తో(రణం )

మన ఇళ్లల్లో   వేడుక ,పండుగ ,పర్వం, శుభకార్యం ఏదైనా  తోరణాలు కట్టడంతోనే మొదలవుతాయి . తోరణాలు పంది ళ్ళతో ఇంటికి కొత్త అందం వచ్చి చేరుతుంది . సంబరాలను వెంట తీసుకొని వచ్చేవే తోరణాలు.  అంతెందుకు  వీధిలో అలా నడిచి వెళ్తున్నప్పుడు  ,ఏ  గుమ్మానికో మామిడాకుల తోరణం కనిపిస్తే చాలు, వీరి ఇంట్లో ఏదో శుభకార్యం జరుగుతున్నట్టుంది అనుకుంటారు దారి ని పోయేవారు . అది తోరణ మహా త్యం. ఇందులో ఇంకొక విశేషం ఉంది .మన అలవాటులో తోరణం అంటే మామిడాకులదే.

అసలు తోరణాలు ఎందుకు ?వాటికి మామిడాకులే ఎందుకు? అని ఆలోచిస్తున్నారు కదూ ! నేను అలానే అనుకున్నా సుమండీ .  అనుకోవడంతో ఊరుకోలేదు .జవాబు కోసం ప్రయత్నించా. ఆ వివరాలు క్లుప్తంగా  మీకోసం .

ఒకప్పుడు తోరణాలు అంటే ముఖద్వారానికి మామిడాకులను ఓ పు రి కొ సతో బంధించడమే. ఇప్పుడు కాలం మారింది.  వస్తువులో , విధానాల్లో  ,వైవిధ్యం చోటు చేసుకున్నది. రంగురంగులతోరణాలు రాజ్యమేలుతున్నాయి .పండగల సీజన్ మొదలైంది గా యూట్యూబ్ లో వేలెట్టండి .ఇంకేముంది వందలాది ఉపాయాలు .వేలాది లైకులు . మూడు పువ్వులు ఆరు కాయలుగా విభిన్నతకు అర్థం చెప్పే  కంటెంట్లు  .

ప్రసిద్ధ ప్రాచీన దేవాలయాల గురించి ఓ మంచి మాట చెప్తుంటారు పెద్దలు .నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అంటే ఆ .దేవాలయంలో సంవత్సరం పొడుగునా స్వామివారికి కళ్యాణం జరుగుతూనే ఉంటుందన్నమాట .ముహూర్తాలు సరైనవి దొరక్కపోయినా ,కుటుంబ పరమైన సమస్యలు ఎదురైనా ,చాలామంది పుణ్యక్షేత్రానికి వెళ్లి పెళ్లి చేస్తారు.  స్వామివారి కల్యాణం జరిగినందువలన అక్కడ విడిగా వధూవరుల  జాతకం ఆధారంగా ముహూర్తాలు పెట్టకున్న, పెట్టిన దానిలో ఏవైనా దోషాలు ఉన్నా, స్వామి అనుగ్రహంతో తొలగిపోతాయన్నమాట.

సరే ఇప్పుడు మనకు బాగా తెలిసిన మామిడి తోరణాల దగ్గరికి రండి .

జ్యోతిశ్శాస్త్రం  లో మామిడి ఆకులను అంగారక గ్రహానికి కారకంగా చెప్తారు.  అందుకే వేడుక ఏదైనా మావిడాకులని వాడుతారు .  చెట్లు ,మొక్కలను  పూజించడం మన సంస్కృతిలో ఒక  భాగం  .దీనికి గొప్ప ఉదాహరణ కార్తీకం లో ఉసిరి చెట్టును, క్షీరాబ్ది ద్వాదశి కి తులసి పూజను చేయడం ఇంకా మిగిలి ఉన్న సంప్రదాయం.

మామిడి చెట్టు, దాని  భాగాలు  అనేక విధాలుగా  మన సంస్కృతిలో  భాగం . ఒకప్పుడు తోట ఉంది అంటే చాలు మామిడి తోటనా అని మొదటి ప్రశ్న ,మామిడి చెట్లు ఎన్ని ఉన్నాయి ?అనేది రెండవ ప్రశ్నగా అడిగేవారు. మామిడి చెట్లు ఆర్థిక వనరులకు చిహ్నం ఒకప్పుడు . మామిడి చెట్టు ఆకులు, లేత చిగుళ్ళు ,పళ్ళు, కాయలు, బెరడు అన్ని ఆయుర్వేదంలో , గృహవైద్యంలో ఉపయోగకారులు .మామిడి ఆకులను తోరణాలుగా మాత్రమే కాక, కలశం లోను వాడుతా రు .అవి దొరక్కపోతేనే తమలపాకులను ఉపయోగిస్తారు .

మామిడాకుల తోరణాల వెనకున్న నమ్మకాలను గురించి కాస్త చెప్పుకుందాం.

మామిడాకులను తోరణాలుగా వేలాడదీయడం వల్ల, ఇంటికి చెడు దృష్టి నుండి రక్షణ, సానుకూల శక్తికి ఆహ్వానం అనేది ఓ ముఖ్యమైన నమ్మకం. ఈ తోరణాల వల్ల ఇంట్లోకి ధనలక్ష్మి తో పాటు సకల దేవతా పరివారం వస్తారని పండితులఉ  వాచ .

