నులివెచ్చని గ్రీష్మం

ధారావాహికం -9వ భాగం

జరిగిన కథ…

అర్జున్, సుభద్ర పిల్లల కోరిక మీద అమెరికాకు వస్తారు. ముందుగా కొడుకు అభిమన్యు దగ్గరకు మినియాపోలీస్ వస్తారు. అక్కడ సీనియర్ సెంటర్ ఉందని, అందులో చాలా కార్యక్రమాలు సీయర్ సిటిజెన్ కోసం నిర్వహిస్తుంటారని వాకింగ్ ఫ్రెండ్ పటేల్ ద్వారా తెలుసుకొని అందులో చేరుతారు. ఇంటికి వచ్చిన హాండీమాన్ బిల్ తో కబుర్లు చెపుతూ అతని గురించి తెలుసుకుంటారు.ఆ వీకెండ్ మినటొంకా లేక్ లో క్రూజ్ కు బుక్ చేస్తుంది కోడలు శశి. కూతురు స్పూర్తి తండ్రికి మినియాపోలీస్ చరిత్ర చెప్పి, ఇంకా అక్కడ ఏమేమి చూడాలో చెపుతుంది. మినటొంకా లేక్ మీద క్రూజ్ కు వెళతారు. అక్కడ శశి అత్తగారికి సర్ప్రైజ్ పుట్టినరోజు పార్టీ ఇస్తుంది. మరునాడు మాల్ ఆఫ్ అమెరికాకు వెళుతారు…

ఇక చదవండి…

కార్డ్స్ రూం లో ఎవరూ కనిపించలేదు. అంతా ఖాళీగా ఉంది. బల్లలు కూడా సద్ది లేవు. ఒక పక్కకు వేసి ఉన్నాయి. కుర్చీలు గోడవారగా పెట్టి ఉన్నాయి. ఒక బల్ల మధ్యకు జరుపుతూ, ఈరోజు ఇంకా ఎవరూ రాలేదే అనుకుంది. ప్రస్తుతానికి ఒక బల్ల, నాలుగు కుర్చీలు వేస్తే సరి. ఎక్కువ వస్తే అప్పుడు జరుపుకోవచ్చు అని, బల్లను జరిపి అడ్జెస్ట్ చేసింది.అలమారాలో నుంచి ఆడేవాళ్ళ అందరి పేర్లూ ఉన్న ప్రింటెడ్ పేపర్ తీసి,  దానిలో తన పేరు దగ్గర టిక్ చేసి, పక్కన ఇంకో బల్ల మీద పెట్టింది. ఇంకేమైనా చేయాలా అని చూసి, అన్నీ పెట్టేసానులే అనుకుంటూ కూర్చుంది. తీరికగా అర్జున్ తనకు అందరి పేర్లూ రాసుకోమని ఇచ్చిన చిన్న డైరీ తీసింది. పేర్ల షీట్ చూస్తూ, తన  డైరీలో పేర్లతో సరి చూసుకుంటూ, వాళ్ళను గుర్తు చేసుకుంటుంటే ఎక్కడా కాథిన్ పేరు కనిపించలేదు. కొందరేమో గుర్తు రాలేదు.

షైనీ లోపలికి వస్తూ “సుబా తొందరగా వచ్చేసావే! ఏమి చూస్తున్నావు?” పక్కన కూర్చుంటూ అడిగింది.

“మీ అందరి పేర్లు నాకు సరిగ్గా అర్ధం కావటం లేదు. సరిగ్గా పలకలేకపోతున్నాను. అందుకని మా హస్బెండ్ ఈ డైరీ ఇచ్చి, ఇందులో రాసుకోమన్నారు. నాకు గుర్తున్నవి రాసుకున్నాను. చెక్ చేసుకుంటున్నాను. కాథిన్ పేరు ఇందులో లేదేమిటి?” అడిగింది.

“కాథిన్ ఎవరు?” అంటూ డైరీ చూసి, కొంత మంది పేర్ల స్పెల్లింగ్స్ సరి చేసి అడిగింది షైనీ.

ఒక్క క్షణం ఏమి చెప్పాలో అర్ధం కాలేదు, తను నీరసశ్రీ అనుకుంటుంది, అని ఆలోచిస్తోంది. అంతలో కాథిన్ వచ్చింది. అమ్మయ్య అనుకొని “తన పేరు కాథిన్ కాదా?” అడిగింది.

