” లోపలికి వెళ్దామా సౌందర్యతో కాసేపు ఆడుకుందాం’ అన్నాడు సాగర్..
” అలాగే వెళదాం” అని లేచింది సౌదామిని.
సౌదామిని చేయి పట్టుకుని ..
” ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు సౌ” అన్నాడు సాగర్.
కొంచెం సిగ్గుపడుతూ కళ్ళు పైకెత్తి సాగర్ కళ్ళలోకి చూసింది సౌదామిని.
” మనం ఎప్పటికీ కలిసి ఉందామా ఇలాగే” అన్నాడు సాగర్.
” ఇలాగే కాదు పెళ్లి చేసుకుందాం” అన్నది సౌదామిని నవ్వుతూ!
“అదే నేను అడుగుతున్నాను.. తొందరలో నేను ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాను అంతవరకు మనం విడిగా ఉండాల్సిందే! అమ్మానాన్నల ఆశీర్వాదం తీసుకుని మనం మన జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుందాం” అన్నాడు సాగర్.
” ఈకొద్ది రోజుల్లో మనం ఇంత సన్నిహితులం అవుతామని ఊహించలేదు.. నేను వచ్చేముందు సౌందర్యని చూసి అలాగే నీలాంబరి అత్తయ్యని కలిసి వెళ్లాలని అనుకున్నాను ..కానీ, ఇక్కడ నామనసు దోచే మనోహరుడు ఉంటాడని ఊహించలేదు” అనీ సాగర్ చేయి గట్టిగా నొక్కి వదిలేసింది సౌదామిని.
ఇద్దరూ నవ్వుకుంటూ ఇంట్లోకి వచ్చారు… అప్పుడే బాలసదనం నుండి వస్తున్న అందరూ వీరిద్దరిని చూశారు.. సాగర్ సౌధామినిల మొహంలో కొత్త కళ కనిపించడం గమనించారు…
అలేఖ్య సౌందర్యను తీసుకువచ్చి సౌదామి
నికి ఇచ్చింది.. సౌదామిని పాపతో ఆడుకుంటూ కూర్చుంది.
బాలసదనంకు వెళ్లి వచ్చిన సౌదామిని తల్లిదండ్రులు.. అలేఖ్య అత్తమామలు అక్కడి పిల్లలను చూసి అది ఏర్పాటు చేసిన నీలాంబరి గురించి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటున్నారు..
“ఇంత మంచి కుటుంబం ఉంటుందా “అనిపించింది వాళ్లకి…
దాదాపు రాత్రి ఎనిమిది గంటలు కావస్తుంది ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన మహేశ్వరి రాలేదు ఇంకా వంట కూడా కాలేదు..
” ఏదో ఇబ్బందికరమైన విషయం ఉంటేనే మహేశ్వరి రాదు ఏమైందో పాపం” అని అన్నది నీలాంబరి.
వెంటనే ఫోన్ చేసింది అవతల నుండి ఫోన్ ఎత్తిన నరసింహ వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు హాస్పిటల్కు తీసుకెళ్లారు అందుకని మహేశ్వరి అత్త గారితోనే ఉందని చెప్పాడు…
“మరి రాత్రి వంట ఎలా ఉన్నాడు భూపతి రాములమ్మ చేయగలదా వంట “అని అడిగాడు.
“ఇంకా రాములమ్మకి మనం తినే పద్ధతులు అలవాటు కాలేదు ఎందుకు నేను చేయలేనా ఏంటి? నేను చేసేస్తాను ఈరోజు వంట” అన్నది నీలాంబరి.
” మీరెందుకు అత్తయ్యా ఇప్పుడే బయట నుండి వచ్చారు నేను చేస్తాను” అన్నది సౌదామిని.
అలేఖ్య కూడా వచ్చి నేను “సౌదామని ఇద్దరం కలిసి చేస్తాము” అన్నది.
” వద్దు వదినా! ఒకవేళ పాప లేచి ఏడ్చింది అనుకో అప్పుడు నువ్వు కారం చేతులతో ఎత్తుకో లేవు అయినా పాపకు నిద్ర వచ్చే సమయం కూడా అయ్యింది నువ్వు పాపని ఎత్తుకో” అన్నది సౌదామిని.
వంట ఇంట్లోకి వెళ్లింది సౌదామిని..
నీలాంబరి కూడా వంటింట్లోకి వెళ్లబోతుంటే సాగర్ ఆపి “అమ్మా! నేను సౌదామినికి సహాయం చేస్తాను నువ్వు అలసిపోయావు కదా! ఇప్పటికే రెండుసార్లు బాలసదనంకి వెళ్లావు” అన్నాడు సాగర్.
” నువ్వా నువ్వేం సహాయం చేస్తావ్ నీకు వంట వచ్చాఅసలు” అన్నది నీలాంబరి..
” అమెరికాలో ఎవరి వంట వాళ్లే చేసుకోవాలి నేను నేర్చుకున్నానుఅమ్మా! ఈరోజు చూస్తావుగా నా ప్రతాపం” అన్నాడు నవ్వుతూ..
