ఎడారి కొలను 

ధారావాహికం – 32వ భాగం

(ఇప్పటివరకు : కాంతమ్మ గారితో మైత్రేయి చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ కి వెళుతుంది. అక్కడ జ్యోతి ని కలిసాక మైత్రేయి  కి చాలా ప్రశ్నలు మనసులో మెదులుతాయి. తిరుగు ప్రయాణం లో కాంతమ్మ గారు మైత్రేయి కి తమ పెళ్లి ఎలా జరిగిందో చెబుతుంది. అంతే  కాకుండా మైత్రేయి  పెద్దక్క గురించి గురించి, చేయూత సంస్థ గురించి కొంత తెలుసుకుంటుంది.)

    ‘మైత్రేయి కి నిద్దర పట్టలేదు. ఆలోచిస్తూనే ఉన్నది. పెద్దక్క, రమణమ్మ, కమలమ్మ , రామ్ బాయమ్మ,  జ్యోతి  ఇలాటి వాళ్ళను వేళ్ళ మీద లెక్క పెట్టలేము. అంతం లేని సామజిక దుర్బలత. ఒక స్త్రీ కుటుంబ వంచితురాలు, ఒక స్త్రీ సొంత బిడ్డ చేతిలో వంచితురాలు, ఇంకొకరు తోడబుట్టిన వాడి చేతిలో, ఇంకొకరు ప్రేమించానన్న మాయలో వంచన. ఇలా అను క్షణం ఎదోక విధంగ వంచితురాలవుతూనే ఉన్నది స్త్రీ. 

కానీ ఆలోచనలో మాత్రం మార్పు లేదు. ఇంకా  తనకన్నా తన కుటుంబంపైనే నమ్మకం, కట్టు కున్న వాడు ఎప్పటికి చేయి విడువడు అన్న నమ్మకం మెండు. తనకు మంచి చేసే విషయం లో  తన తల్లితండ్రులు రాజీ  పడరు అనే నమ్మకం,  గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు. ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ స్త్రీ మాత్రం ఎప్పటికి తన నమ్మకం విడవదు. 

     ఎక్కడో చదివినట్లు గుర్తు,” ప్రతి చిన్న విషయం సహజమే అయినా, రోజు ఉందేదయినా, అప్పుడే విచ్చు కున్న పువ్వు, మొక్క పైన వచ్చే లేత చిగుళ్లు, కోయిలమ్మ కూత, నెమలి ఈక, అమ్మ చెప్పే కధలు. అన్న తో టి సైకిల్ మీద వెళ్లే రోజులు , నాన్న కంచంలో నాన్న పక్కన కూర్చుని తినే పెరుగన్నం.. … 

ఇలా అన్ని కొత్త అనుభూతులే ! వింత అనుభవాలే!’ 

      ‘ఈ చిన్న ఆనందాలు కొందరికి జీవితాంతం దక్కుతాయి, కొందరికి జీవితం మొదట్లోనే దూరమవుతాయి. కొత్తగ  వివాహం చేసుకున్న జంట కూడా అంతే!  హనీమూన్ పీరియడ్ ఎంత కాలం నడుస్తుందో తెలియదు. జీవిత సత్యం అర్ధమయే సరికి సగం జీవితం అయిపోతుండవచ్చు.   అప్పుడు రాజిపడి  బతకడమే మిగులుతుంది. ఎం కోల్పోయామో తలుచుకోవడానికి భయం కలగవచ్చు. అప్పుడే మనం ఆస్ట్రిచ్ లాగా తలకాయ ని గోతిలో పెట్టి తననెవరూ చూడలేరు అన్న భ్రమ లో బతికేస్తుంటాము. నా స్థానం  ఏంటి? ఈ సమాజం లోఎక్కడ? అన్న అనుమానం వచ్చిన రోజు  సొంత ఆలోచన మొదలవుతుంది.  ఆలోచనతో సంఘర్షణ మొదలవుతుంది. అక్కడే మన పోరాటం , మన వెదుకులాట , నన్ను నేను తెలుసు కోవటానికి చేసే అన్వేషణ మొదలవుతుంది. రాంబాయమ్మ గారు చెప్పినట్లు ఈ అన్వేషణ ఎడారిలో అలసి సొలసిన ఒక బాటసారి సేదతీరేందుకు వెతికే కొలను కాదు కదా? ఆ నీటి మడుగు దొరుకుతుందా?’ ఇలా ఆలచనలతో ఎప్పుడు నిద్దర పట్టిందో కానీ , రాంబాయమ్మ లేపేవరకు మైత్రేయి లేవలేదు. 