“కాదు Karen” అంది.

కారెన్…కారెన్ అని రెండుమూడు సార్లు మనసులో అనుకొని, “హాయ్ కారెన్” పలుకరించింది.

ఆ రోజు పోకర్ కు షేనీ, కారెన్ మాత్రమే వచ్చారు. ముగ్గురూ కాసేపు ఆడాక, షైనీ వెళుతానని వెళ్ళిపోయింది. కారెన్ కూడా ఆరోజు ఆడే మూడ్ లో లేనట్లుంది. కాసేపు కార్డ్స్ అటూ ఇటూ కదిపి వెళ్ళిపోయింది. సుభద్రకు ఇంక ఏమి చేయాలో తోచలేదు. అక్కడే ఉన్న సెంటర్ బుక్లెట్ తీసి కాసేపు చూసింది. పక్కన ఉన్న లైబ్రరీకి  వెళ్ళింది. న్యూస్ పేపర్ కనిపిస్తే చదువుదామని తీసింది కానీ చదవాలనిపించలేదు. ఇక అక్కడ నుంచి పక్కన ఉన్న గదిలో ఏముందో చూద్దామని వెళ్ళింది. అక్కడ కొంతమంది కార్డ్స్ గేం ఏదో ఆడుతున్నారు. వాళ్ళతో ఆడుతున్న కారెన్, సుభద్రను చూసి రమ్మన్నట్లు పిలిచింది. కారెన్ పక్కన కూర్చుంది. వాళ్ళు ఆడేదేమిటో అర్ధం కాలేదు.  కారెన్ ను అడిగింది ఏమి గేం ఇది అని. ‘హాండ్’ అంటారని ఎట్లా ఆడతారో చూడు నువ్వూ ఆడవచ్చు అంది. కానీ సుభద్రకు అంత ఆసక్తిగా అనిపించక  లేచి బ్రిడ్జ్ రూం కు వెళ్ళి, అర్జున్ పక్కన కుర్చీలో కూర్చుంది.

ఆడుతున్న కార్డ్స్ లో నుంచి తలెత్తి, “ఏమిటీ ఇటొచ్చావు”? అడిగాడు.

“ఇవ్వాళ అక్కడెవరూ లేరు” అంటూ చుట్టూ చూసింది. పక్క టేబుల్ దగ్గర షైనీ ఆడుతూ కనిపించింది. షైనీ ఎదురుగా వీల్ చేర్లో ఒక పెద్దాయన కూర్చొని ఉన్నాడు. ఆయన పక్కన ఒక అమ్మాయి, కార్డ్స్ పట్టుకొని కూర్చుంది. ఆయన ఎదుటివాళ్ళు వేసిన కార్డ్ చూస్తూ, తన కార్డ్ ఏది వేయాలో చెపితే, ఆ అమ్మాయి ఆ కార్డ్ వేసింది. అలా ఆయన చెపుతున్నాడు. ఆ అమ్మాయి కార్డ్స్ వేస్తోంది. ఆశ్చర్యంగా వాళ్ళను గమనిస్తోంది సుభద్ర. ఆ అమ్మాయికి బహుశా ముప్పై సంవత్సరాల లోపే ఉండవచ్చు. నీలం రంగుమీద  చెక్స్ ఉన్న స్కర్ట్, లేత పసుపురంగు టాప్ వేసుకుంది. చక్కని రంగు,వత్తైన బ్రౌన్ కలర్ బాయ్ కట్ తో అందంగా ఉంది. ఏమీ మాట్లాడకుండా చాలా దీక్షగా పెద్దాయన చెప్పినట్లుగా ఆడుతోంది.

అప్పుడే డమ్మీగా తన కార్డ్స్ టేబుల్ మీద పరిచిన అర్జున్, “కాఫీ తాగుతావా?” అడిగాడు.

“వద్దు, కానీ ఆ అమ్మాయి ఆడుతోందేమిటి?” చిన్నగా అడిగింది.

“ఆయన ఆ అమ్మాయి తండ్రి. ఆయనకు పక్షవాతం. కదలలేడు. చేయి కూడా కదపలేడు. ప్రతివారం తండ్రిని ఇట్లా వీల్ చేర్ లో తీసుకొచ్చి, ఆడిస్తుంది. ఆయన చూసి చెపుతుంటాడు. తను ఆడుతుంది” లో గొంతుకతో వివరించి, తన గేం వైపు దృష్ఠి మరల్చాడు. కాసేపు వాళ్ళ ఆటను గమనించి, లేచింది.

