స్తే అప్పుడు ఆహా, అనుకుంటాము.

ఇలాగే మన యోగానీ రకరకాలుగా మార్చి దాన్ని మనకే ఉసిగొలిపితే ,దాన్ని మహాప్రసాదం అని ఆచరిస్తున్నాము.

ఒకప్పుడు బొగ్గుతో పళ్ళు తోముకుంటే ఛి, ఛి అనాగరికం అనేవాళ్ళు. టూ త్పౌడర్లు, టూత్ పేస్టులు వాడి కంపెనీలకే లాభాలు తెచ్చి పెట్టాం కదా, అదే బొగ్గులు వాళ్లు మీకు పెస్ట్ లో బొగ్గుందా భోషా ణం ఉందా? ఉప్పుందా? అని యాడ్స్ చేస్తూ మళ్లీ మన మీదికే ఉసిగొ లుపుతున్నారు.

ఇళ్లల్లో వేప చెట్ల నుండి తెంపిన ఆకులను ఎన్నింటికో వాడుకునే వాళ్ళము. ఇప్పుడు వాటిని విదేశీయులు దిగుమతి చేసుకొని, దాన్ని మళ్ళీ ఏ ప్రోడక్ట్ రూపంలో మనకు పంపిస్తే దాన్ని సునాయాసంగా వాడుకుంటాము.

ఇండియన్ ప్రొడక్ట్స్ వాడితే చులకన అయిపోమూ!

పిల్లలు పుట్టగానే మూడు నెలలు లేదా నాలుగో నెలలో సెరిలాకు, ఫారెక్స్ పెట్టాలి అని విపరీతమైన అడ్వర్టైజ్మెంట్లు. ఆ డబ్బా మీద ఉన్న బొమ్మలు చూసి మా పిల్లలు ఇలాగే కావాలని, వాటి ధర శక్తికి మించినదే అయినా కొనుక్కొని పిల్లలకి బలమైన ఆహారం అదే అని నమ్మి కోరి కోరి పెట్టాము. పెట్టామా? లేదా? నిజమే కదా నేను చెప్పింది.

ఇప్పుడు మళ్లీ ఏమంటున్నారు? ఆ ప్రొడక్ట్స్ ఏమీ పెట్టకూడదు. మనం ఇంట్లో చేసిన ఉగ్గు, పప్పు నీళ్లు ఇవి మాత్రమే పెట్టాలి. ఇంట్లో వండినవి మాత్రమే ఇవ్వండి. అని చెప్తున్నారు. అంటే బొక్క బోర్లా పడుతున్నది మనమే కదా? కంపెనీల లాభాలు కంపెనీలకు ఎలాగూ ఉన్నాయి. కానీ ఏ అవగాహన లేకుండా మనం పరుగులెత్తి వేరే వాళ్లకు లాభాలు సంపాదించి పెడుతున్నాము. అదేదో ఇంటికోడి పప్పుతో సమానం అన్నారట. ఈ సామెత నేను వాడకూడదనుకొండి. శాకాహారిని కదా! కానీ ఇప్పుడు అదే గుర్తొచ్చింది నాకు.

సున్నిపిండి మార్కెట్లో వస్తే కొనుక్కుంటాము. ఇంట్లో డబ్బాలకొద్దీ చేసి పెట్టేవాళ్ళు. అది వాడడం నామోషి. స్టైల్ గా డబ్బాలో వస్తుంది కదా! పది రూపాయల్లో అయ్యేది వంద రూపాయలు పెట్టి కొనుక్కుంటే మనకు మహాతృప్తి.

అదేదో ఫాస్టింగ్ అట ఇంటర్మిటేషన్, అంటే భోజనం కి భోజనంకు మధ్యలో ఉంటే గ్యాప్ ఎక్కువగా ఉండాలట.

మరి మొన్నటి వరకు ఏమన్నారు? పొద్దున్నే టిఫిన్ తినాలి. కడుపునిండా టిఫిన్ కూరేసుకోవాలి? 8 వరకే పొట్టనిండాలి .అని చెప్పారా? ఏ డాక్టర్కు దగ్గరికి వెళ్లిన ఇదే మాట.

ఇప్పుడు అలా కాదు కనీసం 12 లేదా 14 గంటల తర్వాత కానీ ఏమీ తినకూడదు అంటున్నారు. అంటే సాయంత్రం 6 గంటలకు తింటే ఉదయం 10:00 అలా అన్నమాట. మరి పూర్వం మనం చేసింది కూడా అదే కదా, ఈ టిఫిన్లన్నీ ఉన్నాయా? 12 గంటలకు అలా భోజనం చేస్తే సాయంత్రం పెడితే పిడికెడు అటుకులు లేదా, ఏదైనా చిరు ఆహారం తర్వాత ఏడు లోపల భోజనం, 9 గంటల వరకు పడక చేరడం.

ఇప్పుడు ఇదంతా వాళ్ళందరూ చెప్తేనే తెలిసినట్లు లేకుంటే మిగతా వాళ్ళంతా వెర్రి పప్పలన్నట్టు చెప్తున్నారు. మరి నిజమే వాళ్ళు చెప్పింది. వెర్రి పప్పల్లాగే మనకు తెలిసిన దాన్ని వదిలేసి, తెలియని దాని వెంటపడి, విలువైన విషయాలను ఎన్నో మరిచిపోయాము.

ఇలా చెప్తూ పోతే బోలెడు మీకు బోర్ కొట్టి, నా మీద దాడి చేసే ప్రమాదం ఉంది. కానీ ఇలా అమెజాన్లో కొబ్బరి పీచు చూసి నాకు పిచ్చి పట్టి ఇది రాసాను అన్నమాట .నచ్చితే లైక్ చేయండి. లేదంటే వదిలేయండి.

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తో(రణం )

ఖబడ్దార్