      అప్పటికే కాంతమ్మ గారు లేచి స్నానం చేసి పూజ చేసు కుంటున్నారు. రమణి ఇల్లంతా డస్టింగ్ చేస్తున్నది. రాంబాయమ్మ గారు  వంట గదిలో పనిలో ఉంది. జానీ వాకిట్లో మెట్ల మీద కూర్చుని  చాయ్ తాగుతున్నాడు. మైత్రేయి గబరాట్ గ బాత్రూం లోకి దూరి స్నానం చేసి,  ఉతికి ఉంచిన తన చీర కట్టు కొని వచ్చింది. తలస్నానం చేయడం వల్ల  నొక్కుల జుట్టు వొత్తు గ పొడవుగా  ఉండి  మైత్రేయి చాల అందంగ కనిపించింది రాంబాయమ్మ గారి కళ్ళకి,  దగ్గరి కొచ్చి,” మైత్రేయి! నేను తల దువ్వన ,” అని అడిగింది. 

     అప్పుడే పూజ మందిరం నుండి వచ్చిన కాంతమ్మ గారు అది విని,” మైత్రేయి, రాంబాయమ్మ గారి చేత జడ వేయించుకో చాలా  బాగా వేస్తుంది, నీకు జడ వేస్తూ తన మేనకోడలిని గుర్తు తెచ్చు కుంటుంది,” అంటూ నవ్వింది. 

   మైత్రేయి అలాగే అమ్మ ,  “మీరు నాకు జడ వేయండి,” అన్నది. “చూడు మైత్రేయి కాంతమ్మ గారిని అమ్మ అన్నావు , నన్ను పెద్దమ్మ అని పిలవచ్చు కదా, వినటానికి బాగుంటుంది,” అన్నది. “అలాగే పెద్దమ్మ,” అంటూ ఆమె మెడచుట్టు చేతులేసి గలగలా నవ్వేసింది. 

“చాల రోజుల తరువాత నవుతున్నారే” అంటూ, “గ్రేట్ మేడం! మీ ఇంటిపూదోట లో  ఇంత  మంచిగా పువ్వులు నవ్వుతాయని తెలియదు, చాల బాగుంది,” అంటూ నాటకీయం గ మాట్లాడుతూ లోపలకొచ్చాడు ప్రసాద్. 

“ ప్రసాద్, మీకెలా తెలిసింది నేను ఈ రోజు ఇంటి కి రావాలను కున్నానని,” అంటూ ప్రసాద్ ని చూసిన సంతోషాన్ని దాచుకోలేక పోయింది మైత్రేయి. 

“ అదా! మేడం ఫోన్ చేసి అక్కడ అంతా బాగానే ఉన్నది కదా , మైత్రేయి రావాలనుకుంటున్నది,” అని అడిగారు, “మిమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చాను. మీ కోసం మీ అక్కమ్మ కూడా ఎదురు చూస్తున్నది,” అన్నాడు  కూల్ గా. 

  “ ఓకే ఓకే, ముందు టిఫిన్ చేసి వెళుదురు గాని, రండి,” అంటూ కాంతమ్మ గారు వాళ్ళిద్దరినీ టేబుల్ దగ్గరికి పిలిచారు. చక చక రమణి టేబుల్ మీద  ఇడ్లిలున్న కేసోరల్, కొబ్బరి చట్నీ, ప్లేట్స్ తెచ్చి పెట్టింది. అందరు టిఫిన్  చేసేశాక ఇంకో రౌండ్ కాఫీ కూడా రమణి తెచ్చి పెట్టింది. 

 కాఫీ తాగుతూ “ ప్రసాద్ , నేను మైత్రేయి ని వాళ్ళింటి దగ్గర దిగబెట్టి వెళ్ళిపోతాను, నాకు విజయవాడ లో మీటింగ్ ఉన్నది,”  అంటూ మైత్రేయి పద, “జానీ కారు రెడీ చేయి,” అంటూ తన రూమ్ లోకి వెళ్లారు చీర మార్చుకోవడానికి. 

