మన మహిళామణులు

శ్రీమతి సోంపాక సీత…

నా పేరు సోంపాక సీత. ప్రస్తుత నివాసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం. ఇది మా అత్తగారివాళ్లఊరు.నా పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్ లోని ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా పిలవబడుతున్న కృష్ణాజిల్లాలోని జిల్లాలోని జగ్గయ్యపేట. మా నాన్నగారు, మా తాత, ముత్తాతలు అందరూ కూడా అక్కడే పుట్టి పెరిగారు.మా నాన్నగారి పేరు ముడుంబ తిరువేంగళాచార్యులుగారు,అమ్మగారి పేరు రాజ్యలక్ష్మి(లేటు).
నాకు1983లో వివాహం జరిగింది.నా భర్త పేరు రాజాబాబు .మాది కులాంతర వివాహం. అయితే మాకు సమాజం నుంచి ఎటువంటి ఒత్తిడిలు గానీ, సమస్యలు గానీ, ఇబ్బందులు కానీ ఎదురవలేదని చెప్పచ్చు కానీ వచ్చిన చిక్కల్లా కొంతబంధు వర్గం నుండే . క్రమేపీ అలాంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి జీవనం సాఫీగా సాగటానికి సుమారు పది సం.ల సమయం తీసుకుంది.మా వారు స్కూల్ అసిస్టెంట్ గా రిటైర్ అయ్యారు (ప్రభుత్వ రంగం)2020లో. నాది మొత్తం ప్రైవేట్ ఎడ్యుకేషన్ సర్వీసే.2015లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ ( ప్రైవేట్ ఎడ్యుకేషన్) నుంచి స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకున్నాను.

మా పెద్దపాపది ఇంజనీరింగ్ పూర్తయింది.చిన్నపాపది ఎం.బి.ఏ పూర్తయ్యింది.వీరిద్దరూ వాళ్ల వాళ్ల స్టడీస్ కు సం. కోచింగ్ లు తీసుకుని చదువుకుంటూ ఉద్యాగాలసాధనకై ప్రయత్నాలుచేసుకుంటున్నసమయమది.

