చానమాంబ-ప్రోలమ 

13వ శతాబ్దము లోని ప్రోలమ, చానమాంబ తొలితరం ఆంధ్ర కవయత్రులలో ప్రధములుగా లక్ష్మీకాంతమ్మ పేర్కొన్నారు. అయితే గోన బుద్ధారెడ్డి కూతురు, వీరపత్ని కుప్పాంబిక కొంత ముందుకాలానికి పద్యరచన చేసారనే ఆధారాలు కూడా చరిత్రలో కనపడుతున్నాయి కాబట్టి కుప్పాంబికే మొదటి కవయిత్రి అనే వాదం కూడా ఉంది 

 చానమాంబ రణతిక్కనగా ఖ్యాతి గాంచిన ఖడ్గ తిక్కన భార్య, అంతేకాక కవిబ్రహ్మ తిక్కనార్యునికి వదిన గారు. ప్రోలమ కవిబ్రహ్మకు, ఖడ్గ తిక్కనార్యునికి తల్లి, చానమాంబకు అత్తగారు. మనుమసిద్ధి దగ్గర రణతిక్కన సైనిక వ్యవహారాలు చూసే మంత్రిగా ఉండేవాడు. యుద్ధంలో ఓడిపోయి సజీవంగా ఇంటికి తిరిగివచ్చిన ఈ రణతిక్కనకు వీరపత్ని అయిన చానమాంబ, వీరమాత ప్రోలమ రెచ్చగొట్టి తిరిగి యుద్ధరంగానికి పంపారు. అతడు విజయుడై వీరస్వర్గము పొందాడు. ఆనాటి సామాజిక ఆచారం ప్రకారం భర్తతో చానమ్మ సహగమనం చేసింది.  

ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారు, ప్రోలమ గురించి వివరిస్తూ 

“ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం అన్నట్లు కవి తిక్కన్నను, ఖడ్గతిక్కన్నను తెలుగు ప్రజలకు కానుక ఇచ్చిన తల్లి ప్రోలమ . . . అత్త కవయిత్రి. కోడలు కవయిత్రి కుమారుడు కవిబ్రహ్మ” అని పేర్కొన్నారు. 

ఆవిడ చానమాంబ గురించి కూడా ఎంతో గొప్పగా రాసారు. 

“ఆమె నలువరాణికి తెలుగు చానలు ఉపాయముగా పచరించిన తొలి పూజా పద్మము.
ఆమె భారతీసతి మంజులపద రాజీవములకడ మొకరిలిన మొదటి పూజారిణి.
ఆమె వాగ్దేవీ సంసద్భవమున అంధ్ర కవయత్రీ ప్రతినిధ్యము నంగీకరించిన ప్రధామాస్థాని.
ఆమె సుందరాంధ్ర మహిళావాఙ్మయాంబరమున నుదయించిన తొలితార”, 

అంటూ అభివర్ణించింది. 

చానమ, ప్రోలమల కవితా ధోరణులు ఈ క్రింది సందర్భాలలో ప్రస్తావిస్తారు. పరీభూతుడయి శత్రువులకు వెన్నిచ్చి పారిపోయి వచ్చిన పతి రణ తిక్కనను చూసి వీరపత్ని అయిన చానమాంబ హృదయమునుండి అవమానంతో కూడిన వీరరసావిష్కరణ ఈక్రింది కంద పద్య రూపములో సాక్షాత్కారించింది. 

పగరకు వెన్నిచ్చినచో,
నగరే నిను మగతనంపునాయకు లెందున్?
ముగు రాడు వారమైతిమి;
వగపేటికి జలకమాడ వచ్చిన చోటన్? 

యుద్దభూమికి వెనుచూపి వచ్చావు. మిమ్ములను చూసి నలుగురు నవ్వరా! మాఇద్దరితో పాటు మీరు కూడా ఇంకో స్త్రీ వైనావు. అందుకే మాలాగా ఇలా స్నానమాచరించండి అంటూ
స్నానాల గదికి నులక మంచం అడ్డంపెట్టి, పసుపూ, కుంకుమ, నలుగుపిండి ఏర్పాటు చేసి చానమ తన భర్తనుద్దేశించి పద్యపూర్వకంగా గేలి చేసిందట. 

అవమానాన్ని దిగమింగి, స్నానం చేసి భోజనానికి కూర్చున్న ఖడ్గ తిక్కనతో అతని తల్లి ప్రోలమ కూడా విరిగిన పాలు అన్నంలో వడ్డించి చులకనగా మాట్లాడిందట.  

భోజనానికి కూర్చున్న ఖడ్గ తిక్కనతో తల్లి ప్రోలమ ఈ పద్యం చెప్పిందిట.  