ఇంతలోకే రాంబాయమ్మ గారు బెండకాయ కూర , టమాటో పప్పు, వంకాయ రోటి పచ్చడి డిస్పోసబు ల్ బాక్స్ ల్లో పెట్టి తెచ్చి మైత్రేయి కి ఇచ్చింది ఒక సంచిలో పెట్టి. 

“ఇప్పుడవన్నీ ఎందుకు పెద్దమ్మ , నేను ఇంటికెళ్ళాక చేసు కుంటాను కదా!”   అన్నది.

“ వద్దనకు  మైత్రేయి రాంబాయమ్మ గారు ఊరుకోరు, తీసుకో ఎం పర్వాలేదు.,” అన్నది. 

 కాంతమ్మ గారు, మైత్రేయి కూర్చున్న తరువాత జానీ అడీగాడు “ అక్క మీ ఇంటికి దారి చెబుతావా,” అన్నాడు. “మన ముందు ప్రసాద్ వెళుతున్నాడు కదా అతన్ని ఫాలో అయిపో అన్నది,” కాంతమ్మ గారు. 

“ మేడం, రాంబాయమ్మ గారికి నిజంగ ఎవ్వరు లేరా? “ అడిగింది తాను. 

“ ఉన్నారమ్మా ! రాంబాయమ్మ గారు బాల వితంతువు. అన్న వదినల పంచన బతికింది. భరణం గ వచ్చిన రెండెకరాల పొలం, తండ్రి ఇచ్చిన కొంచం బంగారం అంతా , ఆమె ని పోషిస్తున్నామన్న నెపం తో వాళ్లు లాగేసుకున్నారు. బాగా అనారోగ్యం రావడం తో  ఎవరికీ చెప్పకుండా ఆమెని తెచ్చి ఇక్క డే గుంటూరు జనరల్ ఆసుపత్రి లో వదిలేసారు. ఆ తరువాత ఆమె గురించి పట్టించుకోలేదు. ఆసుపత్రి లో చేర్చబడిన మరొక పేషంట్ పెద్దక్క. ఈమే  దుస్థితి చూసి తనతో పాటె ఆ సంస్థల్లోకి తీసుకొచ్చింది. తన గురించి గాని తానెక్కడినుంచి వచ్చిందని కానీ ఆమె ఎప్పుడు చెప్పలేదు. ఇద్దరు కలిసి చాలా కష్టాలు పడ్డారు .  అక్కడున్న మిగిలిన వాళ్ళకి కూడా ఆసరాగా నిలబడ్డారు.  ఏడాది క్రితం నాకు బాగా జబ్బు చేసింది. అప్పుడే పెద్దక్క రాంబాయమ్మని నా దగ్గరుంచుకోమని సలహా ఇచ్చింది. అప్పటి నుండి రాంబాయమ్మ గారు మా ఇంటి మనిషయి  పోయింది,” చెప్పింది. 

మైత్రేయి ఇంటి ముందు కారు ఆగింది. ప్రసాద్ తన బైక్ ని కాంపౌండ్   లో ఆపాడు. 

మైత్రేయి కార్ దిగుతూ ఏంతో  కృతజ్ఞతా భావంతో , “ఉంటానమ్మా మళ్ళి  కలుస్తాను ,” అన్నది.  “ తప్పకుండ , ప్రభాకర్ ఈ ఆదివారం కల్ల  వచ్చేస్తాడు. నువ్వు ప్రసాద్ కూడా రండి ఆ రోజు,” అంటూ జానీ పోనీ అంటూ ముందుకెళ్ళి పోయింది ఆమె.

రమాదేవి కిటికీ లోంచి చూస్తూ, “ఎవరెవరితోనో వెళుతుంది, వస్తుంటుంది, ఇదేం 

సోధ్యమో,” అనుకొంటూ కిటికీ కర్టెన్ జర్రున లాగేసి లోపలకెళ్లిపోయింది. 