అప్పటికే కుక్కర్లో పప్పు టమాటాలు వేసి పెట్టింది.. మరో కుక్కర్లో బియ్యం కడిగేసి పెట్టింది… కూరగాయలు ఏం చేయాలో ఆలోచిస్తుంటే…
వెనక నుండి వచ్చిన సాగర్..
” వంటింటి అధికారం తీసేసుకున్నావా అప్పుడే” అన్నాడు.
“వంటింటి సామ్రాజ్యం మాదే ఇది ఒకరు ఇస్తే తీసుకునేది కాదు సర్వహక్కులు మాకే” అన్నది అల్లరిగా సౌధామిని..
“ఇంతకీ నేనేం పనులు చేయాలి నీకు అసిస్టెంట్ గా ఉండనా లేక వంట చేయనా”? అన్నాడు సాగర్.
” పప్పు అన్నం పెట్టేసాను కూర ఏం చేయాలో అర్థం కావడం లేదు” అన్నది సౌదామినీ..
ఫ్రిడ్జి తలుపు తెరిచి అందులో కూరగాయలు చూసాడు… పెరట్లో కోసుకొచ్చిన తాజా కూరగాయలన్నీ ఉన్నాయి.,
” నీకు గుత్తొంకాయ చేయడం వచ్చా” అన్నాడు సాగర్.
” వస్తుంది అదే చేయనా” అన్నది సౌదామిని.
” అయితే నేను వంకాయలన్నీ కోసి పెడతాను నువ్వు మసాలా సిద్ధం చేసుకో” అన్నాడు సాగర్.
అన్ని ఒకే సైజులో ఉన్న వంకాయలను ఏరి చక్కగా ఉప్పు పసుపు వేసిన నీటిలో కోసి పెట్టాడు సాగర్ అందులోకి కావలసిన ఉల్లిపాయలు కూడా కోసి ఉంచాడు..
బాణలిలో పల్లీలు ధనియాలు నువ్వులు ఎండు కొబ్బరి ఎండుమిరపకాయలు అన్ని దోరగా వేయించి పక్కన పెట్టుకొని వీటన్నిటిని మిక్సీలో వేసి అందులోనే ఉల్లిపాయలు వేసి చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకుంది సౌదామిని..
బాండ్లీలో నూనె వేసి వంకాయలు మగ్గించి అందులో మసాలా ముద్దను వేసేసి కొత్తిమీర కరివేపాకు చల్లి కొంచెం చింతపండు గుజ్జును వేసి మూత పెట్టింది ఘుమఘమలాడే వంకాయ వాసనలు బయటకి రాసాగాయి..
” మంచి వాసన వస్తున్నది ఏం చేస్తున్నారు అసలు” అని అడిగింది నీలాంబరి లోపలికి వచ్చి…
” నాకిష్టమైన గుత్తొంకాయ సౌదామినితో చేయించుకుంటున్నానమ్మా” అన్నాడు సాగర్.
” ఎందుకురా ఆ అమ్మాయిని ఇబ్బంది పెడతావ్ పాపం తాను వంట చేస్తానని లోపలికి వస్తే ఇంకా పెద్ద పనులు చెప్తావా !వంకాయ అంటే చాలా పెద్ద ప్రాసెస్ కదా” అన్నది నీలాంబరి.
” అంత పని కాదు అత్తయ్య నేను తొందరగానే చేసేస్తాను నాకు ఇంట్లో ముందు నుండే అలవాటు కావాలంటే అమ్మను అడగండి” అన్నది సౌదామి ని..
అప్పుడే అక్కడికి వచ్చిన సౌదామిని తల్లి “అవునమ్మా తనకి వంటలన్నీ చిన్నప్పటినుండే చాలా ఇంట్రెస్ట్.. నాతోపాటుగా వంటింట్లోకి వచ్చి ఏదో ఒకటి తయారు చేసేది” అన్నది.
సౌదామిని తల్లికి కూడా వీళ్ళింట్లో సౌదామిని మెలగడం చూసి మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకున్నది కానీ తొందరపడకూడదు అని మనసులో అనుకొని బయటకు వెళ్ళింది..
వంట పూర్తి కాగానే అన్నీ తీసుకొని వచ్చి హాల్లో కింద పెట్టింది సౌదామిని.
” అదేంటి కింద పెట్టావు సౌదామిని టేబుల్ మీద పెట్టేస్తే అందరం వడ్డించుకుందాము” అన్నాడు భూపతి.
” అందరం చుట్టూ కంచాలు పెట్టుకొని మధ్యలో వంట పాత్రలు పెట్టుకొని ఎవరికి వాళ్ళం వడ్డించుకుని తిందాము అలా అందరం కలిసి కింద కూర్చుని తింటే బాగుంటుంది మీకు నచ్చితేనే” అన్నది సౌదామిని.
” అలా అయితే ఇక్కడ కాదు..పెరట్లో కూర్చుని తిందాం ” అన్నది నీలాంబరి..
పెరట్లో చాపలు వేసుకుని అక్కడ ఉన్న గట్టు మీద వంట పాత్రలు పెట్టుకుని చల్లని గాలి వీస్తుంటే ముచ్చట్లు పెట్టుకుంటూ భోజనం చేశారు…
ఇంకా ఉంది