“బోర్ కొడుతోందా? వెళ్ళిపోదామా?” ఆమె లేవటం చూసి అడిగాడు.

“వద్దు. మీరు ఆడుకోండి. నేను బయట వాకింగ్ చేస్తాను” అని చెప్పి బయటకు వెళ్ళింది. తలుపు తీయగానే చల్లటి గాలి ఒక్కసారిగా తగిలి, కొద్దిగా వణికించింది. కొంగు భుజం చుట్టూ కప్పుకొని బయటకు వెళ్ళింది. ఎండ బాగానే ఉంది. చలి, వేడి… రెండూ ఒక్కసారిగా అనిపించి ‘నులివెచ్చని గ్రీష్మం’ అని నవ్వుకుంది. బయట అంతా రంగురంగుల పూలు అప్పుడప్పుడే విచ్చుకుంటున్నాయి. మధ్యలో లాన్, చుట్టూ పూల మొక్కలు. అక్కడక్కడ చిన్నచిన్న మట్టిదిబ్బలు, వాటి చుట్టూ పూలమొక్కలు. తలుపు పక్క నుంచి పైకి వెళ్ళేందుకు మెట్లు, వాటి పక్కన లాన్, పూల మొక్కలు! సీతమ్మవారి జడబంతి పూలు మెజంతా రంగులో పట్టుకుచ్చుల్లా ఆకుల మధ్య నుంచి పైకి వస్తున్నాయి. ఎరుపు, పసుపు, తెలుపు రంగురంగుల వర్ణాలతో జినియాలు అందంగా ఉన్నాయి. ఓ వరుసంతా బంతిపూలు పచ్చగా మెరిపోతున్నాయి. అన్నీ పసిపాల్లా ఇప్పుడిప్పుడే లోకాన్ని చూస్తున్నట్లుగా బుజ్జిబుజ్జిగా ఉన్నాయి. అవి చూసి “వావ్… సీతమ్మవారి జడబంతి, జినియాలు! ఎన్ని సంవత్సరాలయ్యిందో వాటిని చూసి. చిన్నప్పుడు తమ ఇంట్లో ఉండేవి. సీతమ్మవారి జడబంతి, బంతిపూలు కలిపి అమ్మ పూల జడవేసేది” అని మురిసిపోతూ వాటి  దగ్గరకు వెళ్ళి మృదువుగా చేత్తో తాకింది. ఒక్కసారిగా వళ్ళు జలదరించినట్లు గాలికి అల్లలాడాయి! ఇంకా పేరు తెలియని రంగురంగుల పూలు ఉన్నాయి. అదంతా కలియదిరుగుతూ కాసేపు గడిపింది. అర్జున్ ఇంకా రాలేదు. ఒక్కసారిగా వీచిన గాలికి చెట్టుకొమ్మలన్నీ అల్లలాడి, చిరుగాలి సుభద్రను పలకరించింది. ఆ గాలికి కదిలిన చీర కొంగును పట్టుకుంటూ  అక్కడే ఉన్న చెక్క బెంచ్ మీద కూర్చుంది. అది చాలనట్లు ఓ పిల్లతెమ్మెర సుతారంగా సుభద్ర బుగ్గను గిల్లింది!

“చెప్పవే చిరుగాలి చల్లగా ఎద గిల్లి ఎక్కడే వసంతాల కేళి

ఓ చూపవే నీతో తీసుకెళ్లి ఎక్కడే వసంతాల కేళి

చూపవే నీతో తీసుకెళ్లి చెప్పవే చిరుగాలి” సన్నగా కూనిరాగం తీస్తోంది.

“ఓ నువ్వు ఇక్కడ కూర్చున్నావా? వెళ్ళిపోయావనుకున్నాను” మాట వినిపించి, తన లోకం నుంచి బయట పడి చూసింది. కారెన్ ఎదురుగా ఉంది.