అది మైత్రేయి , ప్రసాద్ ఇద్దరు గమనించారు. ఆమె ఊపు చూసి ఇదిప్పుడే ఏ  తుఫాన్ తీసుకొస్తుందో అని ఎవరికీ వాళ్ళు మనసులోనే అనుకున్నారు.  

వరండాలోనే కూచొని ఉన్న అక్కమ్మ ఆప్యాయంగా మైత్రేయి దగ్గరికి వచ్చి చేయి పట్టు కొని లోపలకి తీసుకెళుతూ ,  “ఎలా ఉన్నావమ్మా,!” అంటూ ఏంతో  ఆర్ద్రం గ అడిగింది.  

మైత్రేయి దగ్గరి నుండి తాళం తీసుకొని ఇంటి తలుపు తెరిచింది. వాళ్ళని కూర్చోమని చెప్పి అరగంటలో ఇల్లు శుభ్రం చేసి , దగ్గ రలోనే ఉన్న బూత్ దగ్గరికి వెళ్లి   పా లు, పెరుగు  తేచ్చింది. అలా హడావుడి  పడుతున్న అక్కమ్మ ని చూస్తూ ,  “ఏమిటా హడావుడి అక్కమ్మ, మనం ఇద్దరం నిదానం గ చేసుకుందాం. నువొచ్చి నాదగ్గిర కూర్చో,” అంటూ అక్కమ్మ ని పిలిచింది. అలా అక్క మ్మ రాగానే అక్కమ్మ వొళ్ళో తలపెట్టుకోని  అలా నేలమీదే పడుకుంది మైత్రేయి. ప్రసాద్ మౌనంగ లేచి తన రూమ్ లోకి వెళ్లి పోయాడు. కళ్ళు ముసు కున్న మైత్రేయి కి తానేదో కొత్త ప్రపంచం నుండి వచ్చినట్లనిపించింది. అక్కమ్మ తలనిమురుతూ ఉండి  పోయింది. 

(ఇంకావుంది)                          

Written by Padma NeelamRaju

రచయిత గురించి:

పద్మావతి నీలంరాజు చండీఘర్ లో ఇంగ్లీష్ అధ్యాపకురాలిగా 35 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న రిటైర్డ్ ఉపాధ్యాయురాలు. ఆమె నాగార్జున విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ నుండి M A (Litt),
POST GRADUATE DIPLOMA IN TEACHING ENGLISH ,CIEFL, హైదరాబాద్‌ లో తన ఉన్నత విద్యను పూర్తి చేసింది. స్త్రీ వాద సాహిత్యంపై దృష్టి సారించి Indian writing in English లో Panjabi University, patiala , Panjab, నుండి M phil డిగ్రీ పొందింది. తెలుగు సాహిత్యం పైన మక్కువ ఇంగ్లీషు సాహిత్యంపై ఆసక్తితో ఆమె తన అనుభవాలను తన బ్లాగ్ లోను
( http://aladyatherdesk.blogspot.com/2016/02/deep-down.html?m=1,)
కొన్ని సాహితీ పత్రికల ద్వారా పంచుకుంటున్నారు. ఆమె రచనలు తరచుగా జీవితం మరియు సమాజం పట్ల ఆమెకున్న అనుభవపూర్వక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. ఆమె అధ్యాపకురాలిగా గ్రామీణ భారత్ పాఠశాలల్లో E-vidyalok- e-taragati (NGO) లో స్వచ్ఛంద సేవలందిస్తున్నారు. రచన వ్యాసంగం పైన మక్కువ. పుస్తకాలు చదవడం, విశ్లేషించడం (Analysis / Review) ఆంగ్లం నుండి తెలుగు లోకి అనువాదం(Translation) చేయడం అభిరుచులు . PARI సంస్థ (NGO) లో కూడా ఆమె గ్రామీణ భారత జీవన శైలిని ప్రతిబింబించే వ్యాసాలను కొన్నిటిని తెలుగులోకి అనువదించారు (padmavathi neelamraju PARI). HINDUSTAN TIMES, తరుణీ ,మయూఖ, నెచ్చెలి వంటి పత్రికలలో కొన్ని కధలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. “Poetry is the sponteneous overflow of power feelings; recollected in tranquility” అన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ తనకు ప్రేరణ అని చెబుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కన్నతల్లి

నుడికడలి