ఏతరగతి మహిళైనా సరే! మార్పులేదు!
మగువల జీవితాల్లో…
వేసుకున్న గాజులు పగిలినన వాటికన్నా ఎక్కువసార్లు
ఆమె గుండె ముక్కలైంది!
అది అతని తప్పుకాదు గాజు గ్లాస్ లోని ద్రవానిదే
ఎదురు మట్లాడే శక్తున్నా..
తాడూ-తాళము అక్కరలేని బంధం…
నోరుమూసుకుంది అతని నోటి దురుసు తనానికి
లేకపోతే ఆమెను సమాజం ఉరెయ్యదూ…?
ఆమె తలచుకుంటే కొండల్ని పిండిచేయగలదు..
తలవంచి కట్టించుకున్న తాళి చేయనివ్వదు!
తనను మించిపోతుందనే అక్కసే!
సమస్యుంటేనే సాధించి వేధించవచ్చు!
ఆర్ధిక మంత్రికన్నా ప్రణాలిక లెక్కువే వేయగలదామె!
ఎప్పుడూ అణా-కాణీ ఆమె చేతిలో పడితే కదా!
పడేసిన కాణీకి వాదనలో ప్రతిపక్షసభ్యుడికొక ఆకెక్కువే…. ఫలితం మాత్రం శూన్యం!
శిరసు మూర్కొనడం కన్నా ఛీత్కారాలే ఎక్కువ!
తలెక్కడ ఎగిరేస్తుందనే భయం!
అలంకరణ చేసుకుంటే భోగం వాళ్ళమా? హేళన!
అందంగా కనిపించకపోతే ఏబ్రాసనే ఏవగింత!
వెఱ్ఱి వేపకాయంత- వెంగళాయిలకు !
ఎలా వేగాలో? ఈ కలాపోసకులతో?
సగటు మగాడు కదా! కనిపారేస్తారు!
సాకి సవరించాల్సింది కన్నతల్లి కదా!
బాధ్యత తెలియని ఆ ఇంటి బహద్దూర్
లెక్క పెడుతోందామె!కృత త్రేతాద్వాపర కలియుగా లను…
లెక్కల్లోకి రాని లేమల బాధ్యతా నిర్వహణలు!
తప్పుల చిట్టాలను గుణించీ, భాగించీ..లెక్కిస్తారు!
చిత్రగుప్తుని వారసులు కదా!
యమపాశ భయమేలేదు!
కొట్టీ-తిట్టీ-అలిగి మంచమెక్కితే…
తన్నులు తిని తనువంతా నొప్పితో..
తానేమో తప్పు చేసినట్టు..బతిమిలాటలు!
మరి చేయిపట్టి -కాలుతొక్కిన మగడు కదా!
ఆ మాత్రం బెట్టుండాలి!
కూలీ రూకలతో చుక్కా-ముక్కా-పక్కా వడ్డించాలి!
మార్పులేని- రాని వ్యవస్థలోని మగువ కదా!