రమక్కతో ముచ్చట్లు -8

చేజారి పోతున్న చేతి రాత

శనార్థులు.
మంచిగున్నరా ….!!

మీకొక ఇచ్చెంత్రం జెబ్తా ఇయ్యాల.
మా ఇంటికాడ ఒక పెద్దమనిషి ఆల్ల బిడ్డెకు
స్కూల్ల మస్తు రాత పని ఇచ్చిండ్రని ఈయన, స్కూలుకు పోయి టీచర్ తోని లడాయి వెట్టుకున్నడంట. ” ఏంది మేడం, గంత రాసుడు అవసరం ఏముంది? చెయ్యి గుంజుతుంది బిడ్డకు, గంత రాత పని ఇస్తరా ఎవలన్న? అయినా రాసుడు ఎందుకు, వర్క్ బుక్కులే ఉన్నయాయే సదువుకుంటరు. ఏం చేస్తానికి రాసుడు అని అడిగిండంట.
మీకు ఏమన్న సమజ్ అయిందా? మీలో గూడ ఎవలన్న గిట్లనే ఉన్నరా…?? ” దునియా డిజిటల్ అయిపోయినంక,రాత మొత్తం మూలకు వడిపోయింది. ‘ రాత’…అదే హ్యాండ్ రైటింగ్ గొప్పతనం ఏందో నాకు తెలిసిన ముచ్చట్లు మీకు చెప్తా ఇనుండి..!
మెదడు శక్తి రాయడం వల్ల శానా పెరుగుతది. రాయడం వల్ల మన మెదడు లోతుగ ఆలోచిస్తది . కొత్త ఆలోచనలు అస్తయి మనకు.
రాసినప్పుడు, మన మెదడు ఆ సమాచారంను మెమరీల నిలుపుకోనీకి ఎక్కువ కోషీష్ జేస్తది. . సదవడం కంటే రాయడం యాద్దాస్త్ ను గట్టిగ జేస్తది,దానిని సైన్సు మల్టీ-సెన్సరీ ప్రాసెస్ అంటది.
మెంటల్ కంట్రోల్ గూడ బాగా రాసేటోళ్లకు ఎక్కువుంటదంట.
సృజనాత్మకత గూడ పెరుగుతదాయే.

మంచిగ రాసుడు అలవాటు ఉన్నోల్లకు మెదడు వయసు బేరింగ్ జేస్తది అంటరు. మెదడు వ్యాధులు, డిమెన్షియా అనేటి సమస్యలను రాకుండ శానా మటుకు ఆపుతదంట. ఎంత మంచి ముచ్చట గదా ఇది….!! రాసుడు ఒక తీరు మానసిక వ్యాయామం, గిది మనసు ఆగమాగం గాకుండ గూడ కంట్రోల్ పెడతదంట.

ఈ పొద్దులల్ల… హ్యాండ్ రైటింగ్ తోని అంటే పెన్ను పేపర్ తో రాసుడు కాకుండా
డిజిటల్ రాసుకునుడు ఎక్కువైంది. యాడ రాస్తే ఏంది అని అనుకుంటరేమో…. మనస్తత్వశాస్త్రం సదువుకున్నోళ్లు, పెద్దపెద్ద సదువులు సదువుకున్నోళ్లు చెప్పిన ముచ్చటలు మనం ఇక్కడ తెలుసుకుందాం…!”