“మా హస్బెండ్ బ్రిడ్జ్ ఆడుతున్నారు. అందుకని ఇక్కడ టైం పాస్ చేస్తున్నాను” జవాబిచ్చి, కారెన్కూర్చుంటుందేమోననికాస్త పక్కకు జరిగింది. “ఓ” అంటూ కారెన్ కూర్చుంది. వాళ్ళ ఆక్సెంట్ కు చాలా వరకు అలవాటు పడింది. ఒకరి మాటలు ఒకరికి అర్ధం అవుతున్నాయి.వాళ్ళు వత్తులేకుండా ‘సుబా…సుబా…’ అని అదో రకం ఆక్సెంట్ లో పిలుస్తుంటే, తనేమో వాళ్ళ పేరు రూపానే మార్చేస్తోంది. చివరికి ఎవరి పేరు ఎట్లా తేలుతుందో అని ఆలోచిస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తోంది.కొద్దిసేపు నిశ్శబ్ధంగా కూర్చున్నారు.

“మీ ఇల్లు ఇక్కడికి దగ్గరా?” అడిగింది సుభద్ర కారెన్ ను.

“కొంచం దగ్గర.” నీరసంగా కూర్చుంటూ  జవాబిచ్చింది.

“ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏమి చేస్తావు?” పాపమెప్పుడూ నీరసంగా ఉంటుంది. షైనీ వాళ్ళతో ఏదో  చెపుతూ ఉంటుంది. ఏమి ప్రాబ్లమో  అనుకుంటూ మాట్లాడించింది.

“చాలా పని ఉంటుంది. వెళ్ళాలంటే ఏడుపు వస్తోంది” అంది కారెన్.

ఏమనాలో, ఏమడగాలో తెలీక కారెన్ చూస్తూ ఉండిపోయింది సుభద్ర. విచారగా కొద్ది క్షణాలు కూర్చొని, పర్స్ లో నుంచి సెల్ తీసి ఒక బాబు ఫొటో చూపించింది. బొద్దుగా ముద్దుగా ఉన్నాడు.

“సో క్యూట్! ఎవరీ బాబు?” అడిగింది.

“నా మనవడు. ఇంటికి వెళ్ళగానే ముందు వీడిని ఎత్తుకోవాలి. చూసావుగా ఎంత లావున్నాడో! కిందికి దింపనీయడు. నన్ను వేరే పని చేసుకోనీయడు” అంది.

“నీ దగ్గరే ఉంటాడా?” అడిగింది.

“అవును. మా అమ్మాయి కొడుకు. మా అమ్మాయి ఉద్యోగానికి వెళుతే నేను వీడికి  బేబీ సిట్టింగ్ చేస్తాను. మంగళవారం, శుక్రవారం ఇక్కడికి వస్తానని నేను వెళ్ళేవరకూ మా అమ్మాయి ఉంటుంది. నేను వెళ్ళగానే వెళ్ళిపోతుంది. కొన్ని సార్లు స్టొర్ లో పనెక్కువగా ఉందని రాదు. అప్పుడు నేను ఇక్కడికి రాను” అంది కారెన్.

“మరి మీ అమ్మాయి కూడా మీ ఇంట్లోనే ఉంటుందా? ఇంకా ఎవరెవరు ఉంటారు ఇంట్లో” అడిగింది సుభద్ర.

“నేనూ, మా హస్బెండ్ ఉంటాము. మా అమ్మాయివాళ్ళు వేరే ఉంటారు. తను స్టొర్ కు వెళ్ళేటప్పుడు, వీడిని నా దగ్గర దింపిపోతుంది. తను వచ్చాక, వీడిని అప్పగించి నేను పనికి వెళుతాను” అంది కారెన్.

“మీ హస్బెండ్ ఏమి పని చేస్తారు? ఎంత మంది మీకు పిల్లలు?” అడుగుతే ఏమనుకుంటుందోనని సంశయపడుతూనే అడిగింది.

“ఏమీ చేయడు. టీ.వీ. చూసుకుంటూ కూర్చుంటాడు. లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరకు వెళుతాడు. నేను పని చేసుకుంటున్నప్పుడు కాస్త వీడిని చూసుకోమన్నా చూసుకోడు. ఎంత మొత్తుకున్నా వినడు. అట్లా లేజీగా గడిపేస్తుంటాడు. నేనే ఏదో ఒక జాబ్ చేసి మనీ సంపాదిస్తుంటాను. వీడిని చూసుకున్నందుకు మా అమ్మాయి పే చేస్తుంది. నాకు నలుగురు అమ్మాయిలు. అందరి పిల్లలనూ నేనే చూసుకున్నాను. వాళ్ళిచ్చే మనీతో, నేను సంపాదించేదానితో మా ఖర్చులు వెళుతాయి. వీడిని చూసావు కదా! ఎంత లావుగా ఉన్నాడో! వీడిని మోయటం నాకు చాలా కష్టంగా ఉంది. ఆయాసం వస్తుంది. కానీ ఏమి చేయను? తప్పదు” నీరసంగా జవాబిచ్చింది.