ఈ ఆకుల్లోంచి విడుదలయ్యే ప్రాణవాయువు వాతావరణాన్ని స్వచ్ఛంగా ఉంచుతుంది . తోరణాలు ఎక్కువమంది గుమికుడినప్పుడు ,ఎదురయ్యే మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి  .ప్రధాన ద్వారం పైన కట్టినప్పుడు ఆ ఇంట్లోని  వాస్తు దోషం పోతుందని ఒక విశ్వాసం  . వెనకటి రోజుల్లో  గ్రామాల్లో బావిలోకి దిగి, శుభ్రం చేయవలసిన సమయంలో ,ఎక్కువ ఆకులు ఉన్న మామిడి కొమ్మను బావిలోకి  చుట్టూ కొంత సేపు తిప్పమని చెప్పే వారు . దాంతో బావిలోని విషవాయువులు తొలగిపోతాయట .ఇది నిరూపించబడింది కూడా .

మామిడి ఆకులలో ఒక ఆహ్లాదకరమైన సువాసన ఉంటుంది అందువలన తోరణాల పరిసరాలు సువాసన , తాజాదనంతో నిండి ఉంటాయి.

మామిడి ,జువ్వి , రావి , మర్రి , ఉత్తరేణి ఈఐదు చెట్ల  ఆకులను పంచ పల్లవాలంటారు .వీటిని శుభకార్యాల్లో వాడుతారు .అయితే తోరణం లో నిలిచేది మాత్రం మావిడే . యజ్ఞయాగాదుల లో  మామిడి ఆకులను వాడి  ధ్వజారోహణం చేయడం సంప్రదాయం .ధ్వజారోహణం అంటే దేవతలకు ఆహ్వానంపంపడమే.   మావిడాకులు అంటే దేవతలకు ఇష్టమేనన్న మాట .

శివపార్వతుల కళ్యాణం మామిడి చెట్టు కిందనే జరిగిందని , అందుకే శుభకార్యాలలో మామిడి ఆకులను ఉపయోగిస్తారని పెద్దవారంటారు .

ఇంకో ముఖ్య విషయం ఇక్కడ తప్పక చెప్పుకోవాలి . మన వైపు పెద్ద పండుగలు  ,ఉత్సవాలు ఎక్కువగా సంవత్సరంలోని రెండో భాగంలోనే వస్తాయి .దీనికి మామిడి తోరణానికి సంబంధం ఏంటా అని ఆలోచిస్తున్నారా ? మామిడి పూత సాధారణంగా శీతాకాలం చివరలో మొదలవుతుంది . వేసవిలో కాత మొదలవుతుంది. కత్తిరింపు మొక్క బలంగా పెరగడానికి సహాయపడుతుందని మీకందరికీ తెలుసు కదా! అయినా ఈ విషయం తెలుసుకోవడానికి వృక్షశాస్త్రజ్ఞుని వరకు వెళ్ళనక్కరలేదు . ఏ తోటమాలి అయినా చెప్తాడు .పండుగలప్పుడు మామిడి తోరణాలను కట్టడానికి ఇదొక మంచి కారణం .

ఈ కారణాలన్నింటినీ  విస్తృతంగా అధ్యయనం చేయకున్నా సంప్రదాయ పద్ధతుల ఆధారంగా తరతరాలుగా జనం ఆచరిస్తున్నారు . విశ్వసిస్తున్నారు కూడా.

తోరణాల గురించి ఇన్ని మాటలు చెప్పుకుని ఆగిపోతే అది అసంపూర్తి అవుతుంది  .తోరణం అనగానే మామిడి ఆకుల తర్వాత గుర్తొచ్చేవి కాకతీయ శిలా తోరణాలు . అందమైన ఈ తోరణాలు మన శిల్పుల నైపుణ్యానికి సజీవ సాక్ష్యాలు  .వీటిని తోరణ ద్వారాలు ,తోరణాస్తంభాలు, కీర్తితో రణాలు ,హంస ద్వారాలు ఇలా రకరకాలుగా చరిత్రలో పేర్కొన్నారు.   ప్రభుత్వం నిర్వహించే అన్ని ప్రధాన కార్యక్రమాల్లో దాదాపుగా కనిపించే నమూనా స్వాగత దారాలు ఇక్కడివే .

వరంగల్ కోటలో ఈ కీర్తి తోరణాలు నాలుగు ఉన్నాయి .  నాలుగూ  వేర్వేరు రాజుల కాలంలో నిర్మించబడినా  ఆ తేడాలను మన చూపులు పట్టుకోలేవు.  వీటిపై అధోముఖ పద్మాలు, హంసలు అందంగా  అమిరాయి  . కోటలోని అపార సంపదను , శత్రువులు దోచినా ఈ అమూల్య సంపద మనకు దక్కింది .చూసేవారికి రాచహోదాను ,  ఆత్మవిశ్వాసాన్ని నేటికీ అందిస్తున్నాయి . ఇవి  యుద్ధాల్లో సాధించిన  గెలుపును తెలిపే విజయ చిహ్నాలు అని చరిత్రకారుల వివరణ  .మన బోటి సామాన్యులకు తోరణం  అంటే నెగిటివ్ ఎనర్జీతో , చెడు దృష్టితో , చెడుగాలితో రణమే . పోరాటమే  .దాన్ని ఎదుర్కోవడానికి తోరణాలను కడదాము .  ఆ సువాసనలను  ,ప్రాణ శక్తిని మనసారా  జీవితాల్లోకి ఆహ్వానిద్దాం .

ఇదండీ  తోరణాల కథ

Written by Vijaya Kandala

రచయిత్రి పరిచయం
పేరు విజయ కందాళ . 35 సంవత్సరాల బోధననుభవం ఉంది. కొత్త ప్రదేశాలు చూడడం , ఫోటోలు తీయడం నా హాబీలు. ఫోటోలు తెస్తాను గాని ,దిగడం ఇష్టం ఉండదు. నేను చేసే పనుల ద్వారా నేనేమిటో తెలియాలంటాను.తరుణీ ద్వారా మీ అందరిని కలుసుకోవడం సంతోషంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రమక్కతో ముచ్చట్లు -8

కొబ్బరి పీచు