డిజిటల్ రైటింగ్ అంటే..కీబోర్డ్ లేదా స్క్రీన్ మీద రాసుడు జెర ఆల్కగ అనిపించినా, ఆ ఫిజికల్ కనెక్ట్ మిస్ అవుతము, టైపింగ్ జెస్తుంటే ఆలోచనలు అస్తయి కాని, రాస్తే వచ్చే డీప్ ఎంగేజ్‌మెంట్ ఉండదు అంటది సైన్సు గూడ.
చేతితో రాస్తే..సమాచారం మెదడుల బాగా నిలిచిపోతది. రాసినప్పుడు, మల్టీ-సెన్సరీ ప్రాసెస్ జరుగుతది, అది యాది వెట్టుకుననీకి అల్కగైతది
డిజిటల్ రైటింగ్..అయితే.. జెర యాది వెట్టుకునుడు కష్టం అంటది సైన్సు. ఎందుకంటే..ఫిజికల్ అనుభవం ఉండదు కారణంగా, అది అంతగా మెదడుల నిల్సిపోదు.న
: హ్యాండ్రైటింగ్‌ల చేతి వేళ్ళు శక్తివంతమైతయి, చేతుల 72 వేల నాడులు ఉంటయని యోగ చెబుతుంది.
పెద్దనవేలు, సూపుడు వేలు మజ్జన కలం పెట్టి రాస్తే.. అది మెదడుకు చేరుతది.
చేతి రాత తోని మెదడుకు, నిజమైన కనెక్టివిటి చేతితో రాసినప్పుడు, ఆ అక్షరాలు, అక్షరాల్ల మనం వ్యక్తం జేసే భావాలు మన మనసుకు దగ్గరగ ఉంటయి. ప్రతి అక్షరం మన చేతి వెళ్ళ మజ్జెలకెల్లి పోతుంటది.

ఇంకా..హ్యాండ్రైటింగ్ తోని మనకు ఒక పద్ధతి, ఇగురం, దృష్టి వెట్టుడు అలవాటు అవుతది. .

చేతితోని రాశిన విషయాలు మెదడుల ఎక్కువ సమయం దాంక నిలుస్తయి. ఇది మన మెమరీకి బలాన్ని పెంచుతది.

మొత్తం మీద…రాయడం అనేది మన మెదడుకు, మనుసుకు, ఆరోగ్యానికి, సృజనాత్మకతకు సుత ఎంతో మేలు చేస్తది.
సదువుకు మూలాధారము రాసుడే.
డిజిటల్ ప్రపంచంలో ఉన్నము.డిజిటల్ వాడుదాము. కానీ పూర్తాగ.. హ్యాండ్ రైటింగ్ ని మర్శిపోకుండి. దాంతోని జరిగే మంచి చానా ఉన్నది. అందమైన చేతిరాతను శాస్త్రంల ‘ గ్రాఫాలజీ’ అంటరు. ఈ గ్రాఫాలజి నేర్చుకున్నోళ్లు చేతిరాతను బట్టి మన తలరాత ఎట్లుంటదో చెప్పేటోళ్లు.
ముత్యాల్లాంటి అక్షరాలు అంటరు కదా. ” ముత్యాలు లాంటి టైపింగ్ అందామా ఇప్పుడు ”
అస్సలు ముఖ్యమైన విషయం..
హ్యాండ్ రైటింగ్ చేతిరాత అలవాటు ఉన్నోళ్లకు సహనం గూడ అలవాటైతదంట. ఎంతకూ రాని ప్రశ్నకు జవాబు ఒక ఐదు సార్లు రాయమందురు.
ఎట్ల సూసుకున్నా చేతిరాత తోని ఉపయోగాలు చానా ఉంటయి.
ఇయాలంటే వాట్సప్ లు ఉన్నయి మెసేజ్లు ఇస్తున్నం. ఒకప్పుడు జమానాల ఉత్తరాలు రాసుకునుడే కదా..!!
మస్తు ఉంటుండే ఉత్తరాలు సదువుతుంటే…!!
రాన్రాను, దునియాల అన్నీ మాయమైపోతున్నయి. చేతిరాత కూడా మాయమైతుంది. తల్లిదండ్రులే పిల్లల్ని రాయొద్దంటే.. ఆల్లు ఇంకేం నేర్స్తరు,ఇంకేం రాస్తరు.
ఎవరింట్ల పిల్లలకి చదువు యాదికుంటలేదో, ఆల్లను రాయుమనుండి ఒకటికి ఐడుసార్లు. అప్పుడు మంచిగ యాదికి ఉంటది..!! ఒక పాలి నేను చెప్పింది చేసి సూడుండి.

ఉంట మరి పైలం
మీ
రమక్క

Written by Ramadevi Kulkarni

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తెలుగు మరువబోకు తెలుగు బిడ్డ

తో(రణం )