అసదృశముగ నరివీరుల –
మసిపుచ్చక విరిగి వచ్చు మగ పంద క్రియన్
కసవున్ మేయగ పోయిన – పసులున్
విరిగినవి; తిక్క! పాలున్ విరిగెన్’ 

యుద్ధంలో ఓడిపోయి, సజీవంగా ఇంటికి తిరిగొచ్చిన ఖడ్గ తిక్కనను అతని తల్లీ – భార్యా రెచ్చగొట్టి తిరిగి రణరంగానికి పంపగా, అతడు ‘విజయుడై వీరస్వర్గమలంకరించెనట!’ ఇదీ సందర్భం. ‘చాటు పద్య మణిమంజరి’లో ప్రోలమ – చానమల చాటువులను సంకలించారు.  

చానమ లెక్క ప్రకారం పగవారికి వెన్నిచ్చి, వచ్చినవాడు ఆడదానితో సమానం! అలాంటి ఆడదాన్ని చూసి మగతనం ఉన్న నాయకులు ఎగతాళిగా నవ్వుతారు. ఇక ప్రోలమ కన్నకొడుకుని ‘మగపంద’వని తిట్టింది. పంద అనే మాటకి పిరికివాడనేదే సామాన్యమయిన అర్థం. కానీ, ఆడంగివాడనే విశేషార్థం కూడా ఉందని ఆచార్య జి.ఎన్.రెడ్డి పర్యాయపద నిఘంటువు చెప్తోంది. ఒక స్త్రీ సాక్షాత్తూ భర్తనే ఆడదానివని తిట్టగా, మరొకామె కన్నకొడుకుని ఆడంగిరేకుల వాడివని తిట్టింది. మగవాడిలా ఆలోచించే స్ర్తిలు ఈ అత్తాకోడళ్లు.  అని విశ్లేషకుల అభిప్రాయం. 

ఖడ్గ తిక్కన వీరత్వం కొరకు చాటువులుగా చెప్పిన ఈ కంద పద్యాలు తప్ప వీరి ఇతర రచనలు లభించలేదు. లింగాలకొండ, సోమశిల యుద్ధవీరుల గాధలు నెల్లూరు ప్రాంతాలలో ప్రాచుర్యంలో ఉన్నాయి. సోమశిల దగ్గర, సోమేశ్వర ఆలయం దగ్గర ఉన్న వీరుని విగ్రహం ఖడ్గ తిక్కనదే అని చెపుతారు. నాడు కవితా శక్తి కల ఇలాంటి స్త్రీలు రాజ్యం కోసం, భర్త, పుత్రులకోసం త్యాగాలు చేసారు. 

ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ ‘అఖిల భారత (ఆంధ్ర?) కవయిత్రులు’ అనే పుస్తకం రాస్తూ ఖడ్గ తిక్కన తల్లి ప్రోలమ, భార్య చానమాంబలు తొలి తెలుగు కవయిత్రులని నిర్ణయించారట. వేటూరి ప్రభాకరశాస్ర్తీ ‘చాటు పద్య మణిమంజరి’లో ఆమె నిర్ణయాన్నే ఉటంకించారు.  వేటూరి ప్రభాకరుల లెక్క ప్రకారం రణ తిక్కనది క్రీ.శ.1260 ప్రాంతం. అంటే, ప్రోలమ – చానమలది కూడా అదే కాలమని అభిప్రాయం .

Written by vijaya Ranganatham

ఆకారం విజయలక్ష్మి గా కేంద్ర ప్రభుత్వోగం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) హైదరాబాద్ లో ముప్పై యేళ్ళు ఉద్యోగం చేసి, రిటైర్ అయ్యాక జీవిత సహచరుడు రంగనాథాన్ని పోగుట్టుకుని మానసిక వేదనలో ఉన్నప్పుడు వెన్ను తట్టి రచనా వ్యాసంగం వైపు మళ్ళించిన స్నేహితుల వల్ల నా జీవిత విశేషాలను, మా అన్నయ్య విప్లవ రచయిత జ్వాలాముఖి గారి అనుబంధాన్ని, ప్రభావాన్ని “జ్ఞాపకాలు” గా గ్రంథస్తం చేసి “విజయారంగనాథం”అయ్యాను.

జీవిత అనుభవాలను కొన్నింటిని కథలుగా మలిచి స్పోటిఫై మాధ్యమంలో పోడ్ కాస్ట్ చేస్తూ “వీరవల్లి” గా పరిచయ మయ్యాను. “అనుభవ కథనాలు” పుస్తకం గా మార్చాను.
తెలుగు తెలియని, పుస్తకం చదివే తీరికలేని మితృలకోసం నా పుస్తకం జ్ఞాపకాలను నా నోట వినిపిస్తూ పోడ్కాస్ట్ చేస్తున్నాను. అలాగే ప్రసిద్ద రచయిత, “కథానిలయం”గ్రంథాలయ స్థాపకుడు కాళీపట్నం రామారావు గారి కథలను కూడా వారి కథానిలయం యాజమాన్యం అనుమతితో వరుసగా పోడ్ కాస్ట్ చేస్తున్నాను.
నేను బుడి బుడి అడుగులు వేస్తూ వింతగా చూస్తూ ఈ సాహిత్య లోకంలో కి అడుగు పెట్టాను. వేలుపట్టి దారి చూపుతున్న నీహారిణి గారికి కృతజ్ఞతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్నేహం

మధురమైన రోజు