నాకు కో కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం.ఎప్పటిలాగానే ఒకసారి మహిళా దినోత్సవం సందర్భంగా ఆటలు పోటీలో పాల్గొన్నా.షటిల్,టెన్నికాయిట్,కేరమ్స్ రోల్లో ప్రైజులు మాటీమ్ వే.అవగాహనలేకో ఏమో యూత్ కు నిర్వహించవలసిన ‘బ్యాక్ వాక్ ‘పోటీలు మాగ్గూడా పెట్టారు.పోనీ నేనైనా ఆగాలిగదా! ఆగలేదు.లైన్ టచ్ చేసి గెలుపొందాలనే ఆత్రంతో పడిపోయా.లేవదీసి రిస్ట్ కు తిండి క్లాత్ తో కట్టుకట్టారు.సంతోషంలో నెప్పితెలవలేదు.అలాగే మిగతా ఆటల్లో పార్టిసిపేట్ చేశా.సా.జరిగిన ఫంక్షన్లో గిఫ్ట్లబరువుతోబాటుగా ఎడమచెయ్యిగూడా భాగమైపోయింది.డాక్టర్ రిపోర్ట్ ..లెఫ్ట్ రిస్ట్ ఫ్రాక్చర్ అని. తర్వాత కట్లూ,మందులూ మామూలే.చూసి పరిష్కరించటానికి వచ్చినవారు తిన్నగా వుండరుకదా!ప్రైజులకోసం ఆశపడితే ఏమైందో చూడండి.చెయ్యే విరిగిపోయింది అన్నారుకొందరు.
నా మనస్సులో వున్నది ఆటలపట్ల అభిరుచి అని బహుశా అర్ధం చేసుకోలేని కురచ మనస్తత్వంవాళ్లదికావచ్చు.ఇప్పుడిలా చెబుతున్నా గానీ అప్పుడు ఇలాంటి మాటలు వినాల్సి రావటంతో నేను బాగా డీలాపడిపోయేదాన్ని.ఇదిట్లా వుంటే నా ప్రారబ్ధమో ఏమోగానీ కొట్టు కుదురుకోక డబుల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి రావటంతో నా చెయ్యి నాకు స్వాధీనంలోకి రావటినికిఆర్నెల్లసమయం మింగేసింది.గోటితో పోయేది గొడ్డలి దాకా వచ్చిందనే సామెత ఇలాంటి సందర్భంలో బాగా సూటవుతుందనుకుంటా.ఆ టైంలో బాగా కండ్లకు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి కండ్లు బాగా వాచిపోయి ఎర్రగా అయి మూసుకుపోయేవి.అసలు తెరవనిచ్చేవికావు అనుకునే వేసిడి మొదలైంది.
ఆ వైరస్ నా హాజరు గూడా తీసుకుంది.దానితో కొన్ని రోజులు ఇబ్బంది.ఇది తగ్గుముఖం పడుతోందనేసరికి కుడి బ్రెస్ట్ లో కొవ్వు గుడ్డు పెరిగి సర్జరీ చేయించుకోవాల్సొచ్చింది.కుట్లుపడటం వల్ల కుడివైపు తిరిగి పడుకోవద్దని డాక్టరమ్మ సూచన.ఎడమచేతికి కట్టువుండటంవల్ల ఎడమవైపు తిరిగిపడుకోలేను.దాదాపు పదిరోజులపాటు వెల్లకిలా పడుకోవటమే.దీంతో వీపంతా ఎలర్జీతో(దద్దుర్లు,మంట) ఒకటేబాధ.ఇన్ని ఇన్సిడెంట్ లు ఎదుర్కొన్నా ఈబాధకు తట్టుకోలేకపోయా.మా అమ్మాయిలు ఒకరి తర్వాత మరొకరువచ్చి నా పనులు,వంట పనులు అట్లా చేసుకునేవాళ్లు.కొన్ని పనులు మనమే చేసుకోవాలి.ఇంకోప్రక్క చేతికి ఫిజియోథెరఫీ.వెరసి ఇవన్నీ కలిసి నన్ను బలహీనురాల్ని చెయ్యటంతో డిప్రెషన్ లోకి నెట్టివేయబడ్డాను.అప్పుడు నన్ను సాహిత్యం మానసికంగా నిలబెడితే నాకుటుంబం ,మందులు నన్ను శారీరకంగా నిలబెట్టాయి మనిషిగా.
ఇక్కడ సాహిత్యం అనే మాటకు ముందు పుస్తకపఠనం అనే మాట గురించి నేను మాట్లాడాలి.పుస్తకాలు చదవే అలవాటుకు ప్రేరణ మా అమ్మగారే.తను తీరిక సమయాల్లో వాసిరెడ్డి సీతాదేవి, యద్దనపూడి సులోచనారాణి,పోల్కంపల్లి శాంతా దేవి,ముప్పాళ్ల రంగనాయకమ్మ గారు లాంటి వాళ్లు రాసిన మంచి మంచి నావెల్స్ చదువుకుంటుండేది.జిల్లా గ్రంథాలయం నుండి నన్నే తెచ్చిపెట్టమనేది.తర్వాత కాలేజీ లైబ్రరీ నుండి కూడా తీసుకెళ్లి ఇస్తే ఇష్టంగా చదువుకునేది.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈనాడు దినపత్రికతో పాటుగా చతుర, విపుల లను దాదాపుగా ముప్పై సం.లు కంటిన్యూ గా చదివిన అభిరుచి మా కుటుంబానిది.ఆదివారం అనుబంధంలో వచ్చే పద బంధాలను,చేతుల్లో ఇవ్వబడే పద ప్రహేళికలను నేనూ మా పిల్లలు పోటీపడి పూర్తి చేసేవాళ్లం.ఈ క్రమంలో చేతుల్లో ప్రచురింపబడే కొత్తగాలులు(నాల్గులైన్ల కవితలు) చదువుతూ నాకు తెలవకుండానే రాయటం అలవాటవటం,అవి చతురలో పబ్లిషవటంతో నాలోని రచనాతృష్ణకు బీజం పడిందని చెప్పవచ్చు.ఒక్కో నెలలో మూడు,నాలుగు కూడా వస్తుండేవి.పుస్తకం రాగానే ముందు మావారే చూసి అభినందించడం మొదలయ్యాక ఈ ప్రేరణతో ఈనాడు దినపత్రిక వేసవిలో ప్రత్యేకంగా నిర్వహించే ‘జలం-కలం ‘ శీర్షికకు వచన కవితలు రాయటం అవికూడా ఏ ఒక్కటీ తిరిగి రాకుండా పబ్లిషవ్వటంతో అది నా సాహితీ ప్రయాణానికి ఓ సరికొత్త ఇంధనంగా మారిపోయింది.ఇక చెప్పేదేముంది.. వివిధ సాహితీ ప్రక్రియలలో పలు మాస ,దిన,పక్ష,మరియు ఆన్లైన్ పత్రికలకురాయటంగా ఎదిగింది.2021లో వంద స్వీయ కవితలు తోటి ‘నాన్నా మాట్లాడు’ కవితా సంపుటిని ప్రచురించుకున్నాను.దీనికి యం.చిననాగయ్య స్మారక మెమోరియల్ ట్రస్టు తిరువూరు వారినుండి (2023 )సం.నకు గాను ‘నేషనల్ బెస్ట్ అవార్డు’ ప్రకటించబడింది.అలాగే గజల్ పోటీలలో 2023లో గెలుపొంది ప్రతిష్టాత్మక ‘విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ ‘వారినుండి నేషనల్ బెస్ట్ గజల్ అవార్డును మాన్యశ్రీ గజల్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అందుకోగలగటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.

