“ఈ అమ్మాయిని ఒకసారి చూసి మీరు ఓకే అంటే… సంబంధం ఖాయపరిచేసుకుందాం.” తన ట్యాబ్ లో ఉన్న ఫోటోని భూ రెడ్డికి చూపించాడు పెళ్లిళ్ల పేరయ్య… ఏ టు జెడ్ శాస్త్రి.
“అమ్మాయి పల్లె పడుచులా మా లక్షణంగా ఉంది. పిల్ల తల్లిదండ్రులు పిలుచుకుని రా! లగ్గవెట్టేసుకుంద్దాం” అన్నాడు భూ రెడ్డి.
“ఓసారి మీ అబ్బాయికి చూపించి
ఓకే అంటే మాట్లాడదాం.” అన్నాడు ఏ టు జెడ్ శాస్త్రి.
“ఆడేటి సూసేది? నా కళ్ళు సూసింది నా నోరు సెప్పిందే ఇంటాడు.” చెప్పాడు.
‘పాపం ఎంత అమాయకుడో ఆ కొడుకు! ఇన్నాళ్ల నుంచి వాడ్ని చూసింది లేదు. పక్కా పల్లెటూరులో పెరిగిన పిల్ల కావాలి, పాతిక ఎకరాల మాగాణి, దొడ్లో దొడ్డెడు పాడి ఆవులు ఉన్నాయి. కట్న కానుకలు తీసుకోము అంటూ…
మ్యాట్రిమోనీ లో ప్రకటన ఇవ్వమని, నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చి చెప్పాడు. నేను ఎన్ని సంబంధాలు తెచ్చినా, ఫోటో చూసి వద్దనే వాడు. ఇప్పుడు ఈ ఫోటో ఓకే అన్నాడు. అసలు పెళ్ళి కొడుకుకి చూపలేదు. ఆ పెళ్ళికొడుకు ఎలా ఉంటాడో ఇప్పటికొచ్చి తనకీ తెలియదు’ అనుకున్నాడు శాస్త్రి.
*
ఆ అమ్మాయి వైపు, తల్లిదండ్రులు బంధువులు ఎవరూ లేరు అని చెప్పడంతో… పెళ్లిచూపులు తంతు కూడా లేకుండా…
పెళ్లి ముహూర్తం పెట్టేయించాడు భూరెడ్డి.
“అయ్యా! కనీసం తమరైనా పిల్లను వెళ్ళి చూస్తారా?” అడిగాడు పంతులు.
“అక్కర్లేదు గుడిలో పెళ్లికి ఏర్పాటు చేయండి.” అని చెప్పి శాస్త్రాని పంపించేశారు.
**
పెళ్లి పీటల మీద నిత్య(పెళ్లికూతురు) కూర్చుని ఉంది.
పంతులు మంత్రాలు చదువుతున్నాడు. ఇంకా పెళ్ళికొడుకుని తీసుకురాలేదు. కాసేపటికి భూరెడ్డి పోలీసులతో అక్కడికి వచ్చాడు. పోలీసులు వచ్చి పెళ్లికూతురుని అరెస్ట్ చేసి తీసుకుపోయారు.
శాస్త్రి గారికి ఏమీ అర్థం కాలేదు.
స్పృహ తప్పి పడిపోయిన శాస్త్రి గారి మొహానికి నీళ్లు జల్లి,
“శాస్త్రిగారు ఆమె ఇప్పటికీ 50 పెళ్లిళ్లు చేసుకుంది. ఫస్ట్ నైట్ అవగానే నగలు డబ్బు పుచ్చుకొని
ఊడయిస్తుంది.
అలా ఈమె బారిలో మా డి.ఎస్.పి గారు కూడా పడ్డారు.
అందుకే నేను రైతు వేషంలో మీ దగ్గరికి వచ్చి, పల్లెటూరి అమ్మాయి కావాలని చెప్పి మ్యాట్రిమోనీలో ప్రకటన ఇప్పించాను.
నేను ఊహించినట్టుగానే… ఈమె పల్లెటూరు వేషంలో… ఫోటో అప్లోడ్ చేసింది. ఇంకేముంది తర్వాత అంతా మీకు తెలిసిందే.
పెళ్లి ఎర వేసి ఈ నిత్య పెళ్లి కూతుర్ని పట్టుకున్నాం” అంటూ చెప్పారు ఇన్స్పెక్టర్ భూ రెడ్డి.