కాసేపాగి తనే “ఇతను నా సెకెండ్ హస్బెండ్. అమ్మాయిలు నలుగురూ మొదటి భర్త పిల్లలు. అతనితో పడక విడాకులు ఇచ్చేసి, ఇతనిని పెళ్ళి చేసుకున్నాను.ఇతను నా కొలీగ్ అప్పుడు.  పెళ్ళైన కొద్ది కాలానికి హెల్త్ ప్రాబ్లంస్ వచ్చి ఉద్యోగం మానేసాడు. హెల్త్ బాగుపడ్డా ఇంట్లో ఉండటం అలవాటయ్యి ఇట్లా టీ.వీ. తో, ఫ్రెండ్స్ తో లేజీగా కాలం గడిపేస్తుంటాడు. ఇంక నాకు అలవాటైపోయింది. అందుకే అడ్జెస్ట్ అయిపోయి ఉంటున్నాను. కాకపోతే పనే చాలా ఎక్కువగా ఉంటోంది. చాలా స్ట్రెస్ అవుతున్నాను. అమ్మాయిలు కూడా ఆఫీస్ నుంచి రాగానే పిల్లలను తీసుకొని వెళిపోతారు. వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి కదా, నాకేమి సహాయం చేస్తారు? పైగా పిల్లలను చూసుకోవటానికి మనీ కూడా ఇస్తున్నారు కదా! ఇంకేం హెల్ప్ చేస్తారు?  అన్నట్లు వీడు కాకుండా రెండో కూతురు కొడుకు నాలుగేళ్ళ వాడు, వాడినీ చూసుకుంటాను. మా హస్బెండ్ జాబ్ చేయకపోతే చేయకపోయాడు, ఇంట్లో పనికి, పిల్లల పనికి కూడా హెల్ప్ చేయడు. నేను చేసి పెడితే తీసుకొని తింటాడు. అదొక్కటే ఆయన చేసే పని” ఆ భర్తతో ఎంత విసిగిపోయిందోఆపకుండా చెప్పుకుపోయింది.

అందుకే పాపం అంత నీరసంగా ఊసురో దేవుడా అన్నట్లు ఉంటుంది ఎప్పుడూ అనుకుంది సుభద్ర మనసులో. వీళ్ళు మాటల్లో ఉండగానే అర్జున్ వచ్చాడు. పని ఉందని బై చెప్పి వెళ్ళిపోయింది కారెన్.

కాబ్ బుక్ చేసాడు అర్జున్. “ఏమిటీ మాట్లాడుతోంది మీ ఫ్రెండ్? అడిగాడు అర్జున్ సుభద్ర పక్కన కూర్చుంటూ.

“అండీ… ఇక్కడ కూడా ఆడవాళ్ళు భర్తలతో ఇబ్బంది పడుతుంటారా? కారెన్ చెపుతుంటే విచిత్రంగా అనిపించింది” అంది సుభద్ర.

“అంత విచిత్రంగా ఏమి చెప్పిందేమిటి?” అడిగాడు.

కారెన్చెప్పిన విషయాలు చెపుతుండగానే కాబ్ వచ్చింది. కాబ్ చూడగానే చెప్పేది ఆపి, “ఇప్పటికి సశేషం. తరువాత చెపుతాను మిగితాది. ఆకలేస్తోంది వెళ్దాం పదండి” అంటూ కాబ్ ఎక్కింది. ఇంటికి వచ్చేసరికి పిల్లలు ఇంకా స్కూల్ నుంచి వచ్చినట్లు లేరు. అభి, ఒక అమ్మాయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, భోజనం చేస్తున్నారు. ఎవరీ అమ్మాయి? ఎప్పుడూ చూడలేదే? శశి ఏది? అనుకుంటూ అభి వైపు చూసింది సుభద్ర…

(ఇంకా ఉంది)

 

 

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

డస్ట్ బిన్స్

 శ్రావణ మాస వైశిష్యత