నా కవిత్వానికి అక్షరాలతో వపోటీలలో ప్రథమ పురస్కారం..ఖమ్మం,ఉదయ సాహితీ సంస్థ వారి నుండి కవితాభూషణ,ఉత్తమ సమీక్షలు అందించినందుకు గాను సమీక్షా భూషణ్,వెన్నెల సహృదయ సాహితీ సంస్థ రాష్ట్ర స్థాయి సదస్సు..అనంతపురం వారినుండి ప్రత్యేక గుర్తింపు,శ్రీశ్రీ ఫౌండేషన్ పాలమూరి వారి నుండి, స్ఫూర్తి రత్న,కవితాలయం వారినుండి కవిరత్న, గిడుగు రామమూర్తి ఫౌండేషన్ వారి నుండి ప్రత్యేక గుర్తింపు,మానవహక్కుల కమిషన్ వారి ప్రతిభా సన్మానం,శ్రీ మల్లినాథసూరి కళాపీఠం వారి నుండి కవి చక్ర,కవి చక్రవర్తి, సాహితీ బృందావన వేదిక వారినుండి సాహిత్య కళానిధి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదుకాబడటం,ఇంకా తెలంగాణా జాగృతి, తెలంగాణా రాష్ట్ర సాంస్కృతిక భాషాశాఖ, గణేష్ పబ్లికేషన్స్,వికాసతరంగిణి,ప్రజాపిత బ్రహ్మకుమారీస్,తె.సా భద్రాచలం, కాశ్మీర్ ఏకతా కవనక్రతువు, జగిత్యాల కావున దుందుభి,ఆజాదీకా అమృత మహోత్సవం, ప్రాంతీయ యు.టి.ఎఫ్, ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్,స్థానిక శ్రీశ్రీ కళా వేదిక,స్వరం సంగమం భద్రాద్రి,మెలోడీ సింగర్స్ , వాగ్దేవి సాహితీ వేదిక ప్రమీలా సాహిత్య సేవాసంస్థ ఇలా పలు సంస్థల నుండి సన్మానాలు,ప్రశంసా పత్రాలు, లభించినా నాకు ‘జీవన్ దాన్ ‘ నుండి లభించిన ప్రశంసా పత్రమంటేనే నాకు సర్వదా,బహుదా ప్రీతికరం .

ఒకసారి నేను ఒక పత్రికలో అవయవదానం,దేహదానాలకు సంబంధించిన వార్త నన్ను చాలా ఆలోచింపజేస్తూ నన్ను నిద్రపోనివ్వలేదు.అదేంటంటే వైద్య విద్యార్థులు పరిశోధన కోసం ఎప్పుడు డెడ్ బాడీస్ వస్తాయా అని దైన్యంగా ఎదురుచూస్తున్న సంఘటనలు గురించి క్రోడీకరిస్తూ రాసిన ఆర్టికల్ అది. ఎన్నో అపోహలు,ఎన్నో ఛాదస్తాలు,మరెన్నో మూఢనమ్మకాలతో సతమతమవుతున్న సమాజాన్ని ప్రతిబింబించిన ఆ రచన నాలో అవయవదానం,దేవదానం చేయాలనే సత్సంకల్పానికి ఊపిరిపోశాయి.ఆ ప్రయత్నంలో భాగంగా అసలు ఈ ప్రాసెస్ ఎలా?ఎవరిని సంప్రదించాలి లాంటి ఆలోచనలతో సతమ తం చేస్తూ ఎలాగైనా సరే నువ్వుకూడా నీ వంతుగా సమాజానికి ఏదైనా సేవ చేయాలనే కార్యానికి గట్టి ఊతమిస్తూ నాతో ముందడుగు వేయించింది.
కాట్రగడ్డ భారతి గారి హెల్ప్. తో జీవన్ దాన్ ట్రస్ట్ వారికి నా ఆర్గాన్స్ నుంచి డొనేట్ చేయటం జరిగింది.ట్రస్ట్ వారి నుండి ఐడి కార్డు, ప్రశంసాపత్రం లభించాయి.
మితృలకు అవగాహన కల్పిస్తూ సుమారు ఓ పదమూడు మందితో రిజిస్ట్రేషన్ చేయించాను.వారు మరికొంతమందికి ప్రేరణా దాయకంగా మలచబడాలనే సదుద్దేశ్యంతో మా తెలంగాణా సాహితీ సంస్థ భద్రాచలం శాఖ వారి ఓ కార్యక్రమంలో గౌరవం సన్మానం చేశాము.వారుకూడా ఐడి కార్డ్స్ రూపొందించుకున్నారు.ఈ సం.తెలుగు భాషా వారోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న కార్యక్రమంలో స్థానిక ప్రఖ్యాత వైద్యుని చేతుల మీదుగా జీవన్ దాన్ సంస్థ వారి ప్రశంసాపత్రాలను అందించాలని నిశ్చయించాము.దీనికి మా తె.సా కమిటీ వారు ఆమోదించడం నాకు చాలా ఆమె అందాన్నిచ్చింది.అన్నట్లు నేను మిద్దెతోట ప్రేమికురాలిని.తె.సా కుటుంబీకురాలిని.

జీవితంలో శారీరకంగా కావచ్చు లేదా మానసికంగా కావచ్చు మనం ఎన్ని సార్లు కింద పడ్డా లేవగలగటం,కాలంతో పాటు పరుగెత్తలేకపోయినా ,ఆటంకాలను దాటుకుంటూ కనీసం నడవగలగటం ..ఇవే మనల్ని మనం లక్ష్యం వైపుకు చెయ్యి పట్టుకు నడిపిస్తాయని నా అనుభవం.మానవమాత్రంగా మనం చెయ్యా ల్సిందేంటంటే మనం దాని చెయ్యి బలంగాపట్టుకోవటమేనండీ.
నేనీ పని చేశానందుకే ఇంకా క్రొత్త విషయాలను నేర్చుకుంటూ ,నేర్పగలుగుతున్నాను.అది ఆధ్యాత్మికంగ కానీయండి లేదా మరే విజ్ఞానానికో,సాహిత్యానికి సంబంధించినదైనా కానీయండి.మనం మానసికంగా ధృడంగా వుండగలగాలంటే ఎప్పటికప్పుడు క్రొత్త విషయాలను నేర్చుకుంటూపోవటమే.ఇది ఎంతో స్థైర్యాన్నిస్తుంది.అందుకేవిపరీతమైన జాయింట్ పెయిన్స్ రోజూ కవ్విస్తున్నా, స్పాండిలైటిస్,డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కోసారి భరించలేనిబ్యాక్ పెయిన్స్ కలిసి నాతో చెడుగుడులాడుతున్నా,నేనేం తక్కువ తిన్నానా అంటూ ఎపిలెప్సీ గుర్రుగా చూస్తున్నా జడవను నేను.వాటి పనులు వాటివే.నా పనులు నావే.ఆన్లైన్లో శ్రీమద్భగవద్గీత నేర్చుకుంటున్నా.మి ఫ్రెండ్స్ కు ఈమధ్య తిరుప్పావై నేర్పించా. తిరువాయ్ మొజి కూడా మా సోదరుని ద్వారా నేర్చుకుంటున్నా.గజల్స్ రాస్తుంటా తరచుగా.ఆ..అన్నట్టు త్వరలో నా స్వీయ గజల్ సంపుటి ‘గజల్ కౌస్తుభం’ రాబోతోంది.ఇలాంటి పనులెన్ని పూనుకున్నా మళ్లీ నామనసు ఒకవైపుకే బాగా లాగుతుంటుంది.అదేనండీ ‘బాడీ డొనేషన్’ చెయ్యాలని.
మరి మీ ఆశీస్సులు తప్పక అందిస్తారు కదూ.ఇంతవరకూ నా మనోభావాలను పంచుకుంటూ నాతో ప్రయాణించిన ప్రియ తరుణీమణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

“బతుకంతా చింతే….”

కుప